'నాట్యవేదం' - చింతలూరు శ్రీలక్ష్మి - అచ్చంగా తెలుగు

'నాట్యవేదం' - చింతలూరు శ్రీలక్ష్మి

Share This

'నాట్యవేదం' - చింతలూరు శ్రీలక్ష్మి 

- బ్నిం


 ఒక నర్తకి ప్రఖ్యాతి పొందటానికి సాధన సరిపోతుంది. ఒక నర్తకి గురుస్థానం పొందటానికి ఖచ్చితంగా పాండిత్యం అవసరం – ఆ పాండిత్యానికి పరాకాష్ట శిష్యులు ప్రకాశించడం – దానికన్న పరమోత్క్రుష్టం శిష్యుల శిష్యులు ప్రఖ్యాతి చెందటం –
          ఇది మాత్రం ఆ నర్తకి గురువుగారికి ఇచ్చిన ఘనమైన గురుదక్షిణ –
శ్రీమతి శ్రీలక్ష్మీ చింతలూరు – ఆ స్థాయిలన్నీ దాటారు- ఇప్పుడామె గురించి చెప్పను మరో నెల చెప్తాను..కానీ.. ఆమె చేసిన ఒక అద్బుత చరిత్రని అక్షరీకరించాలని ప్రయత్నిస్తాను –
          ఆమె రాజమండ్రీ- దానవాయిపేటలో ఉంటున్నారు – హైదరాబాద్ లో అంతకుముందెప్పుడో 20 ఏళ్లక్రితం, నర్తకిగా ఆమె ప్రదర్శనకి నేను వహ్వా అనుకున్నాను-
          ఆతర్వాత ‘నాట్యవేదం’ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలుగా అధ్యక్షులుగా, నాట్యగురువుగా ఆమె సాధించిన విజయ రధగమనం చూసాను- ఈనెల ‘శింజారవం’ ఆ రథకేతనం గురించి రాద్దామని ఆమెని ఇంటర్వ్యూ చేయడం వాయిదా వేసుకున్నాను-   
మొన్న మే 3వ తారీఖున రాజమండ్రీలో అన్నమాచార్య జయంతి నృత్యోత్సవాలు పేరిట... జాతీయస్థాయి కూచిపూడి నాట్యపోటీలు నిర్వహించింది. నాట్యవేదం- 130మంది నాట్యగురువులు రాష్ట్రరాష్ట్రేతరప్రాంతాలనుంచి వచ్చి తమ శిష్యుల కళాప్రదర్శన చేయించారు-  ఆనాడు -  అవి పోటీలు అనిపించలేదు -  నిర్వాహకులు నిర్దేశించినట్లు అన్నమయ్య కీర్తనలనే కూచిపూడి నృత్యశైలిలో ఒక్కొక్కరూ 10నిముషాల వ్యవధిలో ప్రదర్శించారు-
ఇందులో 10సంవత్సరాలలోపు పిల్లలనుండి.... వీళ్లని సబ్ జూనియర్స్ అంటారుట – ఆపై 15సంవత్సరాల వరకు వారిని జూనియర్స్ అన్నారు – ఆ తర్వాత సీనియర్స్... ఇలా వీరితో అన్నమయ్య పదాలకి నృత్యాంజలి పట్టించారు. ఇవే కాక డ్యూయెట్స్- గ్రూప్స్ అనో రెండువిభాగాలు ఉన్నాయి – అన్నింటా అందరూ అన్నమయ్య వాచికానికి (సారీ...సాహిత్యానికి అనాలేమో) ఆంగికాహార్యసాత్విక లక్ష్యలక్షణాలు మాల కట్టి వేయించారు- ఆవెంటనే... అందరికీ పట్టంకట్టి...ప్రతిభకు పట్టాభిషేకం చేసారు-

పోటీలు పెడితే వార్తే- అయితే...అందుకు ప్రసిద్ధ నాట్యకారిణి సంగతులు రాయకుండా ఆమె నిర్వహించిన కార్యక్రమాన్ని గురించి రాయడానికి కారణం ఉంది. ఆనాడు రాజమండ్రీలో ఎన్నిమువ్వలు రవం చేసాయి – ఎన్ని గంటలు ఈ కార్యక్రమం నిరాఘాటంగా జరిగిందీ అనేది ఒక చరిత్ర...
అ రోజు ఉదయం 9గంటలనుండి రాత్రి 11గంటల వరకూ నిర్విరామంగా సాగిన ఈ సంగీత నృత్యోత్సవం అన్నమయ్య సంకీర్తనాఝురితో గోదావరి తీరాన్ని పులకరింపజేసింది. (ఉష్ష్...ఇది అన్ని గంటల వీడియోని
చూస్తూరాస్తున్నాను) అక్కడ ప్రతీకళాకారుడు చేసే నాట్యానికి వారివారి గురువుల హాహాభావాల్లో తృప్తినీ...(కొందరిలో అసంతృప్తినీ కూడా చూస్తూ) పుత్రోత్సాహాన్ని మించిన శిష్యోత్సాహానికి ముగ్ధునైపోయి రాస్తున్నాను –
          అందరూ వివిధ కీర్తనలని ఎంచుకున్నారు – ఓకే! అందులో కొత్తదనం ఏంటి?? కొందరు మాత్రం ఒకే కీర్తనని ప్రదర్శించినా వారి వారి మనోధర్మాల్తో కంపోజు చేసారు – అక్కడ... కనిపించింది...ఒక అద్బుతం! మనోధర్మం ... అంటే.. సృజనాత్మకత ఎంత విశిష్టమైనదో-  
          ‘ఆ కీర్తననే’ ఒకరు బృంద నృత్యంతో చేసారు- ఒకరు సోలో చేసారు- ఇంకొకరు డ్యూయెట్ లా కంపోజ్ చేసారు – ఇంకొకరు పిల్లల్తోనూ... మరొకరు పెద్దల్తోనూ.. ఒకరు అన్నమయ్య ‘పాయంటాఫ్ వ్యూ’ లో చేస్తే మరొకళ్లు దేవుడితోనే అభినయింపజేసారు. ఈ భావవైరుధ్యవైభవం కోసమే ఈనెల జోహార్ చెప్పాలనిపించింది-
 అందుకే....  ప్రఖ్యాత నర్తకీమణి శ్రీమతి శ్రీలక్ష్మి గురించి రాసేముందు ఈ గొప్పపనిని.... నాట్యగురువుల మెదడుకు పదును కల్పించిన గొప్పపనిని గురించి చెప్పాలనిపించింది- వచ్చే నేల ఏంరాస్తానో తెల్సిపోయింది కదా!

No comments:

Post a Comment

Pages