కల్తీమడుసులు - అచ్చంగా తెలుగు

కల్తీమడుసులు

Share This

 కల్తీమడుసులు    

మీనాక్షి శ్రీనివాస్


"మంగమ్మా ...మంగమ్మా ......నీ మనవడిని పోలీసులు పట్టికేల్లిపోతున్నారు." ఏసోబు వగరస్తూ వచ్చాడు.
"ఏందిరా ?ఆడేం చేసాడురా?నోట్లో నాలికలేనోడు ....ఆడిని పోలీసులు పట్టికేల్లదమెందిరా...?" గబాగబా బయటికొచ్చింది మంగమ్మ.
" ఆడు ....ఆడు..................."
"ఏందిరా అయ్యా ...అట్టా నీళ్ళునముల్తావేంది.? రంగడిని పోలీసులు అట్టుకేల్లడమేంది...?ఆడేం చేసాడురా........?"
"అది ...అది ....దొంగసారా కేసులో బుక్చేసి అట్టుకెల్లిపోయారు......." ఏసోబు భయంభయంగా అన్నాడు.
"ఆడు దొంగసారా కాయడమెందిరా?....ఆడసుంటోడు కాదు........"
"మరే ...మంగమ్మా .....ఆ మల్లన్న ......ఆడితొత్తులు చేసే పనిలో .....అదే డొంకలో ...దొంగసారా కాస్తారు కదా ....రోజు ....అట్టానే ఈరోజు కాస్తావుంటే .....పోలీసులకి ఎట్టానో ఉప్పందింది ,.ఆల్లు అస్తన్న సంగతి పసిగట్టి మల్లన్న దగ్గరపనిచేసే సింగడు గబాలున మన రంగడిని....ఆదోవంట ఎడుతుంటే కేకేసిపట్టుకుని బలిమి కాస్త సారా పట్టించి, ఆల్లుపారిపోయారు ఈడేమో..కైపుతలకెక్కి ఆడనే పడిపోయాడు ....పోలీసులకి దొరికిపోయాడు .....ఆమత్తులో వున్నాడిని బట్టుకు ...నీవేనా ఈసారా బట్టిలంటే అవునన్నాడు ........వెంటనే ఆడికి నాలుగు తగిలించి జీపెక్కిన్చేసారు ." వివరం చెప్పాడు.
"ఆళ్ళ జిమ్మడిపోను....ఎదవపని ఆల్లుచేసి ...అన్నెంపున్నెం ఎరగని నా బిడ్డని అందులో ఇరికిత్తారా .....నడు....టేసనుకి. ”చీరకొంగు నడుముకి బిగించింది మంగమ్మ యుద్దానికి సిద్దమైనదానిలా .
" మంగమ్మా ...మనం వొంటరిగా పోవద్దె.....నా మాటినే.....మన సరపంచి బాబుతోమాటాడి ..ఆరిని తీసికెడితే మంచిదే ...ఆ పోలీసులు మన అసుంటోరి మాట ఖాతరు సేయ్యరే ....నా మాటిని సర్పంచిబాబునో నేకపొతే మనరాయుడుగోరినో వోట్ట్కేదారి..............."
"ఛా.....పిరికిసన్నాసి ఎందుకురా ?మనం ఏం తప్పుసేసేమని బయపడాలిరా.?నీతిమాలిన పనులుసేసే ఆల్లు పెద్దమడుసులూ మనం దొంగలమూనా?నడేసే...ఏం చేసిస్తారేటి పొలీసులు?రంగా ఎసుంటాడో చిన్నపిల్లకాయకి కూడా తెలుసు .....అసున్తప్పుడు ఆడేం నేరంచేసాడని ఆడిని జైల్లో పెడతారంటా? ....ఊ అనవసరంగా బయపడిపోయి సేయ్యనితప్పుకి ఆళ్ళకాళ్ళు ఈల్లకాళ్ళు ఎందుకు పత్తీసుకోవాలే ?
" మంగమ్మా నీకేట్టా చెపితే అర్దమౌతుందే ?నువ్వన్నది నిజమే ...కాని నిజం ....నాయం ఎవురికి కావాలే ?ఈ రోజుల్లో ......పెపంచ్మంతా డబ్బు ...డబ్బుచుట్టూత తిరుగుతూందే .....అందుకే డబ్బుఎన్ని మాయలయినా సేయిస్తాది.ఆ మల్లన్న డబ్బుతో సాక్షికాలు .....పుట్టిస్తాడు ...డబ్బుతో పోలిసోల్లని కొనేస్తాడు .....మనకాడ ఎటుందని ఆల్లు మన గురించి సోచాయిస్తారు ...చెప్పు.....మల్లిమాటాడితే ఆ తప్పు మనమే చేసామని మన సేతేవోప్పిస్తారు ..... సేప్పిస్తారు.అందుకే మొండితనానికి పోక .....అన్నాయంగా ఆ రంగాగాడిని జైలు పాల్జేయక ....నా మాట ఇనుకుని ఆ సర్పంచిబాబునో ....ఆ రాయుడిగోరినో బతిమలాడుకుని ఈ గండం దాటుకోవాలే......నువ్వు ఊరకేరా అంతే ఆల్లతోనే మాతాడతాగా ............."
