గోదావరి నుంచి సబర్మతి వరకు...

(కొత్త సీరియల్ )

అవని


" జీవితం "-మూడు అక్షరాల విధిరాత,
జ్ఞాపకాలనే పున్నాగల పులకింత ,
గుణపాఠాలు నేర్పే భగవద్గీత,
 అనుభవాల సరాగాల కలబోత."
                               కొబ్బరికాయ లోపలికి నీరు ఎలా వచ్చిందో, సముద్రం లోకి ఉప్పు ఎలా వచ్చిందో... మనకి తెలియనట్టే,  జీవితంలో జరిగే అనేక సంఘటనలు ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో మనం ఊహించలేం. ప్రతి జీవితం వెనకాల ఓ కథ వుంటుంది. ఓ కనిపించని వ్యధ ఉంటుంది. కొన్ని జీవితాలు ఆనందమయంగా గడవొచ్చు,మరికొన్ని జీవితాలు విషాదభరితం కావొచ్చు, మరికొన్ని రెండింటి కలయిక కావొచ్చు...కానీ జీవితం ఏదైనా మనిషనేవాడు పుట్టాక అనుభవించి తీరాల్సిందే. కష్టాల్లో వున్నవాడు సుఖాలకోసం ఎదురుచూస్తూ బతుకుతాడు. సుఖాల్లో మునిగితేలేవాడు మరిన్ని సుఖాలకోసం అర్రులు చాస్తూ బతుకుతాడు. మొత్తానికి పుట్టాక, పోయేవరకు బతకాల్సిందే. జీవితాన్ని అనుభవించాల్సిందే. బతుకు జీవిత బండిని లాగాల్సిందే. ఆ బండిని ఆపే హక్కు ఎవరికీ లేదు. ఆ పై వాడికి తప్ప.
***
                   ఖమ్మం రైల్వేస్టేషన్‌, మధ్యాహ్నం మూడు గంటలు: ఇది మరీ పెద్ద రైల్వేస్టేషన్‌ కాకపోయినప్పటికీ మరీ చిన్నదికాదు. ఫ్లాట్‌ ఫారం మీద జనం బాగానే అటూ, ఇటూ తిరుగుతున్నారు. ఎవరి గమ్యాలకు వాళ్ళు చేరాలన్న తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే వుంది. వాళ్ళను చూస్తుంటే, మన పాత నానుడి గుర్తొస్తుంది. ‘వెళ్ళేవరకు తొందర,వచ్చే వరకు తొందర.ఈ ఉరకల,పరుగుల ప్రవాహమే జీవితం.’
“దయచేసి వినండి, రెండో నెంబర్‌ ఫ్లాట్‌ ఫాం మీదకి నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో అరగంట ఆలస్యంగా వస్తుంది”  మైక్‌ లో  ప్రకటన వినిపించింది. అహమ్మదాబాద్‌ వెళ్ళాలంటే వున్న ఒకే ఒక రైలు అదే కావడంతో సహజంగానే ఆ రైలు కిక్కిరిసి వస్తూ వుంటుంది.
ఓ చేతిలో నీలంరంగు బ్యాగ్‌, మరో చేతిలో మైక్రోసాఫ్ట్‌, ల్యూమియా మొబైల్‌ తో ఓ ముఫ్ఫయి ఏళ్ళ అమ్మాయి ఆ రైలు ఎక్కడానికా అన్నట్టు అక్కడ ఎదురుచూస్తుంది. నిపుణుడైన శిల్పి చేతినుంచి అప్పుడే జాలువారిన అద్భుత శిల్పంలా ఉంది ఆమె. కళ్లలో ఓ తెలియని వేగం, గొంతులో తెలియని ఓ ఆదుర్దా, మనిషిలో తెలియని ఓ నిశ్చలతత్వం... ఒకసారి చూసిన వారికి మళ్ళీ ఆమెను తిరిగి చూడాలి అన్నంత ఆకర్షణ ఆమెలో ఉంది. అంతకు మించిన వ్యక్తిత్వం ఏదో, ఆమె అందానికి ఆభరణమై సొబగులద్దుతోంది.
ఇంతలో శ్రీరామ... అంటూ ఆమె మొబైల్‌  రింగయింది.
" హలో, హలో.." అంది ఆమె.
సిగ్నల్‌ సరిగా వున్నట్టు లేదు. సంచారవాణి ఆగిపోయింది.
ఇంతలో తనే ఆతృతగా మళ్ళీ రింగ్‌ చేసింది.
" బాబీ..చెప్పు " అంది.
" అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా... రైల్లో తినడానికి తెచ్చుకున్నావా.." అట్నుంచి అడిగాడు.
" అన్నీ తెచ్చుకున్నాను... నువ్వు జాగ్రత్త... నేను మళ్ళీ చేస్తాను... " ఫోన్‌ కట్‌ చేసింది.
నెమ్మదిగా నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాట్‌ ఫాం మీదకి వచ్చింది. తన బోగీ నంబరు చూసుకొని ఆమె లోపలికి ఎక్కబోతుంటే ఎవరో " అమ్మా..ఆకలి ! తినడానికి ఏమైనా వుంటే ఇవ్వమ్మా " అని అడగడం వినిపించింది.
అతని వైపు జాలిగా ఓ చూపుచూసి తను రైల్లో తినడానికి తెచ్చుకొన్న పూరీలలో కొన్ని, కూరతో కలిపి అతనికి ఇచ్చింది. తర్వాత మనశ్శాంతిగా ఓ నవ్వు నవ్వి తన బెర్త్‌, నంబరు చూసుకొని అక్కడ తన సామాన్లు జాగ్రత్తగా సర్దుకొంది. తన చుట్టుపక్కల బెర్తులున్న వాళ్ళని ఒకసారి తదేకంగా పరీక్షించి తన బెర్తు సర్దుకుంది. తను కోరుకున్నట్టే తనకి అప్పర్‌ బెర్త్‌, రావడంతో మీదకి ఎక్కి కూర్చుంది. కింద బెర్త్‌, మీద ఓ అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి, మధ్యలో అతని భార్య సర్దుకున్నారు. తర్వాత ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకోడంలోను, స్టేషన్‌ కి తమని దిగబెట్టడానికి వచ్చిన వాళ్ళకి వీడ్కోలు పలకడంతోను, తోటి ప్రయాణీకులు హడావిడిగా వుండటాన్ని గమనించసాగింది.
రైలు నెమ్మదిగా ఖమ్మం దాటి పరుగు మెదలెట్టింది.
ఆమెతో ఒకింత మాటలు కదుపుతూ " ఎంతవరకు వెళతారు ఆంటీ..?" అని అనునయంగా అడిగింది.
" అహమ్మదాబాద్‌  వరకు వెళతామమ్మ” చెప్పింది ఆమె.
" నువ్వెక్కడి వరకు ?" అడిగింది.
" నేనూ అక్కడికే.." చెప్పింది.
" నీకు ఎప్పుడు కావలసిస్తే అప్పుడు  కిందకి వచ్చి కూర్చో " చనువుగా చెప్పిందామె.
" అలాగే కొంతసేపు పోయాక వస్తాను " చెప్పింది.
ఇంతలో ఆమె మొబైల్‌ రింగయింది.
" ఏంటి బయలుదేరావా..రైలు బయలుదేరిందా .." అవతలి గొంతులో ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది.
" ఆ ..బయలు దేరాను..రైలు కూడా బయలుదేరింది." చెప్పింది ఆమె.
" సరే..జాగ్రత్త.." అవతలి స్వరం.
" సరే..వుంటాను.." ఆమె ఫోన్‌ పెట్టెసింది.
నెమ్మదిగా కిందకి దిగి ఆ ఆంటీ పక్కన కూచుంది. వాళ్ళకి ఎదురుగుండా బెర్త్‌,ల మీద హిందీ వాళ్ళలా వున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి పెద్దగా అర్ధం అయీ అవనట్టుగా వుంది.
" ఏంటమ్మా..నువ్వు ఏం చేస్తూ వుంటావు.." ఆసక్తిగా అడిగాడు ఆ పెద్దాయన.
" నేను కాకతీయ యూనివర్సిటీ లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నాను." చెప్పింది ఆమె.
" ఓ ..వెరీగుడ్‌..ఏ సబ్జ్జెక్ట్‌,.." అడిగాడు.
" మేధమెటిక్స్‌," చెప్పింది ఆమె.
" మీరు ఏం చేసేవారు..అంకుల్‌"అడిగింది.
