అవధూత సదాశివ బ్రహ్మేంద్రులు

- అక్కిరాజు ప్రసాద్ 


 చిన్ముద్రిత కరకమలం చింతిత భక్తేష్టదం విమలం
గురువరమాద్యం కంచన నిరవధికానందనిర్భరం వందే
వటతరునికట నివాసం పటుతరువిజ్ఞానముద్రితకరాబ్జం
కంచన దేశికమాద్యం కైవల్యానందకందలం వందే
చిన్ముద్రలో ఉన్న కమలము వంటి చేతలు కలిగిన , భక్తుల కోరికలను తీర్చే, విమలమైన, మొదటి గురువైన, ఎల్లప్పుడూ సచ్చిదానందంలో ప్రకాశిస్తూ ఉండే దక్షిణామూర్తికి వందనములు. ఎల్లప్పుడూ వటవృక్షం క్రింద నివసించే, మహిమ గల జ్ఞానముద్రలో ఉన్న కమలముల వంటి చేతులు కలిగిన, మొదటి గురువైన, మోక్షానందముతో, నిరంతర వృద్ధి కలిగిన ప్రకాశముతో ఉన్న దక్షిణామూర్తికి వందనములు (ఆత్మ విద్యా విలాసములోని మొదటి శ్లోకము)
కొందరు మహానుభావులు జీవితంలోని ప్రతి కోణంలోనూ దైవాన్ని నిరంతరం దర్శిస్తూ సచ్చిదానందంలో మునిగి బాహ్య ఐహిక విషయాలకు అతీతంగా, నిత్యానంద తన్మయులై ఉంటారు. అది భక్తి మార్గము ద్వారానే అత్యంత సులభము. అత్మానందానుభూతిలో మునిగి తేలే యోగులు, సత్పురుషులు భారత దేశంలో ఎంతోమంది. దక్షిణాదిన అటువంటి మహానుభావుల్లో 18వ శతాబ్దానికి చెందిన సదాశివ బ్రహ్మేంద్రులు. ఆ యోగి జీవిత విశేషాలు.
చరిత్ర:
బ్రహ్మేంద్రులు సస్యశ్యామలమైన, భారతీయ మేధో సంపత్తికి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు నిలయమైన కావేరీ తీర ప్రాంతంలోని కరూరు దగ్గరలోని నెరూరులో తెలుగు నియోగి బ్రాహ్మణ దంపతులైన మోక్ష సోమసుందర అవధాని, పార్వతి దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు శివరామకృష్ణగా నామకరణం చేశారు. తొలివిద్యలు తిరువిసైనల్లూరుకు చెందిన గురువులు రామభద్ర దీక్షితార్ వద్ద నేర్చుకునే సమయంలో భజన సాంప్రదాయ త్రయమైన శ్రీధర వేంకటేశ ఐయ్యర్, బోధేంద్ర సరస్వతి మరియు భాష్యం గోపాలకృష్ణ శాస్త్రులచే ప్రభావితులైనారు.
విద్యాభ్యాసంతో పాటు ఆత్మ విద్య, యోగసాధనలో శివరామకృష్ణులు మునిగితేలారు. చిన్న వయసులోనే వైరాగ్య భావనలు, లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. యుక్తవయస్సు వస్తున్న కుమారునికి వివాహం చేస్తే ఈ ధోరణి మారుతుందేమో అని తల్లి పార్వతి శివరామకృష్ణునికి వివాహం 16వ ఏట చేసింది. శివరామకృష్ణులు గృహస్థాశ్రమము తన ఆత్మసాధనకు ఆటంకమని గ్రహించి తల్లి వద్ద అనుమతి తీసుకుని ఇల్లు వీడుతారు.
కాంచీపురం చేరుకుని అక్కడి కంచి కామకోటి పీఠాధిపతులైన పరమశివేంద్ర సరస్వతీ స్వాముల వద్ద సన్యాసం స్వీకరిస్తారు. అలా శివరామకృష్ణులు సదాశివబ్రహ్మేంద్ర సరస్వతిగా మారి తన ఆధ్యాత్మిక సోపానంలో ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంటారు. తన విద్వత్తుతో, యోగసాధనతో మహా మహా పండితులను ఓడిస్తుండగా, గురువులైన పరమశివేంద్ర సరస్వతి ఆగ్రహంతో 'సదాశివా! మౌనంగా ఉండలేవా!' అని అంటారు. గురువుల మాటను ఉపదేశంగా భావించి, అంత్యం వరకు మౌనదీక్షలో ఉంటారు. కాంచీపురం వదలి మోక్ష సోపానంలో ఎన్నో మైలురాళ్లను దాటి ముందుకు వెళ్తారు. చాలాకాలం కావేరీ తీర ప్రాంతాల్లో తిరుగుతూ సమాధి స్థితిలో ఆత్మానందాన్ని పొందుతారు. తల్లికి ఇచ్చిన మాట నిలుపుకోటానికి ఆమె అవసాన దశలో తిరువిసనల్లూరు వస్తారు. తల్లి అంత్యక్రియల తరువాత నెరూరు ప్రాంతానికి చేరుకుంటారు సదాశివబ్రహ్మేంద్రులు. దక్షిణవాహిని యైన కావేరీ తీరప్రాంతమైన ఈ ప్రదేశం తన సాధనకు అనువైనదిగా గ్రహించి అక్కడ స్థిరపడతారు. ప్రాపంచిక విషయాలను వీడి, కమండలము, కాషాయము, దండము త్యజించి అవధూతగా తిరుగుతూ ఉంటారు. అప్పటి పుదుక్కోటై రాజావారు సదాశివ బ్రహ్మేంద్రుల అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఒకసారి తిరువిసనల్లూరుకు వచ్చినప్పుడు చిన్ననాటి గురువులు సదాశివుల క్షేమసమాచారాన్ని అడుగుతారు. సమాధానం రాకపోవటంతో, దానికి కారణం మౌనవ్రతమని గ్రహించి గురువులు సదాశివులను తన అనుభూతులను భక్తి జ్ఞాన వైరాగ్య కీర్తనలుగా, రచనలుగా వెలువరించమని, అది తన మౌన వ్రతానికి (మౌనం ప్రాపంచిక విషయాలకే గానీ భగవత్ స్తుతికి వర్తించదు) భంగం కాదని సలహా ఇస్తారు. దానికి సదాశివులు అంగీకరించి తన అద్భుత రచనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు వెలువడినవే వారు రచించిన ఎన్నో కీర్తనలు, ఆధ్యాత్మిక రచనలు.
అవధూతగా కావేరీ తీర ప్రాంతంలో ఆధ్యాత్మిక సంపదను, సౌందర్యాన్ని వెదజల్లిన సదాశివబ్రహ్మేంద్రులు 1755వ సంవత్సరంలో శత సంవత్సరములపైగా పరబ్రహ్మమయమైన జీవనము గడిపి నెరూరులో జీవన్ముక్తులైనారు. వారి సమాధి (బిల్వ వృక్షం క్రింద) ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖ శుద్ధ దశమి (జీవన్ముక్తులైన రోజు) నాడు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
అద్భుతాలు:
కొంతమంది చరిత్రకారుల ప్రకారం సదాశివబ్రహ్మేంద్రులు 1560 నుండి 1762 వరకు భౌతికంగా జీవించారు. ఇంత సుదీర్ఘ జీవనంలో కొన్ని మహిమలు వినికిడిలో ఉన్నాయి.
1. ఒకసారి నీరులేని ఎండాకాలంలో కొడుముది నది మధ్య ఇసుకతిన్నెపై సమాధి స్థితిలోకి వెళ్తారు. ఆరు మాసాల తరువాత వర్షాలు పడి, నదిలో వరదలు వచ్చి ఆయన కొట్టుకుపోగా, ఆయన కోసం అక్కడి జనం వెదుకుతారు. ఎక్కడా కనిపించక, చివరకు వరదలు తగ్గిన తరువాత దగ్గరలోని ఇసుకతిన్నెలను తవ్వగా రక్తం వస్తుంది. మరింత జాగ్రత్తగా తవ్వగా, సదాశివ బ్రహ్మేంద్రులు సమాధిస్థితినుండి లేచి నిలబడి వడివడిగా పరిగిడుతారు. 2. ఒకసారి బ్రహ్మేంద్రులు గడ్డి మోపులపై ధ్యానంలో ఉండగా రైతులు గమనించక, ఆ మోపులపై మోపులు వేస్తూ ఏడాది పాటు అలానే మోపుల పర్వతంలో ఉంచేస్తారు. ఏడాది తరువాత రైతులు గడ్డిమోపులను తీస్తుండగా బ్రహ్మేంద్రులు సజీవంగా సమాధి స్థితిలో కనిపిస్తారు. 3. ఒకసారి ముస్లిం రాజు ఒకడు దిగంబరునిగా ఉన్న వీరిని చూసి పిచ్చివాడనుకొని భటులచేత ఆయన చేతిని నరికిస్తాడు. దీనికి ఎటువంటి బాధ, నొప్పి లేకుండా సదాశివులు తన చేతిని పునరుద్ధరించుకొని ముందుకు సాగుతారు. 4. ఒకసారి ఈయన ఒక ధాన్యపు కుప్ప వద్ద ధ్యానం చేసుకుంటుండగా రైతు ఈయనను చూసి దొంగ అనుకుని కర్రతో కొట్టబోగా చలనం లేకుండా శిలలా అయిపోతాడు. మరునాడు బ్రహ్మేంద్రులు సమాధినుండి బయటకు వచ్చిన తరువాత ఆ రైతుపై అనుగ్రహం చూపగా, రైతు తిరిగి చలనాన్ని పొందుతాడు. 5. ఇంకొకసారి ఒక నవవధువు పాముకాటుకు గురి కాగా, ఆమెకు తిరిగి ప్రాణం పోస్తాడు 6. ఒకమారు నెరూరులో ఉన్న పిల్లలు మన్మదురైలో ఉన్న సంతకు తీసుకువెళ్లమని అడుగగా వారిని కనుసన్నలతో కళ్లు మూసుకొమ్మని చెబుతారు బ్రహ్మేంద్రులు. క్షణకాలంలో పిల్లలంతా తాము మన్మదురైలో ఉన్నట్లు గ్రహిస్తారు. వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆయన కాళ్లమీద పడతారు.
సమాధి:
ఆయన తన సమాధి సమయంలో, నెరూరులో జీవసమాధికై యోగముద్రలో కూర్చుని సమాధి సందేశాన్ని యోగం ద్వారా తంజావూరు, పుదుక్కోటై, మైసూరు మహారాజులకు పంపిస్తారు. ఈ సందేశంలో వారణాసి నుండి బాణలింగము తీసుకువచ్చి, తన సమాధి స్థలం పక్కన ఒక బిల్వ వృక్షం నాటమని చెబుతారు. బిల్వ వృక్షం ఆయన సమాధి అయిన 9 రోజుల తరువాత అక్కడ మొలుస్తుంది. బాణలింగము 12వ రోజున తరలి వస్తుంది. మన్మదురై మరియు కరాచీలలో ఉన్న ఒక బ్రాహ్మణ మరియి ముస్లిం శిష్యులు ఆయన సమాధిని దివ్య దర్శనం ద్వారా చూస్తారు.
రచనలు:
వాటిలో ముఖ్యమైనవి ఆత్మ విద్యా విలాసము, నవమణిమాల, గురురత్నమాలిక, దక్షిణామూర్తి ధ్యానము, బ్రహ్మసూత్ర వృత్తి, యోగ సుధాకరము, కైవల్యామృత బిందు, సిద్ధాంతకల్పవల్లి, అద్వైత రసమంజరి, బ్రహ్మతత్త్వ ప్రకాశిక, మనో నియమం వంటి ఉత్తమోత్తమమైన అద్వైతసిద్ధాంత జ్ఞానసారాన్ని పంచారు.
వీటన్నిటిలో, ఆత్మ విద్యా విలాసము అత్యుత్తమైన రచనగా ప్రాచుర్యం పొందింది. 62 శ్లోకాల అందమైన సంస్కృతంలో రచన ఇది. దీనిలో పూర్తిగా బంధములనుండి ముక్తుడైన అవధూతను వర్ణిస్తుంది. సామాజిక కట్టుబాట్లకు, ధర్మానికి, అధర్మానికి, మంచికి, చెడుకు అతీతమై, స్మృతి, శాస్త్ర పురాణేతిహాసములకు దూరంగా, సన్యాసి ధర్మానికి అతీతంగా, దేహచింతలన్నీ అధిగమించి, పరిపూర్ణ ఆత్మానంద తృప్తుడై నిరంతర సచ్చిదానంద మగ్నుడై ఉండే, తానే పరబ్రహ్మమని గ్రహించి నిరంతర అనుభూతిలో ఉండే అవధూతను వర్ణిస్తుంది. అట్టి అవధూత లక్షణాలను, మనో స్థితిని, అలవాట్లను, వ్యవహారాలను చెబుతుంది. భారతదేశంలో యోగులకు, సన్యాసులకు, పీఠాధిపతులకు, కఠోర సాధకులకు ఈ గ్రంథం ప్రామాణికం. నడిచే దైవంగా పిలువబడిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాములవారు ఈ గ్రంథాన్ని ప్రతి దినము ఎక్కడో ఒక చోట ప్రస్తావించేవారు. అంతటి మహత్తర రచన ఈ ఆత్మ విద్యా విలాసము. తన గురువులైన పరమశివేంద్రులకు ఈ రచనను అంకితం చేశారు. తంజావూరు మహారాజా వారైన శరభోజీ ఆ ఆత్మ విద్యా విలాసాన్ని ఆస్వాదించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇవే కాకుండా, సదాశివ బ్రహ్మేంద్రులు సంస్కృతంలో కొన్ని గొప్ప కీర్తనలను రచించారు. వాటిలో పిబరే రామరసం, ఖేలతి మమహృదయే, భజరే రఘువీరం, చేతహ శ్రీరామం, చింతా నాస్తికిలా, స్థిరతా నహి నహిరే, స్మరవారం వారం, గాయతి వనమాలి, బ్రూహిముకుందేతి, సర్వం బ్రహ్మమయం, మానస సంచరరే, ఖేలతి బ్రహ్మాండే వంటి ఆణిముత్యాలైన రచనలను చేశారు. ప్రతి ఒక్క కృతి ఒక్కొక్క ఆధ్యాత్మిక సంపద. ప్రతి రచన పరబ్రహ్మ తత్త్వాన్ని మహోన్నతమైన పదశైలిలో వర్ణిస్తుంది. ఆయన రచించిన కీర్తనలలో ఇరవైరెండు కీర్తనలకు సాహిత్యం అందుబాటులో ఉంది తన గురువుల ద్వారా వచ్చిన భజన సాంప్రదాయాన్ని తన రచనలలో కొనసాగించారు. దక్షిణాదిన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు దేవాలయాలలో, సంకీర్తనోత్సవాలలో నిరంతరం ప్రతధ్వనిస్తునే ఉంటాయి. పరమహంస ముద్రతో ఆయన రచన చేసిన ఈ కృతులు సులభమైన సాహిత్యంతో, లోతైన అధ్యాత్మిక భావనతో ఉంటాయి. కొన్ని సాకార రూపాల వర్ణనగా, కొన్ని పరబ్రహ్మ తత్త్వ వర్ణనగా అద్వైతామృత సారాన్ని మనకు అందిస్తాయి. నాకు నచ్చిన ఐదు కీర్తనలు క్రింద. ఆంద్ర భారతి వెబ్ సైట్ లో అన్ని కీర్తనల సాహిత్యం ఉంది. ఒక కీర్తన చూద్దాము...
// పిబరే రామరసం //
పిబరే రామరసం రసనే పిబరే రామరసం |పిబరే|
జనన మరణ భయ శోక విదూ సకల శాస్త్ర నిగమాగమ సారం |పిబరే|
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం |పిబరే|
భావము:
ఓ జిహ్వా! రామ రసాన్ని త్రాగుము. జనన మరణముల యందు గల భయమును, శోకమును తొలగించే, అన్ని శాస్త్రముల, వేదముల సారమైన రామ రసాన్ని త్రాగుము. శుద్ధ అంతఃకరణము కలిగిన యోగుల ఆశ్రమములలో ఆలపించ బడిన గీతం ఇది. శుకుడు, శౌనకుడు, కౌశికుడు ఆస్వాదించిన రామ రసాన్ని త్రాగుము.
కొన్ని కీర్తనలు క్రింది లింక్ లలో విందాము...

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top