Sunday, August 23, 2015

thumbnail

సంకల్పబలం

సంకల్పబలం 

- భావరాజు పద్మిని 


'సంకల్పబలం ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది' అంటారు పెద్దలు. మనం ఏదైనా పనిని చెయ్యాలని అనుకున్నప్పుడు అది ఎటువంటి అడ్డంకులూ లేకుండా చెయ్యాలని, బలంగా సంకల్పించాలి. మనం తలపెట్టిన కార్యాన్ని మనసా, వాచా, కర్మణా అదే పనిని తలపోస్తూ ఉండాలి. అటువంటి మనిషిలోని బలమైన సంకల్పబలం ముందు ఈ సమస్త ప్రకృతి తల ఒంచుతుంది. అడ్డంకులన్నీ సూర్యతేజస్సు ముందు మబ్బుల్లా వీడిపోయి, కార్యం సఫలం అవుతుంది.
ఓం వాజ్‌మీ మనసి ప్రతిష్ఠితా మనోవాచి ప్రతిష్ఠిత!మాలిరావీర్మ ఏధి! వేదస్య మ ఆణీస్థః! శ్రుతం మే మా ప్రహాసీర నేనాధీతే నా హోరాత్రాన్ సందధామృతం వదిష్యామి! సత్యంవదిష్యామి! తన్మామీవతు! తద్వక్తార మవతు! మామవతు వక్తార మవతు వక్తారమ్!!
పై ఋగ్వేదమంత్రం నా వాక్కు మనస్సులో ప్రతిష్ఠితం అగుగాక! మనస్సు వాక్కులో ప్రతిష్ఠితం అగుగాక! భగవంతుడు అంతరాత్మయై నాలో ప్రకాశించుగాక! నేను నేర్చుకున్నదీ, విన్నదీ నన్ను వీడకుండుగాక! నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తానుగాక! నేను సత్యాన్ని పలుకుతానుగాక! నేను పారమార్థిక సత్యాన్ని పలుకుతానుగాక! భగవంతుడు నన్నూ, అందరినీ రక్షించుగాక!
బలం అన్నది రెండు రకాలు: ఒకటి పశు బలం, రెండు సంకల్ప బలం. పశు బలం తిండితో వచ్చేది : సంకల్ప బలం జ్ఞానశుద్ధత తో వచ్చేది. పశు బలం అన్నది ఎప్పుడూ సంకల్ప బలం ముందు దిగదుడుపే..
చాలామందిలో సంకల్పబలం లేక అనుకున్నవి సాధించలేకపోతున్నారు. ఫలానా అవ్వాలని కోరుకోవటం వేరు. ఆ కోరికను సాధించేందుకు చేసే ప్రయత్నలోపమే సంకల్పబలం లేకపోవటం.వజ్రం లాంటి సంకల్ప బలం ఉంటే వారు సాధించలేనిది ఏమీ ఉండదు. కొండలనైనా పిండి చేయగలరు. మనం తీర్మానం చేసుకునేటపుడు ఆ లక్ష్యాన్ని సాధించటానికి ఆత్మశక్తి, పట్టుదల, ధ్యేయం ఉన్నపుడే ఆ సంకల్పాన్ని సాధించి లక్ష్యాన్ని చేరుకోగలం. అంతేకాని కోరిక ఉంటే సరిపోదు. ఆ కోరికకు సంకల్పం తోడైతేనే లక్ష్యాన్ని సాధించగలం.
"ప్రేమ... డబ్బు... ఙ్ఞానం.. చదువు... దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం." - స్వామి వివేకానంద
అవరోధాలను అవలీలగా అధిగమించగలిగే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ, అంతర్‌దృష్టి కోల్పోయినప్పుడు అతడు గుడ్డివాడై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు మనసులోని కోరికలు వాస్తవ రూపాన్ని దాల్చడానికి సంకల్పబలం అవససరం. ఈ సంకల్పం అనేవి ఎంత బలంగా వుంటే అంతే వేగంగా కోరికలు కార్యరూపం దాల్చుతాయి. సంకల్పం బలహీనమైతే కోరికలు ఎట్టి పరిస్థితులలో నెరవేరవు. ఎవరైతే పవిత్రమైన మనసుతో ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటారో, అట్టివారు తక్షణమే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు.
సత్‌సంకల్పంవల్ల సత్ఫలితాలే కలుగుతాయి. అందుకు మన పురాణాలలో కోకొల్లలుగా కథలు కనిపిస్తాయ. పురాణాలలో కొన్ని పాత్రలు సంకల్పానికి ఉన్న బలమేంటో మనకు తెలీయజేస్తున్నాయి.
సగరుల శాపవిమోచనం కోసం భగీరధుడు కఠోర తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి గంగను భూమి మీదకు పంపవలసిందిగా ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ కరుణించి గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని, ఆ శక్తి ఒక్క శివునికే ఉందని చెప్పాడు. దాంతో భగీరధుడు శివుని గూర్చి ఘోరతపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై అతని కోర్కెను తీర్చడానికి అంగీకరించడమే కాక, గంగను తన తలమీదనే ఉంచుకుంటానని చెప్పాడు. అయితే, గంగ అహంకారంతో శివుడి తలనే వంచానని విర్రవీగింది. గంగ అహాన్ని గమనించిన శివుడు ఆమెను ఏకంగా తన జటాజూటంలో బంధించాడు. మార్గంతరం లేని భగీరధుడు మరలా తపమాచరించి గంగను క్షమించి, భూమిపైకి పంపమని శివ మహారాజును కోరగా, అందుకు ఆయన అంగీకరించి గంగను భూమిమీదకు పంపాడు. భగీరధుడు గంగా ప్రవాహాన్ని ఎంతగా క్రమబద్ధం చేస్తున్న ప్పటికీ, అత్యుత్సాహంతో గంగ మహర్షి జాహ్నవి హోమాన్ని చిందరవందర చేసింది. దానికి ఆగ్రహించిన ఆయన గంగను ఔపాసన పట్టడంతో భగీరధుని సమస్య మరలా మొదటి కొచ్చింది. పట్టువీడని భగీరధుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. అందుకు జాహ్నవి అంగీకరించి ఆమెను విడవడంతో తన పూర్వీకుల భస్మాలపై గంగను ప్రవహింపజేసి, వారికి ముక్తి కలిగించాడు! ఈ విధంగా అకుంఠిత దీక్షకు మారుపేరుగా భగీరధుడు నిలిచాడు. లక్ష్య సాధనకు కృషి అంటే అదన్నమాట!
ఇవేకాక ఏకలవ్యుడు, హనుమంతుడు, భీష్ముడు, విశ్వామిత్రుడు, ధృవుడు వంటివారి గాధలు చదివితే, పట్టువదలని బలమైన సంకల్పబలమే వారిని లక్ష్యం దిశగా నడిపించి, అనుకున్నది సాధించేలా చేసిందని, మనం తెలుసుకోవచ్చు.
లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో, సంకల్పబలంతో అడుగు ముందుకు వేయాలి. అసాధ్యాలను సుసాధ్యం చేసే అటువంటి సంకల్పబలాన్ని మనలో పెంపొందించుకుందాము. విజయ సోపానాలను అధిరోహిద్దాము!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information