ఇలా ఎందరున్నారు ?- 9 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 9

Share This

ఇలా ఎందరున్నారు ?- 9  

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ ధ్యాసలో చదువును నిర్లక్ష్యం చేస్తున్న సంకేతను టైం పాస్ కు ఎవరితో తిరిగినా, చదువు పై ధ్యాస పెట్టమని, మందలిస్తూ ఉంటుంది పల్లవి. ఇక చదవండి... )
ఈ మాటలు సంకేత చెవికి ఏ మాత్రం చేరలేదు.
“అదే శివాని చూడు! నాకు తెలిసి నాలుగో అబ్బాయితోనే ఎక్కువ కాంటాక్ట్ లో వుంది. ముందు పరిచయం అయిన ముగ్గురు అబ్బాయిలతో బ్రేక్ అప్ అయింది. తనకి ఇప్పుడు వాళ్ళ అవసరం కూడా అంతగా లేదు. వాళ్ళకీ శివాని అవసరం ఉండకపోవచ్చు. హిందూ ఎవరికీ తెలియకుండా చాలాచాలా మెయిన్టెయిన్ చేస్తోంది. ఎవరికీ తెలియదు కాబట్టి హిందూ మహామహా యోగి...” అంది పల్లవి. తను పిలిచినపుడు తన స్కూటీ మీద బయటకి రాలేదన్న కోపంతో హిందూ మీద అబద్ధం చెప్పింది. అది తెలియక సంకేత అప్రతిభురాలై “హిందూ కూడానా?” అంది.
పల్లవి ఆశ్చర్యపోతూ “అసలేంటే నువ్వు? హిందూ కూడానా అంటున్నావ్? హిందూకి ఏం తక్కువ? నాకు తెలిసి హార్మోన్స్ ప్రాబ్లం లేదు. నాలాగ ఒబేసిటీ ప్రాబ్లం కూడా లేదు. ఇంకేంటి చెప్పు! కానీ నువ్వు నా దృష్టిలో అందరికన్నా భిన్నమైన దానివి. చదువుల దారిలో నడుస్తున్న దానివి. ఆ దారిని మార్చుకోకు...” అంది పల్లవి. సంకేతకి పల్లవి చివర్లో అన్న మాటలు ఏ మాత్రం ఎక్కలేదు.
సంకేత చాలా నెమ్మదిగా “హిందూ కూడా అలా వున్నప్పుడు అనంత్ కి నేను ‘ఐ లవ్ యు’ చెబితే తప్పేంటి?’ అంది ఆలోచనగా ఎటో చూస్తూ.
పల్లవి వెంటనే ఇంతింత కళ్ళు చేసి చూస్తూ ‘ఇంకా చెప్పలేదా?’ అంది ఆశ్చర్యపోతూ.
“చెప్పలేదే! రేపు చెబుతాను. ఇప్పటికే లేటయిందేమో కదా! పాపం అనంత్ ఏ రోజుకారోజు వెయిట్ చేస్తూనే వున్నాడు తెలుసా? నేనే ఆలోచిస్తున్నా... చెప్పాలా! వద్దా! అని...” అంది సంకేత.
“ఆ ఒక్క పదాన్ని చెప్పకుండా అంత భద్రంగా లాకర్లో పెట్టుకోవడం ఎందుకమ్మా! అదేదో పెద్ద ఆస్తి లాగా? భవిష్యత్తులో ఉద్యోగం రాకపోయినా దాంతో బతికేద్దామనా...?” అంటూ ఎత్తిపోడిచింది వెటకారంగా పల్లవి.
“అదికాదు పల్లవీ! నా మనసు గురించి నేను కూడా బాగా స్టడీ చేసుకోవాలి కదా! అనంత్ విషయంలో నేను పూర్తిగా ప్రిపేర్ అవుతున్నానో లేదో నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి కదా! అతనితో ఇదే స్థాయిలో జీవితాంతం వుండగాలనో లేదో ఆలోచించుకోవాలి కదా!” అంది.
పల్లవికి ఆ మాటలు నచ్చక నుదుటి మీద టపటప కొట్టుకుంది...
“పిచ్చి దానిలా ఎందుకలా కొట్టుకుంటావ్?” అంది సంకేత.
“ఎందుకంటే ఏం చెప్పను సంకేతా! దేన్ని లైట్ తీసుకోవాలో దేన్ని లైట్ తీసుకోకూడదో ఇప్పటి అమ్మాయిలకి తెలిసినంతగా నీకు తెలియటం లేదు. మొన్న శివాని కూడా ‘పరిచయం అయిన ప్రతి అబ్బాయి హీరో అన్నట్టు ఫీల్ కావటానికి నేనేమైనా మెచ్యురిటి లేని పదిహేనేళ్ళ అమ్మాయినా? నాకు ఏది ఎంజాయ్ అనిపిస్తే అది చేస్తాను’ అంది. నువ్వలా ఎందుకు అనుకోలేకపోతున్నావ్? అనంత్ ని వదిలేసి చదువుతో ఎందుకు ఎంజాయ్ చెయ్యలేవ్?”
సంకేత బాధగా తలపట్టుకుని “నేను బాగా డిస్టర్బ్ అయ్యాను పల్లవీ! శివాని లాగా, శ్రావ్య లాగా, ఇంకొకరి లాగా నేనుండలేను. నా ఫీల్ కో అర్ధం వుంది. ఉద్దేశం వుంది.” అంది. అలా అంటున్నప్పుడు చిరుగాలికే కదిలే చిగురాకులా వణికింది.
