కిన్నెర - అచ్చంగా తెలుగు

కిన్నెర

Share This

కిన్నెర 

 డా II వి . బి . కాశ్యప .జె


జనవరి 30, మధ్యాహ్నం 1...
'' 'ఈ సముద్రం చూసినప్పుడొక గతంగుర్తుకు వస్తుంటుంది. విచిత్రం ఏంటంటే... ఆ గతం నాదికాదు. కానీ, చాలా అందంగా ఉంటుంది...ప్రతిసారీ కన్నీళ్ళే తెప్పిస్తుంటుంది. అందులో ఈ సముద్రమంత బాధ ఉంది. ఇంకొక నేనే ఆ బాధ అనుభవిస్తున్నట్టు ఉంటుంది...' నా క్లాస్రూం... మొదటి వరుస కిటికీ ప్రక్కకుర్చీలో  కూర్చున్నఅమ్మాయి చెప్తున్నది ఇదంతా..." నల్లని పొడవైన కురులు, అందంగా, సన్నగా, గోధుమరంగు కళ్ళతో... తను వెనుదిరిగి ఉన్నా, ఆ కళ్ళ రంగు తెలుస్తున్నది నాకు.ముఖం కడుక్కునే  సమయానికి, ఆ కలలో నాకు గుర్తుఉన్నది ఇంతవరకే. కలలింతే అనుకొని ఊరుకొలెకపోతున్నా.నాకు స్పృహ వచ్చిన దగ్గరనుండి ప్రతిరోజూ వస్తోందిది...
క్లాస్ లో డయాస్ పై అడుగు పెడుతుంటే, కుడి చివరి మూడు ప్రక్కటెముకలు కొద్దిగా నొప్పి పుట్టాయి. ఇంకా గాయాలు పూర్తిగా తగ్గలేదు. క్లాసంతా లేచి నుంచొన్నారు. నా దృష్టి అంతా ఆ మొదటి వరుస, చివరి కుర్చీ మీదే ఉంది. ఎప్పటిలానే అది ఖాళీగా ఉంది. క్లాస్ సరిగా చెప్పలేకపోయాను, ఆ నొప్పితో.., ఆ ఆలొచనలతో... అరగంట తర్వాత హాజరు తీసుకొని అందరిని వదిలేశాను. అందరూ గదిలో నుంచి వెళ్ళాక, క్లాస్ రెప్రజెంటేటివ్ పార్థు మాత్రం మిగిలాడు.
''సార్! మీ రిబ్స్ పెయిన్ ఇంకా  తగ్గినట్లు లేదు. కుడి చేతిని ఎక్కువ అబ్డక్ట్(పైకెత్తలేక) చెయ్యలేకపొతున్నారు. టేక్ సమ్ రెస్ట్.'' సానుభూతిగా చెప్పాడు.
''దట్ విల్ బి బెటర్...'' అన్నాను కానీ, చూపులు మాత్రం ఆ కుర్చీ మీదనే ఉన్నాయి. అది గమనించిన పార్థు, ''సార్... మీరు అడగమన్నట్టు అందరిని కనుక్కున్నాను. సర్ప్రైజింగ్లి, ఆ కుర్చీ మేము కాలేజీలో చేరిన దగ్గరి నుండి ఖాళీగానే ఉండేదిట. ఎందుకనేది మాత్రం ఇంకా విచిత్రంగనే ఉంది. పీపుల్ ఆర్ జస్ట్ నాట్ యుస్డ్ టు సిట్ దేర్...'' నవ్వేసి, ''మంచి వ్యూ...'' భుజాలెగరేసి వెళ్ళిపొయాడు.
సముద్రం హోరు వినపడుతోంది. చూపు రిజిస్టర్ మీదకు మళ్ళించాను. ఒకటి... రెండు... మూడు... అన్ని పేర్లు వరుసగా ఉన్నాయి. పదహారు, పదిహేడు మధ్య మాత్రం ఒక ఖాళీ... అలా ఎందుకు రాసి ఉంటానో, అర్ధం కావడం లేదు. వెనుక పేజీలు తిప్పినప్పుడు కూడా, ఆ ఖాళీ అలానే ఉంది ప్రతినెలా... సంవత్సరం మొదటి నుంచీ...
మొబైల్ లో అలారం మోగినప్పుడు ఈ లోకంలోకి వచ్చాను. గంట నుంచి ఆ రిజిస్టర్ తో అలానే కూర్చుని ఉన్నాను. అపాయింట్ మెంట్ సమయం అయ్యింది . కాలేజి నుంచి హాస్పిటల్ వైపు నడక సాగించాను.
''హలో డాక్టర్! ఎలా ఉన్నారు? మీ కోసమే వెయిట్ చేస్తున్నా... " నవ్వుతూ  నన్నాహ్వానించాడు డా|| కిషోర్. ప్రక్కనే ఉన్న డా|| మురళీ కూడా నవ్వుతూ విష్ చేశారు. నేను వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.
