రుద్రాణి రహస్యం – 3

 - వేద సూర్య


(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. గండరుడి కోసం పూజలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది తంత్రిణి. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి, అధ్భుత్ కలిసినప్పుడల్లా ప్రమాదాలు తప్పిపోతుంటాయి. వారిద్దరూ, అద్భుత్ పోటీదారుడు అతన్ని గాయపరిచేందుకు డాన్స్ ఫ్లోర్ పై జెల్ లిక్విడ్ వేస్తాడు. కాని, వారిద్దరూ కలిసి ఉండడం వల్ల వారికి ఏమీ కాదు.  ఇక చదవండి...)
 
అద్భుత్ కి ఏమి కాకుండా ఉండటం చూసిన అతని అప్పోనెంట్ తట్టుకోలేక, డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి, లిక్విడ్ ఎందుకు పనిచేయలేదని అనుకుంటూ, ఫ్లోర్ పై అడుగు వేసాడు. అంతే, బ్యాలన్స్ కుదరక జర్రున జారి పడ్డాడు.
**********
రుద్రాణి కోన 10 కి. మీ ల మైలు రాయి దాటుతుండగా, ఆర్కియాలజీ టీం వెళుతున్న కారు టైర్ పంక్చర్ అయ్యింది. ప్రవల్లిక కారు నుండి దిగి ,కంకర తో ఉన్న ఆ రోడ్డును చూస్తూ, ఎటువంటి సందడి కనిపించని ఆ వాతావరణాన్ని చూడసాగింది.
“పంక్చర్ కిట్ లేదు “ అన్నాడు డ్రైవర్.
“బయలుదేరే ముందు ఏం చేసావ్, చూసుకోవద్దా ?” అంటూ కసురుకుని మిగిలిన సిబ్బంది ఏమీ మాట్లాడకపోవటంతో, “ఇపుడేం చేద్దాం?” అసహనంగా అరిచింది ప్రవల్లిక. అసలే ఎప్పుడూ కోపంగా ఉండే ప్రవల్లిక ఏం మాట్లాడితే ఏమంటుందో అని సైలెంట్ గా ఉండిపోయారు అంతా. ప్రవల్లిక సబార్డినేట్ తేజ, దగ్గరలో ఏదైనా ఉంటుందేమో చూస్తానని అంటుండగా ... “మే ఐ హెల్ప్ యు?” అంటూ ఒకతను అక్కడికి వచ్చాడు.
ట్రావెల్ బ్యాగ్ తగిలించుకుని ,ఒంటిపై కార్గో షార్ట్ , టీ షర్టు పై స్లీవ్ లెస్ జాకెట్ తో సైకిల్ పై ఉన్న అతన్ని చూసి “ఎవరు నువ్వు?” అని ప్రవల్లిక జూనియర్ యామిని అడిగింది.
“ఈ దారిలో గమ్యం వెతుక్కుంటూ వెళుతున్న ఒక బాటసారిని” , అన్నాడు అతను. “ వియ్ ఆర్ ఫ్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ , ఈ అడవిలో ఒక అస్సైన్మెంట్ చేయటానికి వచ్చాం , ఆదిలోనే హంసపాదు అన్నట్లు వెళ్ళకుండానే టైర్ పంక్చర్ అయింది”, అంది ప్రవల్లిక.
“ఇక్కడేమన్నాదగ్గరలో పంక్చర్ షాప్ ఉందా?” అని తేజ అతన్ని అడిగాడు.
“ఉంటే బాగుండేది కాని, ఈ అడవి అలాంటి బంపర్ ఆఫర్స్ ఇవ్వట్లేదు...” అన్నాడతను నవ్వుతూ.
“మరిపుడెలా? ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, నడిచి వెళ్ళాలా ?” అని ప్రవల్లిక అనటం విని , “అవసరం లేదు ఒక పది నిముషాలు వెయిట్ చేస్తే, కార్లోనే వెళ్ళొచ్చు” అంటూ... అతను తన బ్యాగ్ లో నుండి పంక్చర్ కిట్ ని తీసి, రిపేర్ మొదలుపెట్టడంతో అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. “ఈ రోడ్డు పై సైకిల్ మీద తిరగాలంటే మనకు పంక్చర్ వేసుకోడం కూడా తెలియాలి” అంటూ డ్రైవర్ హెల్ప్ చేయటంతో టైరు కి పంక్చర్ వెయ్యసాగాడు.
“ఇంత ప్రిపేర్ గా ఉన్నావ్ , ఈ అడవిలో ఏం చేస్తున్నావ్ ? “ తేజ అడిగాడు. “ఏం చెప్పమంటావ్ భయ్యా , ఆయుర్వేదం మీద రీసెర్చ్ చేసేద్దామని పది మందొచ్చాం , ఆ రోజు కార్లో పెట్రోల్ అయిపోయింది, అడవిలో కారు ఆగిపోయింది . చుట్టూ చీకటి .. సడన్ గా పెద్ద ఆకారం ఏదో వచ్చి కారుకు తగిలింది అంతే భయ్యా పొద్దున్న లేచి చూస్తే నేను,ఈ సైకిల్ మిగిలాం.”
“ మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు?” అని యామిని అడిగింది.
“అది అర్ధం కాకే ఆళ్ళని వెతుకుతూ నేను ఇలా ఈ సైకిలు తొక్కుకుంటూ,ప్యాచీలు వేసుకుంటూ, ఈ దారిలో వెళుతున్నాను, “ అని చెప్పాడు అతను.
“ఏం ఆకారం అది ? నువ్వు చూసావా? “ అడిగింది ప్రవల్లిక. “ ప్చ్ .. వచ్చింది .. గుద్దింది .. వెళ్ళింది .. అంతే అంతా బ్లాంక్ అయిపోయింది, అన్నాడతను.
“సరే ఇక్కడ నీకేదన్నాఅనుమానంగా కాని , ఆసక్తిగా అనిపిస్తే ఈ నంబర్ కి కాల్ చెయ్” అంటూ ప్రవల్లిక తన కార్డ్ ను ఇచ్చింది.
అతను ఆ కార్డ్ ని చూస్తూ “మిస్ ప్రవల్లిక.. అసిస్టెంట్ కమిషనర్.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ..” అని చదివి, “ నైస్ టు మీట్ యు మిస్ పజిల్ .. దిస్ ఈజ్ దేవ్” అంటూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేసాడు.
“తన చేతికి ఉన్నమట్టిని చూస్తున్న ప్రవల్లిక ని చూసి,” ఇట్స్ ఓకే సమ్ అదర్ టైం” అన్నాడు దేవ్ చేతిని వెనక్కితీసుకుంటూ....
“ఎనీ వే థాంక్స్ ఫర్ ది హెల్ప్” అంటూ ప్రవల్లిక కారులో కూర్చోవటంతో కార్లు బయలుదేరాయి. కార్లో వెళుతూ ,”మేడం అతన్ని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది”, అన్నాడు తేజ .
“అది తెలుసుకోవాలనే కార్డ్ ఇచ్చాను” అని అంది ప్రవల్లిక. “ కార్డిస్తే ఎలా తెలుస్తుంది?” యామిని అడిగింది.
“అనుమానస్తుడైతే దొరికిందే అవకాశం అనుకుంటూ దగ్గరవ్వాలని ట్రై చేస్తాడు..చూద్దాం ఇపుడేగా ప్రయాణం మొదలైంది”, అంది ప్రవల్లిక దీర్ఘంగా ఆలోచిస్తూ...
రుద్రాణి కోన కు వెళ్ళే దారిని చూపిస్తున్నరాయిని దాటి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కార్లు కోనకు వెళ్ళే దారిలో వెళ్తున్నాయి. దారిని రెండు వైపుల నుండి గొడుగులా అల్లిన గుబురు పొదలను చూస్తున్న ప్రవల్లిక ఆ వైపే చూస్తుండటం గమనించిన యామిని, “ఏమైంది “ అని అడిగింది.
“ ఏంటో, ఈ అడివి వాతావరణమే వింతగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఏదో తెలిసీ తెలియని అనుభూతి “ అంటూ చుట్టూ చూస్తూ తన ల్యాప్ టాప్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కనిపిస్తున్న రుద్రాణి రహస్యం పుస్తకం పై చేయి వేసి అడవిలోకి గ్లాస్ నుండి చూస్తూ ఉండిపోతుంది ప్రవల్లిక.
“ లచ్చిమీ పొద్దుగూకింది . అమ్మ ఒచ్చే ఏల అయినాది .. సద్ది కుండలో పెట్టినావా .. అని అరుపులు వినిపిస్తూ కార్ పక్క నుండి కొన్ని రూపాలు కనిపించినట్లు అనిపించటంతో ఉలిక్కి పడి, “ఆపండి “ అంటూ అరిచింది.
డ్రైవర్ కారు ఆపాకా, ప్రవల్లిక గ్లాస్ దించి చూస్తే ఏమి కనిపించలేదు . “ఏమైంది మేడం,అలా అరిచారు” అడిగాడు తేజ.
ఏం చెప్పాలో తెలియక , “ఏం లేదు” అని అంది. డ్రైవర్ కారుని కదిలించాడు. ప్రవల్లిక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని తడుముతుంది. ఆ కారుకి కొన్ని పర్లాంగుల దూరం లో ధ్యానం లో ఉన్న అయ్యోరు నవ్వుకుని కళ్ళు తెరచి, రెండు చేతులు
దగ్గరచేసి “ అమ్మా నీ ఆట మొదలు పెట్టావా?” అని అనుకున్నాడు. “కాలూ .. కోన కడుపు పంట వచ్చింది , కాపు కాయి” అని అనటంతో దారిని గొడుగులా కప్పిన పొదలు, కాల సర్పంగా మారి , వెళుతున్న కార్లు ని మెరుపు కంటే వేగంగా దాటుకుని ఒక చోట మహా వృక్షం లా అయ్యాయి.
కారునుండి కనిపిస్తున్న వృక్షాన్ని చూసి,” ఆ చెట్టు కిందకు అసలు ఎండే రావట్లేదు , టెంట్ లు అక్కడ వేసుకుందాం” అంది ప్రవల్లిక. “గుడ్ ఛాయిస్ మేడం” అంటూ చెట్టు కి దగ్గరలో కార్లు పార్క్ చేసి, బస ఏర్పాటు చేసుకునే పనిలో మునిగిపోయారు అంతా.
ప్రవల్లిక ఆమెకు కనిపించివినిపించిన వాటి గురించే ఆలోచిస్తుంటుంది. ఆమెలో ఆమెకే తెలియని ఒక కొత్త మార్పు,అదేమిటో ఆమెకు అర్ధం కాకపోవటానికి కారణం, ఆమె అక్కడికి ఒక రహస్యాన్ని తెలుసుకోడానికి రావటమే అనుకుంది... కానీ ఆ రహస్యం ఆమె తోనే ముడి పడి ఉందని ఆమెకు తెలీదు.
************
కాల కేతు ముహూర్తం లో తంత్రిణి చేసిన ఆవాహన హోమానికి ప్రసన్నుడైన గండరుడు ప్రత్యక్షమయ్యాడు. తంత్రిణి , “నా శక్తికి సవాలుగా నిలిచిన రుద్రాణి కోనలో రహస్యం గుట్టుని విప్పు “ అని అడుగుతుంది. గండరుడు నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో , తంత్రిణి తనకు ఓటమి కలుగుతుంది అంటే గండరుడి ముందే ఆత్మ త్యాగం చేస్తానని, ప్రత్యక్షం చేసుకున్నఖడ్గంతో పొడుచుకుంది.
చూస్తున్న ఫ్రెడ్రిక్ ,అత్రిక ,విలియమ్స్ లు షాకింగ్ గా చూస్తుంటారు. తంత్రిణి త్యాగానికి ప్రసన్నుడైన గండరుడు తన శక్తి తో తంత్రిణి ని మామూలుగా చేసాడు.
తంత్రిణి గండరుడ్ని ,” నీ నిశ్శబ్దానికి కారణం ఏమిటి ?” అని అడిగింది.
“కొన్నితరాల ముందు రుద్రాణి తో తలపడిన కింకాసురుడు ఆమె ఆగ్రహానికి ఉద్భవించిన కాలాగ్నికి ఆహుతయ్యి బూడిద రూపంలో చిందరవందరగా ఆమె పాదాల చెంతనే బందీగా ఉండిపోయాడు, ఇదే నా నిశ్శబ్దానికి కారణం ” అని చెప్పాడు గండరుడు.
“కింకాసురుడు బందీగా ఉన్నాడా?” తంత్రిణి ఆశ్చర్యంగా అడిగింది.
“అసలు అక్కడ ఏముంది?” మళ్ళీ సందేహం వెలిబుచ్చింది...
“ఒకనాటి కాలం లో రుద్రాణి కోన, రుద్రకోట అనే వాడుకతో ఉండేది. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు పరమేశ్వరీ అంశ అయిన రుద్రాణి ని కొలిచేవాడు. ప్రద్యుమ్నుడి దగ్గర ఉన్న శమంతకమణి రోజుకు 12 బారువుల బంగారాన్ని ఇచ్చేది , ఆ మణి కున్న మహిమ వల్ల ఆ రాజ్యం ఎప్పుడూ సుసంపన్నంగా ఉండేది. మహిమ గల మణిని రుద్రకోటలో గల రుద్రాణి ఆలయం లోనే ఉంచి పాలన సాగించేవాడు. రుద్రకోట, అడవి తెగకు చెందిన వీర రుద్రుడు అనే సామంతుడి పరిపాలనలో సుభిక్షంగా ఉండేది. యుగాలు మారాయి,తరాలు మారాయి.. వారసత్వం గా సింహాసనం అధిష్టించిన అతిరోధుడు వ్యసనపరుడు . అతని బలహీనతను తెలుసుకున్న ఆంగ్లేయులు, రాజ్యం పై దాడి చేసి, మైకంలో ఉన్న అతిరోదుడ్ని అంతంచేసి, రాజ్యాన్ని అదుపులోకి తీసుకుని , మణి ని సొంతం చేసుకోడానికి రుద్రకోటకు వెళ్ళారు.
ఆ సమయం లో రుద్రకోటను పాలిస్తున్నవీర రుద్రుడి మనుమడు వీర సింగడు అనారోగ్యం తో ఉన్నాడు. అమ్మ శక్తిని కాపాడుకోవటానికి ఏమైనా చేస్తామని ప్రతిన పూనిన సింగడి కూతురు జాబిల్లి ఆంగ్లేయుల తో యుద్ధానికి సిద్ధ పడింది. జాబిల్లితో ప్రేమ లో ఉన్న సేనాని సూరీడు, జాబిల్లి నిర్ణయానికి తల ఒడ్డి సింగం లా ముందుకు ఉరికాడు. ....
(సశేషం...) .

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top