కళారత్న మేస్ట్రో - డా.గజల్ శ్రీనివాస్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

కళారత్న మేస్ట్రో - డా.గజల్ శ్రీనివాస్ గారితో ముఖాముఖి

Share This
 కళారత్న 'మేస్ట్రో' డా.గజల్ శ్రీనివాస్ గారితో ముఖాముఖి  

భావరాజు పద్మిని 


గొంతు పాడితే అది పాట అవుతుంది. గుండె పాడితే, అది గజల్ శ్రీనివాస్ గారి గజల్ అవుతుంది. ఆయనకు గజల్ ఒక కన్నైతే, సమాజసేవ మరొక కన్ను. పంచే చేతులకే గులాబీల పరిమళం అద్దుతూ, ఆ చేతులు ఎప్పుడూ నిండిఉండేలా చూస్తాడట ఆ పరమాత్మ. ఆ పరమాత్మే, తన ప్రాణమిత్రుడని చెప్పే గజల్ శ్రీనివాస్ గారితో ప్రత్యేక ముఖాముఖి, ఈ నెల మీకోసం.
నమస్కారం గజల్ శ్రీనివాస్ గారు! 
నమస్కారమండీ.
శ్రీనివాస్ గారు మీ స్వగ్రామం, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. కానీ మా పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర మదనపల్లి. నాన్నగారు ఉద్యోగ రీత్యా పాలకొల్లులో స్థిరనివాసం ఏర్పరచుకోవడం చేత మాకు యుక్తవయసు నుంచి కూడా పాలకొల్లే స్వగ్రామం అయిపోయిందన్నమాట. అందుకనే ఎవరు అడిగినా ఇప్పుడు పాలకొల్లు మా స్వగ్రామం అని చెబుతుంటాను.
మీ అమ్మ గారు, నాన్న గార్ల పేర్లండీ..
మా నాన్న గారి పేరు నరసింహారావు గారు, అమ్మ పేరు రత్నావళి. మా నాన్నగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు. మా అమ్మగారు హౌస్ వైఫ్. మేము నలుగురు బ్రదర్స్, ఒక సిస్టర్. అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు.
చిన్నప్పటినుంచీ మీరు పాడేవారా? మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉండేది...
నన్ను నేను గుర్తుపట్టటం దగ్గరినుంచీ నేను పాడుతునే ఉన్నట్లుగా నాకు గుర్తు. నాకు తెలిసినప్పటినుంచీ కూడా నేను పాడుతునే నాకు పరిచయం కాబట్టి ఆబాల్యం నుంచి పాడుతున్నానని నేనుకుంటున్నాను.  తరువాత సినిమా పాటలు పాడటం, ఏదన్నా పాట వింటే, దానిని ఇమిటేట్ చెయ్యటం చేస్తుండేవాడిని. తరువాత పాటల పోటీలకు వెళుతుండటం, ప్రైజులు రావటం...నేను గురుముఖంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. చిన్నప్పుడు నేర్చుకుందామని ప్రయత్నం చేశాను కానీ నాన్నగారికి ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీల వలన స్థిరంగా ఒక చోట ఉండటానికి అవకాశం కలగలేదు. అయినప్పటికీ ప్రముఖ శాస్త్రీయ సంగీత కళాకారులతో తరచూ మాట్లాడుతూ ఉండటం చేత, కొన్ని కొన్ని రాగాల గురించి తెలుసుకోవటం ద్వారా, నాకు సంగీతం మీదున్న అభిలాషను పెంచుకోవటం జరిగింది. చాలా కాలం సినిమా పాటలు పాడిన తరువాత ఇంకొకరిని అనుసరించటం కానీ, అనుకరించటం కానీ సరైనది కాదని నేను తెలుగులో గజల్స్ పాడాలని నిర్ణయించుకున్నాను. నారాయణరెడ్డి గారి గజల్స్ అప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెగులర్‌గా వస్తుండేవి. అవి చూసి స్ఫూర్తి పొంది 1986లో తెలుగులో గజల్స్ పాడటం ప్రారంభించాను..
ఏయే సినిమాల్లో పాడారు? మీ సినీ ప్రస్థానం ఎలా జరిగింది?
నేనెప్పుడూ సినిమాల్లో పాడలేదండీ. గత ముప్ఫై ఏళ్లుగా చాలామంది అడిగినప్పటికీ నేనెప్పుడూ ప్లేబ్యాక్ పాడలేదు. నేను హీరోగా చేసిన చిత్రం జంధ్యాల గారి ఆఖరి సినిమా 'విచిత్రం' సినిమా. ఇందులో  నా క్యారెక్టర్ ఎంట్రీ పాటతో మొదలవుతుంది. దానిని నాకు నేను పాడుకున్నాను, వేరే ఎవ్వరికీ పాడలేదు. ఈ మధ్యనే రాంగోపాల్‌వర్మ గారితో నాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని ఆయన ఒక టిపికల్ సాంగ్ పాడమని అడిగారు. దానితో ముప్ఫై సంవత్సరాలుగా నాకున్న వ్రతాన్ని బ్రేక్ చేసుకొని ప్లేబ్యాక్ పాడాను. అది సిరాశ్రీ గారు రాసారు. ఎటాక్ అనే సినిమా కొరకు పాడాను.