షాకింగ్ గా చూసింది పల్లవి. పల్లవి తేరుకొనే లోపలే...
“పల్లవీ! రేపు నేను నిట్ క్యాంపస్ కి వెళ్తున్నాను. అనంత్ రమ్మన్నాడు. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయట.. నువ్వూ వస్తావా?” అంది.
“నేను రాను...” అంది పల్లవి.
పల్లవికి సంకేత ఎమైపోతోందో అర్ధం కాకుండా వుంది. సంకేతను చూస్తుంటే అనంత్ అనే డ్రగ్ కి ఎడిక్ట్ అయిన రోగిలా అనిపిస్తోంది. ఇలాంటి పరిచయాలు డ్రగ్స్ లాంటివని తెలిసివుంటే అనంత్ కి సంకేతను పరిచయం చేసి ఉండేది కాదు. సంకేతను అనంత్ కి పరిచయం చేసి తప్పు చేసానేమో అని తొలిసారిగా బాధపడింది పల్లవి.
*****
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తో స్ప్రింగ్ స్ప్రీ – 2011 ఆర్భాటంగా ప్రారంభమయింది. అందులో అంతర్జాతీయ అంశాలతో పాటు మెదడుకు మేత, మొహంపై కుంచెలతో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించిన ‘ఫేస్ పెయింటింగ్’ విద్యార్ధుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి...
అంతేకాదు.. ప్రపంచ దేశాల్లోని పాలనాపరమైన అంతర్గత విషయాలు, మానవహక్కులు, శరణార్ధుల హక్కులు, నియంతల పాలనా అంశాలు, ఏకవ్యక్తి పాలనను నిరసిస్తూ ప్రజల తిరుగుబాట్లపై మినీ ఐక్యరాజ్య సమితిని తలపించేలా నిట్ మోడల్ యునైటెడ్ నేషన్ (నిట్మున్) ను నిర్వహించారు. బోస్నియా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, బెల్జియం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇటలీ, ఆర్జెంటినా, ఇండోనేషియా, సౌదీఅరేబియా, అమెరికా, ఇంగ్లాండ్, జోర్డాన్ దేశాల ప్రతినిధులుగా విద్యార్ధులే వ్యవహరించారు... ఆయుధాల నిరాకరణ, సైబర్ క్రైమ్స్, అంతర్జాతీయ భద్రతపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు ‘యస్’ మోషన్, ‘నో’ మోషన్ ను మూవ్ చేసారు.
జెర్మనీ కి చెందినా స్ట్రీట్ పెయింట్ ఆర్టిస్టులు జెబ్ స్టార్ లూమిట్ రూపొందించిన ‘ఆల్ సిటి’ లఘు చిత్రాన్ని నిట్ న్యూ సెమినార్ లో ప్రదర్శించారు...
ఆ తర్వాత నిట్ ఆడిటోరియం లో చిత్ర్ – 2001 ఫోటో ఎగ్జిబిషన్ ను నిట్ డైరెక్టర్ ప్రారంభించారు.. గ్లాస్ పెయింటింగ్, పెన్సిల్ పెయింటింగ్ ఆర్ట్ పెయింటింగ్ తో గ్లోబల్ వార్మింగ్, వార్మింగ్ తో పాటు వివిధ అంశాలపై ప్రదర్శించిన చిత్రాలు అత్యద్భుతంగా నిలిచాయి.
స్పోర్ట్స్ కిజ్, స్లిప్ ఆన్ సోప్, ఇ-ప్లాన్, వర్డ్లీ ప్రైజర్ (వర్డ్ గేమ్) ఇంగ్లీష్, హిందీ, జాం, హిందీ డెబిట్, గేమ్ డోమ్, తెలుగు పద్యాలపోటీ, ఇమేజ్ హంటర్, బి.బాయింగ్, స్ట్రీట్ ఎక్స్, ఇన్ఫార్మల్స్ లో ఆటపాటలు, మ్యూజిక్ హంగామా, ఫాషన్ షో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టే ఇంజనీరింగ్ విద్యార్ధులు ఆ కాసేపు కాసింత రిలీఫ్ అయ్యారు. వాళ్ళకిప్పుడు క్లాసుల్లేవ్, లాబుల్లేవ్, చదువుల్లేవ్, పరీక్షల్లేవ్, ఆనందానికి అవధుల్లేవ్. ఆ వసంత ఆగమనానికి 20 రోజులు ముందుగానే నిట్ లో వాలిన ఆ సాంకేతిక యుగ కోయిలలు కొత్త రాగాలను ఆలపించారు. క్యాంపస్ కి కొత్త చిగుర్లు తొడిగారు.
చివరగా ఆ రోజు రాత్రి స్ప్రింగ్ స్ప్రీ – 2011 ముగింపు సందర్భంగా జరిగిన రాక్ షో అందరిని ఆకట్టుకుంది.. ఎవరి ఆనందంలో వాళ్ళుండగా అనంత్, సంకేత అందరికన్నా ముందుగా లేచి బయటకి నడిచారు.
అనంత్ సంకేతను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని తన గదికి తీసుకెళ్ళాడు. సంకేత అంతవరకు ఎప్పుడూ అనంత్ గదికి వెళ్ళలేదు. అనంత్ అడిగినా ఏదో ఒక సాకు చెబుతుండేది. ఇప్పుడెందుకో అలా చెప్పాలనిపించలేదు. రోజురోజుకీ ఇతను ‘నావాడే’ అన్న ఫీలింగ్ ఆమెలో బలంగా కలుగుతోంది. దేన్నీ లెక్కచేయని తత్త్వం, దాన్ని మించి ఏదీ ముఖ్యం కాదన్న భావం.. ఇతనొక్కడే నా సర్వస్వం అన్న అభిప్రాయం బలపడిపోయింది.
