శివం – 10 - అచ్చంగా తెలుగు

శివం – 10

Share This
శివం – 10 (శివుడే చెబుతున్న కధలు ) 
 - రాజ కార్తీక్ 9290523901
 ( శివభక్తుల కధలను గురించి చెబుతుంటాడు శివుడు...) 

 భక్తులారా! మరొక మంచి కథ చెబుతాను మీకు, నంది గురించి. ఈశ్వరుడిని అంటే - నన్ను మోసిన నంది, నందీశ్వరుడు. ఎవరు ఎక్కడ నా నామస్మరణ చేస్తారో, ఎవరికి నా నామం మనసులో ధ్యానంగా ఉంటుందో, అక్కడ ఎప్పుడూ నంది ఉంటాడు. “మహాదేవా, మహాదేవా” అంటూ నన్నే స్మరిస్తూ ఉంటాడు. శుద్ధభక్తికీ, జ్ఞానానికి, తపస్సుకు సరియైన ఉదాహరణ నందియే. నా ప్రియభక్తుడు, నా సేవకుడు, నా వాహనం, నాకు అందరి కంటే ముఖ్యమైన నంది గూర్చి ఒక మంచి కథ చెబుతాను. అది పూర్వం నేను సన్యాసిగా విరాగిగా, ఒక్కడ్నే ఉన్నప్పుడు జరిగిన కథ..... శిలాదుడు నాకు ఎంతో ఇష్టుడు. నా కోసం ఘోర తపస్సు చేసి నన్ను ప్రత్యక్షం చేసుకున్నాడు. శిలాదుడు నాముందు మోకరిల్లి “ దీనులకు ధన్యత, పాపులకు మోక్ష అర్హత, అన్ని కోరికలు పటాపంచలు చేసే మహాశివా” అంటూ నా చుట్టూ తిరిగి నాకు ప్రదక్షిణలు చేసి “ శరణం లయ, చరణం లయ, ఓ శివాలయ “ అంటూ ప్రసన్నం చేసుకున్నాడు. “హరహరమహదేవ్” అంటూ తీవ్రతన్మయత్వంలో ఉన్నాడు. నేను “శిలాదా నీ ఆర్తి నన్ను కదిలించింది, నీ భక్తికి నా మనసు పులకించింది, నీకు ఏం కావాలి? ‘ అని అడిగా. శిలాదుడు “త్రినేత్ర, నాకు నీ యందు ఎల్లప్పుడూ భక్తి ఉండేట్లు, ఒక బిడ్డని అనుగ్రహించు తండ్రి” అని వరం కోరుకున్నాడు. నేను “తథాస్తు, నీ కోరిక తథ్యం నెరవేరుతుంది” అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నంది శిలాదునికి పుట్టి, క్రమక్రమంగా పెరుగుతూ, శివభక్తి పరాయణుడు అయ్యాడు. కానీ ఇద్దరి మహర్షుల వాక్కుచేత, నంది తాను అల్పాయుష్కుడనని తెలుసుకొని, శిలాదుని దగ్గరకు వెళ్ళి, బాధపడుతున్న శిలాదుని ఓదార్చి “మహాదేవుణ్ణి నమ్మిన వారిని తలరాత, మృత్యువు ఏమి చేయలేదు, మీరు నాకు అనుమతి ఇస్తే, నేను వెళ్ళి మహాదేవున్ని తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకుంటా” అని ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు. నంది “భువననది “ లో తపస్సు చేద్దామనుకొని బయలుదేరి వెళ్తున్నాడు. భక్తులారా! నంది ద్వారా అనన్య చింతన, నవవిధభక్తిమార్గాలు అంటే ఏమిటో చూపటానికి నేను ఈ లీల చేశాను. మార్గమధ్యంలో నేను మరొక రూపంలో నంది ముందు ఉన్నాను. తోటి బాటసారిలాగా నందితో పయనమయ్యాను. నంది నాతో భువననదికి దారి తెల్సా అని అడిగి, దారి చూపమన్నాడు, మారువేషంలో ఉన్న నన్ను నంది గుర్తించలేదు? “భువననదికి” ఎందుకు అని అడిగాను. దానికి నంది “స్వామీ, ఎందుకు తెలీదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మీరు బాగా ఎరిగిన వారులాగా ఉన్నారు, నా మనసు మీతో మాట్లాడుతుంటే, పరవశించిపోతుంది. నేను “మనిద్దరి బంధం ఇంకా మున్ముందు మొదలుకాబోతుందిలే” అని అన్నాను. దానికి నంది “మీరు కూడా మహాదేవుని భక్తులా”, అని అతడు అడిగాడు. నేను “ఏ దేవుడ్ని నేను నమ్మను, నన్ను నేనే నమ్ముకుంటా. మహాదేవుడు అసలు దేవుడు అని ఋజువు ఏది? ఇందాక శిలాదుడిని కలిసి మాట్లాడాకా , నాకు శివుడు లేడని తెలిసిపోయింది ,” అని అన్నాను. నంది తానెవరో చెప్పకుండా “మీకు ఏమి తెలిసినది మహాత్మా, దయచేసి శివుడ్ని నా ముందు విమర్శించవద్దు” అని గౌరవ హెచ్చరిక చేశాడు. నేను - “వరం ఇచ్చినవాడు అదే ఆ మహాదేవుడు, ఆల్పాయుషు ప్రసాదించాడట, శిలాదుడు కన్నీరు పెట్టుకుంటే అడిగి తెలుసుకున్నా...”. నంది - ” మహాత్మా! ఆయుష్షు తక్కువైనా , మహాదేవుడ్ని నమ్మితే భౌతిక మరణం తర్వాత ఆయనలో లీనమవ్వచ్చు కదా? అప్పుడూ, రాత, ఆయుష్షు అనే పదాలకు అర్ధం ఏముంది, అంతిమ చర్య మోక్షానికి ఆయనలో లీనం అవ్వటమేగా? నేను - అబ్బో, భలేగా చెప్పావు, ఇంతకీ ఆ నదికి నీవు ఎందుకు వెళ్తున్నావో ?” నంది - “తపస్సు చేయుటకు పయనమయ్యాను”. నేను -“ఏ వరం కావాలో” అన్నాను వ్యంగ్యంగా. నంది - ”మహాత్మా, వరాలకోసం తపస్సు కాదు, ఆయన్ని దర్శిచటం కోసం”. నేను - “పిలిస్తే వస్తాడు అంటారు కదా, మరెందుకు తపస్సు చేయటం? ” నంది -“మహాత్మా, మీ ప్రశ్నలో నాకొక కొత్త ఆలోచన వచ్చింది, నేను వరం కోరుకుంటా”. నేను - “చెప్పలా...వరంకోసమేగా”....హాహాహా . నంది - “నేను కోరుకునే వరం వేరు, నీవు అనుకునేది వేరు” , అంటూ నా గూర్చి నా ముందే పాటలు పాడుతూ స్తోత్రం చేస్తూ తిరుగుతున్నాడు. నంది పాడుతున్న సంకీర్తనలను విని నేను చాలా సంతోషపడ్డాను. భక్తావేశం ఎక్కువై నంది పూనకం వచ్చిన వాడిలాగా ‘శివ శివ శివ’ అంటూ తిరుగుతూ క్రిందపడ్డాడు. క్రిందపడిన నంది కాలికి గాయము అయ్యింది, అక్కడి నుండి మళ్ళీ దొర్లటంతో. నంది కదలలేని స్థితిలో ఉన్నాడు. నంది” శివయ్యా, నేను కవిని కాను, బుద్ధిలేని ఈ పశువు పాడిన పాటలు నీకు వినబడ్డయా?” అని ఆర్తితో ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి నందిని గట్టిగా పట్టుకొని “ఏమయింది నీకు” అని గాబరాగా అడిగినట్లు అడిగాను. “నేను త్వరలో శివయ్యను చూడబోతున్నా” అని ఆనందంగా అరుస్తున్నాడు. నంది కాలికి గాయము అయ్యింది. నేను వెళ్ళి అక్కడ ఆకుపసరు సేకరించి నంది కాలు పట్టుకొని రాయబోతున్నా, నంది “స్వామి మీరు పెద్దవారు నా కాలు మీరు పట్టుకోవటమా ?”, అన్నాడు. నేను” ఏమి పర్లేదు నాయనా, నా బిడ్డ లాంటి వాడివి నీవు, నా బిడ్డవే అనుకో” అంటూ చొరవగా నంది పాదాలకు మందు వ్రాసాను. నంది చిన్నగా లేచి కదలబోయాడు. కానీ కదలలేక పోయాడు. నందిని చిన్నగా ఆసరాగా తీసుకొని జాగ్రత్తగా నందిని నిలబెట్టాను. నంది భక్తి పారవశ్యంలో ఉన్నాడు. నందిని దగ్గరగా కూర్చోబెట్టుకొని అన్నం ఎప్పుడు తిన్నావో, తిను నాయనా అని అన్నం పెట్టాను. నంది చేయికి గాయం కావున, నేనే దగ్గరుండి తినిపించాను. ప్రకృతి ఈ దృశ్యాలు చూసి మైమరచిపోతుంది. నంది “నీవు చెప్పిన శిలాదుని బిడ్డను నేనే” అంటూ ఏడవసాగాడు, “ఇలా ఉంటే, నేను ఎలా తపస్సు చేయాలి” అని అడిగాడు. నేను వెంటనే “నాయనా, నేను నిన్ను మోయగలను “అంటూ పైకి ఎత్తబోయాను. నంది “ఆ శివయ్య తపస్సు చేద్దామని భువననదిలో నిర్ణయించుకున్నా” ,అందుకు శివుడే సాయంగా పంపినది నిన్నే మహాత్మా” అని అన్నాడు ఆనందంగా. నేను నందిని ఎత్తుకొని నా భుజాలకు వేసుకున్నాను. నంది కళ్ళు మూసుకున్నాడు. నేను నా నిజరూపంలోకి మారాను. (సశేషం...)

No comments:

Post a Comment

Pages