"చచ్చ .......ఎదవసన్నాసి .....ఎన్ని తప్పులు సేసారో ఆల్లకే తెలియదు,కాని ఆళ్ళ బతుకులు నాకు తెలుసు .........ఎల్లెల్లి ...అటాన్తోరినా....కాళ్ళు పట్టమంటావు? సేయని తప్పుకేనా కొడుకుకోడలు బలయిపోయినా అప్పుడంటే ఏం చెయ్యలేక ......పసోడు రంగాడిని సూసుకోవాలని ......ఊరుకున్నా .....ఇప్పుడు ...ఇప్పుడు ....రంగడిని ఎలా ఖైదు చేస్తారో?ఆడిమీద తప్పుడు కేసులేట్టా బనయిస్తారో?నేను సూస్తా ......అందరిని జమచేసి లొల్లిలొల్లిసేస్తా .....దెబ్బకి నాయం  నాకాడకేలగేట్టుకోచ్చేలా సేస్తా.........." ఆవేశంతో మనిషి నిలువెల్లా ఊగిపోతోంది.......అమ్మతల్లిలా .
"అదికాదె ...........
"చ్చేస్ .....నడేహే.... అక్కడ ఆడినేం సేస్తాన్డారో....."రివ్వున బయలుదేరిన మంగమ్మ వయసు ఇద్దమిద్దంగా చెప్పలేంకాని కాయకష్టంతో రాటుదేలిన ఆమెకి డెభైపై చిలుకే ఉంటాయంటారంతా. చేతికందిన చెట్టంత కొడుకు కోడలు వూరిపెద్దల ఘాతకానికి బలాయిపోయినా ....పసివాడైన మనవడి కోసం దుఖాన్ని , ఆవేశాన్ని దిగమింగుకుని ఆ వూరి ప్రభుత్వబడిలో చప్రాసిగా .....ఆయాగా ఉంటూ ఆ పిల్లలందరిలో తన కొడుకుని చూసుకుంటూ .....మనవడు రంగడిని వున్నంతలో ఏలోటూ తెలియకుండా పెంచినా..... ఎంత ప్రయత్నించినా వాడికి చదువు అబ్బలేదు ......కాని వూరందరికీ తలలో నాలికలా ఉంటూ పనిపాటల్లో చేదోడువాదోడుగా వుండేవాడంటే అందరికీ అభిమానమే .  ఇంక మంగమ్మమాట సరేసరి ......చక్కని సుగంధాల్ని వెదజల్లే పూలతో చేరిన దారానికి తావి అబ్బినట్లే ....ఎన్నోఏళ్లుగా ఆ బడిలో పనిచేస్తున్న మంగమ్మకి చాలా ఆశ్చర్యంగా .......ఆ .....మాస్టర్ల ప్రభావం ఎంతగానో వుంది .....ఆమె చదువుకోని సంస్కారవంతురాలు.....ఆమె భావాలు ...మాటలు ....చేతలూ అన్నిఅన్నీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యకరాలే .....
గతపాతిక ఏళ్ళుగా ఆ ప్రభుత్వబడిలో పనిచేస్తూ ఎంతోమంది దగ్గర ఎన్నోమంచి విషయాలు నేర్చుకోవడమే కాదు వాటిని జీవితంలో పాటిస్తూ ఎంతోమంచి పేరుతెచ్చుకున్న మంగమ్మకి ఎంతోమంది ఆత్మీయత, అండదండలున్నా ఏనాడు ఎవరినీ దేనిగురించీ యాచించక తనేదో తన పని ఏదో అన్నట్లుండే మంగమ్మకి నోరుతెరిచి అడిగితే ఎంతటిపని అయినా చిటికెలో చేసిపెట్టే ఆత్మీయులు చాలామందే వున్నారు,
ఏసోబు చెప్పినా వినకుండా పోలీసుస్టేషన్లో అడుగుపెట్టిన మంగమ్మని చూస్తూనే ' మామ్మా ' అంటూ గొల్లుమన్నాడు రంగడుసెల్లోంచి ....