అనంత్ గది నిండా పుస్తకాల కన్నా ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా వున్నాయి. ఎప్పుడు చదువుతాడో ఏమో చదువు కూడా లాప్టాప్ లోనే చాడువుతానంటు ఉంటాడు. పుస్తకం పట్టుకోవాలంటే అతనెందుకో ఇష్టపడడు. ప్రస్తుతం విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడుతున్న వీడియో లెక్చరర్లు, యానిమేషన్ వీడియోలు, ఆడియోల పైనే ఎక్కువగా ఆధారపడుతుంటాడు.
అవైతే మనం కోరుకున్న సమయంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూస్తూ, వింటూ నేర్చుకోవచ్చని అంటాడు. అందుకు అనుకూలంగా అతని దగ్గర లాప్టాప్ వుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది.. మరి ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేని తనలాంటి వాళ్ళు ప్రతి రోజు కాలేజీకి వెళ్ళాల్సిందే! చచ్చినట్లు క్లాసులు వినాల్సిందే రోప్పుకుంటూ ఇళ్ళకి రావలసిందే!
అంతేకాదు... కంప్యూటర్ లేకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ‘మైద్రోణ’ అనే వీడియో, ఆడియో ప్లేయర్ ఒకటి కొత్తగా రాబోతుందట. ఇది తమ ప్రత్యేకమైన ఇంటెలిజెంట్ సెర్చింగ్ ద్వారా అంతర్జాలంలో గాలం వేసి పట్టుకున్న అత్యుత్తమ మెటీరియల్ ను, ఎల్.కే.జీ నుంచి ఇంటర్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసెట్, ఏఐఈఈఈ, టోఫెల్, జీర్ఈ, జీమాట్ లాంటి పరీక్షలకి ఉపకరించే దృశ్య శ్రవణ పాఠాలను అందుబాటులోకి తెస్తుందట. విద్యార్ధులకి కావలసిన తరగతుల స్టడీ మెటీరియల్ ను కూడా దీనిలో నింపి ఇస్తారట.. ఇది మొబైల్ ఫోన్ పరిణామంలో వుండే ఎలక్ట్రానిక్ ఈ-లెర్నింగ్ పరికరం అట... ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా రాబోతున్న ఈ ‘మైద్రోణ’ పరికరం కోసం తను బాగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు అనంత్...
అలాంటి అత్యుత్తమమైన అభిరుచి వున్న అనంత్ కి తను ఇంత దగ్గరగా రావడం అనేది తనకి తగిన ప్రాప్తం కాదు. ఇది ఏ జన్మలో తెచ్చుకున్న వరమో! పుణ్యమో! యోగమో! ఏ కోటీశ్వరుని కడుపునా పుడితేనో తప్ప ఇలాంటి పరిచయాలు సాధ్యమయ్యేవి కావు. కానీ తనకి సాధ్యం అయింది కదాని తను నిర్లక్ష్యం చెయ్యదు. అపురూపంగా గుండెలకి హత్తుకుంటుంది. దోసిట్లో దీపంలా పదిలంగా కాపాడుకుంటుంది.
నిజానికి మట్టిలో పుట్టిన మట్టి మనిషి అయిన తను అనంత్ వల్లనేగా ఇంత పెద్ద అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ద్వారా పైకి వచ్చి అయిదవ అంతస్తులో వున్న ఈ గదిలోకి రాగలిగింది. వచ్చేటప్పుడు గేటు ముందున్న వాచ్మెన్ కాని, లిఫ్ట్ దగ్గరున్న లిఫ్ట్ బాయ్ గాని అనంత్ ను చూడగానే ఎంతో వినయంగా సెల్యూట్ చేసారు. ఆ క్షణంలో తన కళ్ళకి అనంత్ ఎంతో హుందాగా కన్పించాడు. అంతేకాదు అతని ప్రవర్తనలో కూడా చాలా రిచ్ లుక్ కనిపిస్తోంది. అసలు ఈ వాతావరణమే తనకి కొత్తగా వుంది. ఇష్టంగా వుంది. ఎప్పటికి ఇక్కడే వుండిపోవాలనిపిస్తోంది.
సంకేత భుజం తట్టి “ఏంటి! ఆలోచిస్తూ అలాగే నిలబద్దావ్! కూర్చో!” అన్నాడు.
ఆ గదిలో ఎటు చూసినా కుర్చీలు కాని, కాట్ కాని లేవు. కిందనే ఓ మూలకి ఒక అడుగు ఎత్తులో యూ-ఫోం-బెడ్ వుంది. ఖరీదైన బ్లాంకెట్ తో అందంగా వుంది. దాని మీద ఓ పక్కగా లాప్ టాప్ వుంది. దాన్ని కాస్త జరిపి అతను కూర్చుంటూ సంకేతను కూర్చోబెట్టాడు.. సంకేత ఆశ్చర్యపోతూ “నేనేనా! అనంత్ గదిలో ఇంత రాత్రి వేళ ఒంటరిగా వున్నది?” అని మనసులో అనుకుంటోంది. బయట అతనితో కలిసి ఎన్నెన్ని గంటలు తిరిగినా కలగని విచిత్రమైన ఫీలింగ్ అది.
