Monday, November 23, 2015

thumbnail

ఇంకో స్వర్ణం

ఇంకో స్వర్ణం

-బ్నిం ఒక ‘రాక్షసి’ ఒక మంచి తల్లితండ్రులకి పుట్టింది! చిన్నప్పడి నుంచి పట్టుదలే – ఆ తల్లితండ్రులు ఆ పిల్లని సహించారు – భరించారు. లేకపోతే ఏంటండీ .... LKG లోనే ఆటపాటల పిచ్చా? చదువుపై ఆశ్రద్దా? సరే ... ఆపిల్ల పిచ్చిమేరకు రోణంకి గోవిందరావుగారు వారి సతీమణి విజయలక్ష్మిగారూ ఓకే అనేయడమా? ఈ పిల్ల రెచ్చిపోవడమా ఫోర్ మచ్ కాదూ?!! ఈ గాజువాక (సింధియా న్యూ కాలనీలో) ఉండే పాపకి అలా చిన్నప్పుడే డ్యాన్స్ పిచ్చి పట్టింది! అప్పటికి ఎన్నేళ్ళు ...నాలుగేళ్లు!! ఆ తర్వాత క్లాసులు పెరుగుతున్నాయి పిచ్చీ ముదురుతోంది! అప్పుడు మొదలయింది అమ్మానాన్నల అసలు అవస్థ –ఆపిచ్చి ఎలా తీర్చాలి అనే వారి ధ్యాస! 
 నిజానికి డ్యాన్స్ చాలా ఖరీదైన విద్య – అయినా సరే ... వాళ్లకి అందుబాటులో ఉన్న ప్రసిద్ధ గురువుల దగ్గరే ... ఈ ‘తకతై ..తై’ పాపని తిప్పారు – ఈ పేచీల పిల్లకి అదొకటే మందు కదా ....’ఆట’ లాడించారు- కాదు ... రోణంకి గోవిదరావు-విజయలక్ష్మిగారు ఈ ‘స్వర్ణగౌరీ’ని కళాహృదయంతో రెచ్చిపోనిచ్చారు – అంతకు మరింత ‘మా
మనవరాలు ఏం చెప్తే అదే అదే జరగాలని బామ్మాభిమానం! ఇంటావంటా ఎవరికీలేని డ్యాన్స్ పిచ్చి పిల్ల ...(ఇంక స్వర్ణగౌరి అనేద్దాం) ఎలాగో అలాగ ఇంటర్ గట్టెక్కింది. అలనాడు దూరదర్శన్ లో చూసిన డ్యాన్స్ పోగ్రామ్ లు ఆమెను ఎప్పటికీ మార్చలేని స్థితిలో పెంచుతోంది- మొదట్లో ... షిప్ యార్డ్ లో ఉన్న ‘సత్యనారాయణ’మాష్టారు కూచిపూడి నేర్పించారు- ఆ తర్వాత ఏం జరింగిందో గ్రూప్ మారి ... కస్తూరి మేడమ్ దగ్గర భరతనాట్యం ... ఇలా తిప్పాక మళ్లీ కూచిపూడికళాక్షేత్ర బాలక్కగారి ఇంకోపధ్ధతి... ఇలా... మార్గాలు గమ్యాలూ మారుతున్న... చదువుమాత్రం ప్రైవేటుగానే – ఇంటర్ కూడా ప్రైవేటుగానే చదివి ...డ్యాన్స్ ని కొనసాగిస్తూ ..గిస్తూ... హాయిగా అత్తెసరు మార్కులు తెచ్చేసుకుంది – చివరాకరికి చిరాకేసి అప్పట్లో పేరు మ్రోగుతున్న లంక బుల్లయ్య కాలేజీలో ఈ పిల్లని బీకామ్ అంటూ ..B.Com లో కుక్కేసారు – కాలేజీలో టీజర్స్ ‘తకతై..తకతై’ అని టీజ్ చేసేవారు – అదే ఎప్రిసియేషన్ అనుకుంటూ మరింత రెచ్చిపోయేది – నడకే నాట్యంగా... హోయలే నడవడిగా... మొత్తానికి డిగ్రీ గడిపేస్తోంది ... మా నలుగురు కూతుళ్లలో ... ఈ నల్లపిల్లని (నల్ల అనగా ... తమిళంలో మంచి) ఎలా సముదాయించాలి – అని తల్లితండ్రులకి బెంగన్నర అవుతోంది – అపుడోదేవుడు ... రోణంకి ఉమామహేశ్వరరావు అనే పెద్దమనిషి వచ్చి ... ఆంధ్రాయూనివర్సిటీవారి పార్ట్ టైం థియేటర్ ఆర్ట్స్ కోర్స్ లో తోసేయ్యడం ఉత్తమం అన్నారు – డిగ్రీతో పాటు అదీ పూర్తయింది- ‘మూడవ అడుగు ఎచట మోపేది?’ అని వామనుల్లా అడిగింది .. అమ్మానాన్నల్ని – నీ ఇష్టం తల్లీ అన్నారు ... ఆ అడుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టించింది!!! ప్రకాష్ కోవెలమూడి మొదలైన వారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి మెప్పులు పొందుతూ సొంతంగా సినిమా తీయాలని మున్ముందుకు దూకుతోంది. అయితే... డ్యాన్స్ మీద మమకారం అలాగేవుండి వేదాంతం సత్య నరసింహశాస్త్రి గారి దగ్గర మరిన్ని మెళుకువలు చేర్చుకుంటూ ... నాతో క్యాన్స్ బేలే రాయించుకునే ప్రయత్నంలో మేనకోడలంత దగ్గర అయిపోయింది. డ్యాన్స్ బేలే త్వరగా రాయకూడదని పదేపదే ఆ స్వర్ణగౌరి మనింటికి వస్తుండాలని విష్ చేయండి! కానీ... ఈ డైరెక్టర్ తను చెప్పి రాయించుకుంటున్న సబ్జెక్ట్ కి నాతో కసరత్తు చేయిస్తోంది – నవరసాలనీ పౌరాణికంగా ...సాంఘీకంగా పోలికలు చూపించి రాయించుకుంటోంది! ఇంత డ్యాన్స్ పిచ్చి ఉన్న బంగార్తల్లి ‘స్వర్ణగౌరి’కి మీరు కూడా శుభాశీస్సులు ఇచ్చేయచ్చు!!  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information