దొండకాయ లాలిపప్స్

- ఆండ్ర లలిత


పరధ్యానము పరమానందయ్యగారి ఇంటిపేరు. పరధ్యానము కాదు కానీ ఏ ఆనందనిలయమో ఉండవలసింది. ఎప్పుడు చూసినా సరదాగా ఉంటారు. మరి వాళ్ళఇంట్లో ఏ ఒక్కళ్ళకి కూడా పరధ్యానము రాలేదు. ఇంట్లో అందరూ మంచి చురుకూ చలాకి వాళ్ళు. మరివాళ్ళ ఇంట్లో స్వాభిమానము కూడా ఉట్టిపడుతూ ఉంటుంది. స్వాభిమానమే కాదండోయ్!! వేపకాయ అంత వెఱ్ఱి కూడా ఉందండోయ్!! వంటబ్రాహ్మడు, పనివాళ్ళని కుడా లెక్కలోవేసుకోవాలి మనము.
ఉన్నదాంట్లో సంతృప్తిగా సంతోషముగా ఉంటారు. పరమానందయ్యగారి ఉద్దేశ్యములో — ఇల్లంటే ఆప్యాయతలూ అనురాగాల దేవాలయము. ఇంటికి అందము, ఆ ఇంటిలో మసిలే మనుషులు. ఇల్లు జీవించాలి కానీ, ఒకస్మారకరూపం కింద మిగిలిపోకూడదు. ఆ విధంగా సీతారామయ్య తన బాల్యస్నేహితుడు పరమానందయ్య కుటుంబము గురించి తన కుటుంబసభ్యులకు సెలవిచ్చారు. “ రేపు పరమానందయ్య ఇంటికివెళ్లి, ఓ నాలుగురోజులు గడిపి వద్దాము, చాలాకాలము నుంచీ రమంటున్నాడాయే “ అన్నారు సీతారామయ్యగారు.
*********
ప్రొద్దున్నే ప్రయాణమైయ్యారు కుటుంబ సమేతంగా తన బాల్యస్నేహితుడింటికి. విశాఖపట్టణం జిల్లా వెఱ్ఱిపాలెం అనే గ్రామములోఒక విశాలమైన మండువాఇల్లు, చుట్టూ పాడిపంట సస్యశ్యామలంగా ఉన్న పరమానందయ్యగారి ఇంట్లో వసారాలో పరమానందయ్యగారు పడకకుర్చీలో కూర్చుని వేడివేడికాఫీ ఆస్వాదిస్తూ అందరికి పనులు పురమాయిస్తున్నారు. వేసంగి సెలవలు మరీ.వేసంగి సెలవలు వచ్చాయంటే పిల్లలూ, మనవలు ,మనవరాళ్ళుతో కలసి ఆయన సరదాగా గడుపుతారు .
వాళ్ళఇంట్లో అందరూ భోజనప్రియులే. కానీ ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ దానికి తగ్గట్టు ప్రణాళికలు అవలంబిస్తారు కూడా. ఆరోగ్యనియమాలు ఉల్లంఘించకుండా వారు స్వీకరించే ఆహారానికి చిన్నచిన్నమార్పులు కూర్పులు చేసుకుంటూ కొత్తరుచులకు నిత్యమూ ఆహ్వానము పలుకుతారు. ఇంతలో గేట్ శబ్దమైంది.
గబగబా పంచ సవరించుకుంటూ సితారామయ్యగారి కుటుంబానికి ప్రేమఆప్యాయతులతో స్వాగతము పలికారు పరమానందయ్యగారు. కుశలప్రశ్నలు వేసుకుంటున్న అందరికి కాఫీలు, పాలు వగైరావగైరా అందించారు సూరిబాబుగారు, చిరునవ్వుచిద్విలాసముతో. సురిబాబుగారికి పిల్లలంటే మహాఇష్టము. వేడిగా ఉంటే త్రాగలేరని చిన్నపిల్లలికి చల్లార్చి మరీపాలు ఇచ్చారు. “పాపా, నీ పేరు ఏమిటి? ఈ ఊరు నచ్చిందా?” అన్నారు సూరిబాబుగారు సీతారామయ్యగారి ముద్దుల మనవరాలుతో. " మానస" అంది ఆ పాప. "మరి మా ఊరు నచ్చిందా?” అన్నారు సురిబాబుగారు. "ఓ, బావుంది" అంది మానస. "పిల్లలూ!! మాటలుఆటలు చాలించి ఇడ్లి ,కొబ్బరిపచ్చడి తింటారా” అన్నారు సురిబాబుగారు. మమత మూడేళ్ళ పరమానందయ్యగారి ముద్దుల మనవరాలు, ముద్దులు ఒలకపోస్తూ "నాకువొద్దు " అంది.