“నీకే ఈ బహుమతి! ఎలా వుంది సంకేత!” అంటూ ఓ కొత్త సెల్ ఫోన్ ని ఆమె చేతిలో పెట్టాడు అనంత్.
ఉలిక్కిపడి చూసింది సంకేత... అది చూడగానే ఆమె ఒళ్ళు ఝల్లుమంది. కళ్ళు జిగేల్మన్నాయి... ఆమెకు.. వెంటనే.. “నీకు సెల్ ఫోన్ లేదు కదూ!” అంటూ స్నేహితులు మాట్లాడిన మాటలు, వాళ్ళ చేష్టలు గుర్తొచ్చాయి.
అయినా కూడా మొహమాటంగా చూస్తూ “ఇప్పుడు నాకీ సెల్ ఫోన్ దేనికి? వద్దు అనంత్!” అంది.
“ఇది నీ కోసం కాదు. నా కోసం...”
“నీ కోసమా!!”
“అవును! నేను నీతో మాట్లాడకుండా ఉండలేను కదా! అలాంటప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ లేకుండా నేను ఎలా మాట్లాడాలి? అందుకే ఆ ఇబ్బందిని నేను పడలేక నీ కోసం ప్లస్ నా కోసం కొన్నాను.. నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవు కదా?” అన్నాడు.
ఉండలేను అన్నట్టు తల ఊపింది వెంటనే...
“సరే! దీన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో చెబుతాను చూడు..” అంటూ సెల్ ఫోన్ చేత్తో పట్టుకుని ఆమెకు కన్పించేలా కూర్చున్నాడు.
ఆమె దాని వైపే చూస్తూ అతను చెప్పేవి వింటోంది. ముందుగా సెల్ ఫోన్ లాక్ తీసాడు. కాల్స్ ఎలా డయల్ చెయ్యాలో, ఎలా రిసీవ్ చేసుకోవాలో, మిస్డ్ కాల్స్ ని ఎలా చూడాలో, మెసేజెస్ ఎలా ఇవ్వాలో, ఎలా చూడాలో నేర్పాడు.  కాంటాక్ట్ లో కి వెళ్లి తన నెంబర్ ని ఫీడ్ చేసి “నీకు ఎప్పుడొచ్చినా ఇదే నెంబర్ నుండి కాల్ వస్తుంది. రిసీవ్ చేసుకో. నీకు మాట్లాడాలనిపించినప్పుడు ఇదే నెంబర్ కి డయల్ చేసి మాట్లాడు.. అప్పుడప్పుడు ఇందులో బాలన్స్ వేయిస్తాను. నో ప్రాబ్లం!” అన్నాడు.
ఆ తర్వాత గేమ్స్ లో కి వెళ్ళాడు.
“ఇందులో బోలెడన్ని గేమ్స్ వుంటాయి. ఇవన్నీ టైం పాస్ కే... ఇవి నీకు వద్దు. ఏదైనా పజిల్ గేమ్ నేర్పిస్తాను” అన్నాడు.
అదేమిటో అన్నట్టు ఆసక్తిగా సెల్ ఫోన్ వైపే చూస్తోంది సంకేత.
వెంటనే అనంత్ మెనూ లోకి వెళ్ళాడు. అందులో అప్లికేషన్ సెలెక్ట్ చేసాడు. అప్లికేషన్స్ లో గేమ్స్ లో ‘సుడోకు’ అనే న్యూమరిక్ పజిల్ ఓపెన్ చేసాడు. ముందుగా వాటి కండిషన్స్ చెప్పాడు.
“ఇదిగో ఇక్కడో చార్ట్ కన్పిస్తోంది చూడు. ఇందులో మూతం 81 గడులు 9x9 ఫార్మాట్ లో డివైడ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి వరసలో అడ్డంగా, నిలువుగా 1 నుండి 9 అంకెలతో నింపాలి. అలాగే ప్రతి 3X3 చదరం లోను 1 నుంచి 9 అంకెలు నింపాలి. వచ్చిన అంకె మళ్ళీ రాకుండా చూడాలి. అలా ఆ 81 గడులు నింపితే ఆట పూర్తయినట్లు.. దీనికి టైం లిమిట్ కూడా ఉంటుంది. మనం యెంత తక్కువ టైం లో ఆ గడులను నింపగలిగితే అంత ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇది టైం పాస్ కి మాత్రమె కాకుండా బుర్రకి పదును పెట్టే ఆట.. మన సెల్ ఫోన్లో వంద వరకు సుడోకులు స్టోర్ అయి వుంటాయి.
ఈ సుడోకులలో కూడా 5 రకాలు వున్నాయి. 1 వెరీ సింపుల్ 2. సింపుల్ 3. మీడియం 4. హార్డ్ 5. డిఫికల్ట్ మన సమర్ధతను బట్టి మనం ఏది కావాలో అది ఆడుకోవాలి. ప్రతి రకంలోను వందకు పైగా సుడోకులు స్టొరయివుంటాయి. మొదట్లో వున్నా సుడోకులు ఈజీగానే వుంటాయి. పోను పోను ఆడటానికి కొంచెం టైం తీసుకుంటాయి.
ప్రతి సుడోకు కొన్ని నంబర్స్ ఆటోమేటిగ్గా డిఫాల్ట్ గ వస్తాయి. వాటిని ఆధారం చేసుకుని మనం ఖాళీగా వున్నా గదులను పైన చెప్పిన విధంగా నింపాలి. ఇది చేస్తుంటే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చిన్నచిన్న విషయాలకి డిస్టర్బ్ కాకుండా కూడా వుంటాం! సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది” అన్నాడు.
