వెన్నెల యానం – 7 - అచ్చంగా తెలుగు

వెన్నెల యానం – 7

Share This

వెన్నెల యానం – 7

- భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్.  ఫ్రెషర్స్ పార్టీ కి వెళ్ళినప్పుడు నదిలో మునిగిపోతున్న సీనియర్లను తాను రక్షించిన వైనం చెప్తాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, తాంబూలాల వేడుక జరిగినప్పుడు   వారి పడవ గోదావరి మధ్యనున్న ఒక లంకకు చేరుకోగా, అక్కడ తమ తొలిరాత్రి మజిలీ చేస్తారు వారు. ‘శ్రీ ఎవరు అని శరత్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటుంది చంద్రిక. ఇక చదవండి...)
శరత్ తెడ్డు వేస్తుండగా, కదులుతున్న అలల్ని, ఆ అలల ఊయలలో మెరుస్తున్న లేతభానుడి కిరణాల్ని   చూస్తూ, ఇలా చెప్పసాగింది చంద్రిక.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాన్ని జీవితం అని అనరేమో ! విధి మనుషులతో, వింత నాటకం ఆడి, వారి బ్రతుకుల్ని అనుకోని మలుపులు తిప్పేసి, వినోదిస్తుంది. అటువంటి సంఘటనలే, కాలేజీ పూర్తయ్యి, ఉద్యోగం వచ్చి, నువ్వు వెళ్లిపోయాకా, నా జీవితంలో కూడా జరిగాయి శరత్.
నవంబర్ 10, కార్తీకమాసంలో బావతో నా పెళ్లి ఖాయం అయ్యింది. అమెరికాలో ఉన్న తన వ్యాపారాలు అన్నీ మూసేసి, హైదరాబాద్ కు వచ్చి, ‘స్పూర్తి ఇన్ఫోటెక్’ అనే కంపెనీని ఆరంభించే పనిలో పడ్డాడు మా బావ. మా అత్తయ్య కుటుంబంవారు అంతా శివభక్తులు. శివానుగ్రహం వల్ల అన్ని పనులూ, ప్రభుత్వ పర్మిషన్ లు పూర్తి అయ్యాయి. ఇక ప్రారంభోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. అన్నీ పూర్తయ్యాకా, వారు మ్రొక్కులు తీర్చుకోవాలని బయలుదేరుతూ, మమ్మల్ని కూడా రమ్మన్నారు. పెళ్ళికి ఇంకా నెల రోజులు కూడా లేకపోవడం, పనుల ఒత్తిడి ఎక్కువ ఉండడంతో నన్ను షాపింగ్ కోసం, బట్టలు కుట్టించుకోవడం కోసం  రాజమండ్రి లో ఉన్న మా పిన్ని ఇంట్లో దింపి వెళ్ళారు మావాళ్ళు. అత్తయ్య, మావయ్య, బావ, అమ్మా, నాన్న, మావయ్య చుట్టాలు, వాళ్ళ పిల్లలు, ఇలా మొత్తం 10 మంది కలిసి, యాత్రలకు బయలుదేరారు.
భూమిమీద విశిష్టమైనవి, శివుడికి రెండు కన్నులలాగా అత్యంతప్రీతిపాత్రమైన క్షేత్రాలు రెండు ఉన్నాయి. ఒకటి కాశి, రెండు కేదారనాథ్. పరమేశ్వరుడు సృష్టిని ఆరంభించినప్పుడు ఆయన అర్ధనారీశ్వర స్వరూపం నుంచి పురుష రూపమైన నారాయణుడు, స్త్రీ రూపమైన ప్రకృతి అవతరించాయి. సృష్టి చేసే శక్తిని సంపాదించేందుకు వారిని తపస్సు చెయ్యమని పరమశివుడు ఆదేశించాడు. కాని, ఎక్కడ చూసినా, జలమే కనిపిస్తుండడంతో సందిగ్ధంలో ఉన్న వారికోసం, శివుడు తన తేజస్సుతో ఐదు క్రోసుల విస్తీర్ణం కల ఒక పట్టణాన్ని నిర్మించాడు. అదే, కాశి. ఆపై దేవతల కోరికలను అనుసరించి, శివుడు ఆ క్షేత్రంలోనే ’విశ్వేశ్వరుడి’గా  కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం శివుడి త్రిశూలంపై ఉంటుందనీ, బ్రహ్మ సృష్టి కాదు కనుక ప్రళయంలో కూడా నశించదని, ప్రతీతి. ముందుగా మావాళ్ళు కాశి దర్శనం చేసుకుని, ఆపై కేదారనాథ్ కు బయలుదేరారు.
