Saturday, July 25, 2015

thumbnail

ప్రేమ - సాఫల్యము - ప్రేయసి భావన

ప్రేమ - సాఫల్యము - ప్రేయసి భావన

- అక్కిరాజు ప్రసాద్ 


ప్రేయసి ప్రియుని సేద తీరుస్తూ ఒక భావ యుక్తమైన ఆరాధనా భావమున్న గీతం ఆలపిస్తే ఏమవుతుంది?. ప్రియుని ఒంట్లో, మనసులో ఉన్న అలసట, అలజడి మాటు మాయమై గాఢమైన నిద్ర, ప్రశాంతమైన మనోభావము కలుగుతుంది. అది ప్రేమలో ఉన్న శక్తి. అద్భుతమే మరి ఈ ప్రేమ అనే రెండక్షరాల మంత్ర ఫలము.
మరి ఆ ప్రేమలో సాఫల్యానికి కావలసింది ఏమిటి? - ధైర్యము, స్థైర్యము, త్యాగము, నిరాడంబరముతో కూడిన పరిపూర్ణ వ్యక్తిత్వము. తనను తాను పూర్తిగా సమర్పించుకోవటం.  ప్రేమలో సమర్పించుకోవటం అంటే దాసోహం అని కాదు. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ, భాగస్వామి ఆనందం కోసం ఎంత కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవటం. ఇది చెప్పినంత సులువు కాదు. తన అహాన్ని, ఇష్టాయిష్టాలను పక్కకు బెట్టగలిగితేనే ఇది సాధ్యమవుతుంది.
నిజమైన ప్రేమ భాగస్వామిలోని మంచి లక్షణాలను గుర్తించి వాటిని ఆరాధించటంతో మొదలు పెడితే అది మంచి పునాది అవుతుంది. దేహ సౌందర్యానికి, అంతస్తుకు ప్రాధాన్యత ఇస్తే అది నిలవదు. ఎందుకంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించినప్పుడు జరిగేది నిజ వ్యక్తిత్వ వ్యక్తీకరణ, నిజ స్పందన. ఈ నిజాలు బయట పడుతున్నప్పుడు అవతలి వ్యక్తి సౌందర్యము, అంతస్తు తెరపైన, మనసులో కూడ ఉండవు. అందుకని, నిజ వ్యక్తిత్వాన్ని దాచుకోకుండా ప్రేమ మొదలు పెడితే, అది దాంపత్యముగా, ప్రణయ వైవాహిక జీవితంగా మారుతుంది. మరి భాగస్వామిలో సుగుణాలను గుర్తించటం అంటే?. మొదలు అతని/ఆమె వ్యక్తిత్వాన్ని యథాతథంగా గౌరవించ గలగటం. నీలో నాకు ఇది నచ్చ లేదు అని చెప్పే ముందు మనలో అవతలి వ్యక్తికి ఏమి నచ్చవో ఆలోచించ గలిగితే, గౌరవం మొలకెత్తుతుంది. ఎప్పుడు మన వైపు నుంచే ఆలోచిస్తే, పూర్తిగా అది స్వార్థంతో కూడిన సంబంధంగా నలిగి నశిస్తుంది.
జీవితంలో ఎక్కువ శాతం మన అహాన్ని నిలుపుకోవటం లోనే సరిపోతుంది. నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు మరలి, నాకోసం ఇది చేయాలి, నాకు ఎప్పుడు జేజేలు కొట్టాలి - ఈ భావాలన్నీ అహం యొక్క పిలకలే. ప్రేమలో అహం ఉంటే, అది నిత్య రామాయణానికి దారి తీస్తుంది. ఈ భావాన్ని వీడ గలిగితే, ప్రణయం ఎంతో మధురంగా ఉంటుంది. అందుకనే, ప్రేమలో వ్యక్తిత్వ వికాసము, త్యాగము, దృఢ సంకల్పము, మానసిక పరిణతి ఎంతో ముఖ్యం. ఇది 16 - 19 ఏళ్ల వయసులో చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకనే ఆ వయసులోని ప్రేమ సఫలమవ్వటం చాలా కష్టం. 22 -25 ఏళ్ల వయసులో మొదలయ్యే ప్రేమ చిన్న పిల్లల చేష్టలకు, అహానికి, కోపతాపాలకు కొంత దూరంగా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి, వ్యక్తిత్వాని అభివృద్ధి పరచుకొని, అప్పుడు జీవిత భాగ స్వామిని ఎన్నుకునే పనిలో పడితే, అది స్వర్ణ జయంతి వివాహంగా నిలిచే అవకాశం ఎక్కువ.
గుడ్డివాడైన ప్రియుని కోసం ఒక ప్రేయసి ఎంత మధురంగా ఉండగలిగిందో ఊహించ గలరా?.
వెన్నెల లోని అభివృద్ధి అంతా నీ కళ్లలో వెలిగిస్తాను, బాధ మరచి పోయి హాయిగా నిద్రపో అనే పల్లవిలో సాగేది ఈ గీతం.
మొదటి చరణంలో - అందమైన ప్రపంచం వర్ణన చేయాలి అంటే వసంతకాలంలోని ప్రకృతి అందాలు మంచి ఉపమానం. చిగురించి నిండుగా పచ్చగా ఉండే కాలం ఉత్సాహకరమైన భావనను, మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. అందుకనే కవి, వాడని పూవులతో ఉన్న చెట్లను ఈ గీతంలో ఉపమానంగా ఉపయోగించారు. అటువంటి వసంతకాలంలో చెలి వినోద రాగాలను జోలగా పాడుతుంటే, కలల సుఖాలలో తేలుతూ హాయిత నిదురించు అని ప్రేయసి ఆలపిస్తుంది. ప్రకృతి, వసంతకాలము, మంచి రాగము, జోల పాట పాడే చెలి ఉంటే నిద్దుర రాకుండా  ఎలా ఉంటుంది? అందమైన కల కలిగి తీరాల్సిందే.
రెండవ చరణంలో - సూర్యుని వీడని నీడలా (ఆయన పత్ని ఛాయ) నీ భావములో నీ తరిస్తాను అని చెలి తన పరి పూర్ణ వ్యక్తిత్వాన్ని, గాఢ మైన ప్రేమను వ్యక్త పరుస్తుంది. అంటే, అతని భావములో తాను జీవించి, ఆస్వాదించి, అతనితో కలసి తరిస్తుంది అని అర్థం. మరి దానికి దేన్ని ఎదుర్కోటానికైన ఆమె సిద్ధమే. నీ సేవలోనే తరిస్తాను, నీ హృదయములో నివశిస్తాను అని ప్రేయసి అతనికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. సేవ అంటే కేవలం శారీరకంగా కాదు, దానికి మానసిక భావన, నిజాయితీ మెట్టుగా వేసుకొని ముందడగు వేయటం. అటువంటి సేవ చేస్తే మరి హృదయంలో స్థానం ఏర్పడి తీరాల్సిందే.
మనసు కవి, మన సుకవి, ఆచార్య ఆత్రేయ రచించిన ఇంత అందమైన ప్రేమ భావానికి నాయిక నాయకులు గా మహానటి సావిత్రి, అక్కినేని కూడితే? దానికి రసరాజు సాలూరి రాజేశ్వర రావు గారు మంచి మాధుర్య భరితమైన సంగీతాని కూరిస్తే? అదే ఆరాధన చిత్రంలోని వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనులా అనీ ఈ రమణీయ గీతం. వింటే ప్రేమ పుష్పాలు వికసించి మనసు పులకించాల్సిందే. విని ప్రేమ రసాస్వాదన పొందుతారని ఆశిస్తూ, మీ కోసం ఈ గీతం సాహిత్యం, యూట్యూబ్ దృశ్య శ్రవణం.
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|
వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము కదలాడే సుందర వసంతమీ కాలము
చెలి జోలగ పాడే వినోద రాగాలలో చెలి జోలగ పాడే వినోద రాగాలలో తేలెడి కలల సుఖాలలో నిదురించుము ఈ రేయి |వెన్నెల|
భానుని వీడని ఛాయగా నీ భావములో నే తరింతునోయి సఖా నీ భావములో నే తరింతునోయి సఖా
నీ సేవలలోనే తరింతునోయీ సదా నీ సేవలలోనే తరింతునోయీ సదా 
నీ ఎదలోనే వసింతులే నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information