తబలా వాయిద్య లయబ్రహ్మ - ఉస్తాద్ జాకిర్ హుస్సేన్

-మధురిమ 


"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అన్నట్టు భగవంతుడు ఇన్ని వేల కోట్ల మంది మనుషులను  సృష్టించినా, ఏకొందిరినో  మాత్రమే ప్రపంచం ఆచంద్రతారార్కం గుర్తుంచుకుంటుంది.కొందరు వైవిధ్యభరితంగా ఉంటే, కొందరు అపూర్వ సృష్టిచేసిన సృష్టి కర్తలు.కొందరు ధైర్యవంతులైతే కొందరు జ్ఞానులు.కొందరు అందరికీ అర్థం కారు, కానీ వారి పేరు మాత్రం ఓ పదానికి అర్ధంగా మారిపోతుంది.అలా తబలాకి తాను అర్ధంగా...తబలాకి మారుపేరుగా మారిన తబలా వాయిద్య తాంత్రికుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన వ్యక్తి…. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్.  
ఏదైనా ఒక శబ్దం ఉత్పత్తి చెయ్యాలంటే చాలా రకాలుగా చెయ్యచ్చు.అలానే సంగీత ధ్వనులు కూడా వివిధ రకాల వాయిద్యాలతో వివిధ రకాల ప్రక్రియలతో ఉత్పత్తి చెయ్యబడుతున్నాయి.ఇలాంటి ప్రక్రియలలో ఓ ప్రక్రియకు ”పెర్కుషన్”అని పేరు.ఈ ప్రక్రియని ఉపయోగించి వాయించే వాయిద్యాలను “పెర్కుషన్ వాయిద్యాలు” అంటారు.
ఏదైనా వాయిద్యం యొక్క ఉపరితలంపై గట్టిగా చేత్తో కానీ కర్రలతో కానీ కొట్టడం వల్ల చక్కటి లయబద్ధమైన ధ్వనిని ఉత్పత్తి చెయ్యగలిగితే వాటిని పెర్కుషన్ వాయిద్యాలని అంటారు.ఉదా: మృదంగం,డ్రంస్,తబలా, ఢంకా, డోలు మొదలైనవి. ఈ పెర్కుషన్ వాయిద్యాలు సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. ఓవిధంగా చెప్పాలంటే  ఈ వాయిద్యాలలో ఒకప్పుడు పాశ్చాత్యులదే పైచేయిగా ఉండేది.అలాంటి రోజుల్లో పెర్కుషన్ రారాజుగా కేవలం భారతదేశ సంగీతాన్నే కాక ప్రపంచ సంగీతాన్ని కూడా  తన లయ విన్యాసాలతో శాసించి,ఉర్రూతలూగించి,పాశ్చాత్య సంగీతనిపుణులే ఆయనతో పనిచేసే అంత స్థాయికి ఎదిగి,”తబలా మాస్టెరో” అని సంగీతప్రియులందరి చేత ముద్దుగా పిలిపించుకునే తబలా తాంత్రికులు మరెవరో కాదు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్.  
ఆయనెవరో ఇంకా బాగా గుర్తురావాలంటే 90వ దశకంలో వచ్చిన తాజ్మహల్ టీ ప్రకటనలో "వాహ్ తాజ్ బోలియె"అంటూ గిరజాలజుట్టుతో తబలా పై గారడి చేసిన వ్యక్తి.....”శక్తి” అనే మ్యూసిక్ బ్యాండ్  సృష్టికర్తే  ఉస్తాద్ జాకిర్ హుస్సేన్.మన కర్ణాటక సంగీతంలో ఓ ముగ్గురు, నలుగురు ఎప్పుడూ కలిసి కచేరిచేస్తే వారిని ఓ బృదంగా పరిగణిస్తాం,పాశ్చాత్య సంగీతంలో ఈ బృందాన్నే  బ్యాండ్ అంటారు. భారతీయుడైన మన హుస్సేన్ గారు ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య బ్యాండ్ లలో అతి ముఖ్యమైన సభ్యులు.