ఇది తెలుగు సినిమానేనా అండీ?
అవును. రాంగోపాల్‌వర్మ గారి దర్శకత్వంలో తెలుగు సినిమా. దానికి నేను ప్లేబ్యాక్ పాడాను.
మీకన్నా ముందు తెలుగులో గజల్స్ పాడటం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు కదా? మీకు ఇటువైపు ఆసక్తి ఎలా కలిగింది?
అందులో ఉన్న సాహిత్యపు విలువలండీ. నారాయణ రెడ్డి గారు వ్రాసిన సాహిత్యపు విలువలు నన్ను బాగా ఆకర్షితుడిని చేశాయి. వాటిలో ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, మానవతా విలువలు, సందేశం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉర్దూలో మధువు-మగువ, విరహం-శృంగారం ఇవే ఎక్కువగా ఉండటం చేత ఫీలింగ్స్ రిపీటెడ్‌గా ఉంటున్నాయి ఏదన్నా కొత్తగా ఉంటే బాగుంటుంది, సమాజానికి ఉపయోగకరంగా ఏదన్నా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో నారాయణ రెడ్డి గారి గజల్స్ కనిపించటం, వాటిని నేను అధ్యయనం చేయటం, పాడటం జరిగింది. నేను హార్మోనియం,సరోద్ లేకుండా కేవలం కంజీరతోనే పాడటం జరిగింది. రాను రాను కంజీరాతోనే పాడటం ప్రజలకు అలవాటై పోయింది. గురువు గారు నారాయణ రెడ్డి గారికి నేను పరిచయమైన తరువాత వారు నా శైలికి అనుగుణంగా గజల్స్ రాయటం, వారు నన్ను "మానస పుత్రుడు" అని డిక్లేర్ చేయటము జరిగింది. ఇలాగ మా ఇద్దరి మధ్య ఒక చక్కటి అనుబంధం ఏర్పడటం వలన, కొన్ని వందల గజల్స్ నేను పాడే రీతిలో నారాయణ రెడ్డి గారు రాయటానికి దోహదపడింది. నేను పాడే శైలి వారికి ఆసక్తికరంగా అనిపించి, నన్ను బాగా ఎంకరేజ్ చేసి, బాగా ఆశీర్వదించి గురువు గారు నన్ను ఒక సొంత కొడుకులాగా చూడటం జరిగింది. వారు నాకోసమే గజల్స్ రాయటం, కొన్ని గజల్స్‌లో నా గురించి ప్రస్తావించటం వలన  నారాయణరెడ్డి గారితో అనుబంధమే  గజల్స్‌తో అనుబంధం. ఇవన్నీ కలిపి గజల్ శ్రీనివాస్ అనే కేరక్టర్‌ను, సింగర్‌ను తయారు చేయటం జరిగింది.
బావుందండీ. మీరు గజల్స్ రాస్తారా?
అవును. నేను కూడా గజల్స్ రాస్తుంటానండీ. ఇంగువ కట్టిన గుడ్డ కూడా ఇంగువ వాసన వస్తుంది కాబట్టి ముప్ఫై సంవత్సరాల పాటు కొన్ని వందల గజల్స్ పాడటం వలన నాకు కూడా రాయటం అలవాటైంది. చాలా రాశాను. గజల్స్‌ను ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని పదేళ్ల క్రితం గజల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది. తెలుగు గజల్ కవులకు గాయకులకు స్ఫూర్తి కలిగే విధంగా చాలా విస్తృతంగా తెలుగు గజల్ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. కొత్త కొత్త రచయితలు చాల మంది వచ్చారు. డాక్టర్ ఎంటాల శ్రీవేంకటేశ్వరరావు గారు, సూరారం శంకర్, ఎంబీవి శ్యామల, రసరాజు గారు, సిరాశ్రీ, కొత్తగూడెం రాజేష్, రాజగోపాలంగారు, పెన్నా శివరామకృష్ణ, యావరు నరేందర్ రెడ్డి..ఇలా ఎందరో మంచి మంచి గజల్ రచయితలు వచ్చారు. వారు చాలా బ్రహ్మాండంగా రాస్తున్నారు. ఇంకా బాగా రాయాలని, పాడాలని అనిపిస్తోంది.
మానవతా దృక్పథం అనేది మీకు ఎలా అలవడిందండీ? 
