స్టిక్కర్స్ నోము - అచ్చంగా తెలుగు

స్టిక్కర్స్ నోము

Share This

స్టిక్కర్స్ నోము

 

పెయ్యేటి శ్రీదేవి


          అది పరమేశ్వర నిలయం.  ఆ నిలయంలో వున్నది కూడా సాక్షాత్తు ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులే.  ఇంకా కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అతిథి అభ్యాగతులతోను, బంధుమిత్రులతోను, నిత్యం వ్రతాలు, నోములు, పూజా పునస్కారాలతొను, శుభకార్యాలతో, ఎండిపోవడమంటే తెలియని లేత మామిడాకుల తోరణాలతో, నిత్యం నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ వుంటుంది ఆ నిలయం. ఉదయాన్నే టేపురికార్డులో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఆలపించిన విష్ణుసహస్రనామం వినిపిస్తోంది.  ప్రతిరోజు ఆ యింట విష్ణుసహస్రం, లలితా సహస్రం, ఇంకా భక్తిగీతాలతో ఉదయం మొదలవుతుంది.  అది పార్వతమ్మగారు చేసిన మంచి అలవాటు.  కేబుల్ టి.వి.లు వచ్చాక ఉదయమే కోతిగంతులతో చేసే వెర్రి డాన్సులు, అసభ్యకరమైన సినిమాలు, ప్రళయభీకర గర్జనల లాంటి అదోరకమైన మ్యూజిక్కు, రిమోట్ చేతపట్టుకుని ఇలా ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు పెట్టుకునే ఆ భయంకరమైన రొద భరించలేక ఆ ధ్వని కాలుష్యాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా విష్ణుసహస్రం, లలితాసహస్రం పెట్టించి, అవి ఇంట్లో అందరికీ నేర్పిస్తోంది పార్వతమ్మగారు. ' దీర్ఘసుమంగళీభవ, పుత్రపౌత్రాభివృధ్ధిరస్తు, నిత్యసుమంగళిగా పసుపు కుంకాలతో నూరేళ్ళు వర్థిల్లు తల్లీ' అంటూ ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తున్న కొత్త పెళ్ళికూతురు కమలమ్మగారి అమ్మాయి సీతని దీవించింది పార్వతమ్మగారు. ' అమ్మాయ్ కౌసల్యా!  సీతకి బొట్టు పెట్టి చీర పెట్టమ్మా.  ఆఁ.....ఏం కమలమ్మా, పెళ్ళి బాగా జరిగిందా?  అల్లుడు, అత్తగారు అందరూ కలిసిపోయారా?  ఆఁ.......బోలెడు కట్నాలిచ్చావు.  చూడకేం చేస్తారులే.' అంది పార్వతమ్మగారు. ఇంతలో కోడలు కౌసల్య సీతకి బొట్టు పెట్టి చీర, రవికలగుడ్డ, పూలు, పళ్ళు ఇచ్చింది. ' ఇవన్నీ ఎందుకు పెద్దమ్మగారూ?  మీ విలువైన ఆశీస్సులే మాకు బహుమతులు. మీరు ఆశీర్వదిస్తే మంచిదని అమ్మాయిని తీసుకువచ్చాను.  ఇప్పటికే చాలా సాయం చేసారు.  మీ ఋణం తీర్చుకోలేను.' అంది కమలమ్మగారు. చీర పెట్టి లోపలికెళ్లబోతున్న కౌసల్యకా మాటలు వినిపించాయి.  కాని కమలమ్మగారమ్మాయి పెళ్లికి అత్తగారు సాయం చెయ్యటమేమిటో అర్థం కాలేదు.  ఆవిడ ఏం చేసినా, ఏమన్నా ఎవరూ మాట్లాడరు.  కొడుకులు గాని, కోడళ్ళు గాని, కూతుళ్ళు గాని, ఆఖరికి ఆవిడ భర్తకి గాని ఆమెని అనే ధైర్యం ఎవరికీ లేదు.  అలాని ఆవిడ దెబ్బలాడే మనిషి కాదు.  ఆవిడంటే అందరికీ ప్రేమ, భక్తి, గౌరవం, అభిమానం, అనురాగం.  ఆమె అందరికీ దేవత.  ఇంట్లోవాళ్ళకే కాదు, ఆ వూరివాళ్ళకి, బంధుమిత్రులకి, అందరికీ కూడా.  మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ స్నేహితుల దగ్గర్నించి అందరూ ఆవిడ మాట వినవలసిందే.  ఆవిడ మాట శిలాశాసనం.  అలాని ఆవిడ ఎవర్నీ భయపెట్టదు.  ఎవరి మీద కోపగించుకోదు.  తెలియకపోతే మెత్తగా మందలించి, చక్కగా తెలియ చెబుతుంది.  ఆవిడ దివ్యమంగళరూపం చూస్తేనే అందరికీ భక్తిభావం కలుగుతుంది. పార్వతమ్మగారంటే సాక్షాత్తు పార్వతీదేవి లాగే వుంటుంది.  నిండైన విగ్రహం, పచ్చని శరీరఛాయ, నుదుట పావలాకాసంత తోపురంగు కుంకుమబొట్టు, చేతులకి నిండుగా బంగారపు గాజులు, మధ్య మధ్య ఎర్రటి గాజులు, మెడలో రాళ్ళ లాకెట్టుతో వున్న అయిదు పేటల చంద్రహారం, రెండు పేటల పగడాల గొలుసు, సిగలో బంగారపు రాళ్ళ చేమంతిపువ్వు, ముక్కుకి రాళ్ళబేసరి, వెడల్పు జరీ అంచుతో ఒకరకమైన కచ్చాపోసిన చీరకట్టుతో వున్న ఆవిడ్ని ఒక్కసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.  ఒకసారి ఆత్మీయతతో ఆదరంగా పెట్టే ఆవిడ చేతి భోజనం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.  ఒక్కసారి ఆవిడతో మాట్లాడితే, ఆవిడ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. పార్వతమ్మగారికి నోములంటే సరదా.  పెళ్ళయిన స్త్రీ పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా వుండాలని కూతుళ్ళ చేత, కోడళ్ళ చేత అన్నిరకాల నోములు పట్టిస్తుంది. పెద్దకొడుకు హైదరాబాద్ లో ఇంజనీరు.  అతడికి కూతురు శిరీష, కొడుకు ఎనిమిదేళ్ళ రవి.  శిరీష తల్లి, తండ్రి దగ్గరే వుంటుంది.  రవికి చిన్నప్పట్నించీ పార్వతమ్మ దగ్గర అలవాటు.  అందుకే నానమ్మ దగ్గరే వుంటానంటూ తల్లీ తండ్రితో వెళ్ళలేదు.  తరువాత ఇద్దరు కూతుళ్ళు గుంటూరులోనే వుంటారు.  తరువాత ఇద్దరు కొడుకులు.  రెండో కొడుకు ప్లీడరు.  అతనికి ఇద్దరూ ఆడపిల్లలు.  లలిత, స్వాతి.  లలితకి పదకొండేళ్ళు.  స్వాతికి నాలుగేళ్ళు.  మూడో కొడుకు లెక్చరర్.  ఎనిమి నెలల బాబు.  రెండో కోడలు కౌసల్య.  మూడో కోడలు వాణి.  వీళ్ళందరూ వున్నవూళ్ళోనే సొంత ఇంట్లో అత్తగారు, మామగారి దగ్గర కలిసి మెలిసి వుంటారు. పెద్దకోడలు సావిత్రి చేత, ఇద్దరు కూతుళ్ళ చేత నోములన్నీ పూర్తి చేయించింది పార్వతమ్మగారు.  ఇప్పుడు మిగతా ఇద్దరు కోడళ్ళ చేత పట్టిస్తోంది.  మర్నాడు వాళ్ళిద్దరి చేత కైలాసగౌరీదేవి నోము పట్టించాలని, అందుకని ఇంట్లో హడావిడి చేస్తోంది ఆవిడ.  అసలు పండగొచ్చినా, శుభకార్యాలు వచ్చినా ఆమె చేసే హడావిడి ఇంతా అంతా కాదు.  కొడుకులతో, మనవలతో బజార్నించి అవి తెమ్మని, ఇవి తెమ్మని ఒకటే తొందర పెడుతుంది. ' ఒరేయ్ చిన్నాడా!  నాయనా బాబీ!  కొంచెం బజారుకెళ్ళి రేపు నోముకి కావల్సినవి మూడు కేజీల పసుపుకొమ్ములు, నాలుగు కేజీల కుంకుమ, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు పట్టుకురండి.  అమ్మా, కౌసల్యా!  వాణీ!  ఉదయం అయిదుగంటలకల్లా తలారా స్నానం చెసి, ఇంట్లో పూజ కానిచ్చి, ఏడుగంటలకల్లా రెడీ అయితే శివాలయంలో అందరికీ బొట్టుపెట్టి, పసుపు కుంకాలు దోసెళ్ళతో పోసి, పండు, తాంబూలం ఇవ్వాలి.  అన్నట్టు, ఇవి పంచిపెడుతున్నంత సేపూ ఎవరితోనూ మాట్లాడకూడదు, కదలకూడదు.  ఎంత?  తొమ్మిది గంటలకల్లా అయిపోతుంది.  ఇవాళ్ళే వెళ్ళి అందర్నీ నోముకి రమ్మని బొట్టు పెట్టి పిలవండి.  ఒకవేళ పిలవక పోయినా దేవాలయానికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకాలు ఇవ్వచ్చమ్మా.  దీనికి ఎవరూ తప్పు పట్టరు.  పసుపు కుంకాల కోసం ఎంత దూరమన్నా వస్తారు.  ముందర తయారయి వెళ్ళండమ్మా.  ఒరేయ్ చిన్నాడా!  మీరు మళ్ళీ ముసుగు దన్ని పడుకున్నారా?  త్వరగా వెళ్ళి కుంకుమ, పసుపుకొమ్ములు, అరటిపళ్ల గెల, తమలపాకులు, వక్కలు పట్రండి నాయనా!' ' అమ్మా!  ఈరోజన్నా కాస్త పడుకోనీయమ్మా.  ఇవాళ సెలవురోజే కదా?  కొంచం విశ్రాంతి తీసుకోనివ్వు.  అన్నిసార్లు చెప్పకు. మెల్లగా సాయంత్రం వెళ్ళి తెస్తాం.  సరేనా?  నువ్వో హైరాన పడబోక.' ' హు!  ఏమిటో, ముందర్నించీ అన్నీ తెచ్చుకుని రెడీ చేసుకోరూ?  అప్పటికప్పుడు పుట్టి పెరుగుతామంటారు.  ఇప్పుడన్నీ తెచ్చుకుని రెడీ చేసుకునుంచుకుంటే, తరవాత పని సులువవుతుంది.  నా మాట ఎవరూ వినిపించుకోరు గదా!  బధ్ధకిస్తే పన్లెలా అవుతాయి?  సుఖాలెక్కువైన కొద్దీ బధ్ధకాలు పెరిగి ఆరోగ్యాలు దెబ్బతింటాయి.  ఇప్పుడెన్నో సౌఖ్యాలుంటున్నా ఆరోగ్యాలెక్కడుంటున్నాయి?  కన్ను మూసి కన్ను తెరిచేలోగా పన్లు అయిపోవాలి.  అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి.  గ్యాసు పొయ్యిలు, కొక్కెర్లు, బట్టల మిషన్లు, పిండి రుబ్బటానికి, పచ్చళ్ళకి గ్లైండర్లు, కరెంటు చీపుళ్ళు, ఇలా ఎన్నో సౌఖ్యాలొచ్చాయి.  ఐనా ఇప్పటివాళ్ళు ముక్కుతూ మూలుగుతూనే వుంటారు.  శరీరానికి తగిన వ్యాయామం ఏదీ?  అందుకే కీళ్ళనొప్పులు వస్తాయి.  నే చేసే పన్లు ఇప్పుటివాళ్ళు చెయ్యగలరా?  ఒరే బాబూ, రవీ!  స్టేటుబ్యాంకుకి వెళ్ళి కొంచెం ఈ చెక్కు మార్చి తీసుకురా నాయనా.  సంక్రాంతి పండక్కి కోడళ్ళకి, కూతుళ్ళకి, కొడుకులకి, అల్లుళ్ళకి, మనవలకి బట్టలు కొనాలి.  ఇంకా పనివాళ్ళకీ కొనాలి.  అన్నట్లు మన ఇంటి పురోహితులు విశ్వనాథశాస్త్రి గార్ని ఒకసారి పిలుచుకురా.  ఆయనకి ఖద్దరుపంచె తీసుకోమంటారో, గ్లాస్కోపంచె తీసుకోమంటారో కనుక్కోవాలి.' ' నానమ్మా!  బ్యాంకు అనకూడదు.  స్టేట్ బేంక్ అనాలి.  కొక్కెర కాదు, కుక్కర్ అనాలి.  గ్యాసుపొయ్యి కాదు, గేస్ స్టౌ అనాలి.  గ్లైండర్ కాదు, గ్రైండర్, లేక మిక్సీ అనాలి.  కరంటు చీపురేమిటి నానమ్మా?దాన్ని వాక్యూమ్ క్లీనర్ అనాలి.'  నానమ్మ చెప్పినవాటిని సరిదిద్దాడు రవి. ' నా తండ్రే, నా నాయనే.  మీ తాతయ్యని ఎన్నిసార్లు ఇంగలీషు నేర్పమని అడిగినా చెప్పారు కాదు.  ఇంగలీషు నువ్వు నేర్పితే ఇంక మీ తాతయ్యతో ఇంగలీషులోనే మాట్లాడతాను.' ఇంగలీషు చెబుతానన్న మనవడితో మురిసిపోతూ అంది పార్వతమ్మగారు. ' నానమ్మా, ఇంగలీషు కాదు, ఇంగ్లీష్ అనాలి.' ' సరేగాని, చీకటి పడుతోంది.  మీ బాబాయిల్ని లేపరా.  కుంకం, పసుపుకొమ్ములూ తేవాలి.  ఇదివరకయితే కుంచాలు కుంచాలు పసుపులు, కుంకాలు కొట్టించేదాన్ని.  ఇప్పుడు కొట్టేవాళ్ళూ లేరు.  ఇప్ప్పుడెన్నో రకాల బొట్టుబిళ్ళలు వస్తున్నాయిగా?  అవి మొహానికి తగిలించుకుంటున్నారు.  ఏమైనా కుంకం అందం వస్తుందా?' అంటూ లోపలికెళ్ళింది. ' రవీ!  లలిత వుందా?' అంటో లోపలికి వస్తూ రవి అక్క (పార్వతమ్మగారి రెండో కొడుకు కూతురు లలిత) స్నేహితురాలు సుధ అడిగింది. ' సుధక్కా!  నానమ్మ చూస్తే తిడుతుంది.  ఇదిగో, ఎర్రతిలకం దిద్దుకో, త్వరగా.  ఆ బొట్టు బాగలేదు.' అంటూ రవి కంగారుగా తిలకం ఇవ్వబోతుంటే అంతలో పార్వతమ్మగారు రానే వచ్చింది. ' అమ్మా సుధా!  ఏమ్మా, ఇలా వచ్చావు?  రా కూచో.  మీ అమ్మ ఏంచేస్తోంది?  పనైందా?  అయ్యో!  అదేమిటే తల్లీ?  మొహాన్ని ఆ పసుపు రంగు బొట్టేమిటి?  పసుపురంగు డ్రస్సు వేసుకున్నందుకు బొట్టు కూడా మేచింగు కోసం పసుపురంగుది పెట్టుకున్నావా?  బొట్టు మేచింగ్ బాగుండదమ్మా.  బొట్టు ఫేషన్ కాదు.  మన సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించినది నుదుటబొట్టు.  మొహానికి బొట్టు అందం.  ఎన్ని నగలు దిగేసుకున్నా, ఎంత అందమైన మొహమైనా, బొట్టు లేని మొహం వెలవెలబోతుంది.  ఏ నగలూ వేసుకోకపోయినా, నుదుట బొట్టు పెట్టుకుంటే అందంగా లేని మొహం కూడా కళకళలాడిపోతుంది.  వెళ్ళు, వెళ్ళి గదిలో అద్దం దగ్గిర ఎర్రతిలకం దిద్దుకో.' ఇంతలో పసుపురంగు పంజాబీడ్రస్సులో పార్వతమ్మగారి మనవరాలు లలిత వచ్చింది. ' ఏం తల్లీ, సుధకి నువ్వు మేచింగా?  పసుపురంగు డ్రస్ వేసుకుని పసుపురంగు స్టిక్కర్ తగిలించుకున్నావు?  మీ ఫ్రెండు గొబ్బెమ్మల పేరంటానికేగా వెడుతున్నారు?  చక్కగా ఇద్దరూ పట్టుపరికిణీలు వేసుకుని జడలో, ఇదిగో, ఈ కనకాంబరాల మాలలు తురుముకుని, ఎర్రతిలకం దిద్దుకురండి.  చక్కని చుక్కల్లా వుంటారు.' అంది పార్వతమ్మగారు. క్షణంలో ఆవిడ చెప్పినట్టే తయారయి వచ్చారు. ' అద్దంలో చూసుకోండి.  కుందనబ్బొమ్మల్లా వున్నారు.  ఈరోజు అందరి కళ్ళూ మీమీదే వుంటాయి.  ఆడపిల్లలంటే అలా వుండాలి శిల్పాల్లా.  పిచ్చిడ్రస్సులు వేసుకుని వున్న అందాన్ని చెడగొట్టుకుంటున్నారు.' ' నానమ్మా!  ఎవరో సారె గావును పట్టుకువస్తున్నారు.' చెప్పాడు రవి. కొత్తకోడలు వచ్చిందని పక్కింటి శాంతమ్మగారి అమ్మాయిలు ఇద్దరూ సారె తెచ్చారు. పార్వతమ్మగారి కోడలు కౌసల్య పళ్ళెం తెచ్చింది.  చక్కిలాలు, చలివిడి, బూంది, లడ్లు, పసుపుకొమ్ములు, బొట్టు స్టిక్కర్లు పేకెట్టు పెట్టారు. పార్వతమ్మగారు అడిగింది, ' ఏమిటే అమ్మాయ్ ఈ బొట్టుబిళ్ళల పేకెట్టు?  కుంకం ఏదీ?' ' ఇప్పుడందరూ బొట్టుస్టిక్కర్ల పేకెట్లే ఇస్తున్నారు పెద్దమ్మగారూ!  ఎవరూ కుంకాలు వాడట్లేదుగా?' అంటూ శాంతమ్మగారి కూతుళ్ళు కౌసల్య నుదుట బొట్టు స్టిక్కర్ తగిలించారు.  పార్వతమ్మగారికీ పెట్టబోతుంటే, ' నాకు నుదుట ఎప్పుడూ కుంకం వుంటుంది లేమ్మా.' అంటూ పెట్టనివ్వలేదు. మనసులో ఒకరకమైన బాధతో ఆలోచిస్తూ నుంచున్న పార్వతమ్మగార్ని ' నానమ్మా!  ఏమిటి ఆలోచిస్తున్నావు?' అంటూ మనవడు రవి పిలిచేసరికి గమ్మున నోము సంగతి గుర్తుకొచ్చి, ' రవీ!  నువ్వన్నా వెళ్ళి తీసుకురా  నాయనా పసుపు, కుంకం.  భూషణం కొట్టుకి వెళ్ళి నే పంపమన్నానని చెప్పు.  వెంటనే పంపుతాడు.' అంది. ' తాతయ్య ఎప్పుడో వెళ్ళాడు నానమ్మా తేవటానికి.' అన్నాడు రవి. ' అయ్యో, తాతయ్య వెళ్ళారా?  అసలే ఆయనకి కీళ్ళనొప్పులు.  రిక్షాలోనన్నా వెళ్ళరు.  ఎంత దూరమైనా నడిచే వెళ్తారు.' ' తాతయ్య గురించి కంగారేం పడక్కర్లేదు గాని, నానమ్మా!  ఒకటడుగుతాను చెప్పు.  ఇప్పుడెన్నో సౌఖ్యాలున్నాయి.  అప్పుడివన్నీ లేవు.  నువ్వే అంటావు కదా, అప్పటికీ ఇప్పటికీ దేశం ఎంతో అభివృధ్ధి చెందింది అని?  ఇప్పుడు ఎన్నో పన్లు నిముషాల్లో మెషీన్ల సాయంతో అయిపోతున్నాయి.  మానవుడు తన మేథాశక్తితో ఎన్నో కొత్తకొత్తవి కనిపెడుతున్నాడు.  నువ్వు మెచ్చుకోవెందుకనీ?  అస్తమానూ పాతకధలు చెబుతావు?' అడిగాడు రవి. ' నాయనా రవీ!  మంచి సందేహమే వచ్చింది నీకు.  దేశం అభివృధ్ధి చెందకూడదని నేననట్లేదు.  మానవుడు కొత్తకొత్తవి కనిపెడుతూనే వుండాలి.  అందువల్లే దేశం అభివృధ్ధి చెందుతుంది.  కాని ఆ అభివృధ్ధి సక్రమమైన మార్గంలో వుండట్లేదు.  అదివరకు తీరిక చేసుకుని అందరం కలిసి సరదాగా ఎప్పుడన్నా ఒక మంచి సినిమా చూసేవాళ్ళం.  లేదా వినాయకచవితి, శ్రీరామనవమి పండగలకి పందిళ్ళలో నాటకాలకి వెళ్ళేవాళ్ళం.  ఇప్పుడా మంచి సినిమాలూ లేవు. బైట గాలికి తిరగాల్సిన పని లేకుండా ఇంట్లోనే రోజుకి ఒకేసారి నాలుగైదు సినిమాలు వస్తున్నాయి.  ఒక్కటీ సరిగా చూడరు.  ఇల్లే శ్రీరామనవమి పందిళ్ళలా తయారయింది.  టి.వి.లో విజ్ఞాన విషయాలకన్నా, పనికిమాలిన సీరియల్స్, అసభ్యకరమైన సినిమాలు, సినిమా పాటలు, ఇంకా వాటి గురించిన పోటీలు, ప్రశ్నలు - ఇలా జీవితానికి సినిమాలే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నారు అందరూ.  దానివల్ల పిల్లల చదువులు వెనకబడిపోయి, వాళ్ళ తెలివితేటలు సక్రమమైన మార్గంలో లేక, ఆలోచనాశక్తి తగ్గిపోతోంది.  దీనిని అభివృధ్ధి అనాలా?  గృహిణులు కూడా చేయవలసిన పనులు చేయకుండా ఎన్నో గంటలు ఆ టి.వి. ముందు కూచుని ఎంతో విలువైన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు.  దానికి తోడు బట్టలుతకటానికి, బూజు దులపటానికి, పచ్చళ్ళు చేయటానికి మిషన్లు, ఇలా అన్నిటికీ ఎన్నో సౌకర్యాలు వచ్చి పని భారం తగ్గటం వల్ల సోమరితనం అలవాటయి అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు.  టేబులు మీద భోజనాలు, నుంచుని వంట చేయడాలు - దీంతో నడుం వంచి చేసే పన్లు లేవు కాబట్టి ఇప్పటివాళ్ళకి నడుం వంగదు.  కాళ్ళు కదలవు.  అవయవాలకి తగిన వ్యాయామం లేక కీళ్ళనొప్పులు, ఇంకా కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.  అన్ని సౌకర్యాలూ వున్నా, ఎనిమిది వందలు, వెయ్యిరూపాయలు ఐనా సరే, ఇచ్చి మళ్ళీ పనిమనిషిని పెట్టుకుంటారు.  మరి నేను చేసే పని మీ అమ్మ, మీ పిన్నిలు చేయగలరా?' ' అవును నానమ్మా.  అందుకేనేమో వాళ్ళు ఎప్పుడూ కాళ్ళనెప్పులు అంటూంటారు.' ' అప్పుడేవో యంత్రాలు వచ్చాయిగా?  ఆమధ్య ఆడో, మగో ముందరే తెలుసుకుని ఆడపిల్లయితే పుట్టకుండానే చంపేసేవారు.ఇంకా కిడ్నీలు కూడా వాళ్ళకు తెలీకుండా దొంగతనంగా తీసేసేవారు.  పరీక్షల పేర్లతో డాక్టర్లు డబ్బు తీసుకుంటున్నారు.  అమోఘమైన మనిషి మేథాశక్తితో అలాంటి యంత్రాలు కనిపెట్టడం గొప్ప విషయమే కాని, ఆ యంత్రాలని సద్వినియోగ పరుచుకోవాలి కదా?  యంత్రాల పేరుతో అవసరం వున్నా లేకపోయినా వేలకు వేలు డబ్బు వసూలు చేస్తారు.  డబ్బు తీసుకోవడం తప్పు కాదు కాని, వైద్యం సరైన పధ్ధతిలో చెయ్యాలి కదా?  దీన్ని అభివృధ్ధి అనాలా?  అభివృధ్ధి పేరుతో దేశం కుంటినడక నడుస్తోంది. ఈనాడు అనేకరకాల ఫేషన్ల పేరుతో మన సంస్కృతి, సంప్రదాయాలని మరిచి, అసభ్యకరమైన దుస్తుల్ని వేస్తున్నారు.  అలా చేస్తే వాళ్ళు అందంగా వున్నారో, లేక వికృతంగా వున్నారో ఆలోచించట్లేదు.  అది ఫేషన్ అంటారు.  లేక నేను ఇలా చెబుతే పాతకాలం అంటారు.  అలాగే పొడవాటి జుట్టుండి, చక్కగా జడ వేసుకోవడం కూడా పాతకాలమే.  ఇప్పుడు జుట్టు విరబోసుకోవడం ఫేషన్.  దీన్ని అభివృధ్ధి అనాలా? పార్వతమ్మగారు చెప్పిన విషయాల్ని ఆశ్చర్యంగా విన్నాడు రవి. ' నానమ్మా!  నువ్వు చదువుకోకపోయినా ఎన్నో విషయాలు చాలా బాగా చెబుతున్నావు.  ఇన్ని విషయాలు ఎలా తెలుసు నానమ్మా నీకు?  ఈ విధంగా ఎప్పుడూ నేను ఆలోచించలేదు.  అసలెవరూ ఆలోచించరేమో కూడా.' ' ఏ విషయమైనా మన మెదడుతో ఆలోచిస్తే చదువుతో పనేముంటుంది నాయనా?  లోకజ్ఞానానికి చదువు కాదు ముఖ్యం, అనుభవం వుండాలి.  మన ఆలోచనా విధానమూ సక్రమమైన మార్గంలో వుండాలి.  అన్నట్లు మీ తాతయ్య ఇంకా రాలేదు.  ఎనిమిదయింది.  పసుపుకొమ్ములు, కుంకం పట్రావటానికి ఇంతసేపట్రా?  వెళ్ళి చూసిరా.'  పత్తితో వత్తులు చేస్తున్న పార్వతమ్మగారు మనవడ్ని వెళ్ళమని తొందర చేసింది. ఇంతలో పార్వతమ్మగారి భర్త రానేవచ్చారు.  రెండుచేతుల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ సంచులున్నాయి.  అరటిపళ్ళ గెల ఒక కుర్రాడు తెచ్చి లోపల పెట్టాడు.  అతనికి డబ్బులిచ్చి పంపారు. ' పసుపుకుంకాలు తేవటానికి ఇంతసేపా?  బాగా పొద్దుపోయింది.  అసలే మీ ఆరోగ్యం బాగాలేదు.  ఇంతసేపూ ఏం చేస్తున్నారు?  ఎవరో ఒకరు వెళ్ళేవారుగా?' ' సరేలే, వాళ్ళు వెడితే ఉత్తిచేతులతో తిరిగివచ్చేవారు.  మొత్తం షాపులన్నీ తిరిగాను.  కుంకం అన్న మాటే లేదు.  అందుకే మూడువందల రూపాయలు పెట్టి ఈ బొట్టుబిళ్ళలు తెచ్చాను.  ఇప్పుడందరూ వీటితోనే నోములూ, పూజలూ చేస్తున్నారట.  ఏం చేయను?  నువ్వు తిడతావని తెలుసు.  అలా బాధగా చూడకు పార్వతీ.  వచ్చేస్తుంటే అందరూ నచ్చజెప్పారు.  ఇళ్ళలోనే కాదు, గుళ్ళల్లో కూడా మొన్న దసరాపూజలూ ఈ బొట్టు స్టిక్కర్లతోనే చేసారట.  ఐనా నీకు మరీ చాదస్తమే.  ఇది అచ్చం కుంకం లాగే వుంటుంది.  మొహానికి అతికించుకోవడమే.  ఏదీ, నువ్వు పెట్టుకు చూడు, ఎంత మెరిసిపోతావో!  ఇదిగో పావలాకాసంత సైజువి తెచ్చాను నీకు.   మొహం కళగా వుంటుందని.' అంటూ నచ్చజెప్పబోయారు భర్త పరమేశంగారు. పార్వతమ్మగారు ఏం మాట్లాడకుండా మౌనంగా వుండిపోయింది. మర్నాడు పార్వతమ్మగారు నోము నోపించటానికి వెళ్లలేదు శివాలయానికి.  కోడళ్ళిద్దర్నీ ' ఆ స్టిక్కర్స్ నోమేదో మీరే చేసుకు రండి.' అంది కుంకుమ దొరకలేదన్న బాధతో. కోడళ్ళిద్దరూ శివాలయానికి వెళ్ళి స్టిక్కర్స్ తో కైలాస గౌరీదేవి నోము చేసుకున్నారు.  పసుపుకొమ్ములు, బొట్టుస్టిక్కర్ల పేకెట్టు, తాంబూలం, అరటిపళ్ళు ముత్తయిదువులకిచ్చుకున్నారు.  నోము పూర్తయ్యాక గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, పూజారిచ్చిన తీర్థం తీసుకుని, అమ్మవారికి పూజ చేసిన బొట్టుస్టిక్కర్లు నుదుట పెట్టుకున్నారు. ఇంటికె వెళ్ళేసరికి ఊర్నించి పార్వతమ్మగారి పెద్దకొడుకు, పెద్దకోడలు సావిత్రి, ఇద్దరు కూతుళ్ళు వచ్చారు.  తోటికోడలు సావిత్రి అప్పుడే స్నానం చేసొచ్చి గోడకంటించిన బొట్టుస్టిక్కర్ మొహానికతికించుకుంది.  తోటికోడల్ని ' అక్కా, బాగున్నారా?' అంటూ మిగతా ఇద్దరు కోడళ్ళూ పలకరించారు.  ఆవిడకి, ఆడపడుచులకి నోము విషయాలన్నీ చెప్పారు.  నోము ఎలా జరిగిందని పార్వతమ్మగారూ అడగలేదు.  ఆవిడకి చెప్పడానికి భయపడ్డారు కోడళ్ళు.  కుంకుమ లేని నోమూ నోమేనా అనుకుంది ఆమె. ' అత్తయ్యా!  కంచి, కాళహస్తి, శ్రీశైలం అన్నీ వెళ్ళాం.  మీరూ వస్తే బాగుండేది.  వచ్చారు కాదు.  ఇదిగో, మీకు కంచిలో ఈ చీర తీసుకున్నాం.' అంటూ అత్తగారికి చూపించింది కంచిలో కొన్న చీరని పెద్దకోడలు సావిత్రి. ' నేను ఆ పుణ్యక్షేత్రాలన్నీ అదివరకు చూసినవే కదమ్మా?  నాకూ ఒంట్లో ఓపికుండటం లేదు.  నే వస్తే ఇల్లు అస్సలు గడవదు.  వీళ్ళకీ ఏమీ తెలియదు.' అంటూ కంచి చీర మడత విప్పి చూస్తూ, ' నాకెందుకమ్మా చీరలు?  ఉన్నవే కట్టటంలేదు.' అంది. రామనీలం రంగు చీర మీద ముదురు ఎర్రంచు పెద్ద జరీ బోర్డరున్న చీర.  చీర చాలా బాగుందన్నారు అందరూ.  కూతుళ్ళిద్దరూ గుంటూరు జరీచీరలు తెచ్చారు తల్లికి. స్టోన్ వాష్ ఫేంటు, షర్టు వేసుకుని, కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, మెడ మీద జుట్టు వేలాడుతూ చేతులు కట్టుకుని, తలుపు దగ్గిర నుంచుని అదేపనిగా చూస్తున్న అబ్బాయిని చూస్తూ అడిగింది పార్వతమ్మగారు. ' ఎవరే ఈ అబ్బాయి సావిత్రీ?  మంచి ఎర్రగా బుర్రగా షోగ్గా వున్నాడు?  మీ పనికుర్రాడా, లేక ఆఫీసు కుర్రాడా?' అందరూ గొల్లున నవ్వారు. ' నానమ్మా!  శిరీషక్క, గుర్తు పట్టలేదా?  నువ్వు ఏమంటావోనని భయపడి అక్కడ నుంచుంది.' అన్నాడు రవి. ' అదేమిటే శిరీషా, ఆ వేషమేమిటే?  మగరాయుడిలా ఆ ఫేంటు, షర్టేమిటే?  మోకాళ్లవరకూ తాచుపాములా వుండే జడతో వయ్యారంగా సత్యభామలా ఎంతో అందంగా వుండేదానివి నిక్షేపంలా.  జుట్టంతా కత్తిరించేసావా?  అసలు నువ్వు మా శిరీషవేనా?  ఇది హైదరాబాదు ఫేషనా?  ఏమిటే సావిత్రీ?  చక్కని చుక్కలాంటి పిల్లని ఇలా తయారు చేసావు?  ఏరా అబ్బాయ్!  నువ్వూ మాట్లాడవు?' అంటూ పార్వతమ్మ బాధ పడింది. ' అమ్మా!  అక్కడ సిటీబస్సులు ఎక్కేటప్పుడు లంగాలు, ఓణీలు కుదరవమ్మా.  పైగా ఇప్పుడెవరూ వేసుకోవట్లేదు అవి.  పంజాబీడ్రస్సులు, ఫేంట్లు, షర్టులే వేస్తున్నారు అందరూ.  కాలేజికి వెళ్ళేటప్పుడు ఆ జుట్టంతా చిక్కు తీసుకుని జడల్లుకునేటప్పటికి సిటీబస్సు దాటిపోయి కాలేజికి లేటుగా వెళ్ళవలసి వస్తోందిట.' అన్నాడు పెద్దకొడుకు రవీంద్ర. ' పోనీలే పార్వతీ!  మన శిరీషగాడు ఇలాగూ బానే వున్నాడు.' అన్నాడు పార్వతమ్మగారి భర్త ఏ విషయంలోనూ ఆవిడ బాధపడకూడదని.  ఆమె మనసుకు నచ్చచెప్పే విధంగా మాట్లాడతారు ఆయన. ఆఖరి కోడలు వాణి భర్తని హడావిడిగా చెయ్యి పట్టుకునీ గదిలోకి లాక్కెళ్ళింది. ' ఏమండీ?  చూడండి, మీ పెద్దన్నయ్యగారు అత్తమ్మగారికి కంచినించి కంచిపట్టు చీర తెచ్చారు.  మనం ఏనాడన్నా ఆవిడకి చీర కొన్నామా?  పాపం అత్తగారే మనందరికీ బట్టలు కొంటారు పండక్కి.  మనమూ ఆవిడకి కంచిపట్టు చీర కొందామండీ.  అత్తగారు ఏమనుకుంటారు?  పెద్దకొడుకూ, పెద్దకోడలికే ఆవిడంటే ప్రేముంది అనుకోరూ/  మనమూ మన ప్రేమని నిరూపించుకోవాలంటే అర్జంటుగా డబ్బివ్వండి, కంచిపట్టు చీర కొనితెస్తాను అత్తయ్యగారికి.' అంది వాణి భర్తతో. ' మనం కంచి వెళ్లలేదు కదే?  అన్నా, వదిన కంచి వెళ్ళారు కాబట్టి తెచ్చారు.  ఇప్పుడు నువ్వెక్కడ కొంటావు?  మనమూ కంచి వెళ్ళినప్పుడు కొని మన ప్రేమను నిరూపించుకుందాంలే.' అన్నాడు వాణి భర్త. ' చాల్లేండి, తెలివి తెల్లారినట్లే వుంది.  కంచి వెడితేనే పట్టుచీర తేవాలా?  ఇక్కడా దొరుకుతాయి.  డబ్బివ్వండి.' అంటూ భర్త దగ్గర డబ్బు తీసుకుని చీర కొనడానికి బయల్దేరింది వాణి. ' పెద్దకొడుకు, కోడలుకే ప్రేమ.  మనకి ప్రేమ లేదనుకుంటారు అత్తగారు.  చూడండి.  మీ అన్నగారు ఎంత ఖరీదైన పట్టుచీర తెచ్చారో.  అత్తగారికి మనం కూడా పెట్టకపోతే ఏం బాగుంటుంది?' అంటూ రెండో కోడలు కౌసల్య కూడా భర్తని డబ్బడిగి చీరల దుకాణానికి వెళ్ళింది. పసుపురంగు మీద కుంకుమరంగు బోర్డరున్న చీర అత్తగారికి చాలా బాగుంటుంది.  ఒకసారెప్పుడో అన్నారు కూడా.  తన మొదటి పెళ్ళిరోజుకి చీర కొనుక్కోవటానికి వెడుతుంటే, ' పసుపురంగు మీద కుంకుమరంగు బోర్డరున్న చీర చాలా బాగుంటుందమ్మా, కొనుక్కో' అన్నారు.  ఆ రంగు తనకిష్టం లేక తను కొనుక్కోలేదు. ఆ విషయం గుర్తొచ్చి, అత్తగారికి పసుపురంగు మీద కుంకుమరంగు బోర్డరున్న చీర కొంది వాణి. అదే షాపుకి రెండో కోడలు కౌసల్య కూడ వెళ్ళి పసుపురంగు మీద కుంకుమరంగు బోర్డరున్న చీర ఇమ్మంది షాపతన్ని. షాపతనికి ఆ యింట్లోని వారందరూ తెలుసు.  కోడళ్ళకి అత్తగారంటే ఎంత ప్రేమో తెలుసు.  ఆ యింట్లో అందరూ ఎంత సమిష్టిగా వుంటారో అందరికీ తెలిసిన విషయమే. ' అమ్మా, ఇప్పుడే మీ తోటికోడలుగారు అదే రంగు చీర తీసికెళ్ళారమ్మా.' అన్నాడు. కౌసల్య అన్ని చీరలు చూసి కుంకుమరంగు మీద పసుపురంగు బోర్డరున్నపట్టుచీర తీసుకుంది.  కౌసల్య అక్కడినించి గాజులషాపుకెళ్ళి అత్తగారికి, ఆడపడుచులకి, తోటికోడళ్ళకి గాజులు తీసుకుంటుండగా, ఆఖరికోడలు వాణి కూడా వెండిషాపులో అత్తగారికి వెండికుంకుమ భరిణి కొని గాజులషాపుకొచ్చింది. ' ఏమిటక్కా, గాజులు కొనడానికొచ్చావా?' అడిగింది వాణి. వాణి చేతిలో చీరపాకెట్టు చూసి ' పసుపురంగు పట్టుచీర కొన్నావటగా అత్తయ్యగారికి?  నాతో చెబితే ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం కదమ్మా?' అంది కౌసల్య. ' ఏమో అక్కా, నువ్వు వస్తావో రావోనని.....' అంటూ నసిగింది వాణి. పాపం, పెళ్ళయిన కొత్తలో అడిగింది, పసుపురంగు పట్టుచీర కొనమని.   అప్పట్లో తన దగ్గర డబ్బులేక కొనలేకపోయాడు.  ఆ రోజుల్లో ఈ చీర ఏభయిరూపాయలే.  అప్పుడు ఆ రోజుల్లో ఆ ఏభయిరూపాయలు కూడా లేక చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది.  తన జీతమే ముఫ్ఫయిరూపాయలు.  ఇంటద్దె ఆరు రూపాయలు.  పనిమనిషికి నెలకి అర్థరూపాయి.  ఇలా అన్ని ఖర్చులు పోను మూడు రూపాయలు మిగిలేవి.  ఏభయిరూపాయలు పెట్టి చీర కొనడమంటే తన తాహతుకి మించినదే.  తరువాత ఆవిడా ఎప్పుడూ అడగలేదు.  తనూ ఆ చీర విషయం మర్చిపోయాడు.  ఇన్నేళ్ళకి మళ్ళీ గుర్తుకొచ్చింది.  పెద్దకొడుకు తీసుకొచ్చిన పట్టుచీర చూసి తనమీద తనకే చిరాకు కలిగింది, భార్య అడిగితే చీర కొనలేకపోయానే అని.  ఏమైనా సరే, పసుపురంగు పట్టుచీర కొనాలని అన్ని షాపులూ తిరిగాడు పార్వతమ్మ భర్త.  ఎక్కడా దొరకలేదు.  ఆఖరికి పక్కవూరికి బస్సులో వెళ్ళి తెచ్చాడు.  తన భార్య కోరుకున్న ఎర్రరంగు బోర్డరున్న పసుపురంగు చీర దొరికింది.  ఎంతో ఆనందంతో ఆ చీర ఇంటికి తీసుకొచ్చేసరికి, ఇంట్లో పెద్ద చీరల దుకాణం తయారైంది. పార్వతమ్మగారి మొహం వెయ్యి ట్యూబులైట్ల కాంతితో వెలిగిపోతోంది అందరి ఆప్యాయతలకి. ' అమ్మా!  నే తెచ్చిన చీర సంక్రాంతికి కట్టుకోమ్మా.' అన్నాడు పెద్దకొడుకు. ' మరి మేం కొన్నది ఎప్పుడు కట్టుకోవాలి?  అది కాదన్నయ్యా.  నువ్వు కొన్నది ముక్కోటేకాదశికి, నేను కొన్న చీర భోగినాడు, సంక్రాంతికి చిన్నన్నయ్య కొన్న చీర కట్టుకుంటుంది.' ' మరి నేను కొన్న చీర ఎప్పుడు కట్టుకుంటుందర్రా?' అంటూ తండ్రి తను తెచ్చిన చీర చూపించాడు. పసుపురంగు పట్టుచీర చూసి మురిసిపోయింది పార్వతమ్మగారు. ' అరె!  అచ్చం నేను కొన్న చీరలాంటిదే మామయ్యగారూ తెచ్చారు.' అంది వాణి. ' అందుకే కదా తల్లీ, నీ ధర్మమా అని ఏ షాపులోనూ ఈ చీర దొరక్క, పక్కవూరెళ్ళి తెచ్చాను.' అన్నారు మామగారు. ఇంతలో రవి గునుస్తూ వచ్చాడు.  ' చూడు నానమ్మా!  పక్కవాళ్ళింట్లో గృహప్రవేశానికి స్కూలు కూడా ఎగ్గొట్టి  వెడితే అమ్మకి బొట్టు పెట్టి, రాకరాక వచ్చావంటూ చీర, రవికలగుడ్డ పెట్టారు.  మరి నేను రాకరాకనే వచ్చాను.  నాకేమో చొక్కాగుడ్డన్నా పెట్టలేదు.  ఎందుకు నానమ్మా, ఆడవాళ్ళకయితే చీరలూ, అవీ పెట్టి పళ్ళు కూడా ఇస్తారు, మగాళ్లకయితే ఏమీ పెట్టరు?' అన్నాడు రవి. ' సరేలేవో, నువ్వూ బొట్టు పెట్టించుకుని జాకెట్టుముక్క పెట్టించుకోక పోయావా?  నువ్వేం ముత్తయిదువ్వా?' అన్నాడు ఆఖరి బాబాయ్ వాసు. ' నువ్వుండరా వాసూ!  వాడినేమనకు.  ఇలా రా నాయనా రవీ!  నే చెబుతాను.  స్త్రీ అంటే ఆదిశక్తి.  శక్తిస్వరూపిణి.  అంటే పెళ్లైన స్త్రీ పార్వతీదేవితో సమానం అన్నమాట.' ' అంటే నువ్వేకదా నానమ్మా?' అన్నాడు రవి. ' నా పేరే పార్వతిరా.  సరే, నే చెప్పేది విను.  వ్రతాలు చేస్తున్నప్పుడు పెళ్ళైన స్త్రీలకి భోజనం పెట్టి, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి జాకెట్టుముక్క గాని, చీరగాని, పళ్ళు, తాంబూలంతో బొట్టు పెట్టి ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తారు.  అక్కడ చీరకి, జాకెట్టుముక్కకి కాదు ప్రాధాన్యత.  ముత్తయిదువుకి పెట్టే బొట్టుకి ప్రాధాన్యత.  అందుకే చూడు, ఇంటికెవరన్నా స్త్రీలు వస్తే, వాళ్ళు వెళ్ళేటప్పుడు, ' ఉండమ్మా బొట్టు పెడతా' అని పండో, తాంబూలమో ఇస్తారు.  లేక ఉట్టి బొట్టన్నా పెట్టి మరీ పంపుతారు.  మరి మగవాళ్ళకి ' వుండవయ్యా, బొట్టు పెడతా.' అంటే బాగుంటుందా?  మగాళ్ళు నోములూ, వ్రతాలూ చేస్తారా?  పెళ్ళిలో మంగళసూత్రాలు మగాళ్ళు కట్టుకుంటారా?' అంటూ వివరించి చెప్పింది పార్వతమ్మగారు. ' బాబోయ్!  ఇంక చెప్పకు నానమ్మా.  ఇంకెప్పుడూ అడగను.  అర్థమైపోయింది.' అంటూ చెంపలేసుకుని వెళ్ళిపోయాడు రవి. ముక్కోటి ఏకాదశికి పెద్దకొడుకు కొన్న పట్టుచీర కొనుక్కుని, ఉదయమే ఇంట్లో పూజ పూర్తి చేసుకుని, కోడళ్లతో, కూతుళ్ళతో కలిసి గుడికి వెళ్ళి పూజ చేయించి వచ్చింది పార్వతమ్మగారు. అంతే!  కాలం స్తంభించిపోయింది!  అందరూ తెల్లబోయి చూస్తున్నారు.  గుమ్మానికి కట్టిన మామిడాకు తోరణాలు వాడిపోయాయి.  ఆ ఇంట్లో సందడిని ఎవరో లాగేసారు.  ఆ యింటి పెరట్లో చెట్లు, పూలు, మొక్కలు అన్నీ కళావిహీనంగా అయిపోయాయి! పరమేశ్వరంగారు పరిస్థితి తెలుసుకున్నా, ' పార్వతీ!  లే పార్వతీ!  నే తీసుకొచ్చిన పసుపురంగు పట్టుచీర కట్టుకోవూ?' అంటూ పట్టుచీర ఆవిడ మీద కప్పాడు. ' అత్తయ్యా!  ఈ చీరలు ఎప్పుడు కడతారత్తయ్యా?' అంటూ కోడళ్ళు, కూతుళ్ళు వాళ్ళు కొన్న చీరలు ఆవిడ మీద కప్పారు. ' నానమ్మా, నానమ్మా!  ఇదిగో ఇంగ్లీష్ పుస్తకం తెచ్చా నానమ్మా.  రా.  నీకు ఇంగ్లీష్ చెబుతాను.నువ్వింక తాతయ్యతో ఇంగ్లీష్ లో అదరగొట్టేద్దువు గాని.' అంటూ అప్పుడే ఇంగ్లీషు పుస్తకంతో హుషారుగా లోపలికొచ్చిన రవి అయోమయంగా చూస్తూ వుండిపోయాడు. ' అమ్మా!  పసుపు, కుంకం తెమ్మని ఎంతో అడిగినా తేకుండా బధ్ధకించానమ్మా.  అందుకేనా అమ్మా, స్టిక్కర్లతో రాజీ పడలేక ఎక్కడ పసుపుకుంకాలు దొరకవో అని నీతో పట్టుకెళ్ళిపోయావా అమ్మా?' పార్వతమ్మగారు లేని ఆ పరమేశ్వర నిలయంం కళావిహీనమై వెలవెలబోయింది.  ఐతే ఆవిడ ఉదారగుణం, సాటి మనిషికి సాయపడాలన్న తపన, అందరిమీద ఆవిడ చూపించిన ప్రేమానురాగాలు, అందర్నీ నవ్వుతూ ఆదరించే స్వభావం - అందరి హృదయాలలోను ఆవిడ స్థానాన్ని శాశ్వతం చేసేసాయి.  
***************************

No comments:

Post a Comment

Pages