అవును వాళ్లిద్దరూ అవాక్కయ్యారు!

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గంగాధరంగారు పురాణాలు ఆపోసన పట్టిన మహాపండితుడు, అంతేకాకుండా జోతీష్య, హస్తసాముద్రిక, వాస్తు శాస్త్రాల్లో పేరొందిన సిద్ధాంతి. ఎవరు ఏ సమస్యతో వచ్చినా వెంటనే సమాధానం చెప్పి మనసుకు సాంత్వన చేకూర్చుతాడు.
ఆయన ఆ వారం పత్రికకు పంపవలసిన, పాఠకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండగా భార్య శకుంతల శ్రద్ధగా, ఓపిగ్గా రాస్తోంది.
అప్పుడొచ్చాడు గుర్నాధం.
గుర్నాధం ఓ అనుమానప్పక్షి. తనకొచ్చేకలలు, అపశకునాలు, బల్లి, తొండపాటు, ఇత్యాది విషయాల మీద ఏ శంక కలిగినా వెంటనే ఆయన ముందు వాలిపోయి సందేహ నివృత్తి అదీ తన మనసుకి తృప్తి నిచ్చేలా వుంటే తప్ప అక్కడ్నుంచి కదలడు. అది ఆ భార్యభర్తలిద్దరికీ మామూలే. పైగా అతను భారీగా దక్షిణ కూడా ఇస్తాడు. అందువల్ల చేస్తున్న పనినాపి-
"ఏంటయ్యా గుర్నాధం, ఏవన్నా సందేహం మనసుని దొలిచేస్తోందా?"అడిగాడు గంగాధరంగారు.
"దైవాంశ సంభూతులు. తమరికి అన్నీ ముందే తెలిసిపోతాయి"అన్నాడు ఆయనపట్ల తన భక్తి ప్రపత్తులు మాటల్లో కనబరుస్తూ.
ఆయనోమారు భార్య వంక గర్వంగా చూసి "ఈసారి ఏవిటోయ్ నీ అనుమానం?" అని అడిగాడు.
"అయ్యా, మరి నేను కొంతకాలం క్రితం రెండు పనులనుకుని, అందులో ఒకటి నిర్విఘ్నంగా పూర్తయితే తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి మరొటి పూర్తయితే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి జుత్తిస్తానని మొక్కుకున్నానండీ, ఇంతకాలం ఇంటి బాధ్యతలు, పని ఒత్తిళ్ల మధ్య వాటి ఊసే గుర్తురాలేదు"
"ఇప్పటికైనా గుర్తొచ్చిందిగా, వెళ్లి జుత్తిచ్చేసేయ్"
"ఇక్కడే నాదో అనుమానం అండీ..నేననుకున్న మొదటిపనికి శ్రీ వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నానో లేక యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామికి మొక్కుకున్నానో గుర్తులేదండి, అలాగే రెండో పనికీనూ."అన్నాడూ బుర్ర గోక్కుంటూ.
"దాందేముంది? మొదట తిరుపతో లేక యాదాద్రో వెళ్ళు. జుత్తు ఇచ్చేయ్"
"అలాగెలాగండీ..మొదటి పనికి ఎవరికి జుత్తిస్తానన్నానో ఆళ్లకే ఇవ్వాలి కదండీ, తర్వాతే కదా రెండో దేవుడికి. లేదంటే వాళ్లకి కోపంరాదటండీ"
భగవంతుడికి భక్తుడంటే ప్రాణమని ఎలా చేసినా ఫర్వాలేదని కొన్ని పురాణ ఉదాహరణలు చెప్పాడు. వినలేదు. నయానా భయానా నచ్చ చెప్పాడు అయినా ‘ససెమిరా’ అన్నాడు.
గుర్నాధం విసిగిపోయాడు. భర్త పరిస్థితికి మొట్టమొదటిసారి శకుంతలకి జాలేసింది.
ఇహ గుర్నాధాన్ని కోపంతో కసురుకుందా మనుకుంటుండగా, తళుక్కున మనసులో ఒక పరిష్కారం మెదిలింది.
"పోనీ ఒక పనిచెయ్, ముందు తిరుపతో, యాదాద్రో వెళ్లి సగం గుండు కొట్టించుకో, తర్వాత మిగతాది గీకించేయ్"అన్నాడాయన.
గుర్నాధం కళ్లలో మెరుపులు.."సామీ మీరు సామాన్యులు కాదు. ఏం చెప్పారండీ"అంటూ బయటకి పరుగు తీశాడు.
ఆయన భార్య వంక "చూశావా, అతగాణ్ని నేనెలా సంతృప్తి పరచానో’ అన్నట్టు అతిశయంతో చూశాడు.
ఆవిడ కూడా మెచ్చుకోలుగా చూసి" అయ్యో, దక్షిణ ఇవ్వకుండా బయటకి పరుగు తీశాడు" అంది బాధగా.
"అతనెక్కడికి పోతాడూ..సంతృప్తి పొందిన మనసు భూరి దక్షిణ ఇవ్వకుండా ఉంటుందా"అన్నాడు.
మళ్లీ అంతలోనే గుర్నాధం వెళ్లినంత వేగంగానూ వచ్చి "అవునూ, తల నీలాలిస్తానని మొక్కుకోవడమంటే మొత్తం తల జుత్తివ్వడం కదండీ. మరి సగం ఒక చోట,  ఇంకో సగం మరో చోటా ఇస్తే దేవుడికి కోపం రాదటండీ"అన్నాడు లెంపలేసుకుంటూ.
అది విని ఆ భార్యభర్తలిద్దరూ అవాక్కయ్యారు.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top