ఆ గేమ్ సంకేతకు నచ్చినట్లు ఆమెలో కుతూహలం పెరిగింది. ఇంకా ఏమైనా వుంటే చెప్పమన్నట్టు చూస్తోంది.
అనంత్ రిలాక్స్ గా బెడ్ మీద ఒరిగి, సెల్ ఫోన్ లోకి చూస్తూ ఏవేవో ఆప్షన్స్ వెతుకుతున్నాడు.
“ఇదిగో సంకేతా! ఇది చూడు... సరదాగా నవ్వుకోవాలనిపించినప్పుడు మెమొరీ కార్డు లో సేవ్ చేసుకున్న స్నేహితుల ఫోటోలను నవ్వు పుట్టించేలా రూపాన్ని మార్చేసి పిక్చర్ మెసేజ్ పంపాలనుకుంటే ఇక్కడో ఎఫ్ 4 మై ఫేజ్ అప్లికేషన్ వుంది. టూల్ ను ఇన్స్టాల్ చేసి ఫోటోను ఎంచుకుని ముఖంపై డ్రాగ్ చేస్తూ సాగాదీయవచ్చు. బిగ్ హెడ్ తో తల పెద్దదిగా మార్చేయవచ్చు. ఫ్యాట్ ఫేస్ తో ముఖానికి కొవ్వు పట్టినట్లుగా చేయవచ్చు.. ఇలా మొత్తం 15 ఆటోగ్రాఫ్ ఆప్షన్లు వున్నాయి. వీటిలోకి వెళ్లి అప్పుడప్పుడు నువ్వు పల్లవితో ఆడుకో... ఏడ్చి ఊరుకుంటుంది. నువ్వు నవ్వుకోవచ్చు. పల్లవి ఇలాంటి సరదాలంటే బాగా ఇష్టపడుతుంది, ఏడవదు...” అన్నాడు.
ఇలాంటివి చేస్తే పల్లవి ఏడుస్తూనే ఎలా నవ్వుతుందో ఒక్కసారి ఊహించుకొని కదిలి, కదిలి నవ్వింది సంకేత.
... నవ్వుతున్న సంకేతను తన గుండెల మీదకి లాక్కున్నాడు. ఆ చర్యకి ఆమె కురులు అతని ముఖాన్ని కప్పేసాయి. వాటిని నెమ్మదిగా తొలగిస్తూ.. ఇయర్ ఫోన్స్ తీసి ఆమె చెవులకి పెట్టాడు.
... ఆమె వాటిని చూడగానే భయపడుతున్న దానిలా మెల్లగా వాటిని తీసి చేతిలో పట్టుకుంటూ “మ్యూజిక్ మేనియాగా మారిన ఇయర్ ఫోన్స్ వినియోగంతో ‘నాయిస్ ట్రోమా’ అనే వినికిడి జబ్బు వచ్చే అవకాశం వుందట అనంత్! వీటిని పక్కన పెడదాం!” అంది.
అనంత్ నవ్వి “అవసరంలేదు సంకేతా! ఇది బ్రాండెడ్ కంపెనీకి చెందినా ఫోన్! దీనివల్ల అలాంటి ఇబ్బందులు ఉండవు. అదీకాక ఇవి బాహ్య చెవికి ఇమిడే ఇయర్ ఫోన్స్! పెద్ద శబ్దాలు, స్టీరియో కాకుండా స్పీకర్ లను మోనోలో పెట్టుకుని విను ఏం కాదు” అన్నాడు.
సంకేత కళ్ళు నిజంగానే తడిసాయి. ఫోనే కాదు. అనంత్ కూడా బ్రాండెడ్! ఇలాంటి సెల్ ఫోన్ ని తాకే అర్హత కూడా తనకి లేదేమో అని ఒకప్పుడు అనుకుంది... అలాంటిది అంత మంచి బ్రాండెడ్ సెల్ ఫోన్ తన సొంతం కావడం, అనంత్ కూడా తన మనిషి కావడం నిజంగానే యోగం... అని ఆమె మనసులో అనుకుంటుండగా అనంత్ సెల్ ఫోన్ రింగయింది స్క్రీన్ పైన ‘పెద్దనాన్న’ అని పడగానే వెంటనే లిఫ్ట్ చేసి, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి...
“చెప్పు పెదనాన్నా!” అన్నాడు అనంత్.
“ఎక్కడున్నావ్ అనంత్? నేను ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది. నువ్వు వెళ్లి మీ పెద్దమ్మకి తోడుగా పడుకో!” అన్నాడు.
“నేను కూడా రావడం ఆలస్యం అవుతుంది పెదనాన్న! నిట్ కాలేజీ ప్రోగ్రామ్లో వున్నాను...” అంటూ అబద్ధం చెప్పాడు.
“సరే! మీ పెద్దమ్మకి కాల్ చేసి మాట్లాడతానులే!” అంటూ ఆయన కాల్ కట్ చేశాడు. ఆయన పేరు దేవరాయుడు. ఆయన అనంత్ పెద్దమ్మకి భర్త.
అనంత్ అబద్ధం చెబుతుంటే తొలిసారిగా ఆశ్చర్యపోయింది సంకేత. అలా ఎందుకు చెప్పావు అన్నట్లు చూసింది.