''రిపీట్ సి.టి, ఎమ్మారై, ఎక్స్-రే రిపోర్ట్ లు వచ్చేసాయి. నో ఆబ్వియస్ ఫ్రాక్చర్స్ టు వర్రీ, ఆ నొప్పులు ఉన్నాయి అంటే... మస్ట్ బి మస్క్యులర్ పెయిన్." రిపోర్ట్ లు బల్ల మీద పెడుతూ చెప్పాడు కిషోర్. నేను మౌనంగా తలూపాను. "న్యూరో రిపోర్ట్ ఈజ్ గుడ్...'' నా తర్వాతి ప్రశ్నను ఊహించాడు.
"ఆర్ యు ఆల్ రైట్!" మురళీ కొంచెం అనుమానంగా అడిగాడు. "కలలు వస్తున్నాయి... మురళీ. యాక్సిడెంట్.., క్లాస్ రూం.., సముద్రం.., ఇలా ఏవేవో...'' గడ్డం కింద చేయి పెట్టి మొటికలు విరుస్తూ చెప్పాను. ఒళ్ళంతా నొప్పులుగానే ఉంది.
"పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ అయ్యిండొచ్చు. మీరు చాలా  పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ... క్యాజువాలిటీకి మిమ్మల్ని తీసుకొచ్చే సరికే మైకం లో... ఐ మీన్ డెలీరియమ్ లో ఉన్నారు. మీతో పాటు ప్రయాణిస్తున్న అమ్మాయి ఎలా ఉందని అడిగారు చాలా సేపు. నిజానికి ఆ కార్ లో మీరొక్కరే ఉన్నారు." కిషోర్ సాలోచనగా చెప్పాడు.
"అలా అన్నానా..?" హఠాత్తుగా లేచి నిలబడి అడిగాను. ఆ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు నా ప్రతిచర్యకు. వెంటనే సర్డుకున్నాను. కూర్చొని మెల్లిగా అడిగాను, "కిషోర్... ఆ రోజు ఏమైందో సరిగా, పూర్తిగా చెప్తారా..? ఇది ఎప్పటి నుంచో అడుగుదామని అనుకుంటున్నాను."
గట్టిగా నిట్టూర్చి, గోడ గడియారం వైపు చూసాడు కిషోర్. పది నిమిషాల తక్కువ అయిదు గంటలవుతోంది. డ్యూటీ ఇంకా ఐపోలేదు కానీ ఈ సమయంలో అప్పాయింట్ మెంట్ లు ఉండవు. ఐదు గంటల కల్లా హాస్పిటల్, కాలేజి ఐపోతాయి. ''జనవరి 10, ఆరోజు దాదాపు ఆరు గంటల సమయంలో హాస్పిటల్ నుంచి నా క్వార్టర్స్ కి కాల్ వచ్చింది.'' గుర్తు చెసుకుంటూ చెప్పసాగాడు.
''ఎమర్జన్సీ అనీ, అది కూడా మీరని... నేను ఆఘమేఘాల మీద వచ్చానిక్కడికి. అప్పటికే మీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి. సెన్సరీ, మోటార్ ఎక్జామినేషన్ నార్మల్ గానే ఉంది. ఎక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేదు. కుడి వైపు చివరి రిబ్స్ నాలుగు బ్రేక్ అయ్యాయి, డయాఫ్రమ్ ఇంజ్యురీ కుడా లేదు. కాకపొతే సెరిబ్రల్ కాంకషన్ లో ఉన్నారు, ఇంట్రా సెరిబ్రల్ బ్లీడింగ్ కూడా లేదు. ఎగ్జామినేషన్ జరుగుతున్నంత సేపు చాలా ఆదుర్దాగా అందరిని, మీతో పాటు ఉన్న అమ్మాయి గురించే అడుగుతున్నారు. ఎన్నిసార్లు అక్కడ ఎవరు లేరనీ, మీరొక్కరే కారులో ఉన్నారని చెప్పినా వినకపోయే సరికి, మత్తులోకి పంపాము. మరుసటి రోజు మామూలుగానే ప్రవర్తించారు. చాలా నెమ్మదిగా, ఏమి మాట్లాడకుండా పరీక్షలన్నిటికీ సహకరించారు. నిజానికి ఆ రోజు మిమ్మల్ని వార్డ్ కి షిఫ్ట్ చేద్దామనే అనుకున్నాము.
హఠాత్తుగా.., రాత్రి పదకొండు గంటల సమయం లో మీరు కోమాలోకి వెళ్ళడం జరిగింది. క్లినికల్, ల్యాబ్ అండ్ రేడియోలాజికల్ ఎక్జామినేషన్స్ కి అందనట్లు పది రోజులు కోమాలో ఉండి, తర్వాత బయటకు వచ్చారు. సారీ టు సే దిస్... అందుకు కారణాలేమిటనేది ఇప్పటి వరకూ కనుక్కోలేకపోయాను. నేను ఎన్నో జర్నల్స్ రిఫర్ చేసాను, ఎక్స్ పర్ట్ ఒపీనియన్ కుడా తీస్కున్నాను.