‘కేదారే ఉదకం పీత్వా –పునర్జన్మనవిద్యతే..’ అంటారు, అంటే నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగే కేదారనాథ్ లోని ‘రేత కుండం’ లోని నీటిని తాగినవాళ్ళకి పునర్జన్మ ఉండదు అని, కేదారఖండం అనే గ్రంధం ప్రమాణంగా చెబుతారు. హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. దేవతలకు విహారభూమిగా, మహర్షులకు తపో భూమిగా ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వతాలలోని ‘కేదార్‌నాథ్’లో శివుడు శ్రీకేదారేశ్వరుడుగా కొలువుదీరి భక్తుల ఆరాధనలందుకుంటూ వున్నాడు. పూర్వం బదరీకవనంలో నరనారాయణులు చేసిన తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు, వారి కోరికపై ఇక్కడ వెలిసాడు .సముద్ర మట్టానికి 3657 మీటర్ల ఎత్తున ఈ శివలింగం ఉంది.
కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని ‘ తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగలో’ కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ ‘ దగ్గర ‘భాగీరథి ‘లో కలుస్తున్నాయి. కాశీ నుంచి హరిద్వార్, అక్కడినుంచి ఋషికేశ్ వచ్చిన మావాళ్ళంతా ఒక సుమో ను అద్దెకు తీసుకుని, కేదారనాథ్ యాత్రకు వెళ్ళారు. దారిలో నాకు ఫోన్ చేసి, ఎలా ఉన్నానో అన్న క్షేమసమాచారం, పెళ్లి షాపింగ్ ఎంతవరకు వచ్చిందో ఆ వివరాలు, అన్నీ కనుక్కున్నారు కూడా !
కాని, వాళ్ళు కేదారనాథ్ చేరగానే వచ్చిన భయంకరమైన ఉప్పెనలోని నీటివడి వల్ల, మా కుటుంబసభ్యులు ఉన్న సుమో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. మొదట్లో ఎంతగా వెతికినా మావాళ్ళ ఆచూకీ దొరకలేదు వాళ్ళు ఎక్కడోఅక్కడ బ్రతికి ఉంటారని, తిరిగి వచ్చి ఫోన్ చేస్తారని, మొబైల్ వంకే పిచ్చి దానిలా చూస్తూ ఎదురుచుసాను. అప్పుడే నాకు తెలిసింది, మనిషికి నిజమైన బలం దేహబలం కాదు, “నా” అన్నవాళ్లు ఇచ్చే మనోబలమే అసలైన బలమని. నా ఎదురుచూపులకి ముగింపులా చివరికి, ఈ సంఘటన జరిగిన 25 రోజుల తర్వాత, మంచుకొండల్లో దూరంగా లభ్యమైన సుమో, అందులో చిక్కుకుని ఉన్న మా అమ్మా,బావల శవాలు దొరికాయి. అప్పుడే నిర్ధారణ అయ్యింది... అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.
పెళ్లి జరిగి కళకళ లాడాల్సిన ఇంట్లో, సామూహిక పిండ ప్రదానాలు జరిగాయి. ‘నా’ అనుకున్న వాళ్ళు ఎవరూ నాకు ఇక లేరు. దుఃఖం, బాధ, మనసును పిండేసే వేదన. అసలు దేవుడు ఉన్నాడా ? ఉంటే, ఇంత విలయం జరగనిచ్చే వాడా ? అంతా పోయాకా, ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ? ఒకటే అంతర్మధనం... ఈ లోపు ఆ కుటుంబానికి మిగిలిన ఒకేఒక్క వారసురాలిగా మా ఆస్తుల, పొలాల బాధ్యతలు, ఇటు మా బావ సాఫ్ట్వేర్ కంపెనీ బాధ్యతలు నామీద పడ్డాయి. ఎవరోఒకరు నిలబడకపోతే కాకుల్లా మా ఆస్తులు పొడుచుకు తినేందుకు, గద్దల్లా పీక్కుతిని ఎగారేసుకుపోయేందుకు  చాలామందే ఎదురుచూడసాగారు.