అనంత్ అది గ్రహించి చిన్నగా నవ్వి “ఆయనతో అలాగే చెప్పాలి. ఆయనకీ అంత అర్జెంట్ పనులేమీ ఉండవు ఈ టైం లో. ఆయనెప్పుడో రిటైరయిపోయాడు. అరవై ఏళ్ళు దాటాయి. రోజూ ఒక గంట సీరియస్ గా వాకింగ్ చేస్తాడు. ఏదో కంపెనీ లో గౌరవ హోదా సంపాయించుకున్నాడు. డే అంటా అక్కడే గడిపేస్తాడు..” అన్నాడు.
మరింకేంటి ప్రాబ్లం అన్నట్లు చూసింది.
సంకేతతో చెప్పాలా వద్దా అన్నట్టు ఒక్క క్షణం ఆగి చెప్పినా ఏం కాదులే సంకేత తనకి బాగా క్లోజ్ కదా అన్నట్లు నోరు విప్పి “ఆయన తన కన్నా వయసులో బాగా చిన్నవాళ్ళయిన ఆడవాళ్ళను తన కార్ లో ఎక్కించుకుని తిరుగుతాదట.. అదీ ఈ సంవత్సరం తిరిగిన వాళ్ళతో ఇంకో సంవత్సరం తిరగకుండా కొత్తవాళ్ళతో తిరుగుతాదట...” అన్నాడు.
సంకేత ఆశ్చర్యపోతూ గబుక్కున తన నోటిని చేత్తో మూసుకుంది. ఎప్పుడూ అలాంటివి వినని దానిలా.
“అంతేకాదు. ఇంటికొచ్చాకా కూడా మా పెద్దనాన్న ఆడవాళ్ళతో గంటలు గంటలు తన సెల్ ఫోన్ తో మాట్లాడుతూనే ఉంటాడట. ప్రతి రోజు నిద్రపోయే ముందు అమెరికా నుండి తెప్పించుకున్న ఖరీదైన మందును ఫ్రిజ్ లో పెట్టుకుని తాగుతుంటాడట. ఇలా ఎందుకు చేస్తున్నావని మా పెద్దమ్మ ఏడిస్తే.. ఆయన చాలా క్యాజువల్ గా ‘పిచ్చిదానా? నేనేమైనా అమాయకుడినై ఇలా చేస్తున్నానని అనుకుంటున్నావా? ఉత్సాహం కోసమే! ఇలా నిత్యం ఉత్సాహంగా వుంటే మా మగవాళ్ళలో కొన్ని గ్రంధులు ఊరి కుర్రతనం వస్తుందట.. నువ్విప్పుడు ఏడుస్తున్నావు కదా! ఈ ఏడుపు కూడా నీ ఆరోగ్యానికి మంచిదే! నువ్విలా ఎడుస్తున్నంత సేపు నీలో కూడా కొన్ని గ్రంధులు అద్భుతంగా పని చేసి రేపటి పనిని ఈ రోజే చేసుకోగలిగే శక్తి వస్తుంది’ అని అంటాడట..” అన్నాడు అనంత్.
సంకేత అలాగే తన చేత్తో నోటిని మూసుకొని, ఊపిరి బిగబట్టి చూస్తోంది. అనంత్ సంకేతను చూసి “చచ్చేలా వున్నావ్! ఏంటా ఎక్స్ప్రెషన్?” అంటూ ఆమె నోటి  మీద వున్న చేతిని లాగేసాడు.. సంకేత ఉచ్చ్వాస, నిశ్వాసలు అప్పుడు ఫ్రీ అయ్యాయి.
“ఆర్ యు ఫ్రీ?”
“ఊ...”
“ఇలాంటివి నువ్వెప్పుడు వినలేదా?”
“ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్లున్నట్లు ఏమిటా ప్రశ్న అనంత్? సడన్ గా మీ పెదనాన్నే ఇలాంటివాడు అంటే జీర్ణించుకోవద్దా?”
“ఆయన మా పెద్దమ్మ దగ్గర ఆడే నాటకాలు షేక్స్పియర్ నాటకాలను మించి వున్నా కూడా బయట ఆయన చాలా పెద్ద మనిషి తెలుసా! ఈ అపార్ట్ మెంట్ లో మా నాన్నగారి లాగానే ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్టనర్! మా నాన్న గారు మా అమ్మ ఖమ్మం లో వుంటారు. మా తమ్ముడు వారణాసి లో ఐఐటి చేస్తున్నాడు. మా నాన్న గారి బిజినెస్ మొత్తం ఖమ్మం ఏరియా లోనే నడుస్తుంది.. నేనొక్కడినే ఇక్కడ, ఈ అపార్ట్ మెంట్ లో వుంది చదువుకుంటున్నాను. నీ పరిచయంతో రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. మా పెద నాన్న, పెద్దమ్మ కూడా ఇదే అపార్ట్ మెంట్ 304 లో వుంటారు... నేను ప్రతి రోజు మా పెద్దమ్మ దగ్గరే తిని ఇక్కడకొచ్చి పడుకుంటాను..” అన్నాడు.
“మరి ఇప్పుడు లిఫ్ట్ బాయ్ తో మనం తినడానికి తిండి, కూల్ డ్రింక్స్ తెప్పించారు కదా! మీ పెద్దమ్మ చూడదా?”
“ఆమె లిఫ్ట్ దగ్గరేమైనా ఉంటుందా చూడటానికి... ఇంట్లోంచి బయటకి రాదు. మా పెదనాన్న గురించే ఆలోచిస్తూ, మా అమ్మ వచ్చినప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. మా అమ్మ మా పిన్నమ్మలతో చెప్పి బాధపడ్తుంటే ఆ మాటలు మాకు వినిపిస్తుంటాయి. అవి నీకిప్పుడు చెప్పను. వదిలేయ్!” అన్నాడు.