మమత అంటే పరమానందయ్యగారికి చాలాఇష్టము. అసలు, మనవలు మనవరాళ్ళూ అంటే పంచప్రాణాలు. ఎంతన్నా అసలుకన్నా వడ్డీ ముద్దుకదండి! "ఎందుకు బంగారుతల్లీ“ అన్నారు సురిబాబుగారు. "నాకు బల్బుల సాంబార్కావాలి“ అంది మమత. "బల్బులసాంబారా!! అదేమిటి" అని గొల్లనినవ్వారు పిల్లలి సమూహము అందరూ, మమత మాటలకి. "నవ్వకండర్రా, ఆసాంబా ర్ఇడ్లిలోకి నేచేస్తా కదా ..ఎంత బావుంటుందో“ అన్నారు సూరిబాబుగారు. ఇది పరమానందయ్యగారి చెవిన పడింది . ఇంతలో సూరిబాబుగారు ఇలా అన్నారు" శివయ్య, ఇట్రావొయ్ ఒక్కసారి. నిన్న నిన్నూ బల్బులు తెమన్నాను కదా, తెచ్చావా?” “కొట్టుగదిలో పెట్టానండీ” అన్నాడు శివయ్య. “ నేను చూడలేదులే. సరే అయితే" అన్నారు సూరిబాబుగారు. "ఏవోయ్ మాణిక్యమ్మా కాస్త వీలుచేసుకుని ఇటురావమ్మా ఒకసారి .. బ్రహ్మగారితో లక్షవత్తులనోము, పదహారుఫలాల నోము వగైరావగైరా మాటలు సంప్రదింపులు అయ్యాక" అన్నారు పరమానందయ్యగారు. "ఏవిటీ కేకేసారు ..” అంది మాణిక్యమ్మ హడావిడిగా వసారాలోకి వస్తూ. " మమత బల్బులసాంబార్ అడిగిందని శివయ్యతెచ్చిన బల్బులతో సాంబార్పెట్టడుకదా ... కొంపకొల్లేరు అవుతుంది. ఏవిటో సీతారామయ్యా!!! మా సూరిబాబు సృష్టి, విశ్వామిత్రుని సృష్టికన్నా గొప్పది. ఏదిచేసినా అమృతములాగ ఉంటుందనుకో " అన్నారు పరమానందయ్యగారు సీతారామయ్యగారితో.
అతనికి తెలుసులేండి బల్బులంటే నీరుల్లిపాయి పళంగా నీరుల్లిపాయితో సాంబార్ అని. మీరు నిశ్చింతగా ఉండండి, అన్నీ సక్రమముగా అవుతున్నాయి "అన్నారు మాణిక్యమ్మగారు. సీతారామయ్యగారు, పరమానందయ్యగారి కేసి చూసి తల ఊపారేకాని గుండెలో రాయిపడింది. ఇంతలో పరమానందయ్యగారిదృష్టి ఘనకార్యాలు వెలగపెట్తున్న తన మనవలు మీదపడింది. అంతే ! ఒక్కకేక పెట్టారు. "ఒరేయ్ ధృవ్, దీప్! పడిపోతారు చెట్టు ఎక్కుతున్నారు. దిగండి! రాముడు ,ఓ నాలుగుపళ్ళు కోసివ్వు" అన్నారు పరమానందయ్యగారు. "అలాగే అండీ" అన్నాడు రాముడు. “తాతా!! కంగారుపడకు.రాముడికి, పాపం అందవు. రాముడు కిందపళ్ళు కోస్తాడు. మాకు కావలసింది చెట్టుఎక్కి, కోసుకుని తింటే ఎంతబావుంటుందో కదా!” అన్నాడు ధృవ్. "దీప్, నా చొక్కా గట్టిగా పట్టుకో, సరేనా" అన్నాడు దృవ్. "దీప్ నువ్వన్నాదిగరా! నువ్వు వాడికన్నా చిన్నవాడివి. దృవ్ కోసి ఇస్తాడులే. దిగరాబాబూ. మీ అమ్మని పిలుస్తా అంతే “ అన్నారు పరమానందయ్యగారు. "ఉష్ ....... ష్! అమ్మతోచెప్పకు.. మా విమానము కూలిపోయింది, అడివిలో మాకు ఆకలివేస్తోంది. కిందుంటే పులిలూ సింహాలు వస్తాయి.అందుకే చెట్టుమీద కూర్చున్నాము. మా శత్రువులు మమ్మలిని పట్టేసుకుంటారు. తాతా, వెళ్ళూ పులివస్తోంది" అన్నాడు దీప్.
*********************
అల్పాహారానికి భోజనాలగదిలోకి ఆహ్వానము పలికారు సూరిబాబుగారు. సూరిబాబుగారు ఎంతో ఆప్యాయతతో వడ్డించారు. అందరూ సంతృప్తిగా భుజించారు. ఎండతీక్షణత ఎక్కువ అవటంతో అందరు సావిట్లో నీడపట్టున స్థిరపడ్డారు. సూరిబాబుగారి కళ్ళల్లో ఆనందబాష్పాలు తిరిగాయి.ఈ యాంత్రిక ప్రపంచ ఒత్తిడులు, అసంతృప్తి నుంచి ఒక నాలుగురోజులు ఆనందనిలయాల్లాంటి కుటుంబాలలో సంతృప్తితో గడిపితే ఎంతబావుంటుందోకదా అని అనుకున్నారు, ఆ అందమైన కుటుంబాన్ని చూస్తూ . "సూరిబాబు, ఏవిటయ్యా ఆ ధీర్ఘాలోచన" అన్నారు పరమానందయ్యగారు సూరిబాబు బుజము తట్టుతూ. "అబ్బే ఏమీ లేదండి "అన్నారు సూరిబాబుగారు. "ఏవోయ్ సూరిబాబు, ఇవాళ మా స్నేహితుడు కూడా వచ్చాడు. ఇవాళ నీ నలభీమపాకమ్ ఏమిటీ? అదిరిపోవాలి అంతేమరి" అన్నారు పరమానందయ్యగారు. సూరిబాబుగారు వంటలజాబితా చదవటము అందుకున్నారు. "చాలా బావున్నాయి. మధురాతి మధురముగా ఉన్నాయి. మా సీతారామయ్యకి పుల్లాబెల్లము పెట్టి ఇష్టము. ఏదోఒక కూరచెయ్యి. "అన్నారు పరమానందయ్యగారు. “ఆయ్ అండి" అన్నారు సూరిబాబుగారు. వంటప్రయత్నములో వెళ్ళుతున్న సూరిబాబుగారికంట, ఆలోక్, కృష్ కి ప్రేక్షకమహాశయులు కావల్సివచ్చి హోర్న్ చేస్తున్న దృశ్యము కంటినపడి, చిరునవ్వు తెప్పించింది. "పీప్పీప్పీ ....... ప్" అలోక్ హోర్న్ మ్రోగించాడు. "అక్కడ చప్టామీద ఆడుకోండి. వెళ్ళరా ఇక్కడ బోళ్ళు పువ్వులు మాలలు కట్తున్నామా .అక్కడ బోళ్ళు చోటుంది బంగారుతండ్రులు కదా! అలోక్, కృష్, మీరు మంచిపిల్లలు కదా!వెళ్ళ్తరా మరి " అన్నారు మాణిక్యమ్మగారు . "ఊ" అన్నాడు కృష్. "పీప్పీప్పీ ....... ప్" మళ్ళీ హోర్న్ మ్రోగించాడు. "కార్వస్తోంది జరుగు బామ్మా, డామ్పడి పోతావులే బామ్మా!!!! లే "అన్నాడు అలోక్. “పక్కనుంచి వెళ్ళండిరా బాబూ” అన్నారు మాణిక్యమ్మ. “కారు టర్న్ కావట్లేదు చోటులేదులే” అన్నాడు కృష్. “సరే పక్కకి తప్పుకున్నాము వెళ్ళండి” అన్నారు మాణిక్యమ్మ. పిల్లలు చక్కగాతిని, వాళ్ళలోకంలో వాళ్ళు ఆడుకుని అందరినుంచి ప్రసంసలు తీసుకుంటుటేనే వాళ్ళు బావుంటారు అనుకున్నారు మాణిక్యమ్మగారు.
**************
సూరిబాబుగారు పెరట్లోకి వెళ్లి, నిమ్మచెట్టుకు బోదిచేస్తున్న రాముడిని పిలిచారు. ”రాముడూ ఇటురా, దొండకాయలు కోయమన్నాను. ఏవి బొత్తిగా ఆలస్యము అవుతోంది. వంట చెయ్యాలి. కాస్తతేవోయ్ త్వరగా !” అన్నారు. "ఓ, అలాగే తెస్తాను ఇంకా ఏమికావాలో చెప్పండి “ అన్నాడు రాముడు. "దొండకాయలు ఓ బుట్టెడు. వంకాయలు లేతవి చూసితే, ఓ బుట్టెడు. పనసపళ్ళు ఒకమూడు కొయ్యి. ఒక కొబ్బరిమట్ట కూడా కొట్టి, తే" అన్నారు సూరిబాబుగారు. "ఓ అలాగే అండి “ అన్నాడు రాముడు. "రాముడూ కూరలులేతగా బావున్నాయి సరే, మరి కొబ్బరిమట్ట ఎందుకూ?” అన్నారు పరమానందయ్యగారు “తెలియదండీ.సూరిబాబుగారు తెమ్మన్నారండి అంతే. అడిగి చెప్పామంటారాండి” అన్నాడు రాముడు. "వద్దులే "అన్నారు పరమానందయ్యగారు. "మాణిక్యమ్మా , పొరపాటున మనసురిబాబుగారు కొబ్బరిఆకుల పచ్చడీ,కొబ్బరి ఈనులతో కూర, దొండకాయి పులుసూ పెట్టడుకదా." సూరిబాబుగారి వంటలలో పరికల్పన మన ఊహలకి అందనది అనుకుంటూ అడిగారు ఆయన. “ఓరే పరమానందయ్య పిల్లాపాపాలతో ఉన్నాము...మీ సూరిబాబుగారు వంటల ప్రయోగాలు మనమీద ప్రయోగిస్తున్నాడు. పరవాలేదంటావా! ఏమిటో మజ్జిగాన్నము తింటే పోలె.చూసుకో.బతికి ఉంటే బలుసాకు తినచ్చు, ఏమంటావ్!” అన్నారు సీతారామయ్య గారు.
******************
సూరిబాబుగారు భోజనాలకి ఆహ్వానము పలికారు.అందరికి ఆకళ్ళు దహించుకుపోవటముతో భోజనాలగదిలో యిట్టెహాజరైయ్యారు. సీతారామయ్యా, పరమానందయ్య గారిద్దరికళ్ళూ ఈనుపుల్లల కోసం వెతుకుతున్నాయి. పంచభక్షపరవాన్నాలతో పాటూ దొండకాయి పుల్లాబెల్లంపెట్టిన కూరకూడా వచ్చింది భోజనాలగదిలోకి… “ఏవిటయ్యా ఈ కొత్త పరికల్పన. ఆఖరికి కొబ్బరి ఈనులు ఉపయోగించేసావు. ఇది ఏ దేశపు వంటకం? చూడటానికి భలెగమ్మత్తుగా ఉందనుకో సూరిబాబూ “ అన్నారు పరమానందయ్యగారు. “తిని చూడండీ, నే చెప్తాగా” అన్నారు సూరిబాబుగారు. పిల్లలకి కాస్తకారము, పోపు తగ్గించి చేసారు సూరిబాబుగారు. పిల్లలు ఉత్తివే తినేయచ్చు. పిజ్జాలు బర్గర్లూ తప్ప తినని పిల్లలుకూడా ఇష్టపడి తిన్నారు. “చక్కటి బెల్లం పెట్టిన పులుసులో మగ్గిన దొండకాయలకి నేర్పుతో ఈనుపుల్లలు గుచ్చి భలేహాజరు చేసావయ్య మా ముందు. చాలా బావున్నాయి.పైన లేతగా కరకరలాడుతూ పుల్లపుల్లగా, తియ్యతియ్యగా, కారంకారముగా అబ్బ ఏమిరుచి. చాలా బావున్నాయి.వంటచేయటము ఓ కళైతే, దాన్ని ఆకర్షవంతముగా చేయటము మరోకళ. నీకు రెండూ అబ్బాయి.నీకు మా జోహార్లు” అన్నారు పరమానందయ్యగారు. అందరికీ నచ్చి, వారివారిపరికల్పనలో పేర్లుపేర్కొన్నారు. దాంట్లో బాగా అందరికీ నచ్చినపేరు అందరికన్న చిన్నదైన మానసపెట్టిన పేరు. 'స్వీట్ అండ్ సోర్ దొండకాయ లాలిపప్స్ ' అందరికీ చాలా నచ్చేసింది. బయటేమో కరకరలాడుతూ, లోపల మృదువుగా చాలాబాగా నచ్చాయందరికీ. ఆ వంటకము గోబిమంచూరియా, గోబీ 65 లా ప్రఖ్యాతి గాంచింది.శుభకార్యాలలో సూరిబాబుగారి 'స్వీట్ అండ్ సోర్ లాలిపప్స్' ఉండాల్సిందే. సూరిబాబుగారి పేరు మారుమ్రోగింది. ప్రసారమాధ్యమాల వారు సురిబాబుగారితో పలు ముఖాముఖీలు నిర్వహించారు.