" ఏందిరా ఇది,? ఆడెం చేసినాడని జైళ్ళ పెట్టినారు? ముందాడిని విడిచిపెట్టండి సారూ.." అంటూ అక్కడున్న పోలీసులని అడిగింది వేడుకోలుగా .
"ఏంటి ఇడిసిపెట్టేది ....ఈడు దొంగసారా కేసుల రెడ్హండేడ్గా పట్టుబడ్డాడు ......అదొక కేసు ....మళ్ళా అందులో ఆ సారాయిల కూడా కల్తీచేసిండు ...అది తాగిమస్తు జనంచచ్చిండ్రు  ......అదింకా పెద్దకేసు.......ఈడిని ఇడిసిపెట్టుడు సమస్యేలేదు .....శిక్షపడుడు ఖాయం ......ఊకలొల్లిపెట్టక ..........ఫో ....." చేతితో పొమ్మని సైగచేస్తూ అన్నాడు హెడ్కానిస్టేబులు కనకారావు .
"ఇదిగో సారూ ...నా మనవడు అసుంటోడు కాడనే సంగతి మీకెరుకలేకనా ....ఎందట్ల మాటాడుతుండ్రు .....మారంగాని ఇంత పిల్లగాడప్పటినున్చీ తమరికి ఎరుకేగందా ? ......మరిగిప్పుడే దిగిట్ల మాటాడతాండ్రు......మీకు పున్నెముంటది ఆడిని విడచిపెట్టుండ్రి.....ఆ సారా కాసేటోళ్ళు ఆ మల్లన్న ...ఆడిమడుసులు ..........ఆ ఆవారాగాళ్ళకి ....ఆ ...రా .....
"ఏయ్ముసలి.. చెబుతుంటే నీక్కాదే. ...తెగరెచ్చిపోతాన్డవ్.....నీ మనవడు నీకు మంచోడేగాని వూరోండ్లక్కాద్ ....ఆడుచేసేది బాడ్ఖావ్పనుల వేరేవాళ్ళ పేర్లుచేబుతా.. వే...ఊకలొల్లి పెట్టకగిండ్ల ఫో ,రేపుకోర్ట్ల. తెలుస్తది గెంతసిచ్చపడేటిది ఏదో ...ముసలిదానివని......గింత చెబుతుండ....మంగమ్మ చెప్పబోయిన పేరుచెప్పనీయక .....గట్టిగ కసురుకున్నాడు కనకారావు.
"మామ్మా .....గేట్లకొట్టిన్ద్రోసూడే .....ఆల్లు చెప్పినట్లినకపాతే ఈడనే సంపెస్తారంటనే........." గోలగోలగా అరిచాడు రంగ.
"ఎట్టా? గిది పోలీసుట్టానన,కసాయి సోటునా ,ఇదిగో హెడ్డూ ....రేపుకోరట్ల నిలబెట్టు బిడ్డని ....కొట్టుడు ...చంపుడు గసుంటిదేదైనా జరగాలన .ఖబ్దార్ ఈ మంగమ్మ మంచినే జూసినావ్., నా బిడ్డని పరేషాన్జేసినావో పాణంతీస్త......మల్ల, రంగా ....బయపడమాక......రేపు ఈ ఏలకి నిన్ను ఇడిపికపాతే, నానునీ మామ్మనే గాన్ర,రంగా దైన్యంగా వుండర,.నాయం  మనకెల్లివుంది మనకేటి జరగదొరే దైర్యంగా ఉండోరే.”
“గిదిగో హెడ్డూ,నా మనవడివొంటి మీద దెబ్బపడినాదా..మంగమ్మ ఇస్వరూపం సూడాల,రేపు కోరట్ల సూసుకుందాం .....నడరా ఏసోబు,నాన్నా రంగా..నేనుండగా నీకేటి జరగదు ...భయపడక .....నడరా ఏసోబు ......." దెబ్బతిన్న ఆడపులిలా వెళ్ళింది మంగమ్మ.
"ఏటి ? ఈ ముసల్ది ఇలా రెచ్చిపోతోంది కొండని  డీకొట్టేపోట్టేలులా ,ఏటి దీని ధైర్యం ..తినడానికిట్టి కానాలేదు గాని ...వూ .....తెగ ...ఇదయిపోతోంది..........' కొత్తగా వచ్చిన కుర్రపొలీసు అన్నాడు.
" మంగమ్మనిఅలాతీసిపడేయ్యకు........దానికి ......వూరుఊరంతాసాచ్చికంవచ్చెయ్యగలదు.....ఆళ్ళకి  .....ఈడేదొరికాడా.....కేసులోయిరికించడానికి.       " మెల్లిగాగొణిగాడు ....ఇంకోపోలీసు ......అప్పారావు ......ఎన్నాళ్ళనుంచోఅదేస్టేషన్లోపనిచేస్తున్నవాడు.