1951వ సం. మార్చి  నెల 9వ తేదీన ప్రముఖ తబలా విద్వాంసులు అల్లా రఖా కురేషీ,బావి బేగం దంపతులకు జన్మించారు.తండ్రిగారిన అల్లారఖా గారు ప్రఖ్యాత తబలా   విద్వాంసులు,ఆకాశవాణి బాంబే లో నిలయ విద్వాంసులు,.ఆ స్టేషన్ లో మొట్టమొదటి సారి తబలా వాయించిన ఘన కీర్తిశేషులు,1943-48 సం..  మధ్య హిందీ సినిమాలకు సంగీతం కూడా చేసారు.
బడే గులాం అలీ ఖాన్,విలాయత్ ఖాన్,అలి అక్బర్ ఖాన్, రవిశంకర్ వంటి సంగీత దిగ్గజాలకు సహకార వాయిద్యకులుగా విశ్వవిఖ్యాత కీర్తి సంపాదించుకున్నవారు, ఆరోజుల్లో అల్లా రఖా గారి మరియు రవిశంకర్ గారి జుగల్బందీ అంటే ప్రేక్షకులు గంటలతరబడీ కూర్చుని వినేవారట.అల్లారఖా  గారికి ముగ్గురు కుమారులు,ఇద్దరు కుమార్తెలు.వారి కుమారులైన  జాకిర్ హుస్సేన్,టాఫిక్ కురేషి,ఫజల్ వీరు ముగ్గురూ  వైవిధ్యమైన తబలా విద్వాంసులే మరియు వీరు ముగ్గురూ అల్లారఖా గారి శిష్యులే  కూడా.
మరి ఇలాంటి సంగీత విద్వాంసుల ఇంట్లో పుట్టిన మన మన జాకిర్ గారికి సంగీతం పై మక్కువ చిన్నతనం నుంచీ ఎక్కువే. అందునా తబలా అంటే ఎనలేని ప్రేమ ఉండడంలో విచిత్రం ఏముంది?ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందన్నట్లు బాలప్రాయం నుంచే తబలా పై విశిష్ట సాధన చేసేవారట.తండ్రిగారి వద్దనే శిష్యరికం చేస్తూ కేవలం 12సంవత్సరాలకే కచేరీలు చేసే స్థాయికి ఎదిగిన బాలమేధావి కూడా.తండ్రి గారు ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవారట "నువ్వు జీవితాంతం ఉత్తమ శిష్యుడిలా ఉండడానికి ప్రయత్నించు అప్పుడే నువ్వు ఎంతైనా నేర్చుకోగలవు అనేవారట",ఇప్పటికీ నేను అలానే ఉన్నా కాబట్టే ఇంతమంది వైవిధ్యమైన కొత్తవారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని వారిదగ్గర పనిచెయ్య గలుగుతున్నాను అంటూ తండ్రి గారి మధుర స్మృతులను నెమరవేసుకుంటారు మన జాకిర్.
బాంబేలో పాఠశాల విద్య,సేంట్.క్సేవియర్  కళాశాల నుండీ డిగ్రీ పూర్తి చేసి 20ఏళ్ళకే అమెరికా లో ప్రదర్శన ఇవ్వడానికి బయలుదేరిన  ప్రతిభాశాలి. ఇలా 20ఏళ్ళ వయసుకే కేవలం భారతీయ సంగీత ప్రియులకే కాక ప్రపంచ సంగీత ప్రియులకు కూడా చాలా ప్రీతిపాత్రులైపోయారు.70వ దశకం లో అమెరికా లో ఒక సంవత్సరంలో  సుమారు 150 కచేరీలు చెయ్యగలిగారంటే  వారి ప్రతిభకు ఎల్లలు లేవు అనడం సమంజసమే కదా.
1972వ సంవత్సరంలో ప్రపంచ డ్రంస్ వాయిద్య సార్వభౌముడైన “మిక్కీ హార్ట్ “తో కలిసి “రోలింగ్ థండర్” అనే ఆల్బం ని విడుదల చేసారు.
