Sunday, April 24, 2016

thumbnail

సద్గురు శ్రీ శివానందమూర్తి గారు

సద్గురు శ్రీ శివానందమూర్తి గారు

టీవీయస్.శాస్త్రి


మనమధ్యలోనే మహానుభావులు ఉంటారు. వారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మనమే వారిని చేరుకోవటానికి ప్రయత్నించం.కారణాలను విశ్లేషిస్తే అనేకం ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సద్గురువులు జీవనదుల వంటి వారు. కొంతమంది​ ​ఆ నదిలో నీటిని పవిత్రంగా వాడుకుంటారు​. అనేకులు ఆ నీటిని కలుషితం చేయటానికి ప్రయత్నిస్తారు.నది వీటినేమీ పట్టించుకోకుండా నిరంతరం తన ధర్మంగా అది ప్రవహిస్తుంది.అటువంటి మహానది కోవకు చెందిన వారైన శ్రీ శివానందమూర్తి గారు మన మధ్యనే ​ఈ మధ్య వరకూ ​ఉన్నారు. వారిని గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం! శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు విభవ నామ సంవత్సర, మార్గశిర శుద్ధ నవమి,రేవతి నక్షత్రం,కన్యాలగ్నంలో (21-12-1928) రాజమహేంద్రవరంలో జన్మించారు.వీరబసవరాజు,
సర్వమంగళ దంపతుల పుణ్యఫలంగా ​వారికి ​జన్మించారు. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని ఉర్లాం. వీరు స్వతహాగా గొప్ప ధనవంతుల కుటుంబానికి చెందిన వారు. వీర బసవరాజు,సర్వమంగళ దంపతులు గొప్ప శివ భక్తులు. వారున్న ప్రాంతంలో వారు షుమారు 200 దేవాలయాలను నిర్మించారు. శివభక్తులు కావటం వలెనే​ ​తమ కుమారుడికి 'శివానందమూర్తి ' అనే పేరు పెట్టుకున్నారు.
శివానందమూర్తి గారికి బాల్యం నుండే భక్తి,యోగశాస్త్రాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది.శివానందమూర్తి గారు 1949 లో సైన్స్ లో పట్ట​భద్రులయి,పోలీసు శాఖలో చేరారు.ఒక దశాబ్దం కాలం హనుమకొండలో పనిచేసారు.1951 సం॥ లో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తలు.పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడే,బీదవారికి సహాయం చెయ్యటం,హిందూ ధర్మంపై ప్రసంగాలు చేసి సనాతన ధర్మపరాయణులుగా పేరు తెచ్చుకున్నారు.ఆ శాఖలో అత్యున్నత స్థానానికి ఎదిగారు.1982 ​లో స్వచ్ఛంద పదవీ విరమణ​ ​చేసి ఆధ్యాత్మిక సాధన చేసేందుకు విశాఖపట్టణానికి 36 కి.మీ. దూరంలో ఉన్న భీమిలి కేంద్రంగా వారి ఆధ్యాత్మిక జీవనం ​మొదలయింది .భీమునిపట్నంలో 'ఆనందవన్' అను పేర ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో ​నివసించేవారు . ఆ ఆశ్రమంలోనే మహాలక్ష్మి దేవాలయాన్ని నిర్మించారు.ప్రజలకు రక్షణ కలిపించటం ఆయన ధ్యేయమేమో! వక్రమార్గంలో నడుస్తున్న మనల్ని రక్షించటం కోసం ఆయన తన ​వయసు​ను లెక్క చేయకుండా మనకోసం ఎన్నోధర్మకార్యాలను ​చేసారు . ఆయన చదవని పవిత్ర గ్రంధం లేదని చెప్పవచ్చు. అయన నడిచే విజ్ఞాన సర్వస్వం.అంతే కాకుండా వీరికి భారతీయ కళలపై ఆసక్తి కూడా ఎక్కువగా ఉండేది.ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాల మీద పలు గ్రంధాలను రచించారు. 'కఠోపనిషత్' మీద వారు వ్రాసిన వ్యాఖ్యాన గ్రంధం కంచి పరమాచార్యుల వంటి వారి చేతనే కాకుండా పలువురి ప్రశంసలను పొందింది.