ఇప్పుడు కుడా మీ కేస్ గురించే మురళీతో చర్చిస్తున్నాను.'' కిషోర్ గొంతులో పశ్చాత్తాపం వినపడింది. ఒక పేరున్న డాక్టర్ కి వ్యాధి నివారణ చేయలేకపోయినా బాధ కలగదు కానీ, వ్యాధి నిర్ధారణ కాకపోతేనే ఎంతో బాధగా ఉంటుంది. తన మీద తనకే నమ్మకం పోతుంది. నాకు తెలుసది. నేనూ ప్రయత్నించాను, నా రిపోర్ట్ ల సహాయంతో దాని కారణం కనుక్కుందామని. పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాసేపటి తర్వాత సెలవు తీసుకున్నాను.
*****
డెస్క్ టాప్ ఆన్ చేశాను, ఇంటికొచ్చాక. ఏదో వెలితి, డెస్క్ టాప్ బ్యాక్  గ్రౌండ్ ఖాళీగా ఉంది. అలా ఉంచడం నాకు అలవాటు లేదు. కాఫీ తాగని నా ఇంట్లో కాఫీ మేకర్ ఏం చేస్తుంది? మెయిల్ చెక్ చేసుకొని చాలా రోజులు అయింది. ఓపెన్ చెయ్యగానే ఫెయిల్యుర్ నోటిసులు కనపడ్డాయి. అందులో 'టు' అడ్రస్ లేదు, మెయిల్ బాడీ లేదు. ఉత్త ఫెయిల్యుర్ నోటీసులు అంతే. కానీ చాలా. డ్రాఫ్ట్ లో మాత్రం ఒక ఆడియో ఫైల్ కనిపించింది. అది ఎప్పుడు చేసానో అని డేట్ చూడగానే ఆశ్చర్యమేసింది.
జనవరి 11, రాత్రి 9...
ఆ రోజునే నేను కోమాలోకి వెళ్ళింది, రెండు గంటల తర్వాత. హడావుడిగా ఓపెన్ చేసి వినసాగాను. మొత్తం 50ని. ల ఆడియో..,
"బీప్... బీప్...
ఈ పేరంటే, చాలా ఇష్టం నాకు. ఎందుకూ అంటే ఏమని చెప్పాలి! తను బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, బెస్ట్ డాక్టర్ కూడా కాదు. ఒక ఫెయిల్యూర్. మొదటి రోజు తనని క్లాస్ లో చూసినప్పుడు... అసలు ఈ అమ్మాయి మెడికోనేనా అని అనుమానం వచ్చింది. నన్ను చూసి లేవలేదు. కిటికీ ప్రక్కన సీటులో కూర్చుని... సముద్రాన్ని చూస్తూ, తెల్లగా... కాదు... పాలిపోయి, కళ్ళు గుంటలు పడి, సన్నగా, నిర్జీవమైన కళ్ళతో.
చూడగానే డ్రగ్ ఎడిక్ట్ అని అర్ధం అయిపోయింది. క్లాస్ చెప్తున్నపుడు తన ముంజేతి మీద చూసాను... ఇంజక్షన్ గుర్తులు, కనీసం రెండేళ్ళ నుండి డ్రగ్స్ వాడుతూ ఉండొచ్చు. నేను క్లినికల్ మెడిసిన్ తీసుకున్నా, ప్రాక్టీసు పెట్టుకోకుండా సీనియర్ రెసిడెంట్ గా క్లాసులకి రావడానికి కారణం, టీచింగ్ మీదున్న గౌరవం. మా ప్రొఫెసర్ల నుండి నేర్చుకున్నదే ఇదంతా, ఒక విద్యార్ధి వ్యక్తిత్వం అన్నిటికన్నా ప్రధానం. ఆ అమ్మాయిని మార్చాలనిపించింది.
ప్రతిరోజూ తనని గమనించే వాడిని. క్లాస్ లో ప్రశ్నలన్నీ తననే అడిగేవాడిని. రోజూ ఎక్కువ సేపు డ్యూటీ చేయించే వాడిని. తన పరీక్షలలో మార్క్ ల గురించి క్లాస్ తీసుకునేవాడిని. ఇదేం హైస్కూల్ కాదు కదా! సరాసరి తనని పిలిచి చేస్తున్న పనుల గురించి అడగటానికి. అందుకే వేరేవిధంగా తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాడిని. ఏదో ఒక రోజు నన్ను నిలదీస్తుందని, అప్పుడు నిజం మాట్లాడగలనని ఆశ. క్లాస్ లో చాలా మంది నా గురించి మాట్లాడుకోవడం తెలిసినా పట్టించుకోలేదు.
కానీ... ఒక్కసారి కూడా తన ముఖంలో అసహనం కనపడలేదు. కనీసం నా మీద కించిత్తు కోపం కూడా కనపడలేదు. తనని ఎవరన్నా కదిలిస్తే కానీ మాట్లాడదు. పేషెంట్స్ దగ్గర సరిగా ఎక్షామినేషన్ చేయలేకపోయినా, వాళ్ళ బాధలన్నీ వింటుంది... బలహీనంగానైనా నవ్వుతుంది. తన చుట్టూ ఒక ఆనందకరమయిన వాతావరణం ఉంటుంది. తను నచ్చని వాళ్ళని పట్టించుకోదు. ఇదంతా గమనించాక తనని మార్చాలన్న ఆలోచన కోరికగా మారింది. అప్పుడప్పుడు తను అలా  జీవితం నాశనం చేసుకోవాలి అని రాసి ఉందేమో అనిపించేది.
ఒక రోజు క్వార్టర్స్ బాల్కనీలో సేద తీరుతుండగా, క్వార్టర్స్ వెనుక కాంపౌండ్ వాల్ మీదుగా ఒక ప్యాకెట్ తనకి ఇస్తున్న ముసలాయన కనపడ్డాడు. అలా జరగడం అది మొదటి సారి కాదు. ప్రతి శనివారం ఇది జరుగుతుంది. ఇది మూడో వారం, అవే డ్రగ్స్ అయ్యుండొచ్చన్న ఆలోచన మొదలైంది మనసులో. తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికిదే మంచి సమయం అనిపించింది. వేగంగా నా గది నుంచి కదిలాను. నేను కిందకి వెళ్ళేదాకా తను అక్కడే ఉంటుందో లేదో తెలియదు. అయినా సరే... అనుకుంటూ వేగం పెంచాను. నేనక్కడికి చేరే సరికి పరిస్థితి పూర్తిగా మారి ఉంది.
ఇద్దరు హౌస్ సర్జన్స్ తన చేయి పట్టుకుని ఉన్నారు. ఒక్క క్షణం లో ఏం జరిగి ఉండొచ్చన్న ఊహ కళ్ళముందు కదిలింది. పరిస్థితిని అవకాశంగా మలచుకుందామనుకుంటున్నారు... తెల్లకోటు వేసుకున్న పశువులు. తను మాత్రం ప్రతిఘటించడం లేదు. అది గమనించి గొంతు సవరించుకున్నాను. వారిద్దరూ నన్ను చూసి చేయి వదిలారు. అక్కడ నుండి గొణుక్కుంటూ వెళ్ళిపోయారు. తను మాత్రం నిర్లిప్తంగా గడ్డిలో పడిన ప్యాకెట్ ను చేతిలోకి తీస్కుంది.
మెడిసిన్ చదివిన వాళ్లతో ఒక ఉపయోగం ఏంటంటే, పరిస్థితిని చాలా వరకు తేలికగా అర్ధం చేసుకోగలరు. ఒక్కోసారి వివరించాల్సినంత అవసరం కూడా ఉండదు. ఆ హౌస్ సర్జన్లకు నేను ఏం చెయ్యగలనో తెలుసు. వాళ్ళ మక్కెలిరగ తన్నడం గురించి  ఆలోచించనక్కర లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిస్తే, నేను లెక్కలోకి కూడా రాను.
కానీ వాళ్ళు భయపడింది, నా చేతిలో ఉన్న ఎక్స్ టెన్షన్  అనే ఆయుధం గురించి వాళ్ళ హౌస్ సర్జన్ పీరియడ్ ని 3 నెలల వరకూ పెంచగలను, అలా చేస్తే చాలు వచ్చే సంII వాళ్లకి పోస్ట్  గ్రాడ్యుయోషన్ ఎక్జామ్ రాసే వెసలుబాటు ఉండదు.
నన్ను దాటి వెళ్ళబోతున్న తనని పిలిచి, నా రూం కి రమ్మన్నాను. ఒక్కక్షణం నన్ను తదేకంగా చూసి, చిన్న వ్యంగమైన నవ్వుతో నా రూం వైపు కదిలింది, అదంతా కొత్త కాదన్నట్టు. బహుశా, ఆ నిమిషం తనకి మరొక పశువు కనిపించి ఉండొచ్చు నాలో. నవ్వొచ్చింది నాకు. రూం లోకి వెళ్ళాక, సరాసరి నా మంచం మీద కూర్చుంది కొంచెం వెనక్కి వాలుతూ, తర్వాతేంటి అని ప్రశ్నిస్తున్నట్లుగా, ఇందాకటిలా నవ్వు రాలేదు. "సిట్ ఇన్ ద చైర్" అరిచాను. ఉలిక్కి పడి లేచి కుర్చీలో కూర్చుంది.
''ఎందుకిలా చేస్తున్నావ్? నీ ఆరోగ్యం గురించి కానీ, నీ తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించవా?" అరుపులాంటి గొంతుతో. పట్టనట్టు గోడలకేసి చూసింది. తన చేతిలో ప్యాకెట్ లాక్కుని గోడకి విసిరికొట్టాను. లోపల ఉన్న సీసా పగిలి పోయిన శబ్దం... దానితో పాటు కొంత దూరం చెల్లాచెదురుగా పడిన తెల్లటి పొడి, తన ముఖం లో కోపాన్ని కొనుక్కొచ్చాయి.
విసురుగా లేచి తూలి కింద పడిపోయింది, పాక్కుంటూ ఆ ప్యాకెట్ వైపు వెళ్ళసాగింది. పక్కనే ఉన్న గాజు జగ్ తీసుకుని అదే గోడకు విసిరికొట్టాను. భళ్ళున పగిలి ఆ నీరంతా ఆ పొడి మీద పడింది, గాజు పగిలిన శబ్దానికి ఒక్క క్షణం మ్రాన్పడిపోయిన తను, ఆ నీటిలో కరిగిపోతున్నపొడిని చూసి పిచ్చిదానిలా కదిలింది, పగిలిన గాజు ముక్కలు గుచ్చుకుంటున్నా లెక్క చేయక.
కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. నీటిలో కరిగిన పొడి చేతికి చిక్కక పోతుంటే, కళ్ళ వెంట నీళ్ళు రావడం మొదలైంది. ఆదుర్దాగా ఆ నీటిలో చేతులు ముంచి కరిగిన పొడిని ఆపే విఫలయత్నం చేస్తోంది. తన గాయాల రక్తం కూడా కలిసి ఆ ప్రదేశం అంతా బీభత్సమైంది. ఇంకో పెద్ద గిన్నెతో వెళ్లి నీటిని తన మీద కుమ్మరించాను. నేనెందుకు అలా  ప్రవర్తిస్తున్నానో నాకే అర్ధం కాలేదు. ఇద్దరం స్తంభించిపోయాము, కొన్ని నిమిషాల పాటు.
ముందు తేరుకున్న తను పెద్దగా అరుస్తూ లేచి నా కాలర్ పట్టుకుంది. గుండెల్లో బాధ నోటికడ్డం పడుతుంటే మాటలు రాక, అలా అని అక్కడితో ఆగని వేదన కనుకొనల నుంచి జాలు వారుతుండగా, మౌనంగానే ఎన్నో ప్రశ్నలు సంధించింది. కాసేపు అలా ఊగిపోయి తర్వాత నన్ను వదిలి వెళ్లి మంచం మీద పడిపోయింది . ఇప్పుడామె ముఖం దీనంగా ఉంది శూన్యం లో దేన్నో వెతుకుతూ. కళ్ళ నుంచి కారుతున్న నీటిని పట్టించుకోకుండా, నొట్లో గొణుక్కుంటుంది.
అలమరా నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి తన దగ్గరికి వెళ్లి, చేతులకు పట్టిన గాయాలు తుడుస్తూ, ''నేను మెడిసిన్ చదివేప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట... ఈ ప్రపంచం లో మనం నిలబడాలంటే తల ఎత్తడం, కోపగించుకోవడం లాంటివి మర్చిపోవాలి, అని. అది తూ.చా.తప్పకుండా పాటించాను కాబట్టే ఎన్నో సంవత్సరాల నుండి నవ్వుతూ పని చేసుకోగలిగాను. ఇంతకాలం దాచుకున్న క్రోధం అంతా ఒక్క క్షణంలో బద్దలైంది నీ ముందు. ఎందుకో నాకు తెలియదు. నీకు నేను చెప్పే మాటలు రుచించక పోవచ్చు. ఎందుకంటే మన మద్య అయిదు సంవత్సరాల వయసు తేడానే ఉంది. నిన్ను ఇలా చూడడం నాకు నచ్చడం లేదు.'' అని ఆగాను. ఆ మాటలకు అర్ధం లేదు.
''నేనెలా ఉంటానో, మీకు తెలియదు'' శూన్యంలోంచి మాట కలిపింది.
''ఊహించగలను. ప్రతి మనిషికి బాధలుంటాయి, కానీ వాటినుంచి...''
''మీరనుకునే లాంటి బాధలేం లేవు నాకు. ఇలా అవ్వడం చాలా క్యాజువల్ గా జరిగింది'' నిర్లిప్తత అంటే ఏంటో తన మాటల్లో మాత్రమే తెలుస్తుందనుకుంటా.
''మరి ఎందుకిలా..?'' నా గొంతు లో బాధ వినిపించిందా! ఆశ్చర్యమేసింది.
''ఏమో, నా కలా రాసి ఉందేమో..''
''నేను మార్చగలను ఆ రాతని...'' నాకే విచిత్రంగా తోచేలా మాట్లాడుతున్నానిపుడు.
''మీకు ప్రేమంటే తెలుసా..?'' ఆ కళ్ళు శూన్యం నుంచి నా వైపు మరలాయి. ఉలిక్కిపడ్డాను, 'తను నా కన్సర్న్ ని ప్రేమనుకుంటుందా?'
''ఇది ప్రేమని మాత్రం అనుకోకండి. నా మీద జాలి పడుతున్నారంతే'' తిరిగి శూన్యం లోకి చూస్తూ చెప్పింది, నా కళ్ళలో తనకి  కావలసిందేదో కనపడలేదన్నట్టుగా.
"ఎవరు చెప్పారు, ప్రేమని. నా స్టూడెంట్ మీద ఉన్న బాధ్యత అది. నీ స్టానంలో ఎవరున్నా..."
