అమ్మలగన్నగోదారమ్మా.. - అచ్చంగా తెలుగు

అమ్మలగన్నగోదారమ్మా..

Share This
అమ్మలగన్నగోదారమ్మా..
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

మహారాష్ట్ర నాసికాత్రయంబకం నుంచి
గల గలా..జల జలా..బిర బిరా జీవనదిగా
ఒంపులతో..సొంపులతో..విఱుపులతో..మెఱుపులతో
సాగుతూ..ప్రవహిస్తూ..
సమస్త జీవరాశికీ ప్రాణం పోస్తూ
ఊళ్ళన్నిటినీ కలిపే జలహారమై భాసిస్తూ
జగతికి చైతన్య ప్రసాది సూర్యభగవానుడికి
భక్తిప్రపత్తులతో మా చేత అర్ఘ్యం విడిపిస్తూ
ఆలయాల్లోని దేవుళ్ళకి స్నానాలు చేయిస్తూ
అభిషేకాలతో అలరిస్తూ
భద్రాద్రిని స్పృశించి..
సీతా రామ లక్ష్మణుల దాహార్తిని తీర్చి
నీవు తరించి..మమ్మల్ని తరింపజేసి
రాజమండ్రీలో అఖండవిశ్వజలరూపధారణచేసి
మా ఒడలు పులకరింపజేస్తావు
అసంకల్పితంగా.. మా కళ్ళు అరమోడ్పులై
చేతులు ముకుళితమవుతాయి
నదీమతల్లి గోదావరీ.. నీకివే నా శత సహస్ర ప్రణామాలు తల్లీ
గంగను గౌతమి గంగ రూపంలో
మావద్దకు చేర్చిన గౌతముడికి కృతజ్ఞతలు
నీ ఒడిలో మేము పుష్కర స్నానం చేసి
పునీతమయ్యే సమయం ఆసన్నమయింది!
పుణ్యఫలం ప్రసాదించి..
‘చల్లగా ఉండమని’ దీవించు ఓ అమ్మలగన్నగోదారమ్మా!!
***

No comments:

Post a Comment

Pages