రాచకొండ రచనా వైశిష్ట్యం - అచ్చంగా తెలుగు

రాచకొండ రచనా వైశిష్ట్యం

Share This

రాచకొండ రచనా వైశిష్ట్యం

- భావరాజు పద్మిని


ఆధునిక వచన సాహిత్యాన్ని,'సామాన్యుడి వెతలు' అనే మానవీయ కోణం నుంచి ఆవిష్కరించిన రతనాల కొండ...రాచకొండ. మనస్సులను మహా వేగంగా పరుగెత్తించే భావావేశాన్ని సృష్టించడం ఆయన ప్రత్యేకత. బాధలతో పాటు, బాధలకు అసలు కారణాలని, కారకులనీ ఎత్తి చూపించడం ఆయనకే చెల్లింది.
రావిశాస్త్రి గా పిలువబడే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, జూలై ౩౦ వ తేదీన 1922 లో నారాయణ మూర్తి, సీతమహా లక్ష్మి దంపతులకు జన్మించారు. రావిశాస్త్రి గారి తల్లికి సంగీతసాహిత్యాలలో గల పరిచయం పిల్లలపై ముఖ్యంగా శాస్త్రిగారిపై చాలా ప్రభావం చూపింది.సమకాలికమైన పత్రికలు పుస్తకాలు చదవడం వలన రాజకీయ,సాహిత్యవిషయాలతో పరిచయం ఏర్పడింది.సాహిత్యమే కాక సంగీతంలో కూడా రావిశాస్త్రిగారికి మంచి అభిరుచి ఉండేది.
రావిశాస్త్రి గారిని విశ్వంగా ఇంట్లోను, ఆర్వీయస్ గా కోర్టులోను,చాత్రిబాబుగా క్లయింట్లతోను, రావిశాస్త్రిగా పాఠక లోకంలోను పిలవడం చాలా మందికి తెలుసు. నిజజీవితంలోనే కాక రచయిత గా కూడా రావిశాస్త్రిగారికి బోలెడు మారుపేర్లు.కాంతాకాంత,జాస్మిన్,గోల్కొండ రాం ప్రసాద్, శంకర గిరి గిరిజా శంకరం, అన్ జానా ఇలాంటి పేర్లతో ఎన్నో కధలు వ్రాశారు రావిశాస్త్రి.
తన పదమూడవ ఏటనే రచనలు చేసారు, అవి ఎన్నో పత్రికల్లో ముదరింపబడ్డాయి. రచయితగా తన రచనల తొలిదశ గురించి చెప్తూ రావిశాస్త్రి తన తొమ్మిదవ యేటనే ఒక డిటెక్టివ్ కథను, రసపుత్ర వీరులగురించి ఒక అసంపూర్తి నవలను వ్రాశానని, కొనసాగింపు తెలియక ఆపేశానని చెప్పారు. ఆయన పదహారవ ఏట 1938 లో దేవుడే చేసాడు అన్న పేరుతో వినోదిని పత్రికలో అచ్చయిన కథ ఆయన తొలి రచన. ప్రేమ ఫలితం, ఉద్యోగం దొరక్కపోతే, మీరే ఆలోచించండి కథలు విద్యార్థి దశలో ప్రచురించబడిన కథలు. రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి 'అయ్యారే బాబారే ' పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక అల్ప జీవి గా పేరు మార్చి నాలుగు నెలల పాటు ధారావాహికంగా ప్రచురించింది. ఈ మహా రచయతను తెలుగు వారికి అందించిన గౌరవం 'భారతి' పత్రికకే దక్కింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది. రచయిత విశాఖ వాస్తవ్యుడని తెలిసి విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది.
విశాఖ రచయితల సంఘంలో బలివాడ కాంతారావు, కాళీపట్నం రామారావు, అంగర సూర్యారావు వంటి వారి పరిచయం రావిశాస్త్రిలోని రచయితకి కొత్తచూపునిచ్చింది. కేవలం తను రచయితగా గుర్తించబడాలన్న కోరిక మాత్రమే నేపధ్యంగా ఉన్న కధారచనకి ఒక ప్రయోజనం,నిబద్ధత ఉండాలనుకోవడంతో పరిణామం చెందింది. తనదైన ఒక దృక్పథాన్ని నిర్దేశించుకోవడానికి బీజం వేసింది విశాఖ రచయితల సంఘం. విశాఖ నాటక కళా మండలి, సహవిద్యార్థి అబ్బూరి వరదరాజేశ్వరావు స్ధాపించిన నటాలి సంస్థ నటుడిగానే కాక నాటక ప్రయోక్తగా కూడా రావిశాస్త్రిని మలిచాయి. గురజాడ కళాకేంద్రం స్ధాపించి వచ్చేకాలం, నిజం నాటకాలను రచించి ప్రదర్శించారు .
'ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపచేసే రచనలే కళాఖండాలని అటువంటి రసానుభూతినే తాను రసన అంటానని, రావిశాస్త్రి రచనలు రసనను సమృద్ధిగా ఆవిష్కరించగలుగుతున్నాయని' మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్నాయి రావిశాస్త్రి రచనలు. తనని ఉర్రూతలూగించిన శ్రీశ్రీ మీద గౌరవంతో శ్రీశ్రీ 'కావేవీ కవితకనర్హం' అంటూ చెప్పిన కవితా వస్తువులను కథా వస్తువులుగా స్వీకరించి కుక్కపిల్ల, అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, బల్లచెక్క,అరటితొక్క,తలుపుగొళ్లెం,హారతి పళ్లెం, గుర్రపు కళ్ళెం పేరుతో కథలు వ్రాసారు. చివరి గుర్రపు కళ్ళెం మాత్రం కధ పరిధులను మించిపోయి నవలగా రూపాంతరం చెంది మరిడీ మహాలక్ష్మ కథ, లేదా గోవులొస్తున్నాయి జాగ్రత్త పేరుతో కనిపిస్తుంది.
రావిశాస్త్రి గారి పరిశీలన అనన్యమయినది. ఆయన కధ చెప్పే పధ్ధతి, ఆలోచించే తీరు, రచనా శైలి, సామాజిక స్పృహ ,విలక్షణమయినవి. ఆయన ఎక్సరే కళ్ళతో లోకాన్ని చూసేవారు. చెవులు టేప్ రికార్డర్లు. పరధ్యానంగా ఉన్నట్లు కనిపిస్తూనే అన్ని పరిశీలించేవారు. ఒక వ్యక్తితో కాసేపు మాట్లాడితే, వారి మాటతీరు, చూపు, హావభావాలు, విసురు, తలబిరుసు వంటి ముడి పదార్ధాలను ఏరి, సమాజానికి ఉపయోగపడేలా పాత్రలను సృష్టించేవారు. వారి కధలను చదువుతుంటే, సంఘంలోని మనుషులే ప్రత్యక్షమయినట్లు తోస్తుంది. ఇలా వాస్తవికత సాధించడం అందరికీ సాధ్యం కాదు.
రావిశాస్త్రి గారి కథలను వస్తురీత్యా గమనించినప్పుడు 1950 ముందు వ్రాసిన కథలకు,  1953 తరువాత, అంటే 'అల్పజీవి' నవలకు విశేష స్పందన లభించిన తరువాత,  వ్రాసిన కథలకు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కథనం, శిల్పంలో చమత్కారాలు, వర్ణనల విషయం పక్కన పెడితే వస్తువరణలో ఈ తేడా కనిపిస్తుంది. 1950 - 1960 మధ్య వ్రాసిన ఎన్నోకథలలో మధ్యతరగతి,దిగువ మధ్యతరగతి జీవన చిత్రణే కథావస్తువు. ఈవర్గానికి చెందిన వారి జీవితాలలోని సమస్యలు వాటికి కారణాలను వెతుకుతూ అందులోని జీవనవైఫల్యం, అంతర్లీనంగా ఉన్న విషాదం, మానవ సంబంధాలను ఆర్థిక కారణాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తూ సాగిన ఈ కథల పై రావిశాస్త్రి అభిప్రాయం , ఆయన మాటల్లో.....
"లోకంలో ధన బలం, అధికార బలం రెండూ ఉన్నాయి. ఈ రెండూ సాధారణంగా జోడు గుర్రాల్లా వెళ్తూ ఉంటాయి. వీటి వాళ్ళ బాధింపబడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎక్కువ మందిలో నేనూ ఒకడిని అందుచేత అటువంటి వారి గురించి యెంత ఎక్కువ రాస్తే, అంత మంచి జరుగుతుందని నాకు  స్థిరమయిన అభిప్రాయం కలిగింది. అధికార మదానికి, ధన మదానికి వ్యతిరేకంగా నేను రాస్తూ వచాను. అది 1953 తరువాత నేను రాసిన ప్రతి విషయం లోనూ స్పష్టం అవుతుంది."
కేవలం కధల్లో బడుగు వర్గాల కష్టాలను ప్రతిబింబించడం మాత్రమే కాకుండా, ఒక న్యాయవాదిగా కూడా వారి బాసట నిలిచారు. పేదల ప్లీడరు రావిశాస్త్రి. ఎవరిపయినయినా అక్రమారోపణ జరిగితే, వారి తరపున వాదించి, రక్షించి, దుర్మార్గుల ఆటలు కట్టించే వారు. శాస్త్రి గారు 'మానవతా న్యాయవాదులు.'పేదవాడి దీనావస్థకు చలించిపోయే సున్నిత మనస్తత్వం.  తానే  పెట్టుబడి పెట్టి బెయిలు మీద విడిపించి, వాళ్ళ కేసులు వాదించి, వాళ్ళను విడిపించి, తక్షణమే తనకు ఏమీ తెలియదన్నట్టు అంటా మరచిపోయి, లోకాభిరామాయణం మాట్లాడేవారు.
శాస్త్రి గారు స్నేహశీలి. చివరి రోజుల్లో, 'ఏడో  చంద్రుడు' అనే పేరుతొ ఆయన  బాల్యం గురించి, జ్ఞాపకాల గురించి, మాష్టారుల గురించీ, మిత్రులందరితో ఆయన అనుభూతుల గురించి,  'రచన' పత్రికలో ఐదు వ్యాసాలూ రాసారు. అందులో వ్రాసిన ఆయన మాటలు..."అన్నీ పోతాయి. ఏడ్చి లాభం లేదు. తప్పదని తెలిసి కూడా ఏడుస్తాము."
ఆయన రచనలన్నీ ఒకే చోట ఏర్చి కూర్చి రాచకొండ విశ్వనాధ శాస్త్రి రచనా సాగరం పేరిట మనసు ఫౌండేషన్ వారు శ్రి బాపు ముఖచిత్రంతో 1373 పేజీలతో పుస్తకాన్ని ప్రచురించారు.
శ్రీ రావి శాస్త్రి గారి కలం నుండి వెలువడిన 'ఈ ప్రేమ లోకంలో ,ఎవరి ప్రేమలు వారివి' అనే చిన్న కధలోని మాటలు వారి హాస్య చతురతను తెలుపుతాయి. ఈ టూకీ కధ  ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో 1972 అక్టోబర్ ఇరవై న ప్రచురించబడింది.
"రెండు పాములు ప్రేమించుకున్నయిట . మధ్యాహ్నం మొగలి పొద నీడలో అవి బుసబుసా ముద్దులాడుకుని, సరసరా పెన వేసుకుపోయి, మిలమిలా మెరిసిపోయాయట. ఆ సమయంలో వాటిని చూసిన ఓ కప్పు ముగ్డురాలయిపోయి ఎంతగానో మురిసిపోయి, 'ఆహా, ఈ లోకమంతా ప్రేమ మాయం--అవునవును ప్రేమ మయం' అని గొంతెత్తి బెకబెకా పాడిందట. ఆ సందడికి పదివేల కప్పలు చకచకా అక్కడికి చేరాయట. ఇంతలో ఆ జంట పాములకి జాయింటుగా ఆకలి వేసిందట. దాంతో పాముల జంట, కప్పు కవితో సహా దొరికిన అన్నికప్పలనూ, వేర్వేరుగా భుజించి, సుఖిన్చాయిత. దొరకని కప్పలు అప్పుడు పాముల ప్రేమ ఏదయినా కావచ్చు కాని కప్పల యెడ ప్రేమ మాత్రం అది కాదు కాదని తెలుసుకున్నయిట ..."
రాచకొండ వారి స్పూర్తి ఎందరికో ఆదర్శవంతం. భావి రచయతలకు ఆయన ఇచ్చిన సందేశం...
"సమాజాన్ని రచయత ప్రభావితం చెయ్యక తప్పదు .రచయత ఒక ద్రష్టగా సమకాలీన సమాజం లోని దౌర్బల్యాన్ని ఎత్తి చూపించడం ద్వారా ఉత్తేజాన్ని కలిగించి, స్పూర్తితో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. అది రచయత సామాన్య ధర్మం."

No comments:

Post a Comment

Pages