“మీ పెదనాన్న మీ నాన్నగారికి సొంత అన్నయ్యనా? లేక మీ అమ్మగారి అక్కయ్య భర్తనా? ఎందుకంటె ఈ విషయంలో మీ అమ్మగారు, మీ పిన్నమ్మలు బాధపడ్తున్నారు. అంటే ఆయన మీ అమ్మగారి అక్కయ్య భర్త అనే నేను అనుకుంటున్నాను... అవునా?”
“అవును! ఆయన మా పెద్దమ్మ భర్త...”
గుండెల మీద చేతులు ఉంచుకుని “హమ్మయ్య” అంది.
ఎందుకు? అన్నట్లు చూసాడు.
“ఎందుకంటె మీకు మీ పెదనాన్న జీన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఫ్యూచర్ లో నేను సేఫ్!” అంది.
“ఓ... అలా వచ్చావా?”
“నాకో సందేహం అనంత్! మీ పెదనాన్నకి ఆడవాళ్ళ ఫాన్సీ బాగావుంది కదా! ఈ పాటికి తన ఆస్తి అంటా పోగొట్టుకుని ఉండాలే... ఇంత పెద్ద అపార్ట్ మెంట్ కి వన్ ఆఫ్ డ పార్టనర్ ఎలా అయ్యాడు?”
“ఈ డౌట్ కూడా వచ్చిందా నీకు? ఆయనతో ఏ స్త్రీ సంబంధం పెట్టుకున్నా ఒక టాక్సీ డ్రైవర్ తో పెట్టుకున్నట్టే... కాకపొతే బేటా తీసుకోడు అంతే!”
“అదేంటి! అర్ధం కాలేదు నాకు...”
“ఆయన మాటల గారడీకి ఆకర్షితులయ్యే ఏ స్త్రీ అయినా ఆయన కార్ లో ఎక్కితే ఆ స్త్రీ డబ్బుతోనే ఆయిల్ ట్యాంక్ నింపిస్తాడట... హోటల్ కి వెళ్లి తిన్నా, ఒక రోజు వున్నా ఆ స్త్రీ చేతనే డబ్బులు కట్టిస్తాడట.. అలా కట్టలేని వాళ్ళు ఆయన జీవితంలోంచి తప్పుకుంటూ వుంటారట. కొత్తవాళ్ళు ప్రవేశిస్తుంటారట.. అర్ధమైందా?”
“అర్ధమైంది. మీ పెదనాన్నాను వెంటనే టి.వి. 9 వాళ్లకి పట్టించాలి. లేకుంటే, ఆయన వల్ల ఇంకా చాలా మంది ఆడవాళ్ళు మానసిక రోగులయ్యే ప్రమాదం వుంది” అంది ఆవేశంగా.
అనంత్ పెద్దగా నవ్వి.. “మరి ఆయనతో అంత రహస్యంగా తిరిగే ఆ ఆడవాళ్ళను పట్టించోద్దా? చూడు సంకేతా! ఆయనతో తిరిగితే వచ్చే లాభం ఎంతో! మానసిక విశ్రాంతి ఎంతో! తప్పు ఎంతో! ఒప్పు ఎంతో! ఎలుసుకోలేని చిన్నవాళ్ళు కాదు వాళ్ళు.. ఎవరికి కావలసిన ఊరట వాళ్లకి దొరకనిదే ఏ మనిషీ ఏ పని చెయ్యదు. మా పెదనాన్న వాళ్ళకే కాదు. మా బంధువర్గంలో బాగా చితికిపోయిన వాళ్లకి కూడా హెల్ప్ చెయ్యదు. మా పెద్దమ్మను కూడా చేయ్యనియ్యాడు.. మహా పిసినారి..”
“మీ పెద్దమ్మ ఏడుస్తోందిగా!”
“ఆమె యెంత ఏడ్చినా మా పెదనాన్న ఆమెకు దేవుడు.. ఆయన చేస్తున్న ఇలాంటి పనులను రెప్పకు కూడా తెలియనంత రహస్యంగా ఉంచుతుంది. తన అక్కయ్యలకు తప్ప ఎవరికీ చెప్పుకోడు. అలా చెప్పి ఇంటి గుట్టును రట్టు చేసుకుని బ్రతికే కన్నా చావటం మేలు అంటుంది” అన్నాడు.
... సంకేత నివ్వెరపోయి చూస్తూ వాళ్ళ పెద్దమ్మ సహనాన్ని గ్రేట్ అనాలో, అసమర్ధత అనాలో అర్ధం కాక “అనంత్! మీరింత రిచ్ కదా! మన కాలేజీ లో ఎందరో అమ్మాయిలూ వుండగా నన్నే ఎందుకు ఇష్టపడుతున్నారు?” అంటూ తన అనుమానాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేసింది.
“ఎందుకూ అంటే! నీ అంత సిన్సియర్ గ నేను చదవలేను. నాలో లేనిది ఎవరిలో కన్పించినా నేను ఇష్టపడతాను. అలా అని నిన్ను ఇష్టపడినంతగా వేరే వాళ్ళను ఇష్టపడను అనుకో! దానికి కూడా కారణం అడగకు.. చెప్పలేను..” అన్నాడు.
గర్వంగా అనిపించింది సంకేతకి.. కానీ ఒకప్పుడు చదివినంతగా కష్టపడి, ఇష్టపడి చదవలేకపోతోంది. మనసును చదువుపై పూర్తిగా నిమగ్నం చెయ్యలేకపోతోంది.. ఎందుకో! ఏమో! అనంత్ కి చదివే వాళ్ళంటే ఇష్టం. తనకేమో అనంత్ అంటే ఇష్టం.
