అల్లుడొచ్చాడు - అచ్చంగా తెలుగు

అల్లుడొచ్చాడు

Share This

(జ) వరాలి కధలు - 2 

అల్లుడొచ్చాడు

రచన : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి ( సోమసుధ)


ఆఫీసునుంచి యింటికొచ్చిన నా చెవులకు మృదుమధురంగా వరాలి పిలుపు సోకింది.
"ఏమండీ! "
పెళ్ళయిన కొత్తలో ఆ పిలుపులోని మృదుత్వం నన్ను బృందావనతీరాలకు చేర్చేది. ఆరునెలలయ్యాక యిప్పుడు ఆ పిలుపు వినాలంటేనే భయం పుడుతోంది.  కారణం యిప్పుడు ఆ పిలుపుతో పాటు ఒక డిమాండ్ కూడా వస్తోంది. అది వినగానే మా ఆఫీసు రికార్డుల్లో ఉన్న పి.ఎఫ్. కాగితం తుఫానుగాలికి చలించే చెట్టు ఆకులా వణికిపోతుంది. నానుంచి వెంటనే బదులు రాకపోయేసరికి వరాలి గొంతు కొంచెం బిరుసెక్కింది.
" ఏమండీ! మిమ్మల్నే! "
ఇంకా బదులీయకపోతే మరెంత కఠినమవుతుందో అన్న భయంతో ముఖంపై చిరునవ్వు పులుముకొని "ఏమిటోయి?" అనడిగాను తనవైపు తిరిగి.
" నాన్న దగ్గరినుంచి ఉత్తరం వచ్చింది "
ఆయనకున్న ముగ్గురల్లుళ్ళలో నేనే కాస్త హోదా ఎక్కువవాణ్ణి. అందుకే ఆయన డబ్బుసాయమడుగుతూ ఉత్తరం వ్రాసి ఉండాలి.
" డబ్బు సాయం చేయమని వ్రాయలేదు కదా! " మనసులో అనుకొంటున్న మాట అప్రయత్నంగా బయటకొచ్చేసింది. ఆ మాటలకు వరాలి గొంతు గంభీరమైంది.
" ఆ! ఇంతకాలం వచ్చిన అల్లుళ్ళు పట్టుకెళ్ళటమే కానీ యివ్వటం తెలీనివాళ్ళు. పెళ్ళిచూపుల్లో మీ సూక్తివచనాలు విన్నారు కద! ఈ అల్లుడు ఆదుకొనే రకమని ఆయనకి అనిపించిందట! అందుకే మనం అద్దెకున్న యీ ఇల్లు అమ్మేసి డబ్బు పంపించమని వ్రాశారు. ఇంటాయనకు చెప్పకుండా ఆ పని చేసేద్దామా? "
వరాలికి కోపమొచ్చిందని గ్రహించి సముదాయించటం ప్రారంభించాను.
" సరదాగా అన్నాను గాని యింతకీ అసలు విషయం చెప్పు"
నా మాటలకు తను మెత్తపడింది.
" మన పెళ్ళయ్యాక వస్తున్న మొదటిపండుగ కద! సంప్రదాయం ప్రకారం సంక్రాంతికి రమ్మని ఉత్తరం వ్రాశారు "
" అసలీ పండక్కి వెళ్ళకపోతే ఏమవుతుందట? " నా ప్రశ్నకు తీక్షణంగా చూసింది.
" మీ ఆదర్శం మావాళ్ళకి అర్ధం కాదు గద! ఊళ్ళో ఎవరైనా మీ కొత్త అల్లుడు వచ్చాడా అనడిగితే ' మా అమ్మాయిని పండక్కి తీసుకురాలేద 'ని అడిగిన వాళ్ళముందు కన్నీళ్ళు పెట్టుకొంటారు. దాంతో మన మధ్య ఏ తగవులున్నాయోనని వాళ్ళు నాన్న బుర్ర తినేస్తారు. ఆ మాటలకు తట్టుకోలేక అరవై ఏళ్ళ ముసలాయన బండెక్కి చక్కా వస్తాడు. ఈ వయసులో ఆయన్నలా యిబ్బంది పెట్టడం మంచిదంటారా? అంతేకాదు. ఆ ఊళ్ళో నా స్నేహితులను వదిలి ఆరు నెలలవుతోంది. ఒక్కసారి అందరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకోవచ్చు గద! మీ వరాల్ని నిరుత్సాహపరుస్తారా? " అంటూ కూర్చుని బూట్లు విప్పుతున్న నా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమిరింది.
ఆవు గంగడోలు నిమిరితే ఏమవుతుంది?
ఊరి ప్రయాణం ఖాయమైపోయింది.
@ @ @ " నువ్వు మన అల్లుళ్ళ పరువు తీసేస్తున్నావోయి తమ్ముడూ! " భోగీ ముందు రోజు అత్తింటి గుమ్మంలో దిగిన నాకు ఎదురొచ్చి అన్నాడు నా పెద్ద తోడల్లుడు శంకరం.
భారతీయ స్త్రీలో ఉన్న గొప్ప గుణమేమిటంటే తనని నడిరోడ్డుపై ఎవరు దుమ్మెత్తిపోసినా సహిస్తుంది. అదే భర్తని అంటే మాత్రం అన్నవాణ్ణి అక్కడే నిలబెట్టి కడిగేస్తుంది.
శంకరం మాటలకు చిరునవ్వుతో లోనికెళ్ళబోయాను.
" అంతకాని పని ఏం చేశారు బావా?" వరాలి సూటి ప్రశ్నకు ఖంగుతిన్నాడతను.
" అదికాదమ్మా! అల్లుడంటే ఎలా ఉండాలి? మావ ఉత్తరం వ్రాసిన మరుక్షణమే గుమ్మంలో దిగిపోవాలి. ఇలా ఉత్తరం వ్రాసిన పదిరోజులకా వచ్చేది?
అల్లుడంటే మామని గడగడలాడించాలి గాని. . అబ్బే. .యిలా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదు " తడబడుతూనే తనని సమర్ధించుకొంటూ
బదులిచ్చాడు. ఫస్టు నైట్ పాలగ్లాసు మీద సరికొత్త నిర్వచనమిచ్చిన పెద్దమనిషి యితనే అయ్యుండాలి.
" ఆయన నీలా అదృష్టవంతుడు కాదు బావా! నువ్వంటే స్కూలు టీచరువి. ఏడాదిలో నాలుగైదు సార్లు పండగ సెలవలని పక్షంరోజులు స్కూళ్ళుండవు. గనుక మీకు సెలవులివ్వగానే అక్కను తీసుకొని మా ఊరి బస్సెక్కేస్తావ్? ఆయన ప్రభుత్వోద్యోగి. అరపూట సెలవివ్వాలన్నా ఆఫీసరు అరడజను ప్రశ్నలడుగుతారు. అతికష్టంపై అయిదు రోజులు సెలవిచ్చారు కనుమ మరునాడే వెళ్ళిపోవాలి. అంత కోపంలోను మా టూరుప్రోగ్రాముని నిజాయితీగా చెప్పేసింది. ఈలోగా వంటింట్లోంచి మమ్మల్ని చూసిన అత్తగారు పరుగున వచ్చింది.
" అదేంటబ్బాయి వచ్చినవాళ్ళని గుమ్మంలోనే ఆపేశావ్? " వరాలి వాగ్ధాటికే బిక్కచచ్చిన శంకరం అత్తగారి అరుపులకి జడిసి వీధిలోకి
జారుకొన్నాడు.
" ఏం బాబూ బాగున్నావా? రండి. నాలుగురోజులు ముందే వస్తావనుకొన్నాం. ఆయనా యిప్పటివరకూ మీకోసమే కలవరించి వీధిలోకెళ్ళారు. " ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూ లోనికెడుతూంటే, మౌనంగా లోనికనుసరించాం. ఆమె ఆపకుండా అడిగే ప్రశ్నలకు నేను బదులిస్తూంటే , వరాలు మౌనంగా బయటకు ఉడాయించింది.
" ఏమిటి బాబూ చూస్తున్నావ్? అమ్మాయి గురించేనా? కాపురానికెళ్ళాక మొదటిసారి వచ్చింది కదా! స్నేహితురాళ్ళ యింటికెళ్ళుంటుంది. వాళ్ళు కూడా దానికోసం నాలుగైదుసార్లు వచ్చి వెళ్ళారు. పల్లెటూరిపిల్ల. మీ పట్నవాసపు పద్ధతులకి అలవాటు పడిందో, లేదో! చిన్నపిల్ల. తప్పులేమైనా చేస్తే మన్నించు బాబూ! " ఆడదానిలో తల్లి బలహీనత. వీళ్ళు తమ ఆత్మగౌరవం కన్న భర్త, పిల్లల తప్పులను వెనకేసుకురావటానికే ప్రాధాన్యత నిస్తారేమో!
" ఎంత పల్లెటూరిదైనా మీ అమ్మాయేం అమాయకురాలు కాదండీ! ప్రస్తుతం నాకే పాఠాలు చెప్పే స్థాయి కెదిగింది " అని బాత్రూం కెడుతూంటే తెల్లబోయి చూస్తూండిపోయిందామె.
@ @ " ఏమిటోయి? ఎంత పుట్టింటికొస్తే మాత్రం యింత యిదా? నువ్వు ప్రక్కనలేక. . . . .మీ అమ్మ ఉపన్యాసధోరణి తట్టుకోలేక . . . .పోనీ. .
రాత్రికైనా వచ్చావ్? లేకపోతే ఏమై పోయేవాణ్ణో? " " సారీ! మన ఊళ్ళో యింటిపట్టున కూర్చుని బోరు కొట్టేసింది. అక్కడ గుమ్మం దిగి ఎక్కడికెళ్ళాలన్నా పైసలు ఖర్చు. ఈ పల్లెటూళ్ళో అలాంటి సమస్య లేదు. అందుకే ఒక్కసారి మా పల్లెటూరి ఎల్లలన్నీ చూసి వచ్చాను"
" అది సరె! మీ బావతో ఎందుకలా గొడవ పడతావ్? "
" ఆయన మీకు కొత్త గనుక అలా అంటున్నారు. పదేళ్ళనుంచి మాకలవాటే! నా చేత తిట్టించుకోవాలని ఆయన ఏదో అంటూంటాడు. నా మాటలకు యిబ్బంది పడుతూంటాడు. మా రెండవబావ నోరు విప్పడు. ఆయనకీ యింట్లో ఏం కావాలన్నా అక్కే చూసుకొంటుంది. అలాగని అక్కేం ఆదర్శవాది కాదు. బహు చమత్కారి. అదిసరె! ఇప్పుడే నాన్న అడిగారు " తొలిపండగ కద! అల్లుడేమన్నా అన్నాడా?"అని. మీ సూక్తిముక్తావళి నాకు తెలుసు కద! హైరానా పడొద్దన్నాను. తప్పేం చెప్పలేదుగా?" అంటున్న ఆమె తలపై మెచ్చుకోలుగా తట్టాను. అర్ధరాత్రి అలికిడికి నిద్ర లేచిన నాకు పెరట్లోకెడుతున్న వరాలు కనిపించింది. అలా వెళ్ళిన ఆమె పది నిమిషాలైనా రాకపోయేసరికి
భయమేసి పెరట్లోకెళ్ళాను. పెరట్లోంచి తిరిగి వచ్చే ఆమె తండ్రి గది కిటికీ ముందు ఆగి ఉంది. అంతలా ఆమెని ఆపేసిన విషయమేమిటో చూద్దామని ఆ కిటికీకివతల ప్రక్క వరాలికి కనిపించకుండా చీకట్లో పొంచి వినసాగాను. గదిలో " ఆదిదంపతులు " అల్లుళ్ళ విషయమే మాట్లాడుతున్నారు గనుక వినటంలో తప్పులేదనిపించింది. అంతేగాక కొత్త అల్లుణ్ణయిన నాపై వాళ్ళ అభిప్రాయం కూడా తెలుస్తుంది కద!
వాళ్ళెంతసేపటినుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు.
" ఆఖరల్లుడు పైవాళ్ళ లాగ కాదు గనుక అతనికి మిగిలిన యిద్దరికన్న ఖరీదైన బట్టలు పెడితే బాగుంటుందండీ! అందులోనూ అతనికిది
తొలిపండుగ." అత్తగారంటోంది. " చూడు! ఇతనికి ఖరీదైన బట్టలు పెడితే శంకరం అంతెత్తున లేస్తాడు. పదేళ్ళనుంచీ దోచుకొంటున్నా తగ్గే రకం కాదతను. రెండో అల్లుడంటావా? తందానతానా! అతనికి తక్కువ చేస్తే మన అమ్మాయే కారం నూరుతుంది. ఇక మూడోది, అల్లుడు ఒకరికొకరన్నట్లుంటారు. అదే చెప్పింది. కొత్త అల్లుడని నువ్వేం హైరానా పడొద్దు నాన్నా అని. అలాగనీ అందరినీ అందలాలెక్కించే స్థోమతు నాకు లేదు "
" అందుకని యితనికి నాసిరకం బట్టలు పెడతారా? " అత్తగారి ప్రశ్న.
" అతని సంగతి నీకు తెలియదే! ఉత్త అమాయకుడు. అసలు బట్టలెట్టకపోయినా ఏమనడు"
" బాగుందండీ! అల్లుడు అమాయకుడని పండగపూటా పస్తుంచేలాగున్నారే! మీరెన్ని చెప్పినా అతనికి తక్కువరకం బట్టలు పెడితే నేనూరుకోను "
" అదికాదే! ఇప్పుడు. . . ."
" మీరేం చెప్పినా నేను వినేదిలేదు"
" షటప్! మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు " భర్త గదమాయింపుతో అత్తగారు నోరు మూసేసింది. అక్కడే ఉంటే నా గురించి ఇంకేం వినవలసి వస్తుందోనని అక్కడినుంచి వచ్చేశాను.
భారతీయ స్త్రీలలో ఉన్న నిజాయితీని విశ్లేషించాను. ఆనాడు రావణాసురుడి భార్య మండోదరీ అంతే! " రాముడి భార్యని మర్యాదగా అతనికి
అప్పచెప్పేయండీ!" అని హితవచనాలు చెప్పింది. ఆడదాని మాట నేనెందుకు వినాలని ఆమె మాటను త్రోసిపుచ్చి పీకలమీదకు తెచ్చుకొన్నాడు. మరి యిక్కడ మామగారి కధ ఏమవుతుందో?
పెరట్లోంచి వరాలి రాక గమనించి నిద్దట్లో కదిలినట్లు మరోవైపు తిరిగాను. వరాలు మౌనంగా వచ్చి మంచంపై కూర్చుంది. కొద్దిక్షణాల తరువాత ఆమె వెక్కిళ్ళు వినిపించి దొంగచాటుగా గమనించాను. కొద్ది క్షణాలు తన ఒళ్ళో తలపెట్టి ఏడిచి, నా భుజాన్ని కుదుపుతూ లేపింది.
" ఏమిటోయి? " అప్పుడే నిద్ర లేచినట్లు నటిస్తూ లేచి కూర్చున్నాను. కళ్ళు తుడుచుకొని పెరట్లోంచి చూసినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది.
" అస్థికలు పీక్కుతినే వాళ్ళకున్న విలువ కూడా మీకివ్వకపోగా, అమాయకుడని మిమ్మల్ని అవమానిస్తే నేనూరుకొంటానా? " ఉక్రోషంగా అంది.
" ఆయన ఆడపిల్లల తండ్రిరా! నా పై వాళ్ళకు ఏ లోపం జరిగినా మీ అక్కలు ఊరుకోరు. నీ విషయంలో ఆయనకా భయం లేదు.
పరిస్థితులకనుకూలంగా సర్దుకుపోయే తత్వం నీది. అందుకే వాళ్ళకి నా కన్న ఎక్కువ మర్యాదలు చేయాలనుకొంటున్నారు."
నా మాటలకు వరాలు దూకుడుగా మంచం దిగింది.
" మీ సూక్తిముక్తావళి ఆపుతారా? నాన్న మిమ్మల్ని చిన్నచూపు చూసినప్పుడు ఊరుకొంటే రేపటినుంచి నా అక్కలు కూడా మిమ్మల్ని, నన్ను చులకనగా చూస్తారు. అది నేను జరగనివ్వను. అందర్నీ పిలిచి అల్లుడైన శివుణ్ణి దక్షుడు తను చేసే యాగానికి పిలవకపోయినా తండ్రి మీద మమకారంతో దాక్షాయణి ఆ యాగానికి వెళ్ళింది. అక్కడ తన వాళ్ళందరూ తనను చిన్నచూపు చూసినా, పట్టించుకోకపోయినా సహించింది. కానీ తన తండ్రి భర్తను పదుగురిలో తూలనాడుతూంటే ఊరుకుందా? అందరిముందు తన భర్తను తూలనాడిన తండ్రి యాగ మంటపంలో ఆత్మహత్య చేసుకొని నానా భీభత్సానికి మూలమైంది. నేనూ ఆ సతీదేవిలాంటిదాన్నే! ఈ సారికి మీసూక్తిసుధను పక్కనుంచండి. రేపు నేనేం చేసినా మీరు మాట్లాడక జరిగేది చూస్తూండండి"
వామ్మో! వరాలు పురాణాలు కూడా ఏకరువు పెట్టేస్తోంది.
ఆరు నెలల సావాసం వారిని వీరిని చేస్తుందంటారు. ఇదంతా నా ఆరునెలల సావాస ఫలితమే! ఇంతలా అర్ధాంగి ఆర్డరేస్తూంటే కాదంటానా?
మరునాడొక చిత్రం జరిగింది. అల్లుడికి పండగ బట్టలకింద రెండువేలే దండగని యెంచిన మామగారు అల్లుడలిగాడనగానే అప్పుచేసి
పదిహేనువేలతో స్మార్ట్ ఫోను కొనిచ్చారు. ( ఇది జరిగాక నాకో సందేహం కలిగింది. మానగారన్నట్లు నేను అమాయకుణ్ణేనా? రెచ్చిపోతున్న పెళ్ళాన్ని అడ్డుపెట్టుకొని మామగారిని దోచుకొనే గడుసు పిండాన్నా? నాకైతే జవాబు దొరకలేదు. బదులీయటానికి వరాలింకా చల్లారలేదు. ఆడపడుచులెవరైనా యీ కేరెక్టర్ని విశ్లేషించగలరా? ఏమంటారు? ఈ లోకంలో నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళనడగమంటారా? సరె! అడగటానికి అలా వెళ్ళొస్తాను. సెలవ్!)
@ @ @

No comments:

Post a Comment

Pages