ఎంతోమంది సన్యాసులు, పీఠాదిపతులు వారిని అనేక విషయాల మీద సంప్రదించి సలహాలను తీసుకున్న సందర్భాలు అనేకం.భారతీయ సనాతన ధర్మం గురించి వారు ఎక్కువగా ప్రవచిం​చేవారు . వారు ఉపన్యాసాలను కొన్నిటిని వారి శిష్యులు'భారతీయత',భారతీయత-2' అనే గ్రంధాలుగా వెలువరించారు.వీరు రచించిన'హిందూ వివాహ వ్యవస్థ-దాంపత్య జీవనం' అనే గ్రంధం ఇంగ్లీష్,తెలుగు భాషలలో 2006 లో ప్రచురితమైంది.2007లో మరొక మహత్తర గ్రంధం,'మహా ఋషుల చరిత్ర'ను వ్రాసారు.2008 లో గౌతమ బుద్ధుని మీద ఒక గొప్ప పుస్తకాన్ని వెలువరించారు.
ఆయనకొక సొంత గ్రందాలయమే ఉంది. దానిలో రమారమి 20,000 ల గ్రంధాలను భద్రపరిచారు.సనాతన చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. అంతే కాదు,ఆంద్ర సంగీత అకాడమీని కూడా స్థాపించారు.
ఈ ఆధ్యాత్మిక సుసంపన్నుడిని శ్రీ రాజాలక్ష్మి​ ​వారు ఘనంగా​ ​​​సత్కరించారు.తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ తో సన్మానించారు.శివానందమూర్తి గారు పలు ప్రదేశాలను,విదేశాలను దర్శించారు. వాటిలో ముఖ్యమైనవి-ఇండోనేషియా ,నేపాల్,అమెరికా మొదలైనవి.2007 లో పలు భాషలలో నిర్మించబడిన 'బుద్ధ' అనే సినిమాకు స్క్రిప్ట్ వీరు వ్రాసిన గ్రంధం ఆధారం చేసుకొని ​వ్రాసింది కావటం విశేషం.దేశం నలుమూలలా వందలాది అనుయాయులతో పర్యటించి దేశసంక్షేమం, సంస్కతీ వికాసం సంకల్పిస్తూ 200కు పైగా యజ్ఞాలు నిర్వహించారు. సాక్షాత్‌ శ్రీ దక్షిణామూర్తి స్వరూపులు సద్గురు
శివానందమూర్తి .‘సద్గురు’ శబ్దాన్ని సార్థకం చేసిన జ్ఞానమూర్తి​. ఆయన అనేక ఆధ్యాత్మిక,భక్తి విషయాలను గురించి విపులంగా చెబుతుంటారు.​'శైవ మహా పీఠం' ను స్థాపించి దానికి పీఠాదిపతిగా ఉన్నారు.​భారతదేశంలో​ని ​ ఋషి పరంపరకు ప్రతీకగా సద్గురు శివానందమూర్తి​ ​గారు మన కళ్ళముందు జీవించారు.ఒక సందర్భంలో వారు ఇలా అన్నారు," శ్రీ రాముడు అవతార పురుషుడు. ఒక పరిపూర్ణ మానవుడిగా ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా సాగించాలో ఆచరించి చూపించాడు. ఒక కుమారుడిగా,అన్నగా,భర్తగా,స్నేహితునిగా,రాజుగా ఇలా అన్ని విషయాలలో మనకు ఆదర్శవంతుడు ఆయన.అలాగే శ్రీ కృష్ణుడు మానవ రూపంలో మనకు జ్ఞాన సంపద పంచి ఇచ్చిన జగద్గురువు.'దైవం మానుష రూపేణా' అంటే అర్ధం ఇదే. పరిపూర్ణమైన మానవజీవితాన్ని గడిపిన వారే మనకు ఆరాధ్యులు,అవతార పురుషు లయ్యారు. చెప్పింది చేసి చూపించే వారే మహనీయులు!" అలా చెప్పింది చేసి చూపించిన మహనీయుడే నేడు మన మధ్య ​నివసించిన సద్గురువు శ్రీ శివానందమూర్తి గారు.ఇట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మిక వేత్త ​మనల్నిభౌతికంగా వీడి 2015,జూన్‌ 9​​ రాత్రి శివైక్యం​ ​చెందారనే వార్త సనాతనధర్మ భక్తులందరిని శోక సముద్రంలో ముంచింది! ​
(సనాతన ధర్మసారథి సద్గురు శివానందమూర్తి గారికి ​స్మృత్యంజలి!)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information