కొత్త చెరువు

కపిల భారతి 


మా వూళ్ళో నేను కొత్త చెరువును.ఇప్పటికే రాముడి చెరువు,కాసుల వారి కుంట,కుమ్మరి కుంట,మోదుగు కుంట,జంగాల వారి కుంట,చింతల చెరువు,వెలమ వారి చెరువు అనే చెరువులు వున్నాయి.కొత్తగా తవ్విన నాకు ఏ పేరు పెట్టకుండా కొత్త చెరువు అనడం మొదలు పెట్టారు.అదే నా అసలు పేరు అయింది.ఈ కధ అంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు పెద్దపులి మర్రిచెట్టు క్రింద మేము చెరువులందరం సమావేశం అవుదామని అనుకున్నాం.అందరం చేరాం, కానీ రాముడు తాత మాత్రం ఇంకా రాలేదు.వాడి కోసమే ఎదురు చూస్తున్నాం.అదిగో దూరంగా రాముడు తాతా కుంటు కుంటూ వస్తున్నాడు.మా అందరికి పెద్ద దిక్కు.అందరి కంటే ముందు పుట్టినవాడు,ముందు ముసలి వాడైనవాడు వాడే.ఇదిగో మా పెద్ద దిక్కు అయినవాడు మమ్ము చేరినాడు.ఇక నేను సమావేశానికి పోతున్నా.
సమావేశానికి కారణం కర్త,కర్మ,క్రియ అంతా రాముడు తాతే.అందుకే రాముడు తాత వచ్చేవరకు అందరం ఆతృతతో,కుతూహలంతో,ఆసక్తితో ఏమై వుంటుంది..?,ఎందుకు రమ్మన్నాడు,రాముడి కేమి బాధ కలిగింది..? అని రకరకాల ఆలోచనలు చేస్తూ వున్నాం.ఉన్న తొమ్మిది మందిమి రాముడుతాత రాగానే-ఏం పెద్దన్నా..ఎందుకు వున్న పళంగా రమ్మని కాకి కబురు చేసినావు అని ఒకరు,ఏం బాబాయ్‌..ఏం కష్టం కలిగింది అని ఒకరు,ఏం పెద్ద నాయినా నీకేమైనా అయితే చెప్పు..మేం నీ కష్టం తీర్చే వాళ్ళం కాకపోయినా బాధ నయినా పంచుకుంటాం అని మరొకరు అనడం మొదలు పెట్టారు.
రాముడు తాత మాత్రం ప్రశాంతంగా లేని ఓపిక తెచ్చుకొని  " ఏం చెప్పమంటారు..నాయినా "- అని మొదలెట్టాడు.నేను పుట్టిన నుండి దిన,దినం వర్ధిల్లుతూ ప్రజలందరికి ఎంతో ఆనందాన్ని పంచి వారూ వర్ధిల్లే విదంగా వుపయోగపడ్డాను.నేను యవ్వనంలోకి అడుగుపెట్టిన సంవత్సరం ఈ వూరి కరణం కొడుకు వచ్చినాడు.కరణం కొడుకు వచ్చిండని అందరూ గొప్పగా చెప్పుకున్నారు.నేను అతనిని చూడాలని ఆశపడ్డా.నేను ఆశపడిన విదంగా వచ్చినరోజు సాయంత్రమే నా దగ్గరకు చేరి నాలో దూకి రకరకాల జల ఆసనాలు వేశాడు.నేను ఎంతో పొంగిపోయాను.నీటిలో కూడా ఇంత ధైర్యంగా ఆసనాలు వేస్తారా అని ముక్కున వేలు వేసుకున్నా,అంతటితో ఆగలేదు ఆ బాబు తామర పువ్వుల గడ్డలు,కలువల దుంపలు తెప్పించి ఆ ఏటి ఎండకాలంలో నా నీటి బురదలో నాటించాడు.నేను ఇవేం దుంపలు అని అనుకున్నా కానీ ఆ ఏడు వర్షాకాలంలో నాలో పూసిన రకరకాల పువ్వులను చూసి నా అందానికి నేనే ముగ్ధుణ్ణి అయిపోయాను.