"ఏటి ....అంతసీను ఉందేటి  ...ఈ ముసిలిదానికి......" వెటకారంగా నేవ్వేడు కుర్రపొలీస్.
"అదే మరి అద్దనేది....ముసిల్ది ముసిల్దని ఓ తీసిపడెయ్యకు.....ఈ ఊర్ల పాతికేళ్ళ పైగా ....ఈ వూరిబళ్ళో ...ఆయాగాచేస్తుంది....ఈవూరి పెద్దొళ్ళకి ....ఆళ్ళపిల్లలోకటే ....చూడడానికైనా ....చెయ్యడానికైనా .....మరి మంగమ్మకి ఊరందరి పిల్లలూ ...పిల్లలే.....అంత ప్రాణం పెడతారు ...అదంటే....ఆల్లలో శానామంది .....బాగా సదివి పెద్దపెద్దపోసిషన్ల వున్నోల్లె........ఇదీ సంగతి అని ఆళ్ళకి తెలవాలే.....ఇదినోరు ఇడిసి అడగక్కరనేదు.....దానికి అన్నాయం జరిగిందని తెలిస్తేసాలు ....ఆళ్ళ భరతం పడతారు......." ఆవేశంగా అన్నాడు హెడ్డు.
" మరి ...ఆ విషయం తెలిసీ ఆ మల్లన్నవొళ్ళు ఈ కేసుల ...ఆ రంగడిని ఎందుకిరికించారు......ఇంకో అమాయకుడి నేవరనయినా సూసుకోక......." ఆరాగా అడిగాడు కానిస్టేబుల్  కనకారావు.
" అనుకోకండా .....ఆ సి.ఐ ...రైడ్చేసే తలికి ...గభాలున ....ఆడనే వున్న.... ఈడిని యిరికించారు .....కేసు బుక్చేసాక ....ఇంకేం సేయ్యలేక ......యిరుకున్నారు......సూత్హా వుండు .....కత ఎట్టా మలుపు తిరుగుతుందో......మంగమ్మా ....మజాకానా .....ఈ దెబ్బతో ...మనవూరికి పట్టిన పీడాపోద్ది ....."ఖచ్చితంగా వుంది అప్పారావు గొంతు.
"సూద్దారి ....మరి అవతలోల్లె తక్కువ తినలే .....వూరికా మందులు.....ఏనాకాలున్నవన్నీ ..పెద్దతలకాయలే ....తేడాలోత్తే....తలకాలేగిరిపోతై...పుచ్చకాయలెక్క ...." అన్నాడు అంతవరకూ కాంగా వున్న రైటర్రామలింగం.
"రాయడుబాబు ....ఆడిసేత ఎట్టాగైనా...వప్పుకునేట్టు ..సూడమన్నాడు. ఆడు వప్పీసుకుంటే ఇంక ఎవరూ ఏంసెయ్యలేరు ఆడికి కొన్నాళ్ళు సిచ్చఏసీ కేసుమూసేత్తారట. మంగమ్మని గోలసెయ్యకుండా కొన్నాళ్ళు కాశీ ,రామేసరాలు అమ్పేతారట ఇదిగో ఈ పెట్టె మీ టేసంలో పంచుకోమన్నాడు రాయుడుబాబు." రాయుడి నమ్మినబంటు అసలు కథలో మూలవిరాట్టు మల్లేసు....కబురుతో బాటు బరువుకూడా మోసుకొచ్చాడు.....స్టేషన్కి.
"రే మల్లిగా, ఇంత గోరం ఎంటిరా .నీ సారా బట్టిలునాయని...నన్ను టేసన్ల ఎసినార్రా చచ్చేట్ల ....కొడతానడ్రా.....అయి ....నీయని చెప్పారా ....నన్ను ఇడిసేమని సెప్పరా........"   గోలగోలగా అరిచాడు రంగ.
" రే ....బామ్మరిది అయినీయనోరే, బామ్మరిది కట్నమీచ్చిసిన వప్పేసుకోరోరే నేకుంటే సావుదేబ్బలోరే మా బంగారానివి కాదు .వోప్పేసుకో ,నేకుంటే నువ్వికడ .మీ మామ్మ..వొరే....అట్టాటి మాటలెందుకు నాసేసేప్పిత్తావ్ . గాని ....వోప్పేసుకో ........" పళ్ళికిలించాడు మల్లేసు.
