అంతకంతకు గాలినణగునా యనలంబు

                  (అందమయిన కవిత్వానికి అక్షరాకృతి ఇచ్చిన అన్నమయ్య కీర్తన విశేషాలు)

 రేకు 19-3  సంపుటము  5-110 కీర్తన

- డా. తాడేపల్లి పతంజలి


అంతకంతకు గాలినణగునా యనలంబు 
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెగాక 
క్రమక్రమంగా, కొద్దికొద్దిగా వీచే గాలులకు అగ్ని ఆరిపోతుందా? కాని- అలమేలుమంగ నిశ్వాసాల గాలులకు , ఆమెలోని ఆకలి అనే నిప్పు ఆరిపోయింది.   
 కలువలూరక నీటఁ గందునా యెందైన 
జెలియకన్నీరిట్లజేసెగాక 
నీటిలో పుట్టిన కలువ పూలు నీటిలో కందిపోతాయా? కాని- అలమేలుమంగ కన్నీటిలో – ఆమె కళ్లు అనే కలువ పూలు కందిపోయాయి. చెలి కన్నీరు ఇంత పని చేసింది.   
 జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల 
నలచి మదనాగ్ని వదనము నొంచెగాక 
ఆ సూర్యుడు తనకు  ఇష్టమైన పద్మాన్ని వికసింపచేస్తూ చల్లదనాన్ని ఇస్తాడు , వేడిని చల్లడు. కాని - బాధించి, శ్రమపెట్టి అలమేలుమంగ మొగమనే పద్మాన్ని ఆ ,మన్మథుడనే అగ్ని స్వరూపుడైన సూర్యుడు బాధకు గురి చేస్తున్నాడు.   
విరులకునుదుమ్మిదలు వెరచునా యెందైన 
మరుబాణముల నెరులు మలగెగాక 
పూలకెక్కడయినా తుమ్మెదలు భయపడతాయా? కాని- అలమేలుమంగ కురులనే నల్ల తుమ్మెదలు – మన్మథుని బాణాలనే పూల భయంతో వంకరయిపోతున్నాయి.తిరిగిపోతున్నాయి.   
సరుస మంచునదీగె వాడునా యెందైన 
అరిది చెమటలనె దేహము నొగిలెగాక 
మంచు పక్కన ఉన్న తీగె ఎక్కడైనా వాడిపోవటం విన్నామా? కాని- ఆశ్చర్యకరంగా శరీరముపై  రతిశ్రమతో మంచుబిందువుల్లా ప్రవహిస్తున్న చెమటలతో నా అలమేలుమంగ శరీరము అనే తీగ శ్రమపడి వాడిపోతోంది.   కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల 
కొమరె గుబ్బలమీఁదఁ గూడెఁ గాక 
కలువలకు హితము చేసే చంద్రుడు తనంటే ఇష్టపడని చక్రవాక పక్షులతో కలిసి ఉండటం ఎక్క డైనా చూసామా? కాని- అప్పుడే యౌవనం పొడమిన ఈ అలమేలుమంగ అనే చంద్రునితో – ఆమె స్తనములనే చక్రవాక పక్షులు కలిసిపోయి జీవిస్తున్నాయి.   
  తిమిరంబు తిమిరమునఁ దెమలునా యెందైన 
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక 
చీకటి చీకటి తో ఎక్కడయినా కదులుతుందా?  తొట్రుపడుతుందా?. చెదరిపోతుందా? పని  పూర్తిచేసికొంటుందా? కాని- నాయకుని రమింపచేసే మా అలమేలుమంగ – వేంకటేశ్వరుడనే చీకటితో –రతి పారవశ్యము అనే  చీకటిలో – తెలియని పరవశములో – తేలిపోతోంది.

విశేషాలు

సమాలు కాని  రెండింటికి సంబంధం వర్ణిస్తే  అది విషమాలంకారం అంటారు. పై కీర్తనలో విషమాలంకారం ఉంది. అంతకంతకు గాలినణగునా యనలంబు అనలము  అనే పదానికి రెండు రకాలుగా వ్యుత్పత్తి చెబుతారు. అనంతి  జీవంత్యనేన లోకా ఇత్యనలః  - అన ప్రాణనే- ఇతని చేత లోకములు జీవింపుచున్నవి కనుక అనలుడు. ‘కట్టెలు నాకు ఇన్ని చాలు’ అని చెప్పని వాడు కాబట్టి అనలుడు.ఇటువంటి విశిష్టార్థములు కలిగిన అనల శబ్దాన్ని ప్రయోగించి అన్నమయ్య భావానికి ఉన్నతి కలిగించాడు. కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల చక్రవాక పక్షులకు సూర్యోదయమంటే చాలా ఇష్టం. రాత్రి, చంద్రుడు వాటికి గిట్టదు. ఆది శంకరాచార్యులవారు  తమ శివానంద లహరి లోని ఒక శ్లోకంలో చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షించినట్టు  భక్తుని హృదయం పరమాత్మ పాదాలను చేరాలని తహతహలాడుతుందని చెప్పారు.(హంసః పద్మవనం సమిచ్ఛతి … శ్లోకం) ఈ చక్రవాక పక్షుల కల్పనలలో రాయలవారిది ప్రథమ తాంబూలం. వృతరఘూత్తమ శాపమొక్కింత విడిచి/విడిచి కడకేగ నప్పుడప్పుడకవిసెడు చక్రయుగ మన రొమ్మొయ్యనాక్రమించి /కొమిరెచన్నులు పృథుచూచుకముల నమరె సీతాదేవి విరహాన్ని  అనుభవిస్తున్న రాముడు  చక్రవాక పక్షులకు రాత్రిపూటవిరహము కలగాలని శాపమిచ్చాట్ట.  అందువల్ల  గోదాదేవి స్తనముల రూపములో   పగటిపూట చక్రవాక పక్షులు దగ్గరగా కలుసుకొన్నాయి. జీవాత్మ, దేహం- రెండూ కలిసి ఉండి విషయసుఖాలను అనుభవించి మృతి చెందగానే విడిపోయి పునర్జన్మలో తిరిగి కలుసుకుంటాయి.అలాగే చక్రవాక పక్షుల జంట పగలంతా కలిసి క్రీడిస్తూ రాత్రవగానే  ఒకదానినొకటి విడిచి దూరంగా పోతాయి. మళ్లీ తెల్లవారగానే కలుసుకొంటాయని చక్రవాకీచక్రవాకన్యాయం వివరిస్తుంది. అన్నమయ్య ఈ బాటలోనే ఈ కీర్తనలో చక్రవాక వర్ణన చేసాడు.స్వస్తి.
********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top