ఆ కరణం బాబు రోజు తప్పక తెల్లవారుఝామున పెద్ద తాంబూలం వేసుకొని దాన్ని ఒక తెప్పగా వాడుకొని తెడ్డులేకుండా దాని మీద కూర్చొని అది మునగకుండా నాలో పూసిన తామరలను,కలువలను కోసుకొని వెళ్ళేవాడు.నాకు అది ప్రతిరోజు ఎంతగానో అనిపించేది...ఎప్పుడు తెల్లవారుతుందా,ఎప్పుడు ఆ బాబు పువ్వలకై వస్తాడా..?అని ఎదురు చూసేదాన్ని.అతను వేసిన జలాసనాలు నాకు ఎప్పటికీ విచిత్రంగానే మిగిలిపోయాయి.ఎండాకాలం నేను ఎండుతూ వుంటే ఆ పూడిక తీసి నన్ను మరికొంత లోతు పెంచి నా నీటి సామర్ధ్యం పెంచేవారు ప్రజలు.నా మట్టిని తీసుకెళ్ళి రాముడి చెరువు మట్టి,రాముడి చెరువు మట్టి అని తమ పొలాల్లో వేసుకొనేవారు.మీరు నమ్మలేని మరొక నిజం ఏంటంటే నాలో ఒండ్రుకట్టి,ఎండిన పై పొరల మట్టిని మా కరణం తల్లి మెత్తగా దంచి,జల్లించి,తలకు రాసుకొని రెండు,మూడు గంటల తరవాత తలస్నానం చేసేది.ఆ అమ్మ మా దొడ్డ ఇల్లాలు.ఆవిడ చనిపోయే వరకు జుట్టు ఒక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు.అందరూ ఆవిడ కేశ సంపద గూర్చి గొప్పగా చెప్పుకుంటుంటే ఆవిడ మాత్రం ఇది మా రాముడి చెరువు చలవ.రాముడి చెరువు వున్నంత కాలం నా వెంట్రుకలు తెల్లబడవు అని గర్వపడేదని నా ఆయకట్టు రైతులు గొప్పగా చెప్పుకొనేవారు.శివరాత్రి దాటిందంటే చాలు గేదెలు కాసుకొనే పిల్లలు,గోవుల కాపరులైన గోపాలురు,గ్రామంలో బడి పిల్లలు మధ్యాహ్నం కల్లా నాలో చేరి ఈత కొట్టి ఆనందించాల్సిందే.ఒక వైపు గేదెలు,మరొక వైపు కొంగలు,ఇంకొక వైపు పిల్లలు,ఉదయమంతా రజకులు ఎంత సందడిగా ఓ పెళ్ళి ఇల్లులా వుండేది.నా పరిసరాలు,కాలం ఎప్పుడూ ఒకేలా వున్నా మనుషుల ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఒకేలా వుండవు.
కరణం కాలం పోయి నా ఆయకట్టు అంతా అమ్మబడి కొత్త రైతన్నలు వచ్చి గ్రామ సభలు,సంఘాలు పెట్టి నన్ను చేపల చెరువులా మార్చారు.