ఆ పరిస్థితుల్లో, ఎంతోమందికి ఉపాధిని కల్పించే, తన కలలకు ప్రతిరూపమైన మా బావ కంపెనీ, పరులపాలు కాకుండా, దాని బాగోగులు చూసేందుకు, తప్పనిసరై నేను కంపెనీ నిర్వాహక బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఊళ్ళో ఉన్న ఆస్తుల బాధ్యతలు అన్నీ , అక్కడే స్థిరపడ్డ మాకు వరుసకు పెదనాన్న అయినవారికి అప్పగించి హైదరాబాద్ వచ్చాను.
నా అదృష్టం, అక్కడ బావకు ప్రాణస్నేహితుడైన కిరణ్, ప్రస్తుతం కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్ ల వివరాలను ,  కంపెనీ విధానాలను గురించి తెలిపాడు. అకౌంట్స్ డిపార్టుమెంటులో ఉండే నివాస్ నాకు పెట్టుబడులు, సిబ్బంది జీతాలు, రాబడులు గురించి చెప్పేవాడు. నా దినచర్య, మీటింగ్స్, అప్పాయింట్మేంట్స్ వంటివి నా పర్సనల్ అసిస్టెంట్ అయిన మనోహర్ చూసుకునేవాడు. సిబ్బంది అంతా నాపై కల సానుభూతితో, బావపై కల అభిమానంతో శ్రద్ధగా పనిచేయసాగారు. నేను పగ్గాలు చేపట్టిన ఆరు నెలలలోనే కంపెనీ లాభాల బాట పట్టింది.
కాని, ఎంతటివారైనా, స్వార్ధం బారిన పడకుండా ఉండలేరేమో! ఒంటరి ఆడది అంటే అందరికీ లోకువే ! ఒకప్రక్క ఎంతో ఆత్మీయంగా ఉంటూ, నేను పెదవి విప్పకుండానే నా అవసరాలు కనిపెట్టుకుని, సహకరిస్తున్న కిరణ్, నివాస్, మనోహర్ ల ప్రవర్తన క్రమంగా మారసాగింది. నాకు దగ్గరయ్యి, నన్ను పెళ్లి చేసుకుంటే, తద్వారా ఈ ఆస్తుల మీద, కంపెనీ మీద ఆధిపత్యం దక్కుతుందని వాళ్ళ ప్లాన్. ఎప్పుడు అవకాశం దొరికినా అతిచనువు తీసుకునేందుకు, అతి సానుభూతి వ్యక్తపరిచేందుకు ప్రయత్నించేవారు. ఒకరితో ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉంటూ, నేను ఏ ఒక్కరితో కాస్త నవ్వుతూ మాట్లాడినా, మిగతావారు చిన్నబుచ్చుకుని, ‘వాడు మంచివాడు కాదు, వాడితో జాగ్రత్త,’ అంటూ ఒకరిపై ఒకరు ఏవేవో నూరిపోసేవారు. ఒకప్రక్క కంపెనీ పనులు, మరోప్రక్క ఊళ్ళో ఉన్న ఆస్తుల పర్యవేక్షణ, మరోప్రక్క వీళ్ళ గిల్లికజ్జాలు, వీళ్ళు వేసే ఎత్తుగడల నుంచి నన్ను నేను రక్షించుకోవడం, నాకు చాలా కష్టమైపోయేది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేదాన్ని, పైగా ఆత్మీయులు దూరమైన గాయం మనసులో ఇంకా మాయలేదాయే.
మన స్నేహితుల్లో ఎవరితోనైనా నా బాధ పంచుకుంటే, కాస్త ఊరటగా ఉంటుందని, ఒక పేస్ బుక్ ఖాతా తెరిచాను. ఎవరో ఒకరిద్దరు తప్ప, మిగతా స్నేహితులు అంతా తలోదిక్కూ అయిపోయారు. వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా, ఒకరోజు ‘శ్రీరాం’ అనే పేరున్న కొత్త వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్ ఫోటో చూస్తే, వెనక్కు తిరిగి, పార్క్ లో బెంచ్ పై కూర్చుని, చెరువులోని అలలవంక చూస్తున్న యువకుడి ఫోటో ఉంది. ఇంకే ఫోటోలు లేవు. ఆ ప్రొఫైల్ లో నన్ను ఆకర్షించిన విషయం, అతను మన కాలేజీ లోనే ఎం.సి.ఏ  చదువుకున్నట్లు ఉంది. ఎవరో మన సీనియర్ లేక జూనియర్ అయి ఉంటారులే, అన్న ధైర్యంతో ఆక్సెప్ట్ చేసాను.