" నేను ఆల్‌ ఇండియా రేడియో లో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్‌ గా చేసి రిటైర్‌ అయ్యానమ్మా..మా అబ్బాయి అహమ్మదాబాద్‌ లో ఓ.ఎన్‌.జి.సి లో పని చేస్తున్నాడు.వాడి దగ్గరకే వెళుతున్నాం.నీ పేరేంటి..?" అడిగాడు.
" ప్రణవి " చెప్పింది ఆమె నవ్వుతూ.
" చక్కని పేరు. మంచి పేరు పెట్టారు నీకు మీ అమ్మ,నాన్న " అంది ఆమె నవ్వుతూ.
" ఏ వాణి అనో, భారతి అనో పెట్టాల్సింది. చక్కని చదువుల తల్లిలా వున్నవు.." అన్నాడు అతను.
" ఆపండి మీరు.. మీరు  AIR లో చేసినందుకు అన్ని మీకు AIR ఆలోచనలే." అంది అతని భార్య ఆటపట్టిస్తూ.
అందరూ ఒకేసారి నవ్వేసారు. అలా మాటల కాలక్షేపం మధ్య వాళ్ళ ప్రయాణం అలా జరిగిపోతోంది. ప్రతి రైలు ప్రయాణంలో ఎన్నో కొత్త పరిచయాలు, మరెన్నో మధురానుభవాలు మనం చూస్తూనే వుంటాం.
సాయంత్రం ఏడు దాటుతోంది.
" వేగంగా ఏదో కొంత ఎంగిలి పడితే మంచిది." అంది ఆమె.
ముగ్గురూ ఒక దగ్గర కూర్చొని టిఫిన్లు అయ్యాయనిపించారు.
ఆ రైల్లో ప్రణవికి ఎదురుగుండా గల బోర్డు చూసి నవ్వొచ్చింది." అపరిచితులు ఇచ్చిన తినుబండారాలు తినొద్దు " అని రాసి వుంది అక్కడ.
ఇంతలో ప్రణవి ఫోన్‌ రింగైంది. ఫోన్‌ ఎటెండ్‌ చేసి చెవిలో హెడ్‌ ఫోన్‌ తగిలించుకొని మీద బెర్త్‌, మీదకి ఎక్కింది. కొంతసేపు ముక్తసరిగా మాట్లాడింది. అలా పడుకొని ఏదో ఆలోచిస్తుంది.
నెమ్మదిగా రైలు కూపే అంతా నిశ్శబ్ధంగా మారుతోంది. అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధంగా వున్నట్టుంది.
ప్రణవి నెమ్మదిగా గత స్మృతుల్లోకి జారుకొంది.
***
ప్రణవి జీవితంలో ఓ రోజు..ఆమె మొబైల్‌ కి ఓ మెసేజ్‌ వచ్చింది.
అది.." నా మది నిండా నువ్వే..నా ఆలోచనల పొదరిల్లు నువ్వే..
          నా వెంట నడిచే నీడవు నువ్వే..నా గుండె చప్పుడు నువ్వే..
          ఉషస్సుల ఉచ్వాశాల్లో..నిశినీడల నిశ్వాసాల్లో
       తొలి నువ్వే..మలి నువ్వే..తుది నువ్వే..సర్వస్వం..నువ్వే..నువ్వే "
చూస్తే ఏదో తెలియని నంబర్‌ లా వుంది.
“పోనీ, తిరిగికాల్‌ చేస్తే..?”మళ్ళీ ఆలోచించింది.
“ఎందుకొచ్చింది..అనవసమైన రిస్క్, ఇప్పుడు ఇటువంటి మార్కెటింగ్ ట్రిక్కులు, మొబైల్ హాకింగ్ లు జరుగుతున్నాయి కదా ! అసలు ఎవరై వుంటారు? నా నంబర్‌ ఎలా తెలిసింది..?నా గురించి తెలిసైనా వుండాలి, లేదా నన్ను గమనిస్తూ అయినా వుండాలి. లేదంటే ఇలా రాయలేడు కదా!”
 మది నిండా, మస్తిష్కం నిండా అనేక ఆలోచనలు. అంతగా పట్టించుకొని బుర్ర బద్దలు కొట్టుకోవడమెందుకు. లైట్‌ తీసుకొంటే పోయింది.. అనుకుంది మనసులో..
(సశేషం)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top