తేలు మనిషిని కుట్టడం అనే చెడ్డ బుద్ధిని వదులుకోదు. అలాగే మనిషిని, నేను మానవత్వం అనే దానిని వదులుకోకూడదు. కాబట్టి కొత్తగా అలవాటైంది ఏమీ లేదు. తల్లిదండ్రుల పెంపకంలోనే అది వచ్చేసింది. మా తండ్రిగారు, అమ్మ గారు సత్యసాయిబాబా గారి భక్తులు. మాకు చిన్నప్పటినుండి సత్యసాయిబాబానే దైవం. వారినే దైవంగా భావించటం, వారు స్థాపించిన బాలవికాస్‌లో చదువుకోవటం, మానవతా విలువలు అనుభవించటం, జీవితం వాటితోనే సాగించటం వలన అలా అలవాటై పోయింది. చాలా మంది అంటారు గజల్ శ్రీనివాస్ గారు మీరు చాల దానధర్మాలు చేస్తుంటారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ అంటుంటారు. అదేమిటి, చిన్నప్పటినుండీ చేసినదే ఇప్పుడూ చేస్తున్నాను. పొద్దునే లేచి పళ్లుతోముకున్నట్లే నేను సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. అదో పెద్ద విశేషంగా చెబితే నాకు నవ్వొస్తుంది. మనం మనిషిగా పుట్టాం కాబట్టి మానవీయతతో ఉండాలి, మానవత్వంవంటే గౌరవం ఉండాలి, సమాజంతో మనం ముడిపడి ఉన్నాము కాబట్టి సమాజానికి సేవ చేయటం పెద్ద విషయం కాదనిపిస్తుంది. బాబాగారు చెసినందాంట్లో మనం చేసేది చాలా తక్కువ. ఈ ప్రపంచంలో చాలా గొప్పమంది చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తుంటారు. కొంతమంది రక్తదానం రెండోందల సార్లు మూడొందల సార్లు చేస్తుంటారు. వాళ్లముందు మనం చేసేది చాలా తక్కువ.
అవునండీ. ఎప్పుడూ మనకన్నా ఎక్కువ సేవ చేసే వాళ్లను చూస్తే మనకు స్ఫూర్తి కలుగుతుంది.
అందరూ మనకన్నా ఎక్కువ చేసే వాళ్లే. మనం కొంత డబ్బు, కొంత సమయాన్నే కేటాయించగలం. కానీ నిజంగా సేవాతత్పరులుంటారు. వారు డబ్బుతోపాటు సేవలో మమేకమైపోతారు. వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్లమండీ.
125 భాషల్లో పాడటం ఎలా సాధ్యమైంది?
అది ఒక అవసరం అనిపించింది. మహాత్మా గాంధీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గతం కాదు భవిష్యత్తు అని చెప్పాలనుకున్నాను. ఆయన సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలను బాగా ప్రచారం చేయాలనుకున్నాను. దానికోసం ఒక పాట రాసి దానిని హిందీలో తర్జుమా చేయించి, గుజరాతీలో కూడా పాడాను. ఆ తరువాత నా మిత్రుడు లగడపాటి రాజగోపాల్ గారు, సోనియాగాంధీ గారి సలహాదారు అహ్మద్ పటేల్ గారు మిగితా భాషల్లో కూడా మీరు పాడితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. మిగితా భారతీయ భాషల్లో పాడుతున్నప్పుడు విదేశీ భాషల్లో కూడా పాడటం జరిగింది. నేను విదేశీ భాషల్లో కూడా నేను పాడగలుగుతున్నాను అన్న విశ్వాసం కలిగిందో ఆ తరువాత నేను ఇంక వెనక్కి చూడకుండా 125 భాషలకు పైనే పాడటం జరిగింది. వందల భాషల్లో లైవ్ పాడటం ఆ విభాగంలో ఒక గిన్నిస్ రికార్డు. అలాగే ఆడీయో సీడీలో 125 భాషలు 125 పాటలు పాడినందుకు రెండో గిన్ని వరల్డ్ రికార్డు వచ్చింది. మూడో గిన్నిస్ రికార్డు 24 గంటల్లో 55 వివిధ వేదికలపై కచేరీలు చేసినందుకు వచ్చింది. గిన్నిస్ రికార్డుల పర్వం ఇది. 125 భాషలలో పాడటం చాలా శ్రమ, వ్యయంతో కూడుకున్నది. 125 భాషల వారిని కలవటం, వారికి నా పాట గురించి చెప్పటం, ట్యూన్ గురించి చెప్పటం, ఆ ట్యూన్‌లో వారి చేత రాయించటం, వాళ్ల దగ్గర ఉచ్ఛారణ నేర్చుకోవటం, వారిని మరల స్టూడియోకి తీసుకురావటం, వారి ముందే నేను పాడటం, వారు ఒకే అన్న తరువాతే దానిని ఫైనలైజ్ చేయటం, ఇలా చేశాం. రాత్రి పగలు స్టూడియోలు తిరుగుతూ ఎన్నో దేశాల్లో ఎంతో మందిని కలవటం జరిగింది. వారి దగ్గర భాష గురించి, దాని పూర్వాపరాలు తెలుసుకోవటం, ఉచ్ఛారణ యొక్క విశిష్టత తెలుసుకోవటం చేశాం.  కొన్ని కొన్ని భాషల్లో పాడటం చాలా క్లిష్టతరమైంది. అర్మీనియన్ వంటి కొన్ని భాషల్లో పాడుతుంటే చెమటలు పట్టేశాయి. అంతా ఒక గొప్ప లక్ష్యం కోసం. నేను చెప్పాను, నేటివ్ సింగర్‌లాగా పాడలేను. ఉచ్ఛారణా దోషాలు చాలా ఉండచ్చు. కానీ నేను పాడిన పాటను ఆయా భాషల్లోని లోకల్ సింగర్స్ స్ఫూర్తిగా తీసుకుని, దానిని రీప్రొడ్యూస్ చేసి ప్రాపర్‌గా పాడతారని నా ఉద్దేశం. మై అటెంప్ట్ ఈజ్ టు ఇన్స్పైర్ పీపుల్ అబౌట్ మహాత్మాగాంధీజీస్ సత్యాగ్రహ ఫిలాసఫీ అని తెలియజేయాలని చేశాను అని చెప్పాను.