క్షణాలు నిముషాల్లోకి మారుతున్నాయి.
అనంత్ డ్రెస్ మార్చుకుని వచ్చాడు.
ఆటను ఎప్పటిలాగే చాలా విశ్రాంతిగా కూర్చున్నాడు.
లిఫ్ట్ బాయ్ తెచ్చిన ఐటెం ను రెండు ప్లేట్లలో సర్దింది సంకేత.. ప్రస్తుతం తను చేస్తున్న పని చాలా ఇష్టంగా అన్పిస్తోంది. యాదృచ్చికమే అయినా పల్లవి తనకి ఇచ్చిన బహుమతి అనంత్! పల్లవికి ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పుకున్నా సరిపోదేమో! ఈ ధ్యాసలో పడి గేట్ ఎగ్జామ్ బుక్స్ చదవలేదని తెలిస్తే తిడతారు కానీ మానసికంగా దొరికిన ఈ తృప్తి ముందు ఆ గేట్ ఎగ్జామ్ ఏ పాటిది? ఈ తృప్తి కూడా తనకి ఏ రేంజ్ లో దొరికిందో తెలిస్తే తన ఏజ్ అమ్మాయిలు తప్పకుండా అసూయపడతారు. తన ఊరి వాళ్ళు అయితే విపరీతంగా విస్తుపోయి, ‘సంకేత కేంటి! ఈ పొజిషన్ ఏంటి? ఇది నిజమా!’ అని నోరేల్లబెడతారు. ఇది తను మనసా! వాచా! సాధించుకున్న అనంత్ విజయం. ఈ విజయం ముందు మరేదీ సాటిరాదు. ఇది తెలిస్తే శ్రీహర్ష, దాస్ కూడా ‘ఇదెలా సాధ్యమైంది సంకేతకి’ అని అనుకుంటారేమో! ఈ అమ్మాయి ఎప్పుడూ ఇంతే! కావాలనుకున్నది సాధించుకుంటుంది అని కూడా అనుకుంటారు. ఇది తను ఎంతో ఇష్టంగా కావాలనుకుని సాధించుకొన్న గెలుపు. ఈ గెలుపు జీవితాన్ని మృదువుగా నిమిరినట్లు యెంత గొప్పగా అనిపిస్తోంది.
అందుకే తింటున్నంతసేపూ అనంత్ తో చాలా ఇష్టంగా మాట్లాడింది. కరువుతీరా మాట్లాండింది. దానికి తగినట్టుగానే అనంత్ మాటల్లో కూడా చొరవ పెరిగింది. వాళ్ళిద్దరి మాటలు స్నేహితుల స్థాయి నుండి ప్రేమ స్థాయికి చేరి ఇంకా ఏదైనా స్థాయి వుంటే దానికి కూడా చేరి సాగుతున్నాయి.
ఆమె ఊహించని విధంగా అతని చేయి ఆమె చెంపను తాకింది.
సంకేత ఉలిక్కిపడి తప్పు అన్నట్టు చూసింది.. అంతే.. ఆ చూపుల్లో ఏదో దొరికి, మైకం కమ్మినట్టుంది.
అతని కళ్ళు నవ్వుతూ చూసాయి. పెదవులు తమాషాగా విచ్చుకున్నాయి. ఆప్యాయంగా ఆమె తలలోకి వేళ్ళు జొనిపి నిమురుతూ దగ్గరకి తీసుకొని చెవిలో గుసగుసగా “ఏది తప్పు? చీకటి వెలుతురుతో మెరుపు పట్టినట్లున్న నీ జుట్టు మీద చెయ్యేసి ,నీ సన్నని, తెల్లని మెత్తని చెంపల్ని తాకటం తప్పా..? తల పైకెత్తి నీలాంబరాన, స్వచ్చందంగా గాలిలో విహరించే మేఘాలను చూడలేని అర్దాంధులకు తప్పుకాని మనకేం తప్పు..? ఇంకా నీకు ఈ నీటి లోకపు వాసనలు పోలేదా?” అన్నాడు..
ఆశ్చర్యచకితురాలై అతని చేతుల్ని వదిలించుకొని “నిజం చెప్పు! ఇవి చలం మాటలు..! పుస్తకాల వాసనే తెలియని నీకు ఇంత భావుకత ఎలా తెలిసింది? పోనీ నువ్వు చలాన్ని చూడగలిగే తరంలో కూడా పుట్టలేదు.” అంటూ అలాగే చూసింది.
అనంత్ నవ్వి పక్కనే వున్నా ‘చలం సిడి’ ని ఆమెకి చూపించి “దీన్ని మా పెదనాన్న దేవరాయుడు దగ్గర నుండి తెచ్చి విన్నాను. ఇందులో చలం మాస్టర్ పీస్ పురూరవ ను వినడం బాగుంది. నీక్కూడా ఇంట్రెస్ట్ వుంటే విను..” అంటూ ప్లే చేసాడు.
అది వింటుంటే ఆమె హృదయానికి చక్కిలిగింత పెట్టినట్లు పులకింతలమయమైంది. అంతేకాదు.. ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేకమైన అంశం పై పట్టు సాధించినట్లు, అనంత్ ఆమె జీవితానికి సరిపడినంతగా వెలుగునిస్తున్నట్లు అనుభూతిస్తూ అతని కంటి చూపుల ప్రేమ పాన్పుపై తల ఆన్చింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages