సజీవ చిత్రాల స్రష్ట - ఆర్టిస్ట్ రాజేష్ 

- భావరాజు పద్మిని 


చిత్రం ఒక మౌన లిపి. ఒక మంచి చిత్రం భాషతో సంబంధం లేకుండానే, మౌనంగా భావాన్ని వ్యక్తంచేస్తుంది. కాని, అటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాలంటే, ఒక చిత్రకారుడు కొన్ని సంవత్సరాలు పట్టు వదలకుండా కృషి, సాధన చెయ్యాలి. ఇతరుల శైలిని, మెళకువలను, కళలో వచ్చే కొత్త కొత్త మార్పులను ఆకళింపు చేసుకోవాలి. అలా కళాతపస్సు చేసి, తనకంటూ ఒక బాటను ఏర్పరచుకుని, ఖ్యాతిని పొందిన చిత్రకారులు – నాగులకొండ రాజేష్. పరమాత్మ విశ్వరూపమైనా, బుజ్జి కృష్ణుడైనా, గంగావతరణమైనా, కార్టూన్ పాత్రలైనా అద్భుతంగా ఆవిష్కరించి, కళ్ళను కట్టిపడేసే కళ ఆయనకే సొంతం .వారి ముఖాముఖిని ఈ నెల ప్రత్యేకంగా మీకు అందిస్తున్నాము.
నమస్కారమండి, మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి.
మాది చీరాలండి. మా తాతగారు కంసాలిగా ఉండేవారు. మా నాన్నగారికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. మేము మొత్తం 5
గురు పిల్లలం – 4 గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. చిన్నప్పటి నుండి నేను నాన్నగారితో ప్రెస్ లో పనిచేసేవాడిని. మూడో క్లాసు తర్వాత, ఇంట్లోవాళ్ళు ఎంతగా బ్రతిమాలినా నేను స్కూల్  కు వెళ్ళనేలేదు. తర్వాత చదువుకుంటే బాగుంటుంది, అని అందరూ పదేపదే చెప్పడంతో 10 వ తరగతి ప్రైవేట్ గా రాసి, ఉత్తీర్ణత సాధించాను. అప్పటినుంచి నా చదువు ఇంటర్, డిగ్రీ (B.sc) దాకా కొనసాగింది.
చిన్నప్పటి నుంచే మీకు చిత్రకళ పట్ల మక్కువ ఉండేదా ?
నాన్నగారు ప్రెస్ లో లుంగీ లేబుల్స్ అవీ డిజైన్ చేస్తూ ఉండేవారు. పని మధ్యలో, వారాంతాల్లో డ్రాయింగ్స్ గీసేవారు. అదంతా ఆసక్తిగా గమనించేవాడిని. నాన్నగారి లాగే నేనూ చేసేందుకు ప్రయత్నించేవాడిని. 10, 12 ఏళ్ళు ఉండగా లైబ్రరీ లో చందమామ పుస్తకాలలోని బొమ్మలు చూసి, ప్రేరణ పొందాను. అవి గొప్ప చిత్రకారులు శంకర్ గారివి. చూసి వేసేందుకు ప్రయత్నిస్తూ సాధన చేసేవాడిని.
డిగ్రీ కి వచ్చేసరికి క్లాత్ డిసైనింగ్ చేసేవాడిని. చొక్కాల మీద ఫాబ్రిక్ పెయింట్స్ తో లోగోస్ రూపొందించేవాడిని.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
మా పెద్దన్నయ్య కంసాలి పనిని కొనసాగించేవారు. నేను డిగ్రీ అయ్యాకా, అన్నయ్య వద్ద ఎంగ్రేవింగ్ వర్క్ చేసేవాడిని. ఏడాది పాటు ఆ మెషిన్ మీద పనిచేసాను. తర్వాత మావాళ్ళు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉంది కదా, అటు వెళ్ళమని ప్రోత్సహించారు.