*******************
”సండేస్ టివీవారు నిర్వహించిన సూరిబాబుగారి ముఖాముఖీ వస్తోంది టీవీలో, రండి చూద్దాము” అని పిలిచారు పరమానందయ్యగారు. “శుభోదయమండీ సూరిబాబుగారు” సండేస్ టివీ వారి తరఫున స్మృతి ఆయనకు స్వాగతం పలికింది. “మీ కుటుంబసభ్యులకి మీరేమన్నా సందేశము ఇవ్వదలచుకున్నారా?” అడిగింది స్మృతి. "నా అభివృద్దికి ప్రాణం మా కుటుంబమే." “మీకు స్ఫూర్తి ఎవరండీ?” "నాకు స్ఫూర్తి నా తల్లీతండ్రి, మరియు మా గురువుగారు, శ్రేయోభిలాషి, తండ్రిలాంటివారైన పరధ్యానము పరమానందయ్యగారండీ!" “మరీ మీవంటల పరికల్పనను వారు ఒప్పుకునేవారా? సూరిబాబుగారండీ” "నా వినూత్న ప్రతిభను,పరికల్పననూ, గుర్తించి ప్రోత్సహించారే కాని, నిరుత్సాహపరచలేదు ఎప్పుడూ ." “మీకు ఈ లోలిపొప్స్ చేయాలని ఎందుకు అనిపించింది సూరిబాబుగారు?” "మా పరమానందయ్యగారింట్లో బాష విశాఖపట్టణం, పశ్చిమగోదావరీ జిల్లా కలయక.మా పక్క పులుసుబెల్లంపెట్టి అంటారు. పుల్లలుకాయలు బెల్లంపెట్టి వండమన్నారని అనుకుని నాకళాత్మకతా, సృజనాత్మకత ఉపయోగించి ఇలా వండాను. చిన్నపిల్లలు సాధారణంగా కూరలునచ్చితేనే తింటారు.రంగూ ఆకారముబట్టీ నిస్సంకోచముగా చెప్పేస్తారు, “నాకొద్దు” అని.అలాంటి పిల్లలుకూడా వీటిని చాలా ఇష్టపడతారు." “ఈ కాలము యువప్రపంచానికి మీ సందేశము ఏమిస్తారు?” "ఇదివరకు నా చిన్నప్పుడు ఇన్ని టిఫిన్లు, ఇన్ని రకాల చిరుతిళ్ళు లేవు. తిండి దగ్గర ఇంత మారాము లేదు. ఇప్పుడు వచ్చే పిజ్జాలు, బర్గర్ లు వంటివన్నీ దాదాపు అధికంగా క్రొవ్వును పెంచి ఆరోగ్యానికి హాని చేసేవే ! కాని, పిల్లలు వెరైటీ కోరుకుంటారు. అదే, అదే పెడుతూ పిల్లలు తినట్లేదని, అందుకే చిరుతిళ్ళు కొనిస్తామని చెప్పడం సబబు కాదు. కాబట్టి, ఆరోగ్యకరమైన కూరగాయాలనే, పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా వండి, కొత్త పేర్లు పెట్టి, తినిపించాలి. అవి చూసి, మరికొందరు పిల్లలు కూడా అవే కావాలని, వండించుకుంటారు. ఇందుకు ఉదాహరణే ఈ దొండకాయ లాలిపప్స్ ! ఇది ఆదర్శంగా తీసుకుని, మారిన కాలంతో పాటు, తల్లిదండ్రులూ మారి, కొత్తకొత్త రకాలు సృష్టించి, పిల్లలకు మంచి పోషణ, తద్వారా మంచి ఆరోగ్యం అందేలా చూడాలి. ఆరోగ్యమే మహాభాగ్యం." అంటూ ముగించిన సూరిబాబు గారిని టీవీ లో చూసి, పరంధామయ్య గారి ఇంట్లోనే కాదు, ఎన్నో ఇళ్ళలోని ఎందరో ఇల్లాళ్ళు మనసులోనే జేజేలు పలికారు.
***********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top