Sunday, March 22, 2015

thumbnail

దశావతారాలు - జీవ పరిణామం

దశావతారాలు - జీవ పరిణామం

వి. ఎస్. భరద్వాజ


ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది.  ప్రకృతిలో అనాది నుంచీ జరుగుతున్న పరిణామ క్రమం నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం.  పురాణేతిహాసాల్లోనూ ఇదే విషయం మనకు స్పష్టమవుతోంది.  కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు.  ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం.  అంతేగాక..  మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే.
విష్ణువు పది అత్యంత ప్రసిద్ధ అవరోహణల్ని సమష్టిగా దశావతారాలని అంటారు. ఈ జాబితా గరుడ పురాణంలో చేర్చారు.  మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగo లో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి.  తర్వాతి మూడు అవతారాలు, త్రేతాయుగo లో, ఎనిమిదో అవతారం ద్వాపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగo లో. పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా.
మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః
రామః రామో రామాః కృష్ణశ్చ కల్కిః
అని ఆ విష్ణుమూర్తి పది రకాల రూపాల్లో అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం సత్య యుగంలో కనిపించింది.  కూర్మావతారమూ సత్య యుగంలో కనిపించింది.  వరాహావతారమూ సత్య యుగంలోనే కనిపించింది.  సగం మనిషి సగం మృగం రూపంలోని నారసింహావతారం..కూడా సత్య యుగo లో కనిపించింది.  వామనావతారం త్రేతా యుగంలో కనిపించింది.  పరశురామం అంటే గొడ్డలితో రాముడు, త్రేతాయుగo లో కనిపించాడు.  రామచంద్రుడు, అయోధ్య రాజు త్రేతాయుగంలో దర్శనమిచ్చారు.  బలరామ కృష్ణులు ద్వాపర యుగంలో కనిపిస్తారు.  భాగవతం ప్రకారం బలరాముడు అనంత శేషుడి వారసత్వం అనే వాదన కూడా ఉంది. కలియుగాంతంలో పదో అవతారంగా కల్కి దిగివస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
దశావతారాల్లోనూ మనకు జీవ పరిణామ క్రమం కనిపిస్తుంది.  మొదటిదైన
మత్స్యావతారంలో, విష్ణువు చేప రూపంలో దర్శనమిచ్చాడు.  మహా ప్రళయం సంభవించినప్పుడు విష్ణుమూర్తి చేప రూపంలో వేద వాఙ్మయాన్ని రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి.  చేప జలచర జంతువు.  జీవ పరిణామంలో తొలితరం జీవులు జలచరాలే.  దశావతారాల్లో రెండోది కూర్మావతారం.  ఈ అవతారంలో మహా విష్ణువు తాబేలు రూపంలో దర్శనమిచ్చాడు.   అమృత భాండం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంలా ఉపయోగించి క్షీర సాగరాన్ని మథిస్తారు.  ఈ తరుణంలో పర్వతo  మునిగిపోతుంటే.. విష్ణువు కూర్మ రూపాన్ని ధరించి పర్వతాన్ని మోస్తాడు.  తాబేలు ఉభయచరం.  అంటే నీటిలోనూ, నేలమీద తిరగే జీవి.  జీవ పరిణామంలో జలచరాల తర్వాతి జీవులు ఉభయచరాలే.
శ్రీ మహావిష్ణువు మూడో రూపం వరాహావతతారం.  ఆ దేవదేవుడు.. పంది రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడనే అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి.. భూమిని పాతాళంలో పడవేసి, బ్రహ్మ నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు.  వరాహావతతారంలో విష్ణుమూర్తి.. హిరణ్యాక్షుడిని సంహరించి.. భూమిని, వేదాలను రక్షిస్తాడు. సృష్టి పరిణామ క్రమంలో.. ఉభయచరాల తర్వాతి వర్గం భూచర జీవులు.  పంది భూమిపై తిరిగే జంతువే.  ఆ తర్వాత నాలుగో అవతారం నారసింహ రూపం.  నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది.  ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతరారంలో దిగివచ్చిన శ్రీ మహా విష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు.
దశావతారాల్లో ఐదోది వామనావతారం.  మరగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు.. రెండడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి.. మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు.  ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు.  మానవులు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది.  ఆ తర్వాత ఆరో అవతారం పరశురాముడు.  మనిషి రూపంలో ఉన్నా.. అనాలోచితంగా, ఆవేశపూరితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది.  అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దశావతారాల్లో ఏడోది శ్రీరామావతారం.  ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం  జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది.  రామావతరాం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది.  మానవ జీవనం ఎలా సాగాలో  ఆచరించి చూపిన రాముడు ఆదర్శపురుషుడయ్యాడు.  ఆ తర్వాత ఎనిమిదో అవతారం బలరామావతారం.  ద్వాపర యుగంలోని ఈ అవతారాన్ని ఆదిశేషుడికి ప్రతిరూపంగానూ చెబుతారు.  ఆయన ఆయుధం నాగలి.  మానవ నాగరికత అభివృద్ధి, వ్యవసాయ జీవనానికి ఈ అవతారాన్ని ప్రతీకగా చెప్పుకోవచ్చు.
దశావతారాల్లో తొమ్మిదోది శ్రీకృష్ణావతారం.  బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు.  ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి.. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారధిగా నిలిచాడు శ్రీకృష్ణుడు.  ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.  ద్వాపర యుగం తర్వాత కలియుగంలో ధర్మానికి హాని కలిగి అధర్మం వృద్ధి చెందినప్పుడు.. శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో తన పదో అవతారంగా దర్శనమిస్తాడని శాస్త్ర వచనం.  ధర్మ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం.. ప్రతీ యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తూ ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు.  ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే.
ప్రకృతికి అనేక రూపాలుంటాయి. అది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. రుతువు నుంచి మరో రుతువులోకి కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. సముద్రం ఉదయం నీలి రంగులో ఉంటే, మధ్యాహ్నం గరుడ పచ్చ రంగులో ఉంటుంది. సాయంత్రం ఎరువు రంగులోకి మారుతుంది. ఆకాశంలోని రంగులు రోజంతా మారుతూ కనువిందు చేస్తూ ఉంటాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాలు మనసుకెంతో ఉల్లాసాన్నిస్తాయి.  ఇలా ప్రకృతిలో మనకు కనిపించే మార్పులు కూడా పరిణామ క్రమంలో భాగమే.  అందుకే.. మనం కూడా మన జీవితాల్లో మార్పును ఆహ్వానిద్దాం.  తద్వారా కొత్తదనానికి ఆహ్వానం పలుకుదాం.  నవ్యతకు నాణ్యతతో ప్రాణం పోద్దాం.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information