చాల బావుందండీ. మీరు చెప్పిన విధానం కుడా ఎంతో బావుంది. గజల్, సంగీతం లేక పాట ఎలా ఉండాలని మీరు భావిస్తారు?
గజలైనా పాటైనా కథైనా నవలైనా ఏ ప్రక్రియైనా ఆత్మ దర్శనం కలిగి ఉండాలి. పొయెట్రీ కానీ ఏదైనా కానీ ఊహలు కాదు. అవి ఊహాభరితంగా ఉన్నవి అలాగే మిగిలిపోతాయి. విశ్వజనీనమైన భావాలేవైతే ఉన్నాయో వాటిని పద్యంగా రాసినా, పాటగా రాసినా,గజల్‌గా రాసినా, గేయంగా రాసినా, నవలగా రాసినా, కథలుగా రాసినా, విశ్వజనీనమైన భావాలు, మానవ  సంబంధాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కాబట్టి, మనం చూస్తున్నటువంటి ప్రకృతిలో మనకు లైవ్‌లో కనిపిస్తాయి కాబట్టి వాటిని స్పృశించటం మూలాన, వాటిని కవిత్వంలోకి తీసుకు రావటం వలన బాగుటుంది. కొన్ని అనుభవాలు, అనుభూతులు కూడా బాగుంటాయి. పాత స్కూల్లో గడిపాము, ఊళ్ళో గడిపాము అన్నటువుంటి అనుభవాలు బాగుంటాయి. అందుకే నేనొక గజల్ పాడాను
ఒక్కసారి ఊరు పోయి రా  - బతికిన పల్లెల కోసం
ఒక్కసారి ఊరు పోయి రా - అనుభూతుల మల్లెల కోసం
ఏటి గట్టు సరదాలు పాటమీద పగ్గాలు
ఒక్కసారి ఊరు పోయి రా ఒక్క సారి ఊరు పోయిరా
చిననాటి మనసుల కోసం ఒక్క సారి ఊరు పోయి రా..
అలాగే మనం చదువుకున్న స్కూల్...
చదువుకున్న రోజుల ముచ్చట్లు ఎలా మరచిపోను?
ఒకరికొక వేసుకున్న ఒట్లు ఎలా మరచిపోను?
విసిరినదొకవైపైతే వెళ్లినదొకవైపై...
ఇక్కట్లు తెచ్చిపెట్టిన రాకెట్లు ఎలా మరచిపోను?
చదువుకున్న రోజుల ముచ్చట్లు ఎలా మరచిపోను?
రెంటాల గారితోను, కవులతోటి డిస్కస్ చేస్తున్నప్పుడు నా భావాలు చెబుతాను. ఎవరో రచయిత ఏవో గజల్స్ రాసి పంపిస్తే నేను పాడను. విశ్వజనీనమైన భావాలు నేను అనుభూతి పొందినప్పుడు రైటర్స్‌తో మాట్లాడి, వారిలో కూడా ఆ భావన ఉందో లేదో తెలుసుకొని, భావన ఉన్నట్లు నాకనిపిస్తే, "అయ్యా మీరు తప్పకుండా దీనిపైన ఒక గజల్ రాస్తే బాగుంటుందండీ అని చెప్పి డిస్కస్ చేసి, ఆ థాట్, మొత్తం ఎలా ఉండాలో" చెపితే వాళ్లు గజల్ రాయటం, ఒక నాలుగు రోజులు చర్చించుకోవటం, సంప్రదించటం, ఇద్దరు ముగ్గురు క్రిటిక్స్‌కి వినిపించటం, తరువాత వేదిక మీద పాడటం జరుగుతుంది. విశ్వజనీనమైన భావాలు అందరూ కూడా ఆడియెన్స్‌లో, హిందీ ఉర్దూ గజల్స్ అయితే కొన్ని వేయి పదిహేను వందల మంది ఉంటారు, కానీ నా గజల్స్‌కు 25-30 వేల మంది ఆడియన్స్ ఉంటారు కాబట్టి వారందరికీ ఒకే భావన ఒకే సూత్రంపైకి ఎలా తీసుకురావటానికి ఎటువంటి గజల్స్ ఉంటే బాగుంటుంది అన్నది ప్రయత్నం. ఉదాహరణకు తటవర్తి రాజగోపాలం గారి చేత ఒక గజల్ రాయించాను.
ఉందోలేదో స్వర్గము నా పుణ్యం నాకిచ్చెయ్
సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చెయ్
ఉందోలేదో స్వర్గము నా పుణ్యం నాకిచ్చెయ్
అమ్మగుండెలో దూరే ఆనందంతో తుళ్లే  
ఆదమరచి నిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చెయ్
ఉందోలేదో స్వర్గము నా పుణ్యం నాకిచ్చెయ్
సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చెయ్
ఈ బాల్యమనేది అందరికీ ఉండేది. ఈ భావం అందరూ ఒకేలా స్పందించేలా ఉంటుంది. అందుకని అటువంటి గజల్స్ పాడటానికి నేను ప్రిఫర్ చేస్తాను.
చాలా అద్భుతంగా ఉందండీ. గొంతుతో పాడేవాళ్లను చూస్తాము కానీ మీరైతే గుండెతో పాడినట్లే అనిపిస్తోంది. ప్రతిపాట అందరూ కనెక్ట్ అయ్యేట్టు ఉంటుంది అన్నమాట. 
ఏదైనా కూడా స్వీయానుభూతి కాకపోతే నాకు పాడటానికి రుచించందండీ. మిగితా సింగర్స్ పాడుతుంతే మిగితావాళ్లు పాడుతుంటే ఆయన ప్రోగ్రాం విన్నారా అని అడుగుతారు. కానీ శ్రీనివాస్ గారి ప్రోగ్రాం అంటే చూశారా అని అడుగుతారు. ఎందువలన అంటే నేను ఆవిష్కరించే విధానం కానీ, నేను అనుభూతి చెందుతూ పాడే విధానం కానీ ఒక విభిన్నమైన శైలి అని నారాయణ రెడ్డి గారు, గులాం అలీ గారు, జగ్జీత్ సింగ్ వంటి వారు ప్రస్తావించటం జరిగింది. మనమేమి గొప్ప గజల్స్ గాయకులం కాదు అయినప్పటికీ పాడేటువంటిది విభిన్నమైన శైలి కాబట్టి ప్రజాదరణ పొందింది.
అనుష్ఠానం సినిమా గురించి చెప్పండి
అనుష్ఠానం నేను హీరోగా, మాధవీలత హీరోయిన్‌గా చేస్తున్న సినిమా అండి. జీ కృష్ణవాస అనే ఆయన డైరెక్ట్ చెస్తున్నారు. ఇది చలం గారు రాసినటువంటి త్యాగం అనే కథ ఆధారంగా చేస్తున్న సినిమా. అందులో నా క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుంది. లీడ్ రోల్ అయినా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గజల్ శ్రీనివాస్‌లో ఒక గొప్ప నటుడున్నాడు అని ప్రజలకు కొంచెం అవగతమయ్యే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అందులో తపస్సు చేస్తున్నట్లుగా ఆ కార్యెక్టర్ చేశాను. ఆ మధ్య ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక సినిమాలో నేను ఒక స్పెషల్ ఎప్పియరెన్స్ చేస్తే దానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఒక వినూత్నమైన నటన అని మీడియాలో రాశారు. ఎప్పుడూ కూడ మనం పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాము. ఉన్నంతలో ఇప్పుడు ఇందులో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేశాను. బట్ స్టిల్ అవర్ బెస్ట్ ఈజ్ యెట్ టు కం. రామారావుగారు, నాగేశ్వరరావు గారు చేసిన పాత్రల ముందు మనం చేసేవి పేలవంగా ఉంటాయి. కానీ 1950స్ లో స్టొరీ కాబట్టి కన్యాశుల్కం, వరవిక్రయం స్ఫూర్తిగా తీసుకొని డైలాగ్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అప్పటిలానే కృషి చేసి చేశాను.
చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది.
చాలా బాగుంటుందండీ. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలమధ్య ఎలా నలిగేవి, భర్త సుఖం కోసం భార్య చేసిన అపురూపమైన త్యాగమేంటి అనేది చిత్రం. ఆయన గొప్ప కథ చలం గారు రాశారు. అందుకు ఆయనను మనం హర్షించాలి. ఆ కథను చాల జాగ్రత్తగా సినిమా తీసాం. నేనే శ్రద్ధ తీసుకొని ఎడిటింగ్, రీరికార్డింగ్‌లో కూర్చుని ప్రజలకు బాగా దగ్గరగా తీసువెళ్లాలనే ఆలోచనతో చేశాను. ఇది కాకుండా, మరో సినిమా కూడా రిలీజ్ అవుతోంది. శ్రీ రామచంద్ర చినజీయర్ స్వామి వారు భగవద్రామానుజులు అని రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను సినిమాగా తీశారు. అందులో నేను విష్ణుమూర్తిగా నటించాను. నిన్ననే చూశాను. చాల బాగుంది అని అన్నారు. విష్ణుమూర్తిగా బానే నప్పాను అని అనిపించింది. ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా వచ్చాయి. నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా ప్రింట్స్ చూసి చాలా మంది ప్రొడ్యూసర్లు పౌరాణిక పాత్రలు చేయమని, భాగవతం మీతో తీస్తాము కృష్ణుడిగా నటించమని, దక్షయజ్ఞం తీస్తాము అని ఇంకో ప్రొడ్యూసర్ అడిగారు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత పరిశీలిద్దామని చెప్పాను.
ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరు మర్చిపోలేను అనుభూతి ఏదైనా చెబుతారా?
జీవితం సంతోషము, దుఃఖాలతో నిండిపోతుంటుంది. ఒకరోజు దుఃఖంతోను, ఒకరోజు ఆనందంతోను. మనం అనుకున్నది జరిగిందనో జరగలేదనో ఇవి. నాకు జీవితంలో ఒకటే ఒకటి ఆనందం. అది మా అమ్మాయి సంస్కృతి పుట్టినరోజు జులై 30 2000 సంవత్సరం. జీవితంలో అంతకన్నా ఆనందమైనది లేదు. ఈరోజు నాకు మహదానందమైనటువంటి రోజు. మిగిలినవన్నీ సంతోషకరం. ఎఛీవ్మెంట్స్‌ది ఏముందండి? మూడు గిన్నిస్ రికార్డులు వస్తే, 125 భాషల్లో పాడితే, డాక్టరేట్లు, అవార్డులు వస్తే అవేవీ గొప్ప గొప్ప ఎఛీవ్మెంట్స్ కాదని నా ఉద్దేశం. ఎందువలన అంటే సముద్రం ముందు నుంచుని మనలను మనం చూసుకుంటే నవ్వొస్తుంది. ఇంతటి అనంతమైన విశ్వంలో మనం చేసే పని చాలా అల్పమైంది. వేటూరి సుందరరామమూర్తిగారు ఒక పాటలో రాసారు - " గగనవీధిలోకెగసితిని కడలి లోతులే తరచితిని స్వల్పమైన ఈ దేహశిల్పమున అల్పజీవినని మరచితిని అఘమను కులమున పుట్టితిని అహమను మతమును పట్టితిని ఇహమే స్థిరమని నమ్మితిని పరమే పరులకు అమ్మితిని"....మనం ఓ వంద అవార్డులు వచ్చేసి వందేళ్లు బతికేసినంత మాత్రాన మనమేమి గొప్పగా సమాజాన్ని ప్రభావితం చేసినట్లు కాదు. ఒక బుద్ధుడిలాగా, ఒక గాంధీలాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా మనం సమాజాన్ని ఎంత వరకు ప్రభావితం చేయగలిగాం అని పోల్చుకుంటే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది.
చాలా బాగా చెప్పారండీ. 
నాకు పెద్దగా గొప్ప అనుభూతులేవీ లేవండీ. నేను సాధించినవన్నీ నాకేమీ ఆత్మానందాన్ని కలిగించినవైతే కావు. సంతోషం, యెస్ ఐ యాం ఎ గిన్నీస్ రికార్డ్ హోల్డర్. మూడు గిన్నిస్ రికార్డులు వచ్చాయి. ఐ యాం వెరీ హ్యాపీ. యంగ్ ఏజ్‌లోనే డాక్టరేట్లు వచ్చాయి డ్ లిట్ వచ్చాయి. స్టేట్ గవర్నమెంట్ హంస, కళారత్న అవార్డులిచ్చి గౌరవించాయి. ఐ యాం వెరీ హ్యాపీ. ఎన్నో ఇంటర్నేషనల్ వేదికలపైన నాకు అవార్డులు వచ్చాయి. సంతోషం. వీటన్నిటికీ మించి రోజూ బాగా పాడగలుగుతున్నాం. రోజూ బాగా నేర్చుకోగలుగుతున్నాం. చూస్తున్నటువంటి దృశ్యాన్ని కళ్లతో కాకుండా మనసుతో చూడగలుగుతున్నాను. అంత తీరిక ఉంది. ఆ భావావేశం, భావార్తి నాలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ముఖ్యంగా నారాయణరెడ్డి గారి లాంటి గొప్ప గురువు నాకు దొరకటం, ఆయన నన్ను మానసపుత్రుడు అనటం ఇవన్నీ కూడా గొప్ప విషయాలనే అని భావిస్తాను. కానీ ఆనందమైతే మటుకు విషయమైతే మాత్రం నా కూతురు పుట్టటం.
తన గొంతు కూడా చాల తీయగా ఉంది. నిజంగా ఏదో తేనె తీసుకువచ్చి చెవుల్లో పోసినట్లు ఎంత స్వీట్‌గా ఉందో తన వాయిస్.
అవును. చాలామంది చెబుతుంటారు. స్వామి పరిపూర్ణానంద గారు చెప్పారు. ఎంత మంచి పేరు పెట్టారండీ పాపకు సంస్కృతి అని. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయి సంస్కృతి కృతి చాలా బ్రహ్మాండంగా పాడుతుంది  చాలా బాగుంది అని ఒక సభకు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. మా అమ్మాయి కూడా నాకు వారసురాలిగా ఎమర్జ్ అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.
అవునండీ చాలా సంతోషంగా ఉందండీ మాకు కూడా. ఈ ప్రయాణంలో మీ శ్రీమతి పాత్ర ఏమిటో చెప్పండి.
ఆవిడ లేకపోతే ఏముందండి? ఒక వ్యక్తి ఉన్నపనులు ఇరవైనాలుగు గంటల్లో పూర్తి చేయలేడు. ఇంకో ఇరవై నాలుగు గంటలు తోడైతే తప్ప సాధ్యం కాదు. అందుకనే రెంటాల వేంకటేశ్వరరావు గారు ఒక గజల్‌లో అన్నారు
"ఇంత కృషికి నాకు సమయమెక్కడిదంటే 
తన తీరిక తాను వాడుకోనేలేదు 
ఇల్లు ఇపుడు ఇల్లు లాగ లేనే లేదు 
ఊరు నుంచి తను ఇంకా  రానే లేదు..." 
కాబట్టి భార్య లేకపోతే మనకు ఏముందండీ?
"ఇంత వెలితి దేనికి ఈ ఇంటికి నాకు
తాను లేక నేను పూర్తి కానేలేదు
గమనించావో లేదో ఓ మనసా
దాంపత్యం లాంటి మైత్రి లేనేలేదు"
దాంపత్యం కన్నా గొప్ప మైత్రి ఉండదు కాబట్టి ఆ మైత్రిలో నా గాత్రం ఆవిడ సహకారం, ఇవన్నీ కలిసి పనిచేయటం వలన నేను ఎఛీవ్ చేయగలిగాను. ఆవిడ ప్రముఖమైనటువంటి పాత్రే పోషిస్తుంది కాబట్టి. గజల్స్ కంపోజ్ చేసి వినిపించటంలో అభిప్రాయం చెప్పటం కానీ, నా డ్రెస్సులు/కాస్ట్యూంస్ డిజైన్ చేయటం కానీ...ఏదైనా సలహాలు సంప్రదింపులు షి ఈజ్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మి. నాకు ఇద్దరు గొప్ప స్నేహితులు ఒకరు నా భార్య ఇంకోరు శ్రీవేంకటేశ్వరస్వామి. నా ఆఫీసులో ఒక కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆయనను ఒక ఫ్రెండనుకొని డిస్కస్ చేస్తుంటాను. జనాలేమో ఏమిటి ఎవరూ లేరు కదా అనుకుంటారు. నాకేమో ఆయన కూర్చీలో ఉన్నాడని ఫీలింగ్.
"నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో నేనుంటే తలుపు తట్టింది
పసిడి అందెల రవళి చెవుల పడకుండా పాదముద్రలు కూడా కనుల పడకుండా 
నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో నేనుంటే తలుపు తట్టింది" 
నేనెప్పుడో నిదురపోతుంటే ఆయన మాఇంటికి వచ్చి ఎండలో వెయిట్ చేసి వెళ్లిపోయాడు. తరువాత తెలిసింది ఆయన వచ్చి వెళ్లిపోయాడని. ఎంతో బాధపడ్డాను నువ్వేనా స్వామి నా ఇంటికొచ్చి వెళ్లింది అని.
నీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాస పవనాలు వీచి
ఇంత పరిమళిమింత కురిసినట్టుంది
నీ మేని నిగ నిగలు నగల ధగ ధగలు
గోడలకు రంగులుగద్దినట్టుంది
నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలలు
మా ఇంటి అరుగుపై పరచినట్టుంది
నీవే కదా స్వామి ఇంటికొచ్చింది
ఇంటి ముందర మల్లె నిన్ను చూసిందేమో
తన పూల కళ్లలో దాచినట్టుంది
పెరటిలోని జాజికగుపించినావేమో
తనువెల్ల పులకించి విరబూసినట్టుంది
మౌనముద్రను దాల్చి మా ఇంటి చెట్లన్నీ
నీ కోసమే తపసు చేస్తినట్టుంది
మట్టి గోడలకంత అదృష్టమిచ్చి
మాను మాకులకేమో సౌభాగ్యమిచ్చి
మొద్దు నిద్దురలోన నన్నేమో ముంచేసి
మాయజేస్తివి గదా మాయింటికొచ్చి
ఏ పాపినో నేను నిను కాంచనైతి
నా తండ్రి శ్రీనివాసా నన్నేలు చిద్విలాసా
నీవే కదా స్వామి ఇంటికొచ్చింది
అద్భుతంగా ఉందండీ. అద్భుతం కూడా సరిపోదు. ఎంత బావుందో భావం కానీ, పాట కానీ, పాడిన విధం కానీ..
అలాగా ఆయన  నాకు మంచి ఫ్రెండండీ.ఏదన్నా ఉంటే ఆయనకు చెప్పుకుంటాను, లేదంటే నా భార్యకు చెప్పుకుంటాను.
చాల మంచి ఫ్రెండండీ. అంతకు మించి ఫ్రెండెవరూ ఉండరు. ప్రతి సమయంలోనూ తోడుంటారు నమ్మిన వాళ్లకు.
ఇద్దరూ భరించే వాళ్లు కాబట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. భరించేది భార్యే, క్షమించేది ఆయనే కాబట్టి ఇద్దరు మంచి మిత్రులున్నారని నాకు భావన.
భావి కళాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటండీ...
నేను ఎవ్వరికీ సలహాలు ఇవ్వను. సలహాలిచ్చి నా టైం వేస్టు చేసుకొని, సలహాలు విని వాళ్ల టైం వేస్టు చేసుకోవటం ఎందుకు? ఎవరికున్న మనోధర్మంతో వాళ్లు పాడితే భగవంతుడు ఆనందిస్తాడు. నేర్చుకున్నది ఉంటుంది, కానీ, జీవితంలో కూర్చుకున్నదానితో కూడా కలిపి నేర్చుకున్నది పాడితే ఆత్మానందం కలుగుతుంది. పాడుతున్నది ప్రతిదీ కూడా పరమాత్మ ఇష్టపడటానికి పాడితే మహాద్భుతంగా ఉంటుంది. ఎవరెవరో మనుషులు మెచ్చుకోవాలని పాడటం కన్నా పరమాత్మ మెచ్చుకునేందుకు, మనలను సృష్టించిన సృష్టికర్త మెచ్చుకునేందుకు పాడితే హాయిగా ఉంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్‌లో చిన్ని చిన్ని సంతోషాలకు బలహీనపడిపోకుండా ఆత్మ దర్శనం చేసుకొని, ఆత్మ తత్త్వాన్ని అర్థం చేసుకొని ఉండాలి. భగవంతుడు ఉన్నా లేకపోయినా ఏదో ఒక విశ్వాసం, సృష్టికర్త మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా సృష్టిపైనైనా విశ్వాసం పెట్టుకొని, ఆ సృష్టిలో మనం చేసే సృష్టేమిటో ఆలోచించుకొని  మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏమిటో చూసుకొని మనం పాడాలి. అదే నేను చేస్తున్నాను, ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నాను. ఐ యాం బీయింగ్ ట్రెయిండ్. ఐ విల్ బి డూయింగ్ ఇట్ ఐ విల్ బి డూయింగ్ ఇట్. ఐ విల్ బి డూయింగ్ ఇట్.
కృతజ్ఞతాభివందనాలండీ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు మా అచ్చంగా తెలుగు పాఠకుల తరఫున, మా మైండ్‌మీడియా రేడియో తరఫున కృతజ్ఞతలండీ. 
చాలా థ్యాంక్సండీ. మైండ్ మీడియాకు కృతజ్ఞతలు. పాపం మీరు చాలా రోజులనుండి విశ్వప్రయత్నం చేస్తున్నారు నా చేత నాలుగు మాటలు మాట్లాడించాలని. నేనేమో పొట్ట పెట్టె చేత పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతుంటాను. టైం దొరకదు. ఆ మధ్య హోటెల్‌కు చాలా రోజుల తరువాత మాశ్రీమతి తో కలిసి ఎక్కడో ఒక పార్టీకి వెళ్లాము.అందరూ ఫ్యాన్స్ వచ్చేసి శ్రీనివాస్ గారు మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి అని అడగటం మొదలు పెట్టారు. మా ఆవిడేమో రెండడుగులు ముందుకు వేసి నేను కూడా అదే అడుగుతున్నాను మా ఆయనను అంది. ఇదండీ నీ పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో మిమంలని చాలా నెలలు ఎదురు చూసేట్లు చేసినందుకు మిమ్మల్ని మన్నించాలి. ఏదైనా ఒక రోజు రాసి పెట్టుంది కాబట్టి ఆ రోజు ఈప్రభాత సమయమైంది కాబట్టి ఆనందిస్తున్నాను.
ఇవాళే దైవానుగ్రహం కలిగిందని భావిస్తున్నాను.
ఆయన అనుగ్రహం కలిగింది. నేను గానం చేయగలిగాను. మీతో నాలుగు మాటలు మాట్లాడగలిగాను. భవిష్యత్తులో మీ చానెల్ కూడా మరిన్ని మంచి పనులు చేయాలని, ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులున్నారు. వారందరినీ కూడా మీరు ఇంటర్వ్యూ చేసి ఆ మహానుభావులందరినీ కూడా వెలికి తీయాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యన 647 మంది హరి కథా కళాకారులతో కూర్చుని భారతీయ హరికథా పరిషత్తు అనే సంస్థను స్థాపించాను. వాళ్ల ట్యాలెంట్ చూస్తుంటే వాళ్లకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం చూస్తుంటే మతిపోయింది. నాకేమీ తెలియదు అనిపించింది. వారిని వింటుంటే నాకేమి రాదనిపించింది. అటువంటి మహానుభావులెంతో మంది మాణిక్యాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. మీ చానెల్ ద్వారా వారాందరినీ వెలికి తీసి ఈ ప్రపంచానికి పరిచ్యం చేసి అటువంటి కళాకారులందరినీ ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీకందరికీ దీపావాళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
కృతజ్ఞతలండీ. నమస్కారం.
గజల్ శ్రీనివాస్ గారితో ముఖాముఖిని, వారి చక్కటి గాత్రాన్ని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages