మరులు కురిపించే నర్తకీమణి జయమాలిని - అచ్చంగా తెలుగు

మరులు కురిపించే నర్తకీమణి జయమాలిని

Share This

మరులు కురిపించే నర్తకీమణి జయమాలిని

అక్కిరాజు ప్రసాద్ 


"నీ ఇల్లు బంగారం కానూ...నా ఒళ్లు సింగారం కానూ...జోరు మీద ఉన్నావు జోడు కడతావా...మోజు మీద సన్నజాజి పూలు పెడతావా"...అని గజదొంగ చిత్రంలో జానకమ్మ పాట విన్నా,
"సన్నజాజులోయ్...కన్నెమోజులోయ్...అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె"...అని సింహబలుడులోని ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట విన్నా,
"గుడివాడ వెళ్లాను గుంటూరు పొయ్యాను"...అని యమగోల చిత్రంలోని సుశీలమ్మ పాట విన్నా,
"శివ శివ అనలేరా కౌగిలిలోనే కైలాసమందరా"...అని భక్త కన్నప్ప చిత్రంలో జానకమ్మ పాట విన్నా,
"బాలను లాలించరా" అని వినాయక విజయంలో సుశీలమ్మ పాడిన పాట విన్నా గుర్తుకొచ్చేది ఒక్కరే
- మరులుగొల్పే శృంగారం, అద్భుతమైన నటన కలిగిన నర్తకీమణి జయమాలిని. దాదాపు ఇరవై ఐదేళ్ల తరువాత సినీ అజ్ఞాతవాసం నుండి బయటపడిన జయమాలిని వివరాలు. ​
1958వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జన్మించిన జయమాలిని తన చిన్ననాటనే తండ్రిని పోగొట్టుకున్నారు. ఎనిమిది మంది సంతానం కలిగిన తల్లితో చెన్నై చేరింది ఆమె కుటుంబం. చిన్నతనంలోనే చలనచిత్రాలలో అవకాశం వచ్చిన జయమాలిని అసలు పేరు అలమేలుమంగ. తండ్రిమరణంతో కుటుంబం బాధ్యత ఈ నటిపై పడింది. తల్లి అండదండలతో, మార్గదర్శకంలో ఈ నటి సినీరంగంలో ముందుకు సాగారు. విలక్షణమైన నృత్యాలతో, శృంగార ఒలికిస్తూ ముఖ్యమైన పాత్రలను పోషించిన జయమాలిని 1975లో అన్నదమ్ముల అనుబంధం అనే ఎన్‌టీఆర్ నటించిన చిత్రంతో తన రంగప్రవేశం చేశారు. అప్పటికే ప్రఖ్యాతిపొందిన నర్తకీమణి జ్యోతి లక్ష్మి చెల్లెలు ఈ జయమాలిని.
ఒక పదిహేనేళ్లపాటు జయమాలిని లేకుండా చిత్రాలు ఉండేవి కావు అంటే అతిశయోక్తి కాదు. మహానటులు ఎన్‌టీఆర్, ఏఎన్నార్లతో పాటు కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ మొదలైన అగ్ర కథానాయకుల సరసన నటించిన ఈ విలక్షణ నటి ప్రేక్షకులను తన శృంగార భరిత నృత్యాలతో ఉర్రూతలూగించారు.డెబ్భై దశకం సగ భాగం నుండి ఎనభయ్యవ దశకం చివరి వరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా సినీ నృత్యసీమను ఏలిన నర్తకీమణి జయమాలిని. మంచిరూపానికి తోడుగా నిలిచింది ఆమె నాట్యకౌశలం. భరతనాట్యాన్ని అభ్యసించిన జయమాలిని చిత్రాలలో దానిని అద్భుతంగా మలచుకొని తనదైన ప్రత్యేకమైన నాట్యశైలిని ప్రదర్శించారు. మెరుపులాంటి కదలికలు, శృంగారమొలికించే హావభావాలు ఆమెకు చలనచిత్రాలలో ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిన చిత్రం జగన్మోహిని. జనాపద చిత్రాలకు పితామహుడు విఠలాచార్య జయమాలినిలోని ప్రతిభను గుర్తించి జగన్మోహిని అనే చిత్రంలో నాయిక పాత్రను ఇచ్చారు. నరసింహరాజు నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తరువాత మదనమంజరి, గంధర్వకన్య అన్న చిత్రాలు కూడా జయమాలినికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
జయమాలిని నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు - అన్నదమ్ముల సవాల్, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, అమరదీపం, యమగోల, జగన్మోహిని, డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, వినాయక విజయం, గంధర్వ కన్య, ఆటగాడు, సూపర్‌మేన్, పున్నమినాగు, గజదొంగ, బొబ్బిలిపులి, మగమహారజు, మెరుపుదాడి, స్టేట్‌రౌడీ. పేర్లు గమనిస్తే అన్నీ దాదాపు విజయాలు సాధించినవే. ఇవి కాక తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించారు జయమాలిని. మొత్తం దాదాపుగా 600 చిత్రాలలో ఇరవై ఏళ్ల సమయంలో నటించారు. అంటే ఆమె ఎంత పేరుపొందారో గమనించవచ్చు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండున్నాయి.
1. పలుచనైన,తక్కువ దుస్తులతో అంగాంగ ప్రదర్శన చేసేలా ఆ కాలానికి ఎబ్బెట్టుగా ఉండే వస్త్రధారణ చేసినా, జయమాలిని వ్యక్తిత్వం సినీప్రపంచంలో గంగాజలమంత శుద్ధమైనది అన్న పేరు వచ్చింది. అంటే, కేవలం పాత్రలవరకే ఆమె శృంగార ప్రదర్శన. దీనితో ఆమెకు నాటి మేటి నటీనటుల గౌరవం, మన్ననలు, దర్శక నిర్మాతల ఆదరణ లభించాయి. ఇది అంతా తన తల్లి క్రమశిక్షణ, ఆమె గీసిన లక్ష్మణ రేఖ పట్ల విశ్వాసం, తన మౌనంగా ఉండే వ్యక్తిత్వం వల్లనే అని ఆమె ఇటీవలి ముఖాముఖిలో చెప్పారు. ఇదే ఆమెకు విశ్వవిఖ్యాత నటులతో పాటు మళ్లీ మళ్లీ నటించే అవకాశాలను తెచ్చింది. ఎటువంటి వివాదాలూ లేకుండా తన సినీజీవితం సాగించిగలిగారు.
2. ఎంతో కష్టపడి సినిమాల్లో నటించటంతో పాటు స్టేజీ నృత్యాలు కూడా చేసి సంపాదించిన డబ్బుతో తన కుటుంబం మొత్తాన్ని పోషించారు. చెల్లెళ్లకు పెళ్లిళ్లు,అన్నదమ్ములు నిలదొక్కుకునేలా చేశారు. ఎందరో ప్రేమ అంటూ వెంటపడ్డా అది క్షణికావేశమని గ్రహించి నిలకడగా తన కుటుంబ సుస్థిరతకే ప్రాధాన్యత ఇచ్చారు. వివాహం చేసుకున్న వెంటనే జయమాలిని కుటుంబం బాధ్యతలు నిర్వర్తించటం కోసం సినీ నిష్క్రమణ చేసి పూర్తిగా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఇది ఆమె దృఢమైన, నిలకడ కలిగిన, నిర్మలమైన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా పరిణతిని సూచిస్తుంది. అందుకే ఆమె వివాదాలకు దూరంగా నిలిచారు. అంతే కాదు, తన తల్లి సహాయంతో సంపాదించిన డబ్బును జాగ్రత్తపరచుకొని జీవితాన్ని సరైన దిశలో నడిపించుకున్నారు.
ఇటీవలి ఆమె టీవీ ముఖాముఖి కార్యక్రమాలు యూట్యూబ్‌లో చూస్తే నాకు ఎంతో ముచ్చట వేసింది. రెట్టింపైన ఉత్సాహం, చక్కని అవగాహన, సకారాత్మకమైన జీవిత దృక్పథం ఆమెలో స్పష్టంగా గోచరించాయి. ఇప్పటికీ ఆమె నాట్యకౌశలం ఏ మాత్రమూ వన్నె తగ్గలేదు. ఆమెలోని ఆత్మ సౌందర్యం ఆమె ముఖంలో ఆనందంగా తాండవిస్తునే ఉంది. ఐటం డ్యాన్సర్లుగా వచ్చిన ఎందరో సినీ నర్తకీమణుల విషాద గాథలు మనకు తెలిసినవే. వీరందరికీ భిన్నంగా జయమాలిని తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ఇప్పుడు సినీజీవితంలో రెండవ అంకం ఆరంభించటానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెలోని కళాప్రతిభకు ఆ తిరుమల వేంకటేశ్వరుని అనుగ్రహం కలిగి మరోమారు ఆమె ప్రతిభ తెలుగు సినీ తెరపై వెలిగిపోవాలని ఆశిద్దాం.
Attachments area
Preview YouTube video Jayamalini Movie Journey | Jayamalini Special Interview | TV5 News

Jayamalini Movie Journey | Jayamalini Special Interview | TV5 News

No comments:

Post a Comment

Pages