శివం – 11

రాజ కార్తీక్

9290523901

(నంది కధను చెబుతూ ఉంటాడు శివుడు …)

 
నంది చేస్తున్న తపస్సు తీవ్రత, ఆర్ధత నన్ను తాకింది. నంది శ్రద్ధ నన్ను ఎంతో పులకరింప చేస్తోంది . నేను కూడా నందికి దర్శనం ఇవ్వటానికి ఊవిళ్ళురూతున్నాను. నాకు తోడుగా మరొక సహవాసి దొరుకుతున్నాడు అని నా సంతోషం. ఘోరతపస్సు తెలిసిన వాడిలా ,ఏ మాత్రం కోరిక లేకుండా, తధేకంగా నిశ్చలంగా నా ధ్యానం చేస్తున్నాడు. అతని పరధ్యానం కూడా పరమేశ్వర ధ్యానమే అన్నట్లు ఉంది. అతని భక్తి తీవ్రత. పిడుగులు, ఉరుములు, వరదలు ఏవి నంది మీద ప్రభావం చూపలేకపోతున్నాయి. ఎందుకంటే వాటికి అడ్డుగా, నందికి రక్షణగా నేను ఉన్నాను.
 ‘హరాహరా హరా హరహరహర’ అంటూ నంది నుండి ప్రతిధ్వనులు వస్తున్నాయి. అతని తపస్సుకి పంచభూతాలు సైతం పునీతం అవుతున్నాయి. నంది శరీరం నిశ్చలం అయిపొయింది. శరీరం జడంగా మారింది. మనసు నా దగ్గర ఆగిపోయింది. దివ్యకాంతి నంది శరీరం నుండి ఉద్భవించింది. ఆ కాంతికి సూర్యుడు కూడా వెలవెలబోయాడు. విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు సైతం నంది చేస్తున్న తపస్సుకి విస్తుబోయారు. క్రమక్రమంగా నంది దేవతలా స్థానాన్ని కూడా మించాడు. నంది పరిసరాల్లో ఉన్న మోడుబోయిన చెట్లకు కూడా పూలు పూసాయి. అలా ఎన్నో పూలు గాలికి వచ్చి నందిని తాకుతున్నాయి. నందిని తాకిన పూలు అక్కడ నా రూపమైన లింగమును తాకుతున్నాయి. నా భక్తుని స్పర్శతో వచ్చిన పూలు నన్ను తాకటం, ఆ భక్తుని సమర్పణ భావన ఉండటం ఎంతగానో ఆనందంగా ఉంది. ఇక నందికి దర్శనం ఇవ్వవలసిన సమయం వచ్చింది....
నేను నంది ముందు ప్రత్యక్షమయ్యాను. నందితో నేను “శిలాపుత్రా, నంది నీ తపస్సుకు మెచ్చాను, అందుకే నీకై వచ్చాను.” అన్నాను.
కనులు తెరిచి చూసాడు నంది. నంది నోటి వెంట మాట రాలేదు. నందికి నా దివ్యరూపం తప్ప ఏమి కనుబడుటలేదు. నా ఢమరుకం దాని అంతటదే ధ్వనిస్తుంది. నా నుండి ఓంకారం నందికి ప్రసారం అవుతుంది. అప్పటికింకా నా మెడలో నాగరాజు, తలపై చంద్రుడు, కొప్పులో గంగ ఏమి లేవు. నా వెంట ఉన్న త్రిశూలం నేను తప్ప... నంది అలాగే  స్థాణువుడై ఉన్నాడు. భక్తికి చివరి మజిలి.. నంది ఆహార్యం మారిపోయింది, శుష్కించిన అతని శరీరం బలంగా మారింది, అతని భక్తే బలంగా మారింది నందికి.
నేను “ నంది, చెప్పు నంది, నన్ను గుర్తుపట్టలేదా?” అన్నాను.
బాటసారిగా మారి నందికి మనస్సులో “ నేను బాటసారిగా రావటం, నన్ను నేనే విమర్శించుకోవటం, నందికి భువననది దారి చూపడం, నంది స్పృహ కోల్పోవటం, అతన్ని నేను మోయటం, అతని గాయాలకు మందు రాయటం, ఆహారం తినిపించడం, మన పరిచయం మునుముందు చూస్తవులే అనటం” అన్ని, కళ్ళ వెంట నీరుతో ఉన్నాడు నంది.
నేను “నంది మన పరిచయం మునుముందు చూస్తావులే అని అన్నాను అర్ధమైందా”
నంది”............”
నేను “ఏమి నంది మౌనంగా ఉన్నావు, నాతో మాట్లాడవా? చెప్పు “
కళ్ళు తుడుచుకుంటున్న నంది “ఆ.... నా పిలుపు నీకు వినబడిందా?”
నేను “ఎప్పుడో... కాబట్టే కదా, నిన్ను దగ్గరుండి అన్నీ కల్పించేటట్లు చేసాను”
నంది”....”
నేను “ చెప్పు నంది, మళ్లి మౌనమా?”
నంది “ స్వామీ, నేను మాట్లాడకపోతే, నీవే మాట్లాడుతున్నావు కదా, అది బాగుంది”
నేను “నంది నీతో మాట్లాడటమే కాదు, నీ కోసం ఏదైనా చేస్తా, నీకన్నా ప్రియమైన వారు ఎవరు, నీవు నేను ఇద్దరం ఒకటే”
నంది “ఒకటా”
నేను “అందుకే కదా నంది, నీవు ఢంకా వాయిస్తే నృత్యం చేసాను”
నంది “అది కలా, నిజమా?”, నేను “ఏదైనా ఆ అనుభూతి ఒకటే”
నంది” స్వామీ నా ఆయుష్షు ఎప్పుడు అయిపోతుంది”.. నేను “ఎందుకు”
నంది “ అప్పుడు నీ దగ్గరికి రావచ్చుగా, శాశ్వతంగా నీతో ఉండిపోవచ్చుగా”
నేను “ఇప్పుడు మాత్రము ఏమైనది ఉండవచ్చుగా, నీవు మృత్యుంజయుడవు”
నంది “ స్వామీ, నేను ఒక జ్ఞానం లేని పశువుని, ఈ సమయంలో ఏ పండితుడు, పామరుడు ఎవరు ఉన్నా గొప్ప గొప్ప స్తోత్రాలు, కావ్యాలు రాసేవాడు. కానీ”
నేను “పండితోత్తమ నీవు పండితుడవే, తథాస్తు, సకలశాస్త్రాల పండితుడవు”
నంది” మహాదేవా స్మశానానికి తీసుకురావడానికి పుట్టించడం ఎందుకు” అంటూ గీతం ఆలపించాడు.
నేను “ చెప్పు నంది, నీ కోరిక ఏమి”, నంది “ప్రభూ, మీతో ఉండటమే ”
నేను “నేనే ఒక యోగిని, నాతో నీవు ఎందుకు, నంది”, నంది “నేను కూడా నీతో”,
నంది “ఇన్ని లోకాలను చూస్తున్నావు కదయ్యా, నేను ఒక్కడ్ని నీకు భారమా?”
నేను “నంది, నీవంటి భక్తుడు నాకెప్పుడూ భారం కాడు, నీవు నాకు ఎంతో ఇష్టుడివి”
నంది “స్వామీ నేను ఒక పశువుని కదా, పైగా మీకు నేను వాగ్ధానం చేశాను, మిమ్ము మోస్తా అని”
నేను “చెప్పు నంది, నీకు ఏమి కావాలన్నా ఇస్తాను”
నంది “ప్రభూ, ఈ పశువుని మీ వాహనంగా చేసుకోండి, మిమ్ము ఎక్కడికైనా తీసుకువెళ్తాను”
నేను “అవును మరి, నీవు నాకు వరం ఇచ్చావుకదా, దాన్ని సద్వినియోగం చేసుకుంటా”
నంది “మరైతే అధిరోహించండి” అని నంది తన యదార్ధ రూపంలోకి మారాడు. నేను నందిని అధిరోహించి, ప్రేమగా వాటేసుకున్నాను, నంది నా స్పర్శతో పులకించాడు. విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు.
విష్ణువు “ప్రభూ, మహాదేవా, ఈ సంఘటన కన్నుల పండుగగా ఉంది”
బ్రహ్మ “మహాదేవా, భక్తులకోసం ఏమైనా చేస్తారు, నంది నీవు ధన్యుడవు”.
నంది మామూలు మనిషిగా మారి నా పాదాల ముందు మోకరిల్లి “నిన్ను నమ్మి, ఉన్న, నిన్నే తలచుకున్నా, నీ తలంపులో వచ్చే కన్నీటిని తుడుచుకున్నా” అంటూ విష్ణువుని, బ్రహ్మని చూసి నమస్కరిస్తూ మధురమైన కీర్తన ఆలపించాడు.
నేను, “నంది, నీ కీర్తనకు ప్రసన్నుడయ్యాను, నా దర్శనానికి ముందు నిన్ను దర్శించుకునేలా వరం ఇస్తున్నాను. కైలాసంలో నా తర్వాత నీవే గణాలను, చూసుకోవాలి ఇక మీద” అంటూ భోగభాగ్యవైరాగ్య వరాల జల్లు కురిపించాను.
 కాని నందికి అవి ఏమి అక్కరలేదు, కావాల్సింది ఒకటే “నేను”, అలా మీరు అనుకోండి అన్ని వస్తాయి. మిగతా ఎవరికైనా గర్వభంగం జరిగింది ఏమో గాని, నంది ఎప్పుడూ అందరి, భక్తులకు ఆదర్శప్రాయుడు.
నేను “నందీశ్వర” అంటూ నందికి నా ఈశ్వర నామధేయం ఇచ్చాను. ఎన్ని ఉన్నా, ఇప్పటికీ నందికి కావలిసింది ‘నేను’ మాత్రమే !
(కధలు కొనసాగుతాయి...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top