మర్నాడే  ఫేస్బుక్ మెసెంజర్ లో ఒక కాల్ వచ్చింది. ఎవరో చూద్దాం అనుకుంటూ తియ్యగానే...
“ఏమే, ఒక ముద్దు పెట్టవే...” అంది అవతలి కంఠం .
నాకు షాక్... అరె, నిన్నేగా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్  చేసాను. ఇంతలోనే అంత అతివాగుడా ? అసలే చుట్టూ ఉన్న కీచకులతో చస్తుంటే, మళ్ళీ కొత్తగా వీడోకడా ? ఒళ్ళు మండిపోయింది నాకు.
“మిష్టర్, వాట్ ద హెల్... ఒళ్లెలా ఉంది ? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా ?”
“ఒళ్ళు బాలేదే బాబూ, అందుకే చేసాను. ఐ.సి.యు లో ఉన్నా. మళ్ళీ ఆ నర్స్ చూస్తే, నా ఫోన్ లాగేసుకుంటుంది. నువ్వు త్వరగా ముద్దు పెట్టావే అనుకో, నేను బ్రతుకుతా... లేకపోతే నా ప్రాణాలు నీ ప్రేమ లేక అనంత వాయువుల్లో కలిసిపోతాయ్. అన్యాయంగా ఒక మనిషిని చంపిన పాపం నీకేందుకుగాని, ప్లీసే, త్వరగా ఒక ముద్దు పెట్టు...”
“ఓయ్, చెప్తుంటే నీక్కాదూ ! ఎవరనుకుని ఎవరికి ఫోన్ చేసావో, నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా ?”
“ఆ, మతొక్కటే మిగిలింది ప్రియా ! చూడు, మొహమంతా బండేజిలు, ఆక్సిజన్ మాస్క్, చేతులు కాళ్ళు, ఆకారాలు ఉన్నాయి. ఈ ఫోటో చూడు... ఇక ఎక్కువకాలం బ్రతకను. నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఒక్క ముద్దు పెట్టేస్తే, నా ఆఖరికోరిక తీరి తృప్తిగా వెళ్ళిపోతాను, ఆలస్యం చెయ్యకు ప్లీజ్...” ఈ సందేశం వెంటనే వచ్చింది ఒక ఫోటో.
అందులో మొహమంతా బాండేజ్ లతో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఒక కుర్రాడి ఫోటో. చూడబోతే, నిజంగానే చచ్చేట్టు ఉన్నాడు. అరె, ఇదేంటి కొత్త సమస్య ? ఇప్పుడు ఏమిటీ చెయ్యడం ? నా వాళ్ళంతా చనిపోయినప్పుడు నేను పడ్డ మనోవేదన గుర్తుకు వచ్చింది. సందిగ్ధంలో పడి, ఒక్కక్షణం మౌనంగా ఉండిపోయాను.
“చంద్రా, ప్లీజ్ రా... క్విక్...” ఆత్మీయంగా పిలిచింది మళ్ళీ అతని గొంతు. కొన్నాళ్ళుగా ప్రేమగా పలకరించేవారే కరువయ్యారేమో... ఆ పిలుపు నా మనసులోతుల్ని స్ప్రుశిస్తోంది. మర్చిపోయిన మమతల్ని గుర్తుచేస్తోంది.
“అయితే ఏం చేసావ్, ముద్దు పెట్టేసావా ?” చంద్రిక చెప్పేది శ్రద్ధగా వింటున్న శరత్ ఆత్రంగా అడిగాడు.
“హమ్మో, అసూయ...” పకపకా నవ్వింది చంద్రిక. ఆమె చేదు జ్ఞాపకాల్లోంచి బయటపడి, నవ్వినందుకు లోలోపల ఆనందిస్తూ, “అసూయ స్వచ్చమైన ప్రేమకు కొలమానం అని, పెళ్ళిపుస్తకం సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పాడులే ! ఇక సస్పెన్స్ లో పెట్టక చెప్పు, ఇంతకీ ముద్దు పెట్టావా లేదా ?” పడవ తెడ్డు వెయ్యడం కూడా ఆపేసి, ఆమె మొహంలోకి వంగి చూస్తూ అడిగాడు శరత్.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages