చిత్రకళా సామ్రాట్ ‘బాలి’ గారు - అచ్చంగా తెలుగు

చిత్రకళా సామ్రాట్ ‘బాలి’ గారు

Share This

చిత్రకళా సామ్రాట్ ‘బాలి’ గారు 

(ముఖాముఖి ముఖచిత్రం వేసినవారు : ఆర్టిస్ట్ పుక్కళ్ళ రామకృష్ణ గారు )

భావరాజు పద్మిని

 చందమామ లాంటి చూడచక్కని ముఖాలు, తెలుగుదనాన్ని ప్రతిబింబించే నేపధ్యాలు.  చూడగానే ‘ఆహా’ అనిపించేలా బొమ్మలు గీస్తూ, స్నేహభావంతో ఎంతో మంది చిత్రకారులకి ఆదర్శంగా నిలిచిన విలక్షణ చిత్రకారులు ‘బాలి’ గారితో ముఖాముఖి, ఈ నెల ‘తెలుగు బొమ్మ’ లో ప్రత్యేకించి మీ కోసం.
మీ స్వగ్రామం, బాల్యం గురించిన వివరాలు చెప్పండి.
నా పేరు మేడిశెట్టి శంకరరావు. పెన్ నేమ్ – బాలి. ఇది నాకు అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం గారు పెట్టిన పేరు. నేను పుట్టింది  అనకాపల్లి దగ్గరున్న ఓ పల్లెటూరులో, మా పెద్దమ్మగారి ఇంటిలో. చదువుతూ కూడా చదువు డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను.
గవర్నమెంట్ సర్వీస్ కమీషన్ ప్యాసయి, PWDలో చిన్న గుమాస్తాగా చేరాను. దగ్గర దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాను – మొత్తం నాకు వచ్చిన లంచం ఈ 7 సంవత్సరాలలో 50 రూపాయలు ఉండవచ్చు.
చిత్రకళ పట్ల చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం ఉండేదా ?
చిత్రకళను ఎలా అభ్యసించానో తెలియదు. అదీ నేను ఒకేసారి పుట్టాము. నా
నాలుగోఏటనే రంగురంగు పెన్సిళ్ళతో గులాబి పూలను గీసేవాడిని. అవి మామూలు గీతలు. దేవతల బొమ్మలను చక్కగా వేసే పెదపాటి వెంకటరత్నం గారివద్ద మెళకువలు నేర్చుకున్నాను. అప్పటిలో మా నాన్నగారు మిలటిరీలో ఉండేవారు – 2వ ప్రపంచయుద్ధం ముగిసింది. మా నాన్నగారు నీలగిరి (ఉదకమండలం ) వచ్చారు. అక్కడ ఆర్మీ హౌస్ లో ఉండేవారం. మీరు చిత్రకారుడిగా ఎదిగానంటున్నారు.నేను ఎదిగానో లేదో తెలియదు.
ఆర్ట్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. వచ్చాను కాబట్టి
గవర్నమెంట్ ఉద్యోగం మానేశాను,కాబట్టి శ్రమ తీసుకొనే నాకు ఇష్టమైన ఈ పని శ్రమ అనుకోకుండా పనిచేస్తూ, ఎవన్నా ఆటంకాలు ఎదురైతే నాకూ మంచిరోజులు రాకపోవన్న ధైర్యంతో ముందుకు నడిచేవాణ్ణి. అందువల్లే నేను కార్డున్లు గీయడం, ఇలష్ట్రేషన్లుగీయడంలో ( కలాలు,బ్రష్ లు ఉపయోగించడంలో) బాగా ప్రాక్టీస్ చేశాను,వేయగలుగుతున్నాను.
కధలకు బొమ్మలు యెంత అవసరం అని మీరు భావిస్తారు ?
కథలకు బొమ్మలు ఉండటం, పేపర్లో కార్టూన్లు ఉండడం తప్పనిసరి.ఎన్నో రసాల మేళవింపు అయితే కాని పత్రికకు అందం రాదు. పాఠకుల అభిరుచి అనేక విధాలు.అందువల్ల అలా పత్రికను తీర్చి దిద్దాలి. ఇక నా విషయానికి వస్తే బొమ్మను అందంగా కనపడేలా చేయడం నా బాధ్యత. Stale అయిపోకుండా నాకు నేను రకరకాల నంబరు బ్రష్ లు, కలాల్లో రకరకాలవి వాడుతూ, రంగుల్లో అలాగే అద్దుతూ వేస్తాను.ఆ పేపర్ వాడు నా బొమ్మకు ఎంత space ఇస్తాడో గమనిస్తూ బొమ్మగీస్తాను. కథ back ground పల్లెటూరులో నడుస్తుందా, పట్నంలో నడుస్తుందా ఇవన్నీ చూడాలి.
కథ బాగుండవచ్చు, రచయిత ఏదో చెపుతాడు. నీనింక కథను చదివించేటట్టు చేయాలి, కాబట్టి కొంచెం మసాలాను అద్దుతాను.
మీరు ఏ సమయంలో బొమ్మలు గీస్తారు ?
నా అలవాటు ఏమిటంటే రాత్రిపూట బొమ్మలు గీయను. రంగులు అసలు వేయను – కథలు చదువుతాను – కథ జరుగుతున్న ప్రదేశం,  ప్రాంతాల
ఆహార్యం,వయస్సు, కథ పక్కన పెన్సిల్ తో మార్కు చేసుకుంటాను. ఆ తరువాత రోజు వేసుకుంటాను బొమ్మను. అది అవసరమైతే అరగంట నుండి గంట పట్టవచ్చు – సాధారణంగా అరగంటలో అయిపోతాయి. చక్కటి విషయము ఏమిటంటే కథ బాగుంటే – ఆ కథనే చక్కని బొమ్మని వేయించుకుంటుంది. 80 % నచ్చు కథకే కదా!
బొమ్మలు వెయ్యటంలో మీరు పాటించే పద్ధతులు ఏమిటి ?
ఇందులో నా ప్రణాళిక, సిద్ధాంతాలూ వంటివేం లేవు – ఇజాలు (కమ్యూనిజం, సోషలిజం వంటివి అసలే) లేవు- మానవత్వమే ముఖ్యం –  ఎర్రపతాకంగాళ్లు ఇలాంటివి సృష్టించి శ్రమైకజీవి అంటూ కొంతమందిని చూపుతూ మరికొంతమందిని బూర్జువాగాళ్లు వైట్ కాలర్ ఉద్యోగి అంటారు. అది తప్పు – కష్టపడితేగానీ ఏదీ దక్కదు. రచయిత గొప్పసందేశాన్ని ఇవ్వడు, ఇచ్చాడే అనుకుందాం పాఠకుడి చేత ఆమోదింపచేయాలిగా! అందువల్ల పాఠకుడికే అర్ధమయ్యేట్టు బొమ్మగీస్తే చాలు అని నా అభిప్రాయం.
మన భారతపతాకం గొప్ప జాతీయపతాకంగా , గొప్ప సందేశాన్ని అందించవచ్చు – అది ఎంతమందికి తెలుస్తోంది. ఆ రంగులు ఏమిటి? ఆ ధర్మచక్రం ఏమిటి? అని ఇంట్రస్ట్ ఉన్నా మహా గొప్పవాడిని అడిగి తెలుసుకుంటాడు.ఆ గొప్పవాడికే తెలియకపోతే అంతే! స్వతంత్రదినం నాడు మోయడం ఆ తరువాత పక్కన పడేయడం- ఎన్నిసార్లు చూడలేదు.
మీరు వేసినవాటిలో మీకు బాగా నచ్చిన బొమ్మ ఏది ?
నేను వేసే ప్రతిబొమ్మ చాలా ఇంట్రెస్ట్ తోనే గీస్తాను – అంటే ప్రతిబొమ్మ ఇష్టమయినదే – అంత కష్టపడివేసినదీ లేదు – కష్టపడుతున్నా ఆ కష్టం తెలియదు ఇంట్రస్ట్ ముందు. అయితే అవతలివ్యక్తి టైము ఇవ్వకపోతే, ఆ తరువాత ఆ బొమ్మ ప్రింట్ లో చూసుకున్నపుడు కొంచెం టైము తీసుకోవలసింది – తొందరపడ్డాను, అని అనిపిస్తుంది.
మీరు కంప్యూటర్ ను ఉపయోగించి బొమ్మలు వేస్తారా ?
నేను బొమ్మలు (ఇల్లేస్త్రేషన్స్ ) వేసేరోజుల్లో ఆఫ్ సెట్ లేదు – ఆఫ్ సెట్ అప్పుడే కొత్తగా వస్తోంది. అది ఖర్చుతో కూడిన వ్యవహారమని, సాంకేతిక నిపుణులు దొరకరని విన్నాను – అందువల్ల అప్పటిలో కొన్ని పత్రికలూ – కొన్ని సెంటర్ పేజీలు  మాత్రం గొప్పగా ఆఫ్ సెట్ లో (black & white)వేసి, అదేదో గొప్పగా ప్రకటించుకునేవి.
అప్పటికి విస్తృతంగా వుండేది కంపోజింగ్ , అక్షరాలు కంపోజ్ చేసుకోవడం, బొమ్మలు బ్లాక్ లు చేసుకోవడం అంతే! ఇంకు సరిగ్గా ఈ అక్షరాలు, బొమ్మల మీద స్ప్రెడ్ కాకపొతే అంతే సంగతులు, ఎంతమంచి బొమ్మన్నా పోతుంది, అక్షరాలు కనబడవు.
నేను ఆంధ్రజ్యోతిలో చేరినపుడు ఇదే అవస్థ. అయితే ఆంధ్రపత్రిక మద్రాసు నుండి వస్తున్న రోజుల్లో బ్లాక్ మేకింగ్ లో నయినా రెండు రంగుల్లో బొమ్మలు అచ్చువేసేది. అంటే సర్క్యులేషన్ ఎక్కువ – దానికి టెక్నిషియన్స్ ఉన్నారన్నమాట. అయితే అది విజయవాడ(shift) వచ్చిన తరువాత ఇదే గతిలో నడిచింది – నేను ఆంధ్రజ్యోతిలో(weekly) జాయినయినపుడు నా బొమ్మలు తేలిపోతున్నాయనిపించి కొంచెం నల్ల ఇంకుతో back ground వేస్తూ – డెప్త్ లు ఇచ్చేవాడ్ని. దానివల్ల బొమ్మతోపాటు పేజీ కూడా అందంగా కనపడేది. ఇంక కంపెనీ వారయితే రెండు పెద్ద డబ్బాలలో ప్రతినెలా ఇంకు వాడితే: ఈ నెల రెండున్నర డబ్బాలు కొనవలసి వచ్చిందట – చివరకు ప్రెస్ టెక్నిషియన్స్ నా వల్ల అలా జగుతోందని మేనేజ్మెంట్ కు విన్నవించారు – ఆ మేనేజ్మెంట్ వారు మా ఎడిటర్ పురాణంగారి ద్వారా – నాకు మెమో ఇప్పించారు – నేను ఇంకు ఎక్కువగా తాగుతున్నానని- అయినా నేను వదల్లేదు. ఇంకా అందంగా, నల్లగా మంచిగా షేడ్స్ కడుతూ బొమ్మలు వేసేవాడిని – బొమ్మలు, అక్షరాలు హాయిగా వచ్చేవి. ఇంకా ఆఫ్ సెట్ లు మార్కెట్ కి విరివిగా రావడంతో బొమ్మల్లో సన్నని గీతలు, అందంగా రంగులు, వాటిల్లో డెప్త్ రావడం మొదలెట్టాయి- నా ఆనందానికి లోటు లేదు  - ఓ 5 సంవత్సరాలు బ్రష్ లూ, కలాలతో ప్రయోగాలు చేస్తూ ఆడుకున్నాను.
ఇప్పటివరకూ మీ ప్రస్థానం మీకు తృప్తిని ఇచ్చిందా ?
నాకు ఈ చిత్రకళ గొప్ప తృప్తిని ఇచ్చిందనే చెప్పాలి – మానసికంగా, శారీరకంగా హాయిగా ఉన్నాను. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారన్నట్టు కళలు – “యోగాభ్యాసాలు” – అందులో లీనమయిపోతే – ప్రపంచం కనపడదు. మనసు హాయిగా ఉంటుంది. అదే నాకు జరిగింది – నాకు తలనొప్పిలాంటిది వచ్చి 25 సంవత్సరాలయ్యింది. జ్వరం అసలే రాదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే, కొంచెం దూరం నడిస్తే అదీ పోతుంది. అయితే మా ఆవిడని గవర్నమెంట్ ఉద్యోగం వదులుకున్నపుడు –అమ్మో అని భయపెట్టలేదు – “నా మీద నమ్మకం!" కొంతమంది ఇది ప్రయివేట్ జాబ్ అని భయపెట్టారు, గానీ నేను నా ఆత్మవిశ్వాసం మీదే ముందడుగు వేశాను. cover designs బాపుగారి కన్నా నేనే ఎక్కువ వేసి ఉంటాను.
ఆంధ్రజ్యోతి వారు ఇచ్చిన జీతం మా ఆవిడకు ఇచ్చేసి, ప్రయివేట్ వర్క్ చేసిన డబ్బులతో నా ఖర్చులు చేసేవాడిని – నా డబ్బులతోనే నేను వైజాగ్ లో ఇల్లు కొనుక్కుంటే – ఆమె డబ్బులు ఇంటి ఖర్చులకు గాను పోను, మిగిలిన వాటితో చాల బంగారం కొంది. ఆమెకు కావలసిన నగలు సంవత్సరానికి ఒకటి తప్పనిసరిగా చేయించుకునేది. ఇది గొప్పా అంటే చెప్పలేను కాని – చక్కటి తృప్తి అని చెప్తాను!!
ఇక నేను సాధించవలసినవి లేవు – బొమ్మలు హాయిగా వేసుకుంటాను, తీరిగ్గా హాయిగా పాడుకుంటాను. గొప్ప గాయకుడని కాదు కానీ, నా గొంతులో హాయిగా పలికే గమకాలూ ఉన్నాయి చాలు.
మీకు రావలసినంత గుర్తింపు వచ్చిందా ?
నాకు రావలసినంత గుర్తింపు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆంధ్రజ్యోతిలో
ఉన్నపుడు చాల సీరియళ్లకు బొమ్మలు వేసేటపుడు – శ్రీ శర్మగారు “ఫలానా సీరియల్ వస్తోంది బాపు బొమ్మలతో” అని ప్రకటనలతో ఊదరగోట్టేవాడు- బాపుగారి నుండి 1 లేదా 2 వచ్చేవి – ఆయన సినిమాల్లో చాలా బిజీ – ఆ తరువాత వారాల్లో నేను వేసేవాడిని- అప్పటికే నా బొమ్మలు బావుండేవి .
ఒకటి రెండు సంవత్సరాలు ఇలా అయిన తరువాత ఆయనను అడిగాను – “బాపు, బాలి బొమ్మలతో ఫలానా సీరియల్ వస్తోంది అని ప్రకటనలు ఈయవచ్చు కదా అని” ఆయన అంతెత్తున ఎగిరాడు. “నీకు పేరు మీద మహా తాపత్రయంగా ఉందే అని” – ఇటువంటివి జూనియర్ దశలో తప్పవు. గమ్మున ఊరుకున్నాను. అయితే అది పేరు గురించి కాదు కొంచెం గుర్తింపు కోసం. పేరు వస్తోందో రాదో తెలియదు – ఇక డబ్బులు సంపాదించుకుందాం అని వర్క్ చేస్తూ కష్టపడేవాడిని బయట.
మీ జీవితంలో మీరు ఎదుర్కున్న ఒడిదుడుకుల గురించి చెప్పండి.
పైన చెప్పినది చెడు అనుభవమే కదా! విషయమొచ్చింది – మీరు ప్రశ్నించారు కాబట్టి చెపుతున్నాను – ఇంకా PWDలో పనిచేస్తున్నాను. విశాఖజిల్లాలో చోడవరంలో శర్మగారు కథలు పంపేవారు ఆంధ్రజ్యోతి నుండి – అలా ద్వివేదుల విశాలాక్షి, కోమలాదేవి,అవసరాల కృష్ణారావు , నండూరి పార్ధసారథి గార్ల నవలలకు బొమ్మలు వేశాను. అయితే ఏదో లోపం బొమ్మల్లో, నాకు సరియైన బ్రష్ లు కలాలు లేవు అని – బొమ్మల్లో ఫినిషింగ్ కూడా బాగా చేయలేకపోతున్నానని – ఇంతలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడకు వచ్చాక రచయిత భమిడిపాటి రామగోపాలంగారు పరిచయం అయ్యారు. వారి ఆఫీస్ మా ఆఫీస్ దగ్గరే!
“బాపుగారు, ముళ్ళపూడి వారు రేపు ఉదయం 11 గంటలకు మా ఆఫీస్ కు వస్తున్నారు – నీవు కుడా రా” అని ఆయన కబురు పంపారు- వెళ్ళాను..
వారికి నన్ను పరిచయం చేశారు – (వారికీ, వారికీ లోగడ పరిచయాలున్నాయి ఏదో సినిమా ఎలా పోతుందో చూసుకోవడానికి ఈ వూరు వచ్చారన్నమాట) “మేము ఫలానా హోటల్లో ఫ్రంట్ రూమ్ లో ఉన్నాం సాయంత్రం కలవండి అన్నారు బాపుగారు. నా అనుమానాలన్నీ తీర్చుకోవచ్చు అన్న ఉత్సాహంలో ఉన్నాను. సాయంకాలం అలాగే వారుండే హోటల్ కి బయలు దేరాను. పెద్దవర్షం- మొత్తం తడిచిపోయాను. అయినా సరదా, వారిని కలుసుకుంటున్నానని. అప్పటికే సీతమ్మధార గవర్నమెంట్ క్వాటర్లో ఉండేవాడ్ని. అక్కడికి గంటకో బస్ ఉండేది. అది తప్పిపోతే వచ్చే బస్ కోసం షెల్టర్ లో వెయిట్ చేయడమే. బారున్న రూము బయట మొత్తం తడిసిపోయి ఉంది. వెనక కొంచెం పొడిగా ఉంది. అక్కడొక పొడువైన బల్ల, అది ద్వారం దగ్గరలోనే ఉంది. మెట్లకు దగ్గరలోనే కుర్చీ ఉంది. అది పూర్తిగా తడిసిపోయి ఉంది. తలుపు తట్టాను.రమణగారు తలుపు తీసి కూర్చోండి అన్నారు. ఎలాగు తడిచాను కాబట్టి అలాగే కూర్చున్నాను. వాళ్లిద్దరూ కాసేపట్లో తెల్లటి బట్టల్లో ఫ్రెష్ గా తయారయివచ్చారు. బల్ల మీద కూర్చున్నారు పలకరించారు. పైనుండి గొట్టంలో పడుతున్న నీరు కాలువగుండా బయటకు పోతుంది, కొంచెం దగ్గరలో పూలమొక్కలు. అలా ఆ నీటివేపే జీవితంలో అదే మొదటిసారి చూసినట్టు చూస్తున్నారు.
రెండు ప్రశ్నలు వేశాను ఆర్ట్ గురించే- మొదటి దానికి సమాధానం – “సోవియట్ లాండ్ పుస్తకాలు తిరిగెయ్యమని”
బ్రష్ ఈకలు సరిగ్గా లేక పాయింట్ రావడం లేదన్న నా రెండవ ప్రశ్నకు “ఈకలు వేలితో నలపండి” అని సమాధానం. తిరిగి ఆ నీటివైపే చూస్తున్నారు.
నా వాచీలో బస్సు టైము అవుతుంది వస్తానని లేచాను.“నాకేదన్న ఆర్ట్ గురించి అనుమానాలుంటే ప్రపంచంలోంచే, అనుభవంలోంచే తెలుసుకోవాలి, ఆలస్యమయినా పరవాలేదు," అని నిర్ణయించుకొని బస్సు పట్టుకొని ఇంటికి వచ్చేశాను. ఎక్కడో చదివాను ఆయన మితంగా మాట్లాడుతారని, నాకు జరిగిన సంఘటన మితంలో భాగం కాబోలు.
ఒకటి రెండు సంవత్సరాల క్రితం నా కార్టూన్ బుక్ రచన చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో ఆయనతో ఆవిష్కరింపచేశారు- ఆయన సభానంతరం అలవోకగా తిరగేస్తోంటే “నిదానంగా చూడండి” అన్నాను. “అయ్యో మీరు నా అభిమాన చిత్రకారులు అన్నారు – “ఆహా అలాగా” అనుకున్నాను.ఆ తరువాత నేను విన్నది. దగ్గరికి వెళ్ళి పలకరించినవాడల్లా ఆయన అభిమాన చిత్రకారుడే అని.
అయితే నేను ఆ దశ దాటిపోయాను కాబట్టి నలుగురిలో చెప్పుకోలేదు. నా ఆత్మకథలోనే వ్రాశాను. అయితే ‘అన్వర్’ అనే ఆర్టిస్ట్ కి ఏదో సందర్భంలో చెప్పాను,  ఆయన అది గుర్తుపెట్టుకొని ఎన్నో సంవత్సరాల తరువాత ఎవరో అమెరికా ఆర్టిస్ట్ కు కొంచెం తేడాతో ఇలాంటి అనుభవమే జరిగితే కంపేర్ చేస్తూ FACE BOOK లో పెట్టాడు ఫోటోలతో సైతం.
మీ ఆత్మకధ రాస్తున్నారట ?
అవును నా ఆత్మ కథను వ్రాయమని ఒక నెట్ మ్యాగజిన్ నడుపుతున్న చిత్రకారుడు అడిగితే రాయడం మొదలెట్టాను. అతడిలో ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని తెలిసింది. ఆపేశాను. అప్పటికే చాలా మంది చదివి దాన్ని పుస్తకంగా తీసుకురండి అని కోరితే పూర్తి చేశాను ,త్వరలో పాఠకుల ముందుకు వస్తుంది.
జీవితంలోని అనుభవాలు మీకు నేర్పిన పాఠాలు ఎటువంటివి ? భావిచిత్రకారులకి మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు ఎదుర్కోవడం వల్ల – ఈ అనుభవాలే సంపదలు కాబట్టి ఔత్సాహికవంతులైన చిత్రకారులు నా దగ్గరకు వస్తే, గౌరవంగా పలకరించాలని, నాకు తెలిసిన విషయాలు తెలియచెప్పాలని సరదా ఉంది . అదే చేస్తున్నాను. “కళ అన్నది మహా సముద్రం, నాకు తెలిసింది అందులో చిన్న నీటి బిందువు” అనుకుంటే చాలు. వినమ్రంగా తలదించుకోడానికి. ఇంతకూ మించి పాఠకులకు ఏం చెపుతాం ?
“అవకాశాన్ని వినియోగించుకోండి- మనకు తెలిసింది అతి తక్కువని భావించండి, ఒప్పుకున్న పనిని సకాలంలో వారికి అందించండి. దానికి మీ మూడ్ బాగులేదన్న కారణం చూపకండి. ప్రతీ క్షణం చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. వారి హాహాభావాలను, అదే పెద్ద లెసన్ బొమ్మలుగా గీసుకోడానికి." ఇదే నేనిచ్చే సందేశం.
గుంటూరు కళాపీఠం వారి నుంచి ' చిత్రకళా సామ్రాట్' గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 'హంస' అవార్డును మాత్రమే కాక, పలు సన్మానాలు పొందారు బాలి గారు. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి, అచ్చతెలుగువారి కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేసారు. శ్రీ బాలి గారు, మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, మనసారా ఆకాంక్షిస్తోంది 'అచ్చంగా తెలుగు'.

No comments:

Post a Comment

Pages