‘కళకళ’ లాడే బొమ్మల స్రష్ట - అచ్చంగా తెలుగు

‘కళకళ’ లాడే బొమ్మల స్రష్ట

Share This

‘కళకళ’ లాడే బొమ్మల స్రష్ట

ఆర్టిస్ట్ డి.ఎస్.కె.వి. శాస్త్రి


బొమ్మను చూడగానే, ‘ఆహా, ఇదీ అచ్చతెలుగు బొమ్మంటే !’ అనిపిస్తుంది. సాధనతో తన కళను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ, పలువురు ప్రముఖుల మన్ననలు అందుకున్నా, ఇప్పటికీ ‘ నేను ఇంకా చిన్న ఆర్టిస్ట్ నండి,’ అని ఎదిగినా ఒదిగి ఉంటూ, వినమ్రంగా పలికే ఆ అద్భుతమైన చిత్రకారులు శ్రీ డి.ఎస్.కె.వి. శాస్త్రి గారు. వారి పరిచయం వారి మాటల్లోనే... నమస్కారం. నా పేరు డి. శీవకుమార వెంకట శాస్త్రి. నివాసం మచిలీ పట్నం. వృత్తి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ .  
 
నా గురించి – మాది సంప్రదాయ వైదిక కుటుంబం, తాతగారు అర్చకులు. మా నాన్నగారు ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగిగా వున్నా, ఆయన స్వతహాగా మంచి  అర్టిస్ట్ అవటంతో నన్ను చిత్రకళలో ప్రోత్సహించారు.  మా నాన్నగారు గీసే చిత్రాలు బాగా గమనిస్తూ ఉండేవాడిని . క్రమంగా ఆర్ట్ మీద ఇష్టం  , ఆసక్తి పెరిగి స్కూల్    స్థాయిలో , కాలేజీ స్థాయిలో వున్నప్పటి నుండీ బాగా సాధన చేసేవాడిని. ఆర్ట్ కాంపిటిషన్స్ లో కొన్నింటిలో పాల్గొని ప్రధమ బహుమతులు గెలుచుకున్నాను.
 ఓ మాదిరిగా బొమ్మలేయటం చేతయ్యాక ' అంధ్రజ్యోతి సంస్థలో ' బాలజ్యోతీ పత్రికకు 1992 లో చిత్రాలు గీయడం, ద్వారా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాను.    వివిధ పత్రికల్లో ఇల్లస్ట్రేషన్స్ , ముఖ చిత్రాలు గీశాను.  మొదట్లో డ్రాయింగ్ పరీక్షల కోసం శ్రీ పి.వి.ఆర్.కె శర్మ, శేషగిరిరావు గార్ల వద్ద
చిత్రలేఖనం కొన్నాళ్ళు  నేర్చుకున్నాను. తద్వారా నాలోని కళకు మెళుకువలు నేర్చుకోగలిగాను, అంతే కాక వివిధ రకాలైన చిత్రలేఖన పుస్తకాలు, చందమామ వంటి బొమ్మల కథల  పుస్తకాలు వంటి వాటి వల్ల నా ఆర్ట్ ను ఇంఫ్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. మా నాన్న గారు తొలి గురువైతే, చందమామ పత్రిక ఆ తర్వాత గురువు. క్రమంగా  చందమామ ఆర్టిస్ట్ వ.ప, శంకర్ ,చిత్ర, రజి, జయ, వంటి ఆర్టిస్ట్ ల బొమ్మలు బాగా ఆసక్తిగా పరిశీలించి, సాధన చేశాను. చాలా సంవత్సరాలు విక్రం, విక్రాంత్, పబ్లిషర్స్  కి చెందిన ఎడ్యుకేషనల్ బుక్స్ కి వర్క్ చేశాను.
 
ముఖ్యంగా  శ్రీ వడ్డాది పాపయ్య గారి శైలి బాగా నచ్చి ఆ శైలిని నేను అనుకరించాను.  ముఖ చిత్రాలు గీసేటప్పుడు నాశైలితో పాటూ వ.ప (వడ్డాది పాపయ్య) గారి శైలిని కూడా ఎంతో కొంత అనుకరించడం తెలియకుండానే జరిగిపోయేది. ఇల్లస్ట్రేషన్స్ గీసేటప్పుడు కూడా.. సుప్రసిద్ధులైన వారి చిత్రాలు,
వారి వర్ణ మిశ్రమం, ఆయన బొమ్మల్లో సింబాలిజం , యాంగిల్స్, భావప్రదర్శన, వంటి ఎన్నో విషయాలు నాకు వారి చిత్రాలపట్ల ఆసక్తి పెంచడమే గాక చిత్రకారుడిగా నను ముందుకు నడిపాయనడంలో సందేహం లేదు.  అంత స్థాయిలో వారి బొమ్మలు నాకు ప్రేరణ కలిగించాయి. 
చందమామ పత్రిక సీనియర్ ఆర్టిస్ట్ శంకర్ గారు, చిత్ర గారంటే నాకు వల్లమాలిన అభిమానం. ఒకసారి శంకర్ గారు నా బొమ్మలు చూసి, చాలా బాగున్నాయి,  ఇలాగే కొనసాగించండి, వేసిన తర్వాత నాకు చూపించండి, అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. నాకు మీరే ఇన్స్పిరేషన్... సర్ అన్నాను.
అలాగే సుప్రసిద్ధ చితకారులు, , కార్టూనిస్టు స్వర్గీయ బాపు గారు తన చితాలు, కార్టూన్ల ద్వారా ఎందరికో ప్రేరణ గా నిలిచినట్లు నాకూ ప్రేరణయ్యారు.   బాపు గారు తాను గీసిన బొమ్మలతో పాటూ అవసరమైన కొన్ని పుస్తకాలు కూడా పంపించి,  అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. వారు నాకు వ్రాసిన లేఖలు అపురూపంగా దాచుకున్నాను. బాపు గారి బొమ్మలు నాకు ఎంతో సహాయపడటమే గాక నాకు చిత్రలేఖనంలో కొత్త ఉత్సాహాన్ని ఎప్పుడూ యిచ్చేవి. వారికి సర్వదా కృతజ్ఞుడిని.
నాకు గురుతుల్యులు, మంచి మిత్రులు అయిన 'బ్నిం' గారంటే నాకు ఏనలేని అభిమానం, గౌరవం. మేం కలిసినప్పుడల్లా ఆర్ట్ కి సంబంధించిన విశేషాలు , బాపు గారి బొమ్మల గురించి, మాట్లాడుకుంటాము. నా కోసం వారి విలువైన సమయాన్ని కొంత కేటాయించడం నా అదృష్టం గా భావిస్తాను. అందుకు వారికి నా ధన్యవాదాలు. ఇక్కడో విషయం చెప్పాలనిపిస్తుంటుంది.. ఎదుటి
వారితో మృదువుగా మాట్లాడటం బాపు గారి నుంచి, బ్నిం గారి నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది.
ఒక సంక్రాంతికి బాపు గారికి ఒక బొమ్మ గీసి పంపితే నాకు వారే స్వయంగా ఫోన్ చేసి అభినందించడం నేను మరచిపోని మధురమైన అనుభూతుల్లో ఒకటి. అది వారి గొప్పదనం. చిన్నవాళ్ళైనా ఎంతో గౌరవిస్తారు.
నా పరిచయస్తులలో కార్టూనిస్ట్ శ్రీ అన్వర్ గారు, శ్రీ గంధం గారు,వంటి ఆర్టిస్టులు నాకు సలహాలు సూచనలు యిస్తూ ఎప్పుడూ సహకరిస్తుంటారు.  బంధువుల్లో మా కుటుంబ సభ్యులందరితో పాటూ నాకు వరుసకు సోదరులు , మంచి గాయకులైన శ్రీ డి.వి.ఎస్ శాస్త్రి గారి దంపతులు, వారి సోదరుడు, మా తమ్ముడు, మరి కొందరు శ్రేయోభిలాషుల  ప్రోత్సాహం, సహకారం నన్ను ధైర్యంగా చిత్రకారుడిగా నిలబెట్టేందుకు తోడ్పడుతున్నాయి. భగవంతుని దయ వల్ల ఈ రంగంలో ఎన్ని ఒడిదుడుకులెదురైనా గత 22 ఏళ్ళుగా ఈ రంగంలో కొనసాగుతున్నాను. ఎన్నో బొమ్మలు, పోర్ట్రైట్ లు, ఇల్లుస్త్రేషన్ లు, ముఖచిత్రాలు గీసాను. నాది సంప్రదాయమైన సరళి అయినా ఇతర అబ్స్ట్రాక్ట్ వంటివి కూడా ఇష్టమే..! చెదురు మొదురుగా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేశాను తప్ప , సింగిల్ గా ఆర్ట్ ఎగ్జిబిషన్ వటివి ఏర్పాటూ చేయడం కుదరలేదు.  దానికి ఇంకా చాలా సమయం పడుతుంది.  ప్రస్తుతం రెగ్యులర్ వర్క్ మీదే దృష్టి . నా వృత్తిలో నన్ను ప్రోత్సహించిన శశికాంత్ శాతకర్ణి గారిని, చక్రవర్తి గార్తిని, మరువలేను. పెద్దలు విజయ్ కుమార్ గారికి, కృష్ణ గారికి, లక్ష్మి గారికి అనేక నమస్కారాలు.
నా అభిమాన చిత్రకారులు : రవివర్మ, దామెర్ల, వడ్డాది పాపయ్య, బాపు, చామకూర్, జాన్ ఫెర్నాండెజ్, రవి పరంజపే, వంటి ఎందరో మహాను భావులు. వీళ్లే కాక ఎందరో విదేశీ చిత్రకారులు, వారు గీసిన చిత్రాలు నాకు , నాలాంటి వారికి ఎందరికో మార్గదర్శకంగా ఉంటాయి. నా రంగంలో ఉన్న తోటి చిత్రకారులకు, కార్టూనిస్టులకు అందరికీ వందనాలు.
ఇట్లు
డి.ఎస్. కె.వి. శాస్త్రి , మచిలీపట్నం.

         

No comments:

Post a Comment

Pages