నానార్ధశివశతకము - మాదిరాజు రామకోటీశ్వరకవి శాస్త్రి

- దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం :
ఈశతక రచయిత శ్రీ మాదిరాజు రామకోటీశ్వరకవి శాస్త్రి గారు. గుంటురు జిల్లా నర్సారావుపేట తాలూకా రొంపిచర్ల గ్రామవాస్తవ్యులైన ఈకవి సదాశివపేట మిడిల్ స్కూలులో తెలుగుపండితులుగా పనిచేసారు. విద్యార్ధులకు అత్యంత ఉపయుక్తంగా ఉండేవిధంగా 1928 సంవత్సరంలో ఈ శతకాన్ని రచించారు.
తెనుగు గీర్వాణపదముల దెలియునటుల
నరసిసమకూర్చిచెప్పితి నార్యులలర
సిరులొసంగెడి నానార్ధశివశతకము
దీని భవదంకితమొనర్తు దేవదేవా!
అని తన శతకాన్ని ఆ దేవదేవునికే అంకితం చేసారు.
నానార్ధశివశతకము పరిచయం:
ఈశతకము ఒకే పదానికి గల నానార్ధాలను తెలియచేస్తు చెప్పిన శతకము. ఏభాషలొనైనా పట్టు సాధించటానికి ఆభాషలోగల శబ్దాలను, పదాలను వాటివాడుకను, సందర్భోచితంగా నేర్చుకొన్నప్పుడే సాధ్యం అవుతుంది. అటువంటి అవసరాలను తీర్చేందుకు ఉపయుక్తంగా ఉండేదే ఈ శతకం.
కందపద్యాలలో చెప్పిన ఈ శతకం అత్యంత సులువైన భాసలో మనసుకు హత్తుకునే విధంగా ఉండటమేకాక మన తెలుగు భాషాపాండిత్యవికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. ఉదాహరణకి "శ్రీ" అనే పదానికి ఎన్ని అర్ధాలను చెప్పారో చూడండి:
శ్రీయనలక్ష్మియు, గీర్తియు
శ్రీయన వృద్ధియు, బుద్ధి, సిరి, శారదయున్
శ్రీయన విష ముపకరణము
శ్రీయన నొకరాగమండ్రు శ్రీపతివంద్యా!
శ్రీయనే పదానికి లక్ష్మీ దేవి, కీర్తి, వృద్ధి, బుద్ధి, సిరి(ధనము), శారద, విషము, ఉపకరణము, శ్రీ అనెడి రాగము అనే అర్ధలున్నాయి అన్నమాట. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. మరి కొన్ని పద్యాలు చూద్దాం
గురువన దండ్రి, బృహస్పతి
గురువుపాధ్యాయుడన్న కులపెద్దయగున్
గురువన తాతయు, మామయు
గురువనగ రాజునగును గుధరజనాధా!
గురువు అనేపదానికి తండ్రి, బృహస్పతి, యుపాధ్యాయుడు, అన్న, కులపెద్ద, తాత, మామ, రాజు అనే అర్ధం.
మండలియన సూర్యుండగు
మండలి శునకంబు, బాము, మార్జాలంబున్
మండలియనగను రాజగు
మండలి యన గుంపునగును మనసిజదమనా!
మండలి అనేపదానికి సూర్యుడు, శునకము(కుక్క), పాము, పిల్లి, రాజు, గుంపు అని అర్ధములు. ప్రస్తుతం మనం ఈ పదాన్ని గుంపు అనే అర్ధంలోనే వాడుతున్నాము.
రుచియన సూర్యుని కిరణము
రుచియనగా నిష్టమగును రుచియన జవిన్
రుచియన గాంతికి నర్ధము
రుచికడుచల్లని వెలుంగు రుసిజనవినుతా!
రుచి అనేపదానికి సూర్యకిరణము, ఇష్టము, ఉప్పు, కాంతి, చల్లని వెలుగు అని అర్థాలున్నాయి.
శిఖయన గిరణముకర్ధము
శిఖయనగా నెమలిసిగయు, సిగయున్, సెగయున్
శిఖయన శాఖయు, నూడయు
శిఖయనగా గొనయునగును శ్రీవిశ్వేశా!
శిఖియన నెమలియు, గోడియు
శిఖి కేతుగ్రహము, నెద్దు, జెట్టున్ నగ్గిన్
శిఖియన బాణముకర్ధము
శిఖి సిగ గలవాడునగును శ్రీకంఠశివా!
(పై పద్యాలకు అర్ధం సుగమం అందుకే వ్రాయటం లేదు)
ఇలా చెప్పుకుంటుపోతే మనకు తెలుసు అనుకునే ఎన్నో పదాలకు క్రొత్త అర్ధలు తెలుసుకునే అవకాశం మొత్తం 128 పద్యాలతో ఉన్న ఈ శతకం వలన కలుగుతుంది.
తెలుగుభాషలో ఉన్న అనేకమైన పదాలకు అర్ధం చెప్పే ఈ శతకం ప్రతి విద్యార్ధి, తెలుగు భాషాభిమాని నేర్చుకోవలసిన  శతకం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top