Sunday, April 24, 2016

thumbnail

దివ్వెలెత్తు పొద్దు

 అన్నమయ్య పదం- పరమార్థం

దివ్వెలెత్తు పొద్దు

డా.తాడేపల్లి పతంజలి 


సాయం సంధ్యా సమయానికి అన్నమయ్య పెట్టిన పేరు “దివ్వెలెత్తు పొద్దు.”దీపాలు పెట్టే సమయమని అర్థం . అలపొద్దు, దీపాలవేళ, సందెకాడ [కళింగ మాండలికం]పొద్దుమీకి, సందాల [తెలంగాణ మాండలికం]అన్బకార, ఎసుర్లయాల, పొద్దు, పొద్దూకు, పైటేల, మూసిడింతల, సందెకాడ, సాయంకాలం [రాయలసీమ మాండలికం] అను ప్రయోగాలు  సంధ్యా కాలనికి సంబంధించి ఇదివరకటి రోజుల్లో ప్రజల నాలుకల మీదుండేవి.
          విద్యుచ్ఛక్తి దీపాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో  కార్తిక మాసం, దీపావళి – ఇలాంటి సందర్భాల్లోనే  సంప్రదాయజ్ఞుల ఇళ్లలో సంధ్యా  దీపాలు వెలుగుతున్నాయి. కొంతమంది  నేటికీ విద్యుచ్చక్తితో సంబంధంలేకుండా దీపాలు వెలిగించే వారు లేకపోలేదు కాని తక్కువ.అన్నమయ్య దివ్వెలెత్తు పొద్దులోని కాంతులను తన కీర్తనలో చదివి పరవశిద్దాం.
పల్లవి:  వచ్చినవారమిదివో వాకిటనె వున్నారము
          నెచ్చెలి యెదురుచూచీ నీచిత్తమిఁకను
చ.1:    నవ్వుల పండుగలాయ ననుపులెండుగలాయ
          యివ్వల చెలితో పొందులిఁకనెన్నఁడు
          రవ్వలాయ నీచేఁతలు రాజసమే నెరపఁగా
          దివ్వెలెత్తుఁబొద్దులకు తిరమాయఁ బనులు
చ.2:    మాటలివే విందులాయ మంతనాలే సందులాయ
          యీటున కాంతతో మేలమిఁకనెన్నఁడు
          మూటలాయ నేర్పులు మోచుకవున్నారమిదే
          మేటిశింగారాల వేగీ మిగిలె చీఁకట్లు
చ.3:    వీడెములే వొడినిండె వేడుకలు పంటవండె
          యీడ వచ్చున్నది చెలియ యిఁకనెన్నఁడు
          పాడితో శ్రీ వెంకటేశ పడఁతిఁ గూడితివిట్టె
          యేడుమద్యాన్నములెక్కె యెట్టి రహస్యములో (రేకు: 0197-3సంపుటం: 07-575)
అర్థం
          అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి, వేంకటేశునితో మాట్లాడుతున్నాడు.
పల్లవి:  అయ్యా ! వేంకటేశా !
          నీకోసం   వచ్చిన వాళ్లం  ...వాకిటలో నీకోసం ఎదురుచూస్తున్నాం.
          మాతో బాటు నీస్నేహితురాలు కూడా ఎదురుచూస్తోంది.
          నీ చిత్తం.. ఎప్పుడు అవిడని కలుస్తావో !
చ.1:    మీ మధ్య నవ్వుల పండుగలు అయిపోయాయి.ఎదురు చూసి చూసి అనురాగాలు (ననుపులు)ధాన్యాదులు           ఎండబెట్టినట్లుగా          ఎండిపోయాయి.(ఎండుగలాయ)
          ఈ వైపుగా నాతో ఉన్న చెలితో నీపొందులు ఇక ఎప్పుడు?
          రజోగుణము వల్ల పుట్టిన  గర్వంతో నువ్వు చేసే  చేష్టలు అల్లరవుతున్నాయి. అపకీర్తి           పాలవుతున్నాయి.(రవ్వలాయ) . నువ్వది గమనిస్తున్నావా?
          సంధ్యాకాలానికి “వ్యవహారాలు” చక్కబెడతావా? లేదా?
చ.2:    వేంకటేశా !  ఇదివరలో నీ మాటలు విందులయ్యాయి. ఆనాటి రహస్య చర్చలు అవకాశం కోసం           ఎదురుచూస్తున్నాయి.
          కాంతతో వేళాకోల  హాస్యాలు ఇక ఎంతకాలం? !
          నీ నేర్పుల జ్ఞాపకాలు మూటలుగా మోచుకొని ఉన్నాం.
          గొప్పవైన సింగారాలలో తపించి , మా జ్ఞాపకాల చీకట్లు మిగిలిపోయాయి.
చ.3:    తాంబూలాలు ఒడిలో నిండిపోయాయి. .( పెళ్లి నిశ్చయమయిందని భావం) వేడుకలు           సమృద్ధమయ్యాయి(పంటవండె)
          నీ చెలి ఇక్కడకు  వచ్చి ఉన్నది.
          నీ సహజ స్వభావంతో (పాడితో) పడతితో కలిసావు.
          ఏడు పట్టపగళ్లు గడిచిపోయాయి. తెమలని ఆ రహస్యాలేమిటయ్యా !
పరమార్థం
          అన్నమయ్య నిరీక్షణతో, బాధతో కీర్తనని పూర్తి చేయడు.
          రెండు చరణాలలో నిరీక్షణ గురించి కమ్మగా చెప్పాడు.
          మూడో చరణంలో నాయిక నాయకుల  కలయికను వర్ణించాడు.
          తెమలని రహస్యాలేమిటని, దివ్వెలెత్తు పొద్దు దీపాల  కాంతులు అక్షరాలలో చూపించాడు.. స్వస్తి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information