ప్రాణాధారము - అచ్చంగా తెలుగు

ప్రాణాధారము

                                         డా.బల్లూరి ఉమాదేవి.                                      ఆదోని(కామవరం)


అందమైన లోకమిది, ఆనందాన్నందించేది
కవుల వూహలకందనిది కమ్మని తావినొసగేది 
మధురోహల రేకెత్తించే సుందరమైన ప్రకృతిది 
నిసర్గమైనది నిర్మలమైనది అందరు మెచ్చే స్వర్గమిది 
పచ్చనైన చెట్లతో చేమలతో పలకరించి పరవశించి 
మురసి మురిసి పోతుంది కొత్త సొబగు లందిస్తోంది.
ప్రకృతిలోని అందాలన్నీ పురివిప్పిన నెమలిలాగ 
ఒక్కచోట చేరినట్లు  సకలసృష్టి సంబర పడిపోతుంది 
నేల గాలి నీరు నింగి నిప్పు 
పంచభూతాలు ఇవి ప్రకృతిలోని అంతర్భాగాలు 
తావు నొసగి కాపాడే నేల 
నీడ నిచ్చిపోషంచే నింగి 
మనుగడ కవసరమైన గాలి 
త్రాగడానికి వండడానికి 
అవసరమైన నీరు నిప్పూ 
అన్నీ అందమైనప్రకృతి లోని భాగాలే 
భగవంతుడిచ్చిన అపురూపమైన వరాలే !
కానీ  ---నేడు 
కాలుష్యపు కోరల్లో  చిక్కి ౘక్కచిక్కి పోయాయి 
తమ ఉనికినే  కోల్పోతున్నాయి 
మానవునిలో 
స్వార్థమన్నదెక్కువై 
మానవత్వమన్నమాటే  మరచి 
అన్నిటిపై ఆధిపత్యం కావాలంటూ 
విషపు సంస్కృతిని పెంచుతూ 
తిలాపాపం తలా పిడికెడన్నట్లు 
కారకులెవరన్నదగమ్యగోచరం 
పంచభూతాలలో నొక్కటైనది 
మానవాళికగత్యమైనది.
నీరు 
నీరేజగతికి జీవాధారం 
నీరే ప్రగతికు మూలాధారం 
ఏ జాతి చరిత్ర చూసినా 
ఏనాగరికతకు నైనా 
మూలాధారం నీరే/ 
నీటి పరీవాహక ప్రాంతమేనని 
తెలుపుతోంది గతచరిత్ర.

సప్తసంతానాలలో  తటాకనిర్మాణ మొకటని 
చెపుతున్నాయిపురాణాలు 
అశోకుడాదిగా రాజులెందరో 
చెఱువులు బావులు త్రవ్వించారు 
చరిత్రలో  మిగిలి పోయారు 
జనులగుండెల్లో శాశ్విత స్థానం పొందారు 
అలనాడు భగీరథునిప్రయత్నం వల్ల 
దివిజ గంగ శివునిజటాఠూటం నుండి 
ఉరుకులుపరుగులతో భువికొచ్చింది 
శాపాలు పాపాలు తొలగించికలుషహారిణయ్యింది. 
జనుల దాహార్తిని తీర్చి 

దేశాన్నిసస్యశ్యామలం చేసింది 

కాని నేడో 
చెఱువులుబావులుపూడ్చేసి 
గృహసముదాయాలు నిర్మించేస్తున్నారు 
నీటి కొరతను నివారించే 
చెఱువులు బావులు నేడు 
ధనదాహం తీరడానికే 
ఉపయోగ పడుతున్నాయంటే 
కానేకాదు అతిశయోక్తి 
వరుణుడి కరుణ లేక పుడమితల్లి 
ఎండకు ఎండి బీటలు వారి పోయింది.


భూగర్భ జలాలడుగంటిపోతున్నాయ్ 
మేధో మథనాలు,మేఘమథనాలు 
చేసినా జలయఙ్ఞాలాచరించినా 
గుక్కెడు నీరు దొరికే దారే లేదు 
ఆశతో ఆకాశం వైపు చూసే 
రైతన్నకుమిగిలింది నిరాశే 
నీటి చుక్కలు లేవు గానీ 
కన్నీటి చుక్కలు ధారాపాతంగాస్రవిస్తున్నాయి 
అందుకే 
రండి రారండి 
పచ్చని చెట్లు పెంచుదాం 
ప్రకృతిని పరిరక్షిద్దాం 
అంతా హరితమయం చేద్దాం..

No comments:

Post a Comment

Pages