చేపల చెరువులా మారిన నాలోని పువ్వులు,పిల్లలు,కొంగలు,గేదెలు,నవ్వులు,జలకాలాటలు,కేరింతలు మాయం అయిపోయి వాటి స్థానే చేప పిల్లలు వాటి పులకింతలు,చేపల అల్లర్లు పైకి,కిందకి గెంతే వాటి ఆనందాలు మొదలు అయ్యాయి.ఇదో రకం మార్పు,ఇది కూడా బాగుందిలే అనుకున్నా.కానీ చేపలు పట్టే నెపంతో మనుషులు వేసే వలలతో నా ప్రాణం విలవిలలాడిన రోజులు నాలో ఎప్పటికీ కన్నీటి జ్నాపకాలే.చేపల పెంపకంలో వాటికి వేసే ఆహారంలో రకరకాల కలుషితాలు,దానిపై పెంపకదారులలో వారిలో వారికి గొడవలు,సభలు,సంఘాలు,వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడాలు నన్ను పట్టించుకొనే నాధుడు, పూడిక తీసే దిక్కు,మొక్కు లేకుండా రోజు,రోజుకూ కుంచించుకుపోతూ నాలో నేనే కుమిలిపోయిన రోజులు నేను వృద్ధ్యాప్యంలోనికి వచ్చేశాను అనే విషయాన్ని జ్నాపకం చేసాయి.
ఈ నా కధ అంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే మీరు నా అంత కాకపోయినా ఎంతో కొంత ప్రజల మేలుకై పాటుపడినవాళ్ళే.మీరు నా తరవాత వచ్చిన వారైనా మీరు ఈ నా అనుభూతులు అన్ని కాకపోయినా కొన్ని అయినా పొందినవారే.అయితే ఈ తరం పిల్లలు చదువులు,వుద్యోగాలు అని వరిపొలాలను తోటలుగానూ, లేదా ఇండ్ల స్థలాల గాను మార్చి తేలికగా డబ్బు సంపాదిద్దాం అనుకొనేవారేగాని ఎవ్వరూ కష్టించి పనిచేద్దాం,నా తాత,తండ్రుల పొలంలో చెమటోడ్చి సంపాదించుకుందాం అనేవారు కరువు అయ్యారు.అంతేకాదు మనది చెరువు కింది పొలం చెరువును శుభ్రం చేసుకుంటే పండే పంట పెరుగుతుంది అని ఆలోచన ఎవ్వరు చేసినట్టు వినపడ్డం లేదు.బోరు వేసుకుందాం , ఎన్ని ఎక్కువ బోర్లు వేసుకుంటే అంత పంట.క్రిమి సంహారక మందులు కొడదాం అవి ఎన్నిసార్లు కొడితే అంత పంట అనే భ్రమతో ఆలోచిస్తున్నారే కాని చెరువు మట్టి పొలంలో వేసుకుందాం,ఎండలు ముదురుటకు ముందు ఒక సారి పొలం దుక్కి చేద్దాం మందులు వాడకం తగ్గిద్దాం. కప్పలను బ్రతికించుకుందాం,అవి పురుగుల్ని తింటాయి.పాములను కాపాడుకుందాం,అవి కప్పలను తింటాయి.ఆహారం కోసం ఒక జీవి మరొక జీవిపై ఆధారపడుతుందనే భావనలే అడుగంటిపోతున్నాయి.కుర్రకారు ఏం ఆలోచనలు చేస్తారో,ఎంత వేగంగా ఎదగాలనుకుంటారో అంత వేగంగాను పడిపోతామని అనుకోరు.సరే! ఇప్పిడింక విషయం ఏంటంటే మన వునుకిని ఎవ్వరు గుర్తించడం లేదు.ప్రజలు అసలు మనం వున్నామనే విషయం కూడా మర్చిపోతున్నారు.కాబట్టి మన ఉనికిని మనం కాపాడుకోవడం కోసం,మన పూర్వ స్తితి తిరిగి పొందడం కోసం మనం ఏం చేద్దాం?ఎలా చేద్దాం..?అనే విషయం మీతో కలసి ఆలోచించి కార్యాచరణ మొదలు పెడదామని మీకు కబురు చేసాను.మీరందరూ ఎంతో ఉత్సాహంతో నా పై ప్రేమతో, అభిమానంతో ఆప్యాయంగా వచ్చినందుకు నాకు ఆనందంగా వుంది.ఇక ఒక్కొక్కరు మన ఉనికి గుర్తింపునకై మీ అభిప్రాయాలు చెప్పండి అని రాముడుతాత కూర్చున్నాడు.