"కాదు... నా స్థానంలో మరో అబ్బాయి ఉంటే చేయ్యరీ పని..." మళ్లీ నిర్లిప్తత. తడబడ్డాను, "నా మీద జాలి చూపడం నాకు నచ్చదు. ఈ రోజు రాత్రికి నాకా అమృతం కావాలి లేకపోతే నాకు పిచ్చిపడుతుంది. నేను బయట కెళ్ళాలి.." లేవబోయింది . తన భుజం మీద చెయ్యేసి ఆపేశాను.
"నీ మీద నాకున్నది ప్రేమ కాదు, జాలి కాదు. నిజంగానే బాధ్యత." చాల స్పష్టంగా చెప్పాను. తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అబద్దం అంత గట్టిగా చెప్పగలనా నేను! పది నిమిషాల తర్వాత ఆ గదిలోనే తనకి  ట్రీట్మెంట్ మొదలెట్టాను. తను ఒక్క మాట కుడా ఎదురు చెప్పలేదు. రెండు వారాలు గడిచాయి.
ఇప్పుడా కళ్ళలో జీవం తొణికిసలాడుతుంది. తన బుగ్గలు తళుక్కుమంటున్నాయి. మూడు కిలోలు బరువు పెరిగింది. నాలో డాక్టర్ సంతృప్తి పడ్డాడు. ప్రతిరోజూ కాలేజి అయిపోయ్యాక ఎక్కువ సమయం నా గదిలోనే గడిపేది. తనకి నవ్వడం తెలుసు... చాలా అందంగా నవ్వడం. ఆ డ్రగ్స్ స్థానం లో బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంది. నాకు కాఫీ తాగే అలవాటు లేదు కాబట్టి తయారు చేయడం రాదు. అందుకే... కాఫీ మేకర్ తో ప్రత్యక్షం అయిందొక రోజు.
తనని చూస్తుంటే విధి అనేది ఏం చెయ్యగలదు అనేది ఆశ్చర్యంగా తోస్తుంది. తను చాలా బాగా పాటలు పాడుతుంది. ఆ కంఠ స్వరంలో అమృతం ఉంది, నిజంగా. తనిప్పుడు నాకొక ఫ్రెండ్. క్లాస్ అయ్యాక తన ప్రక్క కుర్చీలో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. తను కాలేజీలో చేరిన దగ్గర నుండి అక్కడే కూర్చునేది.
"ఈ సముద్రం చూస్తుంటే గతం గుర్తొస్తుంది. అందమైన గతం... కానీ అది నాది కాదు" అనేది. తనని వెనక నుంచి చూడటం ఒక అనుభూతి... అదీ... సూర్యుడు అస్తమించేపుడు.
మరో రెండు నెలలు... తను ఇంతకు ముందు 'బీప్...' కాదు. రోజూ హాస్పిటల్ వర్కర్స్ తో కాఫీ తాగుతూ బాతాఖానీ వేస్తుంది. ఎప్పుడన్నా తను రావడం ఆలస్యమైతే వాళ్లు కాఫీ తీసి పక్కన ఉంచేంత దగ్గర ఐపోయింది. లాన్ లో పావురాల మధ్య తనూ కలిసిపోతుంది. 'ఆ' అలవాటు నుంచి బయటపడినా, ప్రతి శనివారం ఒక పాకెట్ గోడమీదుగా తన చేతికి వస్తుంది. ఆ తెచ్చిన ముసలాయానికి డబ్బులిచ్చి, ఆ పొట్లం చించి కాలవలో పారబోస్తుంది. ఎందుకని అడిగితే, "ఆ తెచ్చే తాతకి ఇదెంటో తెలియదు. నాకోసం బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. ఎవరికి తెలియకుండా తెచ్చిస్తాడు. నాకవసరమైన మందనుకుంటాడు. ఇపుడు నన్ను చూసి ఆ మందు పనిచేస్తున్నందుకు ఆనందపడతున్నాడు. ఈ పని ఆయన బ్రతుకు తెరువు. ఊరికే డబ్బులిస్తే తీసుకోడు'' అని నవ్వేస్తుంది.
 ఒకరోజు నా కొత్తకారు బయటకు తీస్తుంటే, వెనక నుంచి తన పిలుపు. 'నేను రావడానికి  లేటవుతుందన్నా, అసలే ఘాట్ రోడ్... నాకు డ్రైవింగ్ కొంచెం కొత్త' అన్నా వినకుండా నా ప్రక్క సీటులో కూర్చుంది. బండి మొదలైనదగ్గర నుంచి పిచ్చిపిచ్చిగా ఏదో మాట్లాడుతోంది. అనుమానంగా అనిపించింది, మళ్లీ డ్రగ్స్ తీస్కుందేమో అని. ఆ అనుమానం పటాపంచలవడానికి ఎంతోసేపు పట్టలేదు. 'నన్ను పెళ్ళిచేసుకుంటారా..?' ఈ మాట తన నుంచి వినగానే స్థాణువైపోయి తనవైపు తిరిగాను. తను నవ్వుతోంది.
మళ్లీ స్టీరింగ్ వైపు తిరగగానే, నాకు కనిపించింది ఎదురుగా వస్తున్న మరో కారు దాన్ని తప్పించబోయి కుడివైపుకి తిప్పాను, కారు అదుపు తప్పి, వేగంగా ఎదురుగా ఉన్న చెట్టు వైపు దూసుకుపోసాగింది. ఇలానే వెళితే తను ఉన్న వైపున, చెట్టుకి గుద్దుకుపోవడం ఖాయం. అలా అని తనని తప్పిస్తే ప్రక్కనే ఉన్న లోయలోకి పడడం ఖాయం. ఇద్దరం చనిపోవడం తధ్యం. మిగిలిన ఒకే ఒక్క అవకాశం చెట్టు నావైపు వచ్చేలా చేయడం.
స్టీరింగ్ ని బలంగా ఎడమవైపు తిప్పబోయాను. నా చేయి కదలలేదు. స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుంది. నాకు అర్ధమైనదంతా, తనకీ అర్ధమైందనుకుంటాను, అందుకే అడ్డుకుంటుంది. నా బలమంతా వాడే లోపే, ఎడమచేతి వైపు కారు చెట్టును గుద్దుకుంది. స్టీరింగ్ నా  ప్రక్కటెముకలని  విరిచింది కుడివైపు, నేను ఎడమవైపు తిరిగి తనని చూస్తుండడంతో. తన తల, ఎడమచేయి, కుడిచేయి వరకే విడిగా ఉన్నాయి. మిగతా భాగం అంతా నలిగిన కారు భాగంలో ఉండిపోయింది. తన నోటి నుండి రక్తం వస్తోంది. ఏదో మాట్లాడుతోంది. నాకేం వినపడడం లేదు. మెల్లిగా నా కళ్ళు  మూసుకుంటుండగా, ఒక పెద్ద వెలుగు కనిపించింది తన స్థానంలో.
ఈ రోజు ఉదయం నేను ఐసియూలో తెలివిలోకి వచ్చాక, అందరూ తను కారులో లేనట్టే ప్రవర్తిసున్నారు. తనకేదో అయిందని, అందుకే నాకు నిజం చెప్పడం లేదనిపించింది. త్వరగా ఈ పరీక్షాలన్నీఅయిపోతే తనని చూడొచ్చని మౌనంగా అన్ని పరీక్షలకి సహకరించాను, మనసులో రోదిస్తూ. అవన్నీ పూర్తయ్యాక, మధ్యాహ్నం కళ్ళు మూసుకొన్నాను.
సాయంత్రం సూర్యుడస్తమించే వేళ కళ్ళు తెరిచాను. ఎదురుగా ఉన్న పెద్ద కిటికీలోనుంచి అంతులేని సముద్రంలోకి దూకుతున్న భానుడు, నాకెంతో పరిచయం ఉన్న ఒక నీడ కనిపించాయి. కళ్ళు నులుముకున్నాను.
తను..,
వెనక్కి తిరిగి నన్ను చూసి అందంగా నవ్వింది. ''నిద్రలేచారా... ఇంకా ఎంతసేపు వెయిట్ చెయ్యాలో అనుకున్నా..!'' తన వంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు, కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాను. ''నేనడిగిన దానికి నిన్న సమాధానం చెప్పలేదు మీరు'' నడుస్తూ వచ్చి నా బెడ్ మీద కూర్చుని నా చేయి తన చేతిలోకి తీస్కుంది.
''నా గురించి చనిపోవడానికి కూడా వెనకాడలేదు. ఇపుడు చెప్పండి ఇది జాలితోనా, బాధ్యత తోనా చేసింది.'' తను మెరుస్తోంది నాతో మాట్లాడుతుంటే.
''నాది కాని ఆ గతం నాకు గుర్తొచ్చింది నిన్న. కిన్నెరలంటే తెలుసా మీకు? తమ అందానికి ఎప్పుడూ పొంగిపోతూ ఉంటారు. మహా గర్విష్ఠులు. వాళ్ళ గర్వం పూర్తిగా హద్దులు దాటినపుడు వాళ్ళు మానవ జన్మ ఎత్తుతారు. అతి హేయమైన జీవితం గడుపుతారు. అలా ఒక సారి కాదు, వారి గర్వమణిగే దాకా మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటారు. ఆ అంతులేని చక్రం లోంచి వాళ్ళని కాపాడగలిగేది ఏమిటో తెలుసా..?" ఇంకా నాచేయి పట్టుకునే శూన్యం లోకి చూస్తూ మాట్లాడుతోంది, కాళ్లూపుతూ.
తను చాలా ప్రశాంతంగా ఉంది. నాకెందుకో ఆశ్చర్యం కలగడం లేదు. "త్యాగం... తమ కోసం బ్రతకడం కన్నా, ఇతరుల కోసం మరణించడంలోని ఉదాత్తత తెలుసుకున్నప్పుడు వాళ్ళకు విముక్తి కలుగుతుంది. నిన్న మీకోసం మరణించినపుడా విషయం అర్ధమైంది." ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. "కానీ.., త్యాగం అంటే సరైన అర్ధం తెలుసా... స్వార్ధానికి పరాకాష్ట. ప్రాణత్యాగం అనేది రాక్షస చర్య. తనకి నచ్చిన వ్యక్తి కోసమో, నచ్చని విషయం కోసమో దేవుడిచ్చిన ప్రాణాలు వదిలి, అర్ధాంతరంగా బంధ విముక్తలవడం స్వార్ధమే కదా...'' ఇపుడు తన కన్నీళ్ళు మెరుస్తున్నాయి.
"అందుకే ఇది శాప విముక్తి కాదు. అన్నిటికన్నా పెద్ద శాపం. మీ మీద ప్రేమ ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది. కానీ, మీకు నేను గుర్తుండను. అసలు నేననే వ్యక్తినే ఉనికి లోనే ఉండను. చివరిసారిగా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. జాగ్రత్తగా నిద్రపొండి.'' నా చేతిని ముద్దాడుతూ కరిగిపోయింది, కళ్ళ ముందే మాయమైపోయింది. నాకేం మాట్లాడే అవకాశం రాలేదు. జీవితం అంతా ఇంత హఠాత్తుగా కదులుతోందా? నా చుట్టూ ఉన్న వాళ్ళంతా 'తను తెలియదు' అనడం అబద్దం కాదా? నేను కూడా మార్చిపోతానా తనని? తనకి నా ప్రేమ తెలియజేయలేదింకా. ఏం చేయాలో పాలుపోవడం లేదు, మగతగా ఉంది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. నా మొబైల్ చేతిలో అందుకుని ఆడియో రికార్డ్ చేస్తున్నాను..." ఆడియో ఆగిపోయింది.
నా కంట్లోంచి నీళ్ళు ధారాపాతంగా కారసాగాయి. ఆ ఆడియో ఫైల్ ని చూశాను. 25 ని.లు గా ఉందిపుడు. అంటే... అంటే... ఇదంతా కూడా క్రమంగా కరిగిపోతోంది ఈ లోకం నుంచి. ఆ " బీప్ " లు వచ్చిన చోట బహుశా తన పేరు ఉండి ఉండాలి. ఒక్కొక్కటిగా అన్నీ అర్ధం అవుతున్నాయి. ప్రపంచం అంతా తన అస్తిత్వం మర్చిపోయింది. కానీ తన ఉనికిని పూర్తిగా కాదు. క్లాస్ లో కుర్చీ ఖాళీగా ఉండడం. ఇప్పటికీ ప్రతి శనివారం నేను చూసే ముసలతను. ప్రతి సాయంత్రం లాన్ లో ఒక చోటుకి చేరే పావురాలు. ప్రపంచం తనని ఇంకా గుర్తుంచుకుంది. నేను తనని పూర్తిగా మర్చిపోవడానికే కోమాలోకి వెళ్ళి ఉంటాను. తల పట్టుకున్నాను. నొప్పిగా ఉంది. ఇంత తెలిసినా తన గురించి తను గుర్తుకు రావడం లేదు. కేవలం ఆ నల్లని కురులు, ఎత్తుగా సన్నగా ఉండి మెరుస్తున్న ఆ నీలికళ్ళు తప్ప... 'ఆగు .. నీలికళ్ళా ...?' ఇవి అసలు తనవేనా..? సరిగా గుర్తు రావడం లేదు. చెమటలు పడుతున్నాయి. ఏడవాలని ఉంది.
* * *
కాలం కరిగిపోతోంది. ప్రతి రోజూ క్లాస్ లకి వెళ్తున్నాను. ఈ నెల రిజిష్టర్ లో పదహారుకి, పదిహేడుకి మధ్య ఖాళీ వదలలేదు. ఇప్పుడా కాఫీ గ్లాసు తనకోసం ఎదురుచూడడం లేదు. ప్రతి శనివారం ఆ ముసలాయన కనపడడం లేదు. పావురాలు అసలు లాన్లోకి రావడం లేదు. ఒక రోజు ఉదయం నిద్రలేచే సరికి కాఫీ మేకర్ మాయమైంది. ఆడియో ఫైల్ ఎంత వెతికినా కనపడటం లేదు. క్లాస్ అయ్యాక ప్రతిరోజూ ఆ కిటికీ పక్కన కుర్చీలో కూర్చుని సముద్రం చూస్తూ  గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కాని అది నా గతం కాదేమో!
ఒక రోజూ ఆ కిటికీ పక్కన కుర్చీలో ఎవరో అబ్బాయి కూర్చున్నాడు. ఇప్పుడు తన కురుల రంగు కూడా గుర్తుకు రావడం లేదు. నాకు గుర్తున్న కొంచెం గతాన్ని రోజంతా నెమరు వేసుకుంటున్నాను. తనని మరచిపోవాలని లేదు.
ప్రతి రాత్రి నిద్రపోయేముందు ఒకే ఆలోచన... "ఈ రోజు రాత్రికి ఏం మర్చిపోతానో..!"
                                                                                                                        

No comments:

Post a Comment

Pages