" రేమల్లిగా, పాపం తగిలిపోతావ్రా, నాకేటైనా జరిగితే మా మామ్మ ...తట్టుకోలేదురా ...........ఆ ..ముసలిదాని ఉసురుపెట్టకురా ......అది ...దిక్కులేనిది ....అయిపోతాదిరా ........." గోలగోలగా ఏడ్చాడు రంగడు.
"ఓసోసి .....దానికి దిక్కు నువ్వుకాదు ....నీకె....అదిదిక్కు.......ఓ కతలు సేప్తుండాడు ......కతలు....."
" ఓరే .......నా కది....దానికి నేను ......దిక్కుమొక్కు .......మమ్మల్ని  ....వదిలేయండ్రా ......."
"అట్టనే .....మరి ...ఆ ...కాయితాల్మీన...ఓ...సొంతకం ....పడీ.....ఆనక ...నిన్నిడిసేతారు......."   నమ్మబలికాడు మల్లన్న .
"సత్తే పామానికమా ......నిజంగ ....వదిలేస్తరా..?" ఆశగా అడిగాడు రంగడు.
" అమ్మతోడూ......మరి ....సొంతకం ...సేసేమరి......."
" నాకు రాయరాదుగా ........"
"కాకుంటెంలే,వత్తు సారూ ....మా రంగాని సేత వత్తించుకోని ....ఆడిని యిడిసిపెట్టున్ద్రి ..." కన్ను మలిపాడు .....పోలీస్హెడ్డుకు మల్లన్న.
" మాకు సారూ నువ్వా?మా ...సారా?అయన సెప్పినాక ....ఏపిస్తాములే....మా సారూ అచ్చేటి ....టైం ....అవుతుండే......నువ్పో మల్లన్న ....గాయానగాని అచ్చిండంటే...నిన్ను ..సూస్తే .....మాకు ..ప్రాబ్లం అవుతుండే "మెల్లిగా చెప్పేడు .....అప్పారావు.
" నేబోక ఈడనే ...వుంటనా ఏందీ .?ఇదిగో ....పెట్టెబద్రం మా రంగాని బాగా సూసుకొండ్రి.....నేబోతండా ......" వెళ్లిపోయాడు  మల్లన్న ..
" సారు....నన్నిడిసిపెట్టున్ద్రి ......సారు .........."
"ఓలొల్లిపెట్టాక ......గమ్మునుండు .....పెద్దసారూ అచ్చినంక ఇడిసిపెట్టుడే....."
                                                                                            ***
రాత్రయింది......ఆ బట్టీలు తనవే అని .....జరిగిన ప్రాణనష్టానికి తనేపూర్తిగా బాధ్యుడనని ......రాసిన ....కాగితాల మీద....రంగడి వెలిముద్రలు తీసికొని .....రాయుడు పంపిన సొమ్ము తలాకొంచెం పంచుకున్నారు ఆనందంగా.
తెల్లవారింది, వూళ్ళో ఎక్కడా మంగమ్మ కనబడలేదు.... ఆ సంగతి అంతా గుర్తించినా ఎవరూ పెదవివిప్పలేదు.......రంగడు జైలులోనే వున్నాడు..........మామ్మకోసం ..ఆశగా ఎదురుచూస్తూ.
కేసుకోర్ట్కి వచ్చింది....రంగడిని కోర్టుకి తీసికెళ్ళారు.  రంగడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఎంతటి ...సంఘవిద్రోహో.....కోర్ట్కిసాక్షాధారాలతో సహా విప్పిచెప్పి కోర్ట్ అదిరిపడి పోయేలా వాదించి రంగడులాంటి ...వాడిని ...కఠినంగా  ...శిక్షించకుండా వదిలేస్తే, దేశానికి ...సమాజానికి .....ఎంత ప్రమాదమో....నష్టమూ, అతడిని ...శిక్షించాల్సిన...ఆవశ్యకతని పలుమార్లు ...నొక్కి వక్కాణించాడు పి.పీ.
అక్కడవూరు ఊరంతా విస్తుపోయి చూస్తోంది ......ఈ అన్యాయాన్ని .........ఎదిరించలేక ......అలా అని ....ఆమోదించలేక .
                                                                                           ***
" మీలార్డ్...నిందితుడి తరుపున వాదించడానికి..కోర్ట్వారి అనుమతి కోరుతున్నా ." కోమలమైన స్వరం    .....ఖంగునమోగింది...........
" ఎస్ .......మీరు........."
" నా పేరు ప్రణవి, ముద్దాయిగా నేరంమోపబడిన ఈ రంగా నేరంచెయ్యలేదనడానికి ఎన్ని సాక్షాలున్నాయో అలాగే అసలు నేరస్తులేవరో చెప్పే సాక్షాలుకూడా కోర్ట్కు సవినయంగా సమర్పించుకుంటున్నా.కోర్ట్లోకి వచ్చిన.ఆ అమ్మాయిని చూస్తూనే ....కోర్ట్లో కరతాళధ్వనులు మిన్నంటాయి.
"ఎస్చెప్పండి ....మిస్ ...ప్రణవీ ,మీరు, ..మిమ్మల్ని...ముద్దాయి తరపులాయర్గా ....ఎంగేజ్చేసుకున్నారా?ఎవరు ....మీతో"..
"..సారీసర్ ,నన్ను ఎవరూ ....ఎంగేజ్చెయ్యలేదు,.ఇందులో ఎవరిప్రమేయం కూడా లేదు.....నా అంతటా నేనే ...న్యాయం అన్యాయం అవడం చూడలేకే .......ఈ కేసు ...వాదించ దలచాను........ముద్దాయి నిరపరాధి అని మనసా ...వాచానమ్మడమే ...దానికి కారణం. "
" మీ కారణాలతో కోర్టుకి పనిలేదు .,.అతడు నిరపరాధి అని నిరూపించడానికి తగిన సాక్షాదారాలున్నయా....మీ దగ్గర?.,అతడు దోషి అనడానికి, అన్నెంపున్నెం తెలియని పాతిక,ముపైమంది శ్రామికజనం అమానుషంగా ......అన్యాయంగా ...మరణించడానికి కారకుడు అయిన అతడు ....సంఘవిద్రోహి ......సంఘానికి పట్టిన చీడపురుగు అనడానికి ప్రోసిక్యూషణ్వారికన్ని ఆధారాలు ....సాక్షాలు ...ఆల్రెడీకోర్ట్వారికి అందచేయడమైంది.....అసలు ముద్దాయి స్వయంగా వ్రాసి ఇచ్చిన వాగ్మూలం ...వుండగా ...ఇప్పుడు ఈ లెర్నడ్ ఫ్రెండ్ ....కొత్తగా చెప్పేదేమిటో? కోర్ట్వారి విలువైన కాలాన్ని వృధా చేయడం తప్ప......"
" అన్నీ ఎంతో పకడ్బందిగా సాక్షాధారాలు, వాగ్మూలాలు కోర్ట్వారికి అందచేసినా .....ఐమీన్......అవి నిరూపణ కానంతవరకు వాటి ఆధారంగా ఒకనిరపరాదికి శిక్షపడటం అమానుషం.....కోర్ట్వారికాలం ఎంత విలువైనది అయినా ముద్దాయి జీవితం అంతకన్నా విలువైనది అనడంలో ఏమాత్రం సందేహంలేదు ...యువరానర్ .....గౌరవనీయులైన పిపిగారు చెప్పినట్లు ముద్దాయి స్వయంగా వాగ్మూలం వ్రాయడానికి ......అసలు ..అతనికి అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు.......ఇకపొతే..........."
" వ్రాసి ఇచ్చిన అని అంటే .....లిటరల్గా .....అతడే వ్రాసిన అనికాదు అర్ధం   ....అతను అంగీకరించిన ....అని అర్ధం      ,,,,అని మీరు గమనించాలి .......ప్రతిదీ .....మక్కికి మక్కి ...అనువాదంగా తీసుకోకూడదని మా మనవి"
"యిది కోర్ట్ ...ఇక్కడ ప్రతిమాట ....వాదన......క్లారిటీతో వుండాలి కాని ......కాకమ్మ కబురుగా ఉండకూడదని ....గౌరవనీయులైన పిపిగారికి ప్రత్యేకించి చెప్పక్కరలేదనుకుంటా.......ఇకపొతే నా ముద్దాయి దోషికాదు నిరపరాధి .....అని నిరూపణతో బాటు ...అసలు దోషులేవరన్నది ......కోర్ట్వారికి తెలియచేయడానికి ....నాకు అవకాశం ఇవ్వవలసినదిగా కోర్ట్వారిని అర్ధిస్తున్నాను."
"ప్రొసీడ్    ....."
"ముందుగా ....ప్రత్యక్షసాక్షి మల్లన్నని విచారించడానికి అనుమతిన్చవలసినదిగా కోర్ట్వారిని కోరుతున్నాను."
"ఎస్ ...ప్రోసిడ్ ....."
"మల్లన్న ......మల్లన్న .....మల్లన్న   "
ప్రమాణం చేసిన తరువాత ప్రణ విఅడిగింది అతడిని.......
"మీరు .....ఏంచేస్తారు..?......ఐమీన్ .....మీ వృతి........."
"నేనండి.........నేనండి ....యాపారం సేతానండి........" ఒక్కక్షణం తడబడ్డా ....వెంటనే సర్దుకుని ......చెప్పాడు మల్లన్న.
"ఏం వ్యాపారం ....చేస్తారు? "
"అదండీ .....అది ...ఇదానేటండి ......అన్నియాపారాలు సేత్తానండి......."
"అన్ని వ్యాపారాలంటే ........ఉప్పుకల్లు నుంచి ..........తాటికల్లు వరకూనా? .కూల్గా అడిగిన ప్రణవి ప్రశ్నకి ...... అవును కాదు..అన్నట్లు ....ఎంచెప్పాలా? ...అన్నట్లు .....తడబడ్డ మల్లన్న తీరుకి గొల్లుననవ్వారు కోర్ట్లోవున్న జనం.
అప్పటికి అర్ధమైన ...మల్లన్న ...కల్లెటండి .......రామ రామ .....నానసుంటోడిని కాదండి......"
"అది సరే .....రంగ కల్లుదుకాణం .....ఎన్నాళ్ళుగా నడుపుతున్నాడు...?"
"ఎన్నాల్లుగానంటే నండి....అబ్బో సాన్నల్లుగానండి." .ఏం చెబితే ,ఏం తంటానో అన్నట్లు బయటకూర్చున్న రాయుడికేసి చూస్తూ చెప్పేడు."
"మీరు ....ఆ వూరి వాళ్ళేగా .......సాన్నల్లుగా .....అంటే ....ఎన్నేళ్ళుగా ......ఒకటా ...రెండా?.."
"అబ్బే ఒకటి రెండేటండీ ఆ సారాదుకాణాలు.....అబ్బో పది......అః .....పదేనేల్లుగా ఆడనే ....వున్నాయండి."ఉత్సాహంగా చెప్పేడు.
"ఆ.... మీకు రంగా బాగా తెలుసా ......అంటే ....ఆ సారాబట్టిలు అతనివే .....అని......."
"సత్తేపమానికంగా .....ఆడివేనండి ........ఎందుకు తెల్దండి."
"ప్లీజ్ నోట్ థిస్  పాయింట్ మి లార్డ్."
" ఆ ...మల్లన్నా,రంగ ,మీరు కలసి చదువుకున్నారా?.అంటే ఒకే వయసువాళ్ళా?...అని.........."
"చచ ......ఆడివయసు .....నా వయసు ఒకటేటండి..నా ముందు పుట్టినోడు,పిల్లకాయ్....పైగా ఆడికి .....నాకూ సదువూ లేదు ....సత్తిబండ్లు .....లేదు......ఆవారా ....నా ....."
"యువరానర్ ,ప్లీజ్నోట్దిస్పాయింట్, ఆ సారా బట్టిలు అక్కడ పది ...కాదు ...కాదు పదిహేనేళ్ళుగా అక్కడే వున్నాయి......మరి రంగడి వయసు చూస్తే ......ఇంకా ఇరవై అయినా నిండలేదు......అంటే అతను ఈ వ్యాపారం మరీ ఏ ఐదారేళ్ళ వయసులోనో ...మొదలుపెట్టి వుండాలి........."
"ప్రణవి .....సంభాషణ  .....ఎటు తిప్పుతోందో......అర్ధమైన పిపి......కంగారుగా ....మల్లన్న వైపు చూసాడు......
" కేసుతో సంబంధంలేని విషయాలు ప్రస్తావించి లాయర్గారు సాక్షిని తికమకపెట్టి కేసు పక్కతోవ పట్టిస్తున్నారు, ఐ ఆబ్జెక్ట్యువరానర్ "
"అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ .......ప్రొసిడ్ ......"
"థాంక్యు ...యువరానర్ ....ఆ…అన్నట్లు ...ఈ సారా బట్టిల .....కాంట్రాక్టు .......ఎలా వస్తుందంటారు? ......మల్లన్నా......"
" ఎలాగేటండి.....పాటుంటుందండి .......అబ్బో ...దానికి .....సాన ..కతుందిలెండి .........అసలు ....దేముడిపాట ...మొదలు   ...ఇంక మా రాయుడిగోరి పాటే ....ఆకరు........"     పిపి ఉరిమిచూస్తుండగా .....టక్కున ....ఆపేసాడు ....
" మీ లార్డ్ ...మీకు ...ఈ పాటికి విషయం అర్దమైవుంటుంది.......ఈ కేసులో అసలు దోషులేవరన్నది........ఈ కేసుకీ ....రంగడికి ఎటువంటి సంబంధం లేదు అన్నది ...నిర్వివాదాంశం ... అంతే కాదు....నాక్లైంట్మామ్మ .....మంగమ్మ.....ఎటువంటి మనిషో.......ఆమె మనుమడు ...ఈ రంగడు ...ఎంత అమాయకుడు ....వూరుఊరంతా తెలుసు......అసలు మంగమ్మ అవ్వ ఇప్పుడు ....తన మనమడు ఈకేసులో స్టేషన్లబడివుంటే .....ఆమె ....కోర్ట్ ...దరిదాపులలేదు....ఆంటే....ఆమెపై“....ఆపై ....పూర్తిచెయ్యలేకపోయింది ప్రణవి.
"వున్న విషయమవదిలేసి ...కేసుకు సంబంధంలేని విషయాలతో సాక్షిని కంగారుపెట్టి కేసు ....పక్కదారి పట్టించుతున్నారు మిలార్డ్   "
"లేదు యువరానర్ .....ఇందులో కేసుపక్కదారి ఏంలేదు ....మంగమ్మ ....నా కుచిన్నప్పటి ,నే చదువుకున్న స్కూల్ ఆయా ....అయినా నాకు....నాకే కాదు ....పాతికేళ్ళుగా అక్కడ చదువుకున్న ప్రతిఒక్కరికి తల్లితో సమానం....కేవలం ...ఆమె మీద వున్న ప్రేమ ....గౌరవంవలెనే ....నేను .....ఈ కేసు టేక్అప్చేసాను  .....ఇందులో ...ఇంక ఏ  ఇతర ....ఆబ్లిగేషన్స్      ....మాల్ఇంటేషన్స్ లేవు ...ఇకపొతే రంగ ఎలాంటివాడు ....అనేది ఆ వూళ్ళో ప్రతివాళ్లకి తెలుసు ...కావాలంటే మీరు ఎవరినయినా విచారించండి......యిది ...చాలా క్లియర్గా .....అందరికి తెలిసిన విషయం......ఇకపొతే ....గతపాతికేళ్ళుగా ...ఈ ఊరిని ....శ్రామికజనాల్ని పట్టిపీడిస్తున్న ,,,,,,,ఈ తాగుడుమహమ్మారి,దాని మొత్తంచరిత్ర సాక్షాదారాలాతో సహా ....ఇదిగో ....మీకందచేస్తున్నాను.....కోర్ట్వారు ...సహృదయంతో వాటిని పరిశీలించి ...అసలు ...దోషులను శిక్షించాల్సినదిగా కోరుకుంటున్నాను...ఇంకొక ...ముఖ్యమైన విషయం     ....మంగమ్మని ప్రాణాపాయస్థితిలో రక్షించి...కాపాడి ....ఒ కహాస్పిటల్లో ఉంచిన ....వాటి తాలూకు ... నిజాలు ... ఇదిగో ...ఈ ఫైల్లో సమర్పిస్తున్నాను … నేను కోర్ట్వారినికోరేదొకటే … స్థలాలు వేరైనా,వ్యక్తులు వేరైనా ....నేడు మనదేశం అంతటా విషవృక్షంలా వ్యాపించి ..విస్తరించిన ....ఈసారా మహమ్మారిని సమూలంగా నాశనంచేసి ....ఈ సమాజాన్ని.. వ్యవస్తను ... రక్షించే భాద్యత ...మనలో ప్రతిఒక్కరికీ వున్నదని ...దాని కిసంబంధించి ఖచ్చితమైన ...కఠినమైన ..చట్టాలు చెయ్యవలసినదిగా కోర్ట్వారిని కోరుకుంటూ ....అమాయకుడైన నాక్లైంట్ని నిరపరాదిగా విడుదల చెయ్యవలసినదని కోరుకుంటున్నాను.చేసేదే మనుషులని మత్తులోముంచి ,మానవత్వాన్ని మరిచి పశువులుగా మార్చే' సారా ' వ్యాపారం మళ్ళీ దానిలోనూ 'కల్తీ '.    ఎప్పుడైతే మనం మనుషులమని అనిపించి ఈ కల్తీవ్యాపారాలు మానేసి .... సాటి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం మానేస్తారో అప్పటివరకూ మనం మనుషులుగా అనర్హులం ...కేవలం  ..నరరూపంలో ఉన్న "కల్తీమనుషులం" ప్రణవి గొంతులోని ఆవేదన మనసున్న ప్రతిమనిషినీ కదిలించింది .
కోర్ట్  ప్రాంగణం అంతా కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఒక నిర్దోషి, నిరపరాధి రక్షింపబడి, మూడుప్రాణాలు నిలబడ్డాయి ... మూడోదెవరంటారా ....ఇంకెవరు ....న్యాయదేవత.
    ***

No comments:

Post a Comment

Pages