రాముడితాత తరవాత పెద్దవాడు కాసులకుంట లేచి " పెద్దన్నా.. మనం ఏం చెయ్యగలం.అయితే పొంగిపొర్లి జలమయం చేయగలం..అదీ వానకాలం.లేదా చుక్క నీరు లేకుండా ఎండిపోగలం.అసలే మన దిక్కు చూడని ప్రజలు ఎండిపోతే మాత్రం ఏం చూస్తారు.ఇకపోతే వానాకాలం వరకు ఎదురు చూసి పొంగి పొలాలన్ని ముంచివేయగలం.కాని ఇంతమంది మనం పొంగితే ఈ వూరికి దారులు లేకుండా జల దిగ్భంధం అయినట్టు వుండేదని నా జ్నాపకం.కాని తెలివితేటలు పెంచుకొన్న మనుషులు గ్రామం చుట్టూ రోడ్డుపై వంతెనలు కట్టుకొని మన ప్రవాహాన్ని క్రిందకు పంపేసారు.పది,పదిహేను రోజులు పంట మునిగితే మునిగింది,మునిగింది అని ఫొటోలు దిగి పంట నష్టం అని అంచనాలు వేసి బాంక్‌ నుండి ఎంత డబ్బులు రాబట్టాలనే ఆలోచనలతో,ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వానిదే భాద్యత అని మాటలతో గడిపి వర్తమానాన్ని,భూతకాలంలో కలిపి చేతులు దులిపేసుకుంటున్నారు." అని చెబుతుంటే నేను(కొత్త చెరువు) లేచి నేనున్న వైపు వంతెన కట్టలేదు.నేను గాని ఒక పొంగు పొంగితే ఊళ్ళో సగం మంది ప్రాణాలు అరచేతపెట్టుకోవాల్సిందే అని గర్వంగా అన్నాను.
వెంటనే రాముడు తాత అందుకొని " ఒరేయ్‌..కొత్తవాడా! దుడుకు పనికిరాదు.మనం మన ఉనికిని తెలియ చేయడానికే గాని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు.గుర్తుంచుకో" అని కాస్త హెచ్చరికతోనే అన్నాడు.నేను మనసులో ముసిలివాడికి నా తడాఖా చూపెట్టాలని అనుకొని పైకి మాత్రం సరే,తాత నువ్వు చెప్పినట్టే అని అందరం అక్కడి నుండి నిష్క్రమించాం.భాధ్యత మాత్రం నేను తీసుకొని వానాకాలం కోసం ఎదురు చూస్తున్నా..
                                                                                       *********
మా చుట్టూ వున్న గ్రామాలకు వున్న ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్‌ నాగార్జున గ్రామీణ బ్యాంక్‌, అదీ అన్నీపురెడ్డిపల్లి గ్రామంలో.ఆ ఊరు వెళ్ళాలంటే మేము వున్న ఊరు దాటి వెళ్ళాలి.ఆ బ్యాంక్‌ లో పనిచేసేవాళ్ళు ముగ్గురు.అందులో ఒకరు మేనేజరు ,పేరు ప్రసాద్‌.ఆయన రోజూ నేనున్న దారినుండే వెళతాడు. చాలా మంచివాడని రైతన్నలను తన సొంత అన్నల్లా చూసుకుంటాడని,ఋణాలు మంజూరు చేయడంలోనూ,ఇవ్వడంలోనూ,ఋణాలు కట్టలేని వారికి సర్దుబాటు చేసి తిరిగి ఋణం ఇవ్వడంలోనూ తన ఉన్నతమైన మానవత్వాన్ని,ఔదార్యాన్ని చూపేవాడని నా ఆయకట్టు రైతులు చెప్పుకొనేవారు.ఎండాకాలం అయిపోయేముందు,వానాకాలం వచ్చేముందు ఆయన ఇంటికి కూడా పోకుండా రాత్రిళ్ళు బ్యాంకులోనే ఉండి ఋణ సంభంధ వివరాలు ఒంటి చేత్తో చక్కబెట్టుకొని ఏదో సమయంలో కరణం ఇంటికి వెళ్ళి ఇంత తిన్నాను అనిపించి తిరిగి బ్యాంకు కి చేరి అర్ధరాత్రి వరకు పనిచేసుకొని నిద్రపోయేవాడట.వానాకాలం నాట్లు,కలుపులు అయ్యేవరకు ఆ మేనేజర్‌ ఇంటి దగ్గర గడిపే రాత్రులు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చునట.
ఆయన ఇంటికి వెళ్ళే దారిలోనే మా ఊరి కరణం ఇల్లు కాబట్టి కొద్దిసేపు ఆ ఇంటికి వెళ్ళి ఆయనింటి బాధలు విని ఈయనింటి ఈతి బాధలు తరచూ పంచుకొనేవారు.పెంచుకుంటే పెరిగేది ప్రేమ.పంచుకుంటే తగ్గేది దుఖం.అని కదా లోకోక్తి.
రోజులు గడుస్తున్నాయి.నేను ఎదురు చూసే వానకాలం వచ్చేసింది.శ్రావణ చినుకులు బాద్రపద వర్షాలై కురవసాగాయి.బిందువు,బిందువు సింధువైనట్టు ధారాపాత వర్షములతో నేను నిండుకుండాల నవమాసాల బిడ్డను మోసే నిండు గర్భిణి అయ్యాను.ఎప్పుడు పొంగిపోతానో,ఎక్కడ కట్ట తెగుతుందో అనే ఆతృత ఒక వైపు రాముడు తాత చెప్పిన హెచ్చరిక మరొకవైపు.అందుకే పక్షులు గూడు చేరేవరకు,కూలీలు ఇల్లు చేరేవరకు,పశువులు కొట్టాలను చేరేవరకు నాలో నేను ఒత్తిడితో వుంటూ పొంగకుండా జాగ్రత్త పడ్డాను.
రాత్రి తొమ్మిది అవుతుంది.అందరూ నిద్రకి ఉపక్రమించారని తలచి ఒక్కసారి ఉత్సాహంతో గలగల చప్పుడుతో,ఆనందపు పారవశ్యంతో నేనేదో ప్రజలకు కనువిప్పు కలగించబోతున్నాననే ఉత్సుకతో పరుగులెత్తడం మొదలెట్టా.సరిగ్గా రోడ్డు మీదకి వచ్చే సమయానికి ఇంటికి వెళదామనుకున్న మేనేజర్‌ ప్రసాద్‌ గారి బండి రోడ్డు లోతట్టును దిగింది.అంతే నేను వెనక్కి వెళ్ళే స్తితి లేదు.నా గలగల చప్పుడులతో ఆయన హాహాకారాలు ఆ చిమ్మచీకట్లు,కారు మబ్బుల్లో,చిటపట చినుకులలో ఆయన అరుపులు అరణ్యరోదన అయితే నా పొంగిపొర్లిన ఉత్సాహం కన్నీటి జాలువారు అయింది.ఏ తాత అయితే నన్ను హెచ్చరించాడో ఆ తాత వొడిలో శవం అయి తేలాడు.మహా దొడ్డమనిషైన ప్రసాద్‌.నా పాపానికి నిష్కృతి లేదు.నా ప్రాయశ్చిత్తానికి అంతం లేదు.నా గర్వం అణిగిపోయింది.నా ఉత్సాహం ఆరిపోయింది.నా నుండి బయటికి వచ్చిన ప్రవాహపు ప్రతి బిందువు నా కన్నీటి ధారే.సంవత్సరం తిరిగేసరికి ఆ లోతట్టు రోడ్డుపై వంతెన నిర్మించబడిందనే విషయం చెప్పనవసరం లేదనుకుంటా.......

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top