1975లో పాశ్చాత్య సంగీత వాయిద్యమైన గిటార్ సార్వభౌముడైన జాన్ మెక్లాలిన్,భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులైన ఎల్ శంకర్(వయొలిన్) రామ్నాడ్ రాఘవన్ (మృదంగం),విక్కు వినాయకం (ఘటం),తబల పై జాకిర్ హుస్సేన్ వీరందరు కలిసి "శక్తి" అనే బ్యాండ్ ను స్థాపించారు.ఈ బ్యాండ్ చాలా బహుళ జనాదరణ పొందిన బ్యాండ్.
ఈ బ్యాండ్ తో కలిసి జాకిర్ గారు ఏ హ్యాండ్ఫుల్  ఆఫ్ బ్యూటీ (1976లో) నాచురల్ ఎలిమెంట్స్ (1977లో) అనే ఆల్బంస్ విడుదల చేశారు. 75-77 సంవత్సరాల మధ్య ఈ బ్యాండ్ ప్రపంచం అంతటా  పర్యటించింది.
20ఏళ్ళ తరువాత మళ్ళీ "రిమెంబర్ శక్తి"అని మళ్ళి ఈ బ్యాండ్ ని హుస్సేన్ గారు, మెక్లాలిన్  గారు పునః నిర్మించారు. ఈ బ్యాండ్లో అప్పుడు  విక్కు వినాయకం గారి అబ్బాయి సెల్వ గణేష్ ఘటం వాయిస్తే, మాండలిన్ విద్వాంసులైన మాండలిన్.యు. శ్రీనువాస్,ప్రఖ్యాత సంగీత దర్శకులు గాయకులు అయిన శంకర్ మహాదేవన్ గారు పాటలు పాడేవారు.
1973వ సంవత్సరంలో అలీ అక్బర్ కాలేజ్ ఆఫ్ మ్యూసిక్ (అమెరికా) లో "తాల్ వాయిద్య రిథం బ్యాండ్" అనే బ్యాండ్ ని తయారుచేసారు...ఈ బ్యాండ్ లో 1975లో విశ్వవిఖ్యాత డ్రంస్ వాయిద్య సార్వభౌముడైన మిక్కీ హార్ట్ ,హుస్సేన్ గారితో కలవగా వీరిద్దరూ కలిసి ఈ బ్యాండ్ కి "డిగా" అని పేరు పెట్టారు.వీరిద్దరూ కలిసి చేసిన ఆల్బం "డిగా" 1976లో విడుదల ఆయింది. 40నిముషాల ఈ ఆల్బం సంగీత ప్రియులకు ఇప్పటికీ వీనులకు విందే…
ఇదే విధంగా 1979లో ప్రఖ్యాత సరోద్ విద్వాంసులు వసంత్ రయ్ గారితో కలిసి మార్నింగ్ రాగాస్ అనే ఆల్బం,1980లో వయొలిన్ విద్వాంసులు ఎల్.శంకర్ గారితో కలిసి సాంగ్ ఫర్ ఎవ్రీవన్,హూస్ టు నో అనే ఆల్బం,1989 లో హరిప్రసాద్ చౌరాసియా గారితో కలిసి వేణు,తండ్రి గారైన అల్లారఖా గారితో కలిసి 1988లో  తబలా డ్యూఎట్ అనే ఆల్బంలు విడుదల అయ్యి చాలా జనాదరణ పొందినవే.
1991వ సంవత్సరంలో మిక్కీ హార్ట్ తో కలిసి విడుదలైన "ప్లానెట్ డ్రం" అనే ఆల్బం ఆ సంవత్సరానికి "బెస్ట్ వరల్డ్ మ్యూసిక్ ఆల్బం" గా గ్రామ్మీ అవార్డ్ గెలిచింది.మిక్కీ హార్ట్ తో కలిసి 1992,96,97 సంవత్సరాలలో ప్రపంచ పర్యటన చేసారు.
1992లో సంగీత్ సర్తాజ్ అనే ఆల్బం ను 1993లో పండిట్ శివకుమార్ సర్మ (సంతూర్ విద్వాంసులు) తో రాగ్ మధువంతీ అనే ఆల్బం,1994లో పం. రవిశంకర్ గారితో కలిసి కాన్సెర్ట్ ఫర్ పీస్ ,1995లో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులైన కున్నకుడి  వైద్యనాథన్  గారితో కలిసి  గోల్డెన్ క్రితీస్ కలర్స్ అనే ఆల్బం ను చేసారు.
1996లో థ ఎలిమెంట్స్ ఆఫ్ స్పేస్ ,1997లో కీరవాణి,1999లోరిమెంబర్ శక్తి  కూడా హుస్సేన్ గారికి చాలా పేరు తెచ్చి పెట్టాయి.
2000 వ సంవత్సరంలో "తబలా బీట్స్ సైన్స్" అనే కొత్త బృందాన్ని తయారు చేసారు.ఇందులో భారతీయ మరియు పాశ్చాత్య సంగీత నిపుణులు సమ్మేళనం గా పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా,ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ,బిల్ల్  లాస్వెల్ అనే గిటార్ విద్వాంసులు న్నారు.ప్రతి నిత్యం ఇలా కొత్త ఆల్బంస్ చేస్తూ,కొత్తవారితో జత కడుతూ తన సంగీత సాధనను  అలా కొనసాగిస్తూనే ఉన్నారు.
2007 వ సంవత్సరం లో మళ్ళీ మిక్కీ హార్ట్ తో కలిసిన చేసిన "గ్లోబల్ డ్రం ప్రాజెక్ట్" అనే ఆల్బం 2009 వ సంవత్సరంలొ  "ఉత్తమ సమకాలీన ప్రపంచ సంగీత ఆల్బం " గా గ్రామ్మీ అవార్డ్ గెలుచుకుంది.
చలచిత్ర  రంగంలో కూడా తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్. 1983లో హీట్ అండ్ డష్ట్  అనే చిత్రానికి 1992లో మిస్ బ్యూటీస్ చిల్డ్రెన్ 1998లో సాజ్ అనే చిత్రానికి 2002లో మిస్టెర్ అండ్ మిసెస్స్ అయ్యర్  ఈ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి మెప్పు పొందారు.ఇవి ఆయన సంగీత దర్శకత్వం వహించిన మన దేశం లో సినిమాలైతే... 1979వ సంవత్సరంలో అపోకాలెప్స్ ,1993వ సంవత్సరంలో ఇన్ కష్టడీ ,1993లో లిటిల్ బుద్ధా వంటి ఆంగ్ల సినిమాలకి కూడా తబలా వాయిద్య సహకారం అందించారు.
1999వ సంవత్సరం లో "వానప్రస్థం" అనే మళయాళ సినిమాకి సంగీత దర్శకత్వం వహించి సినీ విమర్శకుల మన్నలను కూడా అందుకున్న ఉత్తమ సంగీత దర్శకులు.
ఇక వారిని అలంకరించిన  పురస్కారాల సత్కారాల జాబితాకొస్తే...
1988లో పద్మశ్రీ 2002లో పద్మ భూషణ్ భార్త ప్రభుత్వం చేత అందుకుని (పెర్కుషన్)వాయిద్య విభాగంలో ఈ అవార్డ్లు  అందుకున్న అతి చిన్న  కళాకారుడిగా ఆ అవార్డ్లకే  ప్రత్యేకత ని ఇచ్చారు.
1990లో ఇండో అమెరికన్ అవార్డ్,1992లో ప్లానెట్ డ్రం ఆల్బం కి ఉత్తమ ప్రపంచ సంగీత ఆల్బం గా గ్రామ్మీ,1999లో అప్పటి అమెరికా రాష్ట్రపతి భార్య,అమెరికా మొదటి మహిళ అయిన హిల్లరీ క్లింటన్ గారిచేత "నాషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ " పురస్కారాన్ని పొంది అనితర సాధ్యం గాని గౌరవాన్ని దక్కించుకున్న ధన్యజీవి.
2005-2006 సంవత్సరంలో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో సంగీత ఆచార్యులిగా శాస్త్రీయ సంగీతాన్ని బోధించి అపూర్వ గౌరవాన్ని వారి సొంతం చేసుకున్నారు.
2006 లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేత కాళిదాశ్ సన్మాన్ పురస్కారం పొందారు.
2009వ సంవత్సరంలో  51వ గ్రామ్మీ అవార్డ్ల సభలో "సమకాలీన ప్రపంచ సంగీత ఆల్బం" విభాగంలో తన ఆల్బం "గ్లోబల్ డ్రం "ప్రాజెక్ట్ కి గాను మిక్కీ హార్ట్ గారితో కలిసి గ్రామ్మీ పురస్కారాన్ని అందుకున్నారు.
23 ఫిబ్రవరి 2012వ సంవత్సరంలో గురు గంగాధర్ ప్రధాన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రతీయేటా జరిగే కోణార్క్ నృత్య సంగీత ఉత్సవంలో అందుకున్నారు.  
ఇప్పటికి 145 ఆల్బంస్ విడుదలచేసిన ఘనులు.ఇప్పటికీ వాషింగ్టన్ ,కాలిఫోర్నియా,లాసేంజిలీస్  విశ్వవిద్యాలయాలలో తబలా నేర్చుకునే విద్యార్దులకు శిక్షణ ఇస్తూ తానూ ఓ నిత్య విద్యార్ధిగా నిరంతరం సాధన చేస్తూనే ఉన్న ఉత్తమ సాధకులు.
ప్రముఖ కథక్ నర్తకీమణి ఇటాలియన్ అమెరికన్ అయిన "ఆంటోనియా మిన్నెకోలా" ను వివాహం చేసుకున్నారు.వీరికి  అనిసా,ఇసాబెల్లా అను ఇరువురు కుమార్తెలు ఉన్నారు.వీరు కూడా కళారంగంలోనే ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.
ఆంగ్లంలో ఎన్సైక్లోపీడియా అంటే "సర్వ విద్యా సంగ్రహమనే గ్రంధం" అని అర్ధం.వీరిని పాశ్చాత్యులు "ఎన్సైక్లోపీడియా ఆఫ్ డ్రంస్ " అని పిలుస్తారట.
సంగీత సామ్రాజ్య సింహాసనాన్ని ఎప్పుడో అధిస్టించిన రాజు కానీ,ఇప్పటికీ ఉత్తమ విధ్యార్ధిలా నేలపై గంటలు గంటలు  సాధనలో గడిపే సాధారణ విధ్యార్ధి కూడా.ఆయన వేదిక ప్రపంచం,ఆయన అభిమానులు యావత్ ప్రపంచ సంగీత ప్రియులు.ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగిఉండే వినమ్రశీలి.ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే"సంగీత పాఠాలు పాఠశాల దశ నుంచే పిల్లలకు నేర్పిస్తే దానిలో అంతరార్ధాన్ని ఆ సంగీతంలోని మాధుర్యాన్ని చిన్నపటినుండీ గ్రహించగలరు.  కేజీ నుండీ పీజీ దాకా రోజుకి ఓగంట అయినా కనీసం సంగీతం వినే సమయం పిల్లలకి ఉండాలి."అని తన అమూల్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు.
ఇలాగే ఆయన సంగీత జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతూ ఆయన సంగీత సాధన అలాగే నిర్విరామంగా కొనసాగింపమని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వారికి సంపూర్ణ అరోగ్యం తో కూడిన ఆయువును ప్రసాదించమని వేడుకుందాం.
జాకీర్ హుస్సేన్ గారి తబలా మాధుర్యాన్ని క్రింది వీడియోలలో ఆస్వాదించండి.
****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top