హైదరాబాద్ లో ‘హార్ట్ ఆనిమేషన్ స్టూడియోస్ ‘ అనీ ఉండేది. అక్కడికి నా పోర్ట్ ఫోలియో ప్రత్యేకంగా రూపొందించి పంపాను. సెలెక్ట్ అయ్యాను, నాది ఫస్ట్ బాచ్. ప్రతి వారం స్కెచింగ్ చేసేవాడిని. కాని అక్కడ నిలదొక్కుకోవాలి అంటే, ఆర్ధిక స్థోమత కావాలి. అక్కడి వర్క్ స్టాండర్డ్స్, ఆఫీస్ లు, అన్నీ 8 నెలలు చూసి, వెనక్కు వచ్చేసాను. నేను నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని అనుకున్నాను.
మళ్ళీ అటు నాన్నకీ, ఇటు అన్నకీ సాయం చేసేవాడిని. మాకు పని విషయంలో అదీ, ఇదీ అని ఏమీ లేదు. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్ ‘ ను నమ్మే తత్త్వం నాది. అక్కడితో నా నడక ఆగిపోయింది అనుకున్నాను.
రెండేళ్ళ తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వచ్చి, నన్ను తీసుకువెళ్ళారు. ఆంధ్రజ్యోతి ఆర్టిస్ట్ ‘ఉత్తం’ గారనీ, ఆయన స్టూడియో లో ఉద్యోగావకాశం ఉంటే ఇచ్చారు. మేము ‘సిండికేషన్’ సేవలు అందించేవాళ్ళం – అంటే, పబ్లిషింగ్ హౌస్ లకి బొమ్మలు, కంటెంట్ అందించడం అన్నమాట. అక్కడ వాటర్ కలర్స్ తో నేను వేసిన బొమ్మలు వారికి నచ్చాయి. ఇవే కాక లైన్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను. హైదరాబద్ లోనే కలర్ చిప్స్ అనే సంస్థకు, పద్మాలయ వారికి ఇల్లుస్త్రేషన్ లు వేసిచ్చాను. అప్పట్లో అంతా చేత్తోనే వేసేవాడిని, నాకు
కంప్యూటర్ రాదు.
మరి కంప్యూటర్ పరిజ్ఞానం ఎలా సంపాదించారు ?
USA గ్రీటింగ్స్. com అనే సంస్థలో నేను ఆనిమేషన్ నేర్చుకునేందుకు చేరాను. ఉదయం చేత్తో బొమ్మలు వేస్తూ, సాయంత్రం ఖాళీ గా ఉన్నసమయంలో సిస్టం ఆపరేట్ చెయ్యడం నేర్చుకున్నాను. సాయంత్రం వేళ కంప్యూటర్లు ఖాళీగా ఉండేవి కనుక, నేనే సాధన చేసి ఫోటోషాప్, ఫ్లాష్ నేర్చుకున్నాను. అదే సమయంలో నా వివాహం జరగడంతో చీరాల తిరిగి వచ్చేసాను.
తర్వాత మరి ఎక్కడ ఉద్యోగం చేసారు ?
హైదరాబాద్ లో పనిచేస్తూ ఉండగానే, చందమామ విశ్వనాథ్రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. మద్రాస్ లో ఒక ఉద్యోగం ఉంటే ఇచ్చారు. అక్కడే 5 ఏళ్ళు పనిచేసాను. కుటుంబంతో సహా చెన్నై షిఫ్ట్ అయ్యాను.
ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... నేను చిన్నప్పుడు ఆరాధించిన చందమామ బొమ్మల స్రష్ట ‘ఆర్టిస్ట్ శంకర్’ గారితో కలిసి ఇక్కడే పనిచేసాను. పసిపాప వంటి స్వచ్చమైన మనసు వారిది. నా బొమ్మలు చూసి ఎంతగానో మెచ్చుకునేవారు. కంప్యూటర్ పై నేను గీసే బొమ్మలను చాలా ఆసక్తిగా గమనించేవారు.
5 ఏళ్ళ తర్వాత ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి, చెన్నై లో ‘గోవింద్ హిలాని’ గారనీ, వారి వద్ద దాదాపు ఏడాది పాటు ఆనిమేషన్ క్యారెక్టర్ డిసైనింగ్ నేర్చుకున్నాను. ఆనిమేషన్ సినిమాలు తియ్యడం నేర్చుకున్నాను. ఇవి చేసేటప్పుడే US ఆధారిత కంపెనీ ఒకటి పిల్లల పుస్తకాలు చేసేది, వారికి ఏడాది పాటు పనిచేసాను.
మీరు ఆనిమేషన్ చిత్రాలు ఏవైనా చేసారా ?
‘కమ్లు’ అనే ఇంగ్లీష్ ఆనిమేషన్ చిత్రం చేసాను. కాని, దురదృష్టవశాత్తూ అది బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని విదేశీ సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేసాను.
ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ?
క్యాంపు ఫైర్ గ్రాఫిక్ నోవెల్స్ అనే సంస్థ ఢిల్లీ లో ఉంది. వీరు నా పోర్ట్ ఫోలియో చూసి, నన్ను ఉద్యోగిగా తీసుకున్నారు. నేను ఈ కంపెనీ లో తొలి ఉద్యోగిని. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ లు వస్తూ ఉంటాయి.
మీరు అందుకున్న ప్రశంసలు, అభినందనల గురించి చెబుతారా ?
బొమ్మలు చూసినవారు ఎవరైనా అభినందించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. తోటి ఆర్టిస్ట్ లు, చాలామంది మెచ్చుకునేవారు. శంకర్ గారు ప్రోత్సహిస్తూ, తన అనుభవాలు చెప్పేవారు. నేను చందమామ జూనియర్ కోసం చేసిన ‘కార్టూన్ స్టైల్ ఇల్లుస్త్రేషన్’ లు చాలా ఆసక్తిగా చూస్తూ, అవసరమైన సూచనలు ఇచ్చేవారు.
నేను వడ్డాది పాపయ్య గారి బొమ్మలకు వీరాభిమానిని. ఈ తరంలో అన్వర్ గారు చాలా కష్టపడి పనిచేసే గొప్ప ఆర్టిస్ట్. ఆయన నా బొమ్మలు చూస్తే, ఫోన్
చేసి మరీ అభినందిస్తారు.
మీరు భావి ఆర్టిస్ట్ లకు ఇచ్చే సందేశం, మీ భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పండి.
నా అదృష్టం ఏమిటంటే, నేను ఎక్కడా స్ట్రగుల్ అవలేదు. చెన్నై, ఢిల్లీ వంటి చోట్ల పనిచేసాకా, కష్టపడితే నెగ్గుకురాగలము అన్న నమ్మకం కలిగింది. మనం యెంత బాగా బొమ్మలు వేసాము అన్నది మాత్రమే కాక, దాన్ని సరైన చోటకి , వ్యక్తులకి చేర్చడం కూడా ఎంతో ముఖ్యం.
ఇక పెయింటింగ్స్ వెయ్యాలని, గ్రాఫిక్ నొవెల్స్ చెయ్యాలి అన్నవి నా భవిష్యత్ ప్రణాళికలు. గ్రాఫిక్ నవలలు అంటే – కామిక్ నలలలకి ఎక్స్టెండెడ్ వెర్షన్ అన్నమాట. ఇవి చెయ్యాలని అనుకుంటున్నాను.
కృతఙ్ఞతలు రాజేష్ గారు, ఎన్నో చక్కటి విషయాల్ని తెలియచేసారు.
కృతజ్ఞతలండి.
మీరు ఇంతవరకూ తయారైన బొమ్మలనే చూసి ఉంటారు... కాని ఒక బొమ్మ తయారు చేసేటప్పుడు దశల్ని మనకు అందిస్తున్నారు – రాజేష్ గారు – చూడండి...
0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top