మహిషి (మహేష్) దూకుడు - అచ్చంగా తెలుగు

మహిషి (మహేష్) దూకుడు

Share This

మహిషి (మహేష్) దూకుడు

- యనమండ్ర శ్రీనివాస్ 


“చీ పోకిరీ వెధవకానా” అంది అమ్మ రాత్రి.
“ఆరి పిడుగా నువ్వుండాల్సిన వాడివిరా” అంది పక్కింటి పిన్నిగారు పొద్దున్న.
మరేమో గోపాళం నాన్న రాత్రి బజ్జుకునేటప్పుడు నాకు కధలు చెప్తున్నాడు కదా. ఆ కధలు అయ్యిపొయ్యాక నాకు కొన్ని కొచ్చెన్స్ వేస్తానని చెప్పాడు. ఈ అవిడియా నాన్నకి పిన్నిగారి డాట్రు తమ్ముడొకాయన చెప్పాడట. కధలు చెప్పటమే కాదు. వాటిని చెప్పేటప్పుడు కొచ్చెన్స్ వేస్తే పిల్లలకి గ్నాపకం బాగా వుంటుంది అని. నాకదే ఖోపం వొచ్చేస్తుంది. కొచ్చెన్స్ పిల్లలు వేస్తే ఈ పెద్దాళ్ళు “ఛస్ వెధవకానా, నోర్మూసుకో” అంటారు. కానీ వాళ్ళు వేస్తే మనకి గ్నాపకం వుంటుందీ అంటారు.
కానీ నాన్న అంటే నాకు ఇష్టం. కధ చెప్పమంటే బాబాయిలాగా ఎప్పుడూ “అనగనగా ఒక వూళ్ళొ ఓ రాజుగారున్నారు. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులున్నారు. ఆ ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు” అని సోది కధలు చెప్పరు. ఓసారి బాబాయిని అడిగేశా. “బాబాయ్ బాబాయ్ అసలు నాకు తెలీకడుగుతాను. వేటకెళ్ళి చేప పిల్లలెట్లా తెచ్చారు రాజు గారి బచ్చాలు. వాళ్ళు కూడా నీ లాగానే కదా. నువ్వు కాలేజీకి అని చెప్పి వెళ్ళి, ఇంకెక్కడికొ వెల్తావే. అట్లా వాళ్ళు కూడ వేటకని చెప్పి ఇంకెక్కడికో వెళ్ళారు కదా” అని. అంతే. అప్పటినుండీ బాబాయి నాకు కధలు చెప్పటం మానేశాడు.
సరే. రాత్తిరి నాన్న రామాయణం కధ చెప్తూ ఒక కొచ్చెన్ వేసాడు. “దశరధ మహారాజు, రామలక్ష్మణులు పుట్టడానికి చేసిన యాగం పేరేమిటి” అని.
నాకు భలే గుర్తుందిగా. అందుకే ఠపీమని చెప్పేశా “పుత్ర యాగేష్ఠి కామం” అని.
అంతే. రామయణం కధల పుస్తకం పక్కన పెట్టి అమ్మ, నాన్నా ఒకటే నవ్వటం. అది పొద్దున్న లేచాక పిన్నిగారికి చెప్పింది అమ్మ. ఆవిడ ఆరి పిడుగా అన్నది అందుకే.
నాకయితే అర్దమే కాలేదు. సీ గాన పెసూనాంబకి కూడ. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారొ. కాకపొతె సీ గాన పెసూనాంబ అన్నది “బుడుగూ, అది “పుత్ర యాగేష్ఠి కామం” కాదు “పుత్ర కామేష్ఠి యాగం” అని. రెండింటికీ తేడా ఏంటి అంటే తనకీ తెలీదు అంది.
ఈ పెపంచకంలొ ఏది మనకీ తెలియకపోయినా వెతకాల్సిన చొటు “గూగుల్” ట. బాబాయి చెప్పాడు. అందుకే ఎప్పుడు ఏది అడిగినా బాబాయి టక్కున ఇట్టే కంప్యుటర్ లో కొట్టి సమాధానం చెప్పేస్తాడు. ఓరోజు, “బాబాయ్, ఓసారి గూగుల్ చూసి చెప్పు నా చెడ్డీ ఎక్కడ పెట్టానో” అని అడిగా. బాబాయ్ టక్కున ఓ జెల్లకాయ పీకి “అలాంటివి కాదు, నీకేదైనా విషయం తెలీక పోతే అడుగు. అది చెప్తుంది” అన్నాడు.
అందుకే ఇవాళ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు బాబాయ్ పక్కకెళ్ళి “ఓసారి గూగుల్ ఓపెన్ చెయ్యవోయి” అని అడిగా. యాగం అంటే పూజ. అమ్మ చెప్పింది. మరి కామం అంటే. గూగుల్ ని అడగాలి. బాబాయి ఓపెన్ చెయ్యగానె దాంట్లో “కామం” అని కొట్టా. అంతే. బాబాయి ఠపీమని కుర్చీమీద నుండీ పైకి ఆంజనేయస్వామి సంజీవిని కోసం ఎగురుతాడె, అట్టాగ ఎగిరి కంప్యుటర్ ప్లగ్గు లాగేసాడు. అది కాస్తా టప్పుఖున ఆగిపోయింది.
“మనం కంప్యుటర్ కాదు కానీ సినిమాకి వెళదాం పద” అన్నాడు చెమటలు తుడుచుకుంటు. “మరి నాకు పాప్ కార్న్ కొనిపెడతావా?” అన్నాను. “ఒ యెస్” అన్నాడు బాబాయి.
ఏ సినిమానొ అడగరే. మహేష్ బాబు దూకుడు. సీ గాన పెసూనాంబకి చెప్పలేదు నేను సినిమాకి వెళ్తున్నాను అని. ఎందుకొ తెలీదు. అంతే.
నాన్నని సినిమాకి వొస్తావా అంటే “నాకు మూడ్ లేదురా. మీకు చూసే మూడు వొచ్చిందిగా. మీరు వెళ్ళి రండి” అన్నారు. నేను వెంటనే వెళ్ళి నాన్నకి గాఠిగా ముద్దు పెట్టేశా. “ఎందుకురా” అన్నాడు నాన్న. “మలేమో ఆకలేస్తే అన్నం పెట్టాలి. మూడు వొస్తే ముద్దులు పెట్టాలి కదా. బాబాయి మొబైల్ ఫోనులో పాట వినలేదా” అన్నాను. బాబాయి ఘబుక్కున నా షర్ట్ కాలరెట్టుకుని పక్కకి లాగేసి బయటకి తీసుకెళ్ళాడు.
ఆ దూకుడు సినిమా ఏమిటో నాకు అస్సలు అర్దమే కాలేదు. బాబాయి మటుకు గాఠి గాఠిగా నవ్వేస్తున్నాడు. మధ్యలో బుడంకాయ్ బాలరాజు అబ్బాయి ఇంకో అబ్బాయిని అంటాడు కదా “నీ మైండు దొబ్బిందా” అని. దానికైతే బాబాయి ఎగిరి ఎగిరి నవ్వేశాడు. వెనక సీటులో ఆంటీ పక్కన అంకుల్ బాబాయిని “బాబూ కాస్త మమ్మల్ని కాస్త సినిమా చూడనివ్వవా” అని అడిగేశాడు. అంతే అప్పటినుండీ బాబాయి కాస్త నెమ్మదిగా సినిమా చూశాడు.
ఆటోలో ఇంటికొస్తుంటే అడిగా బాబాయిని “మైండు దొబ్బిందా అంటే ఏమిటి బాబాయ్” అని. బాబాయి అన్నాడు “దాని అర్దం బుర్ర పనిచెయ్యట్లేదా” అని. ఓ అదా. ఈ పెద్దాళ్ళున్నారే పెతీదానికీ రెండేసి పదాలు వాడి మనల్ని కన్ఫూజ్ చేస్తుంటారు. కన్ఫ్యూజ్ అంటే. నాకు తెలీదు. బాబాయిని ఈ సారి అడిగి చెప్తా. బాబాయి అంటుంటాడు కదా అప్పుడప్పుడు “ఈ రెండు జళ్ళ సీత యవ్వారం కన్ఫ్యూజ్ గా వుందిరా” అని.
సరే ఇంటికొచ్చాక అమ్మ అన్నం పెట్టింది కదా. గోపాళం నాన్న నన్ను పడుకోపెట్టి అయ్యప్ప కధ చెప్తా రా అన్నాడు. సరె అని మంచం మీద నాన్న పక్కన పడుకున్నా.
సరే సరే. నాన్న కధ చెప్తూ “మహిషాసురుడు బెమ్మదేవుడిని వరం అడిగాడు” అని చెప్పాడు.
“నాకు చావు వద్దు అని కదా” అన్నాను. ఈ రాచ్చచులందరూ చచ్చు దద్దమ్మలు. బెమ్మగారికోసం అన్నాళ్ళు తపస్సు చేస్తారా. చివరికి ఆయన కనపడితే “చావు వొద్దు” అని ఒక్కటే అడుగుతారు. అప్పుడు అమ్మ నాకు చెప్తుందే చ్చోటా భీం తప్ప ఇంకేదైనా ప్రోగ్రాం అడుగు పెడతా అని. అలాగ ఆ బెమ్మగారు “ఆ వరం తప్ప ఇంకేదైనా అడుగు ఇస్తాను” అంటాడు. ఆ రాచ్చచులు కన్ఫ్యూజ్ అయ్యిపోయి ఏదొ ఒక వరం అడిగేస్తారు. పప్పులొ కాలేస్తారు. బెమ్మగారు వాళ్ళకేదో ఒక వరం ఇచ్చేస్తారు. ఇంకేదో దేవుడేమో వాళ్ళని శిచ్చించేసి మనల్ని రచ్చించేశాను అంటాడు.
అసలు సంగతి ఏంటంటే, పూజ చేసేటప్పుడు ఏమీ తినక పోతే బెమ్మగారు కనిపించాక ఏమి ఆడగాలొ తెలీదు. ఈ సంగతి ఈ సారి రాచ్చసి అబ్బాయి కనిపించినప్పుడు చెప్పాలి. “ఒరే రాచ్చసుడు. రాచ్చసుడూ. భీం లాగా చక్కగా లడ్డూలు తిని పూజ చేసుకోరా. చక్కగా బెమ్మగారు కనపడగానే ‘నాకు డోరేమాన్ లాగా ఏది అనుకుంటే అది అయ్యిపోయె గాడ్జెట్ ఇవ్వు’ అని అడుగురా” అని కూడా చెప్తా.
సరే. మహిషాసురుడు బెమ్మగారు వరం ఇవ్వను అనేసరికి “సరే అయితే. మొగవాళ్ళు నన్ను చంపకూడదు” అన్నాడట. వాడికి తెలీదు. ఆడవాళ్ళే అసలు మనల్ని చంపేది అని. కావాలంటే నాన్నని అడుగు. అమ్మని “ఈ మధ్య నన్ను తెగ చంపుకు తింటున్నావే” అంటాడు. బాబాయి కూడ అంతే “ఈ సీత నన్ను చంపేస్తోందిరా ఆ ఓణీ కట్టుకుని అటు ఇటు తిరుగుతూ” అంటాడు.
కానీ దేవుడేమో మహిషాసురుడిని చంపడానికి దుర్గాదేవి వేషం వేస్కుని వచ్చేశాడు కదా. అలా వాడిని చంపేసరికి వాడి సిస్టర్ మహిషికి బోల్డు ఖోపం వొచ్చేసిందిట. ఆవిడ కూడ దేవుడికోసం అన్నం మానేసి తపస్సు చేసిందిట. దేవుడు ప్రచ్చస్యం అవగానే “నాకు చావు వొద్దు” అందిట. దేవుడు మామూలుగా “ఇంకోటి అడుగు” అన్నాడట.
ఈ రాచ్చసులందరికీ కోచింగ్ క్లాసు పెట్టాలి. ఈ కొచ్చెన్ దేవుడిని అడగొద్దు అని. సరే వెంటనే మహిషి “అయితే, నాకు శివుడికి, విష్ణువుకి పుట్టే పిల్లాడు అయితేనే నన్ను చంపేలాగా వరం కావాలీ” అందిట.
నాన్న, ఇక్కడివరకూ కధ చెప్పి “బుడుగు బుడుగు అపుడు బెమ్మగారు ఏమనుకుని ఉంటారో గెస్ చెయ్యి” అన్నాడు.
నాకు వెంఠనే గుర్తొచ్చి “దూకుడులో అబ్బాయిలాగా అనుకున్నాడు. కరెక్టేగా” అన్నాను.
“అంటే?” అన్నాడు నాన్న. ఈ నాన్న ఇంతే. సినిమాకి రమ్మంటే రాడు. మరి ఇప్పుడు నేనే చెప్పాలి కదా.
“అంటే. బెమ్మగారు ఆ కొచ్చెన్ కి మహిషి ఆన్సరు విని – ఈ రాచ్చసికి మైండ్ దొబ్బిందా – అనుకుని వుంటారు. బాయ్స్ కి గరల్స్ కి కానీ, బాయ్స్ కి బాయ్స్ కి ఎక్కడైనా పిల్లలు పుడతారా అని?”
అంతే. మళ్ళీ మామూలే.
“చీ పోకిరీ వెధవకానా” అంది అమ్మ.
“ఆరి పిడుగా నువ్వుండాల్సిన వాడివిరా” అంటుంది పొద్దున్నే పక్కింటి పిన్నిగారు.
ఇంక నేను పడుకుంటా

No comments:

Post a Comment

Pages