మనసున మనసై - అచ్చంగా తెలుగు

మనసున మనసై

Share This

మనసున మనసై

(పెద్ద కధ )

- రాజవరం ఉష


‘సంజనా! ఏమిటే ! ఇంకా ఎంత సేపూ? ‘అంటూ బైక్ హారన్ మోగించాడు సుజన్ .. ‘వస్తున్నాను రా! ఆగు! అబ్బబ్బబ్బబ్బ! హారన్ మోగించక పొతే ఊపిరాడదా నీకు? ‘అంటూ విసురుగా బ్యాగు భుజాన వేసుకుని ‘డాడీ ! వెళ్ళొస్తా! ‘అని గట్టి గా అరిచి బయటకు పరుగెత్తింది సంజన .. ‘ఇదెప్పుడు ఇంతే !త్వరగా తెమలదు ,పాపం ఆ అబ్బాయి ఎలా అరుస్తున్తాడో గొంతు చించుకుని ... ‘ సంజన తాగి పెట్టిన బూస్ట్ గ్లాసు అందుకుంటూ విసుక్కుంది అన్నపూర్ణ .. ‘సర్లేవే! అది.. ఆడ పిల్లే! మనింట్లో కాకపోతే ఇక్కడే దానికీ మాత్రం స్వేచ్ఛ?   రేపు పెళ్లి చేసుకుని అత్త వారింటి కెళ్తే ఇలా సాగుతుందా ఈ కొన్నాళ్ళైనా ఇలా కానీలేవే’ అన్నాడు  త్యాగ రాజు ‘ఆ! .. అది ఆడ పిల్ల అనే నేనూ చెప్తున్నాను కాస్తంత కూడా ఆడపిల్ల లక్షణాలు లేకపొతే  ముందు ముందు ఎలా? అనేదే నా బాధ  కనీసం ఆ అబ్బాయికున్న క్రమ శిక్షణ మన సంజనాకుందా... అని .. ‘ భర్త కు  కాఫీ కలుపుతూ అంది అన్నపూర్ణ. "ఏం చెల్లాయ్ మా కోడలు పిల్ల మీదేనా నీ అరుపులు?" వాకింగ్ నుండి  నేరుగా వాకిట్లోకొచ్చి త్యాగరాజు భుజమ్మీద చిన్నగా చరిచాడు గిరి బాబు .. ‘ఏమేవ్! ఆ చేత్తోనే మీ అన్నయ్య కీ ఓ కప్పు పట్రా .. ‘ అంటూ .. ‘ఇటు తిరిగి.. రండి బావ గారూ! ‘ లోనికి దారి చూపాడు త్యాగరాజు . “మరే! అన్నయ్యా!ఎంత మనం దగ్గరి వాళ్ళమయినా రేప్పొద్దున్న పెళ్ళయి సంజన మీ యింటి కోడలిగా అడుగు పెట్టేటప్పటికి కాస్త అణకువ, గౌరవం నేర్చుకుని ఉంటె బాగుంటుంది కదాని " కాఫీ కప్పు చేతికందిస్తూ ఫ్యాన్ రెగ్యులేటర్ స్పీడ్ పెంచింది అన్నపూర్ణ . “చూసారా బావగారు! మీ చెల్లి ఓ కాఫీ కప్పు మాత్రమే తెచ్చి దాన్ని మీకందించింది అరగంట నుండి మొత్తుకున్నా నన్ను పట్టించు కుందా అసలు?” అని,,, “ఇక పిల్లకు మాత్రం నీతులు చెబుతుందట ..” అన్నాడు త్యాగరాజు .. “అయ్యో! అన్నయ్యా! ఈ కప్పు ఆయనకే తెస్తున్నాను, మీ గొంతు వినేసరికి మీకు తెచ్చిచ్చాను. ఆ మాత్రం దానికే ఎలా నోరు పారేసుకుంటారో  చూడండి ఈయన.. “ ,అని  ఉడుక్కుంటూ  మరో కాఫీ కప్పు కలపటానికి లోనికి వెళ్ళింది  అన్న పూర్ణ  ... "మా చెల్లి అతిధి మర్యాదలు చేయటంలో ఎక్స్పర్ట్ తెలుసా? అలా ఆవిణ్ణి మెచ్చుకోక ఏంటి బావ తప్పు పడుతున్నావు ?" అన్న గిరి బాబు వంక కన్ను కొడుతూ  త్యాగరాజు ... వంటింట్లోకి తొంగి చూసాడు .. మరో కప్పు కాఫీ తీసుకుని  శ్రీమతి ముద్ద ముఖం తో వస్తుంటే ఆ అలక చూడాలి అని ఎంత ముచ్చటో మన  రాజు కి ....( ఈయన ప్రపంచకంలో  మగవాళ్ళందరికీ  ప్రతీక ). " చెల్లెమ్మా! కాఫీ అమోఘం! ఇంత బాగా కాఫీ కలపగల నిన్ను చేసుకోవటం మా బావ అదృష్టం కదూ! మా రామాప్రభా ఉంది ఏం లాభం? కాఫీ కలిపితే  వేడి నీళ్ళు  తాగినట్లున్తుంది.." అని చెల్లెమ్మ ను పొగిడి ఆమె ముఖంలో చిరునవ్వు తెప్పించి, అలా వాతావరణాన్ని రణరంగం నుంచీ కూల్ గా మార్చేశాడు గిరిబాబు. కాఫీ మొదటి సిప్ చేయగానే .. తానూ కాఫీ  తాగుతూ భార్య ప్రసన్న వదనం చూసి హ్యాపీగా " బావా ! మేమిద్దరం ఈ ఇల్లు కట్టే టప్పుడే మీరూ .. ప్రక్కనే మీ ఇల్లు కడుతూ పరిచయమయ్యారు .. దాదాపు  ఒకేసారి వచ్చి చేరాము కూడా.." అంటున్న  త్యాగరాజు మాటలకు అడ్డోస్తూ.. గిరి బాబు ఇలా అన్నాడు " అవును మా రమకు చెల్లాయి పరిచయం కావడం రమ చేసుకున్న పుణ్యం.. ప్రతి విషయంలో చెల్లాయి  సలహాలతో రమ ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యేది  "   అతని మాటలను మధ్య లోనే ఆపుతూ అన్నపూర్ణ " అన్నయ్యా! ఊరికే పొగడద్దు మీ బావ గారికి దిష్టి తీయటం కూడా రాదు " అని కిల కిలా నవ్వింది - " ఇంకా ఆ కోరికా మిగిలిందా? అదొక్కటే తక్కువ " ఎద్దేవా చేసాడు త్యాగరాజు.  "సర్లేవోయ్   బావయ్యా! నిన్ను బావ అని ఊరికే అన్నానా? రేప్పొద్దున సంజన మాయింటి కోడలవ్వదూ? అప్పుడు చెల్లాయిని ఏమన్నా అన్నావంటే ఊరుకుంటానా?" అన్నాడు గిరి బాబు .. " అన్నయ్యా! ఏదీ మరోసారను ఈ చల్లని మాట " చెమ్మగిల్లిన కళ్ళను కొంగు తో తుడుచుకుంటూ అంది అన్నపూర్ణ.. ఏమనాలో తెలియక త్యాగరాజు ఉబ్బి తబ్బిబ్బవు తున్నాడు .." ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా! మన యిళ్ళ గృహ ప్రవేశాలప్పుడే రమ, నేను అనుకున్నాము, మన కుటుంబాలు  పరస్పరం వియ్యమందాలని.. మన కన్నా సంజనా సుజన్  లను అర్ధం చేసుకున్న వాళ్ళెవరు?" అన్నాడు గిరి. " మనం వాళ్ళని అర్ధం చేసుకున్నాం వాళ్ళు కూడా మనల్ని అర్ధం చేసుకుంటారా  ... అదే తేలాలి" అన్నాడు త్యాగరాజు " భలే వాడివే బావా! ఆ విషయం అంతగా ఆలోచించాలా వాళ్ళిద్దరి మాటల్లో రోజు కనబడటం  లేదా? అంటూ విషయం చెప్పాడు గిరి.. చిన్నప్పటి నుండి స్కూల్ బాగ్ లు, పెన్సిల్ రబ్బరు దగ్గరనుండీ పరీక్షల్లో మార్కులు వచ్చే రిసల్ట్ దాకా  తాను ఎన్ని గమనించాడో .. ఇప్పుడు ఒకే కాలేజీ లోనే ఇద్దరు చేరటం, రోజు ఇద్దరు కలిసి వెళ్ళటం, చనువుతో ఇద్దరూ  సరదాగా  కీచులాడుకోవటం అన్నీ గమనించానమ్మ! అందుకే వాళ్ళు చక్కని దంపతులే కాదు మనకు అసలైన వారసులు అని కూడా నా మనసు చెప్తుంది  అన్నాడు ఆనందంగా గిరి.. మరింక వెళ్ళొస్తా నమ్మా  ! రమ ఎదురు చూస్తుంటుంది ఎక్కడ తప్పిపోయానో అని .. “నవ్వుతూ  లేచాడు కుర్చీ లోంచి .. వాకిటి దాకా సాగనంపారు ఆనందంతో వచ్చిన పారవశ్యంలో మునిగి తేలుతున్న త్యాగరాజు దంపతులు మాటలు కరువై .... "సంజనా! ఏంటి? కాల్  చేసావు? " "సుజన్! ఎక్కడున్నావు?” అట్నుండి సంజన ... “మధ్యాహ్నమే క్లాస్ అయిపొయింది, ఈ వేళ అలా ఫ్రెండ్స్ తో బయటికెళ్ళాను. వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు ట్రిపుల్ రైడింగ్ అని .. అన్నీ ఉన్నాయి లైసెన్సు , అవీ .. “ సుజన్ మాట ముగించే లోపలే సంజన అసహనంగా అన్నది" లైసెన్స్ ఉంది కానీ సెన్స్ లేదు ట్రిపుల్ రైడ్ మెయిన్ రోడ్ లో చేస్తార్రా ఎవరైనా.... ట్రాఫిక్ పోలీస్ ఉంటాడని వెలగలేదా? " “ఏంటి సంజు? సెన్స్ లేదంటున్నావు? ఆ టైంలో నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ నీ  క్లాస్ బిల్డింగ్ ముందుంటావని  సెన్స్ ఉండబట్టే కదా స్పీడ్ గా ఆపకుండా వచ్చేస్తున్నాను .. ఇంతలో వాడు పట్టుకున్నాడు .. చలాన్ కట్టమని” అన్నాడు.  “ఫ్రెండ్స్ వాదనలోక ప్రక్క, ట్రాఫిక్  పోలీస్ కరకుదనం మరోపక్క.. చివరికి వాడే గెల్చాడు పుర్స్ లో డబ్బు లేదు . మూడో వాడుండ బట్టే గట్టేక్కాము. నీకు అంత కూడా ఓపిక లేకుంటే ఆటో ఎక్కి వచ్చేయ్ యింటికి....  నీ ఫోన్ వస్తే ఓ ప్రక్క బండి ఆపి కాల్ చేస్తున్నా తెల్సా !  సెన్స్ ఉందని ఇప్పుడైనా గ్రహిస్తావా? " సుజన్ గొప్పగా  కవర్ చేసాననుకున్నాడు. "అబ్బో! నా కోసం .. అని చెప్పకు మళ్ళీ బైక్ రైడ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే  ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడని భయం  అలా చెప్పు  హు ! " అని ఫోన్ కట్ చేసింది సంజన.. షిట్ అంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేసాడు సుజన్ .. సంజన ఎప్పుడు ఇంతే తననే 24 గంటలు పట్టిన్చుకోవాలనుకుంటుంది  తప్ప, నా సైడ్ నుంచి ఎప్పుడూ  ఆలోచించదు. ఈ  వేళ అయినా  అలా ఆలోచించేలా చెయ్యాలి.. రొజూ మహారాణిలా నా బైక్ ఎక్కి కూచుంటుంది, ఇవ్వాళ తెలుస్తుంది  నా విలువ " అనుకుంటూ నేరుగా యింటికి బయలుదేరాడు సుజన్.. దార్లో  మిత్రుడు లిఫ్ట్ అడిగితే వాణ్ణి ఎక్కించుకుని మరీ వస్తున్నాడు .. వాడింటి ముందు డ్రాప్ చేసి యింటికొచ్చాడు .. ఆశ్చర్యం! యింటి ముందు ఉయ్యాల ఊగుతూ  కనిపించింది సంజు .. బైక్ పార్క్ చేస్తూ ..  " ఎలా వచ్చావు?" అడిగాడు "హు,  దేశం ఏమీ గొడ్డు పోలేదు నీ లాంటి వాడే ఒకడు లిఫ్ట్ ఇచ్చాడు లే అంది. అంతే !ఒక్క ఉదుటున వచ్చి సంజన చేయి పట్టుకుని "ఎవడే వాడు? నాకు తెలియాలి" అన్నాడు, పళ్ళు కొరుకుతూ .. “పోరా ! నువ్వు , నీ దోస్తులు వాళ్ళతో కూచున్నప్పుడు నేను గుర్తు రాలేదా? ఒక్క  ఫోన్ చేయలేదు నేను కాల్ చేసే దాకా ..” సన్నగా మందలించి అతని  చేయిని విదిలించింది సంజన. " ఏరా వచ్చావా?" అంటూ తమ యింట్లో నుండి అమ్మ గొంతు వినిపించే సరికి" ఆ వస్తున్నా!  మా!" అని ..  సంజన ముఖం కేసి గుర్రుగా చూస్తూ తమ యింట్లోకి నడిచాడు .. సంజన బూస్ట్ లాస్ట్ సిప్ అయ్యాక ఉయ్యాల నుండి దిగి  జడ ఊపుకుంటూ యింట్లో కెళ్ళింది .. (సశేషం)  

No comments:

Post a Comment

Pages