Tuesday, December 23, 2014

thumbnail

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు -2

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు -2
- చెరుకు రామమోహనరావు

ఈయన నన్ను కలిసిన వెంటనే, "మా ప్రాంతాలలో ఎవరైనా తప్పు చేస్తే పై అధికారులు నిన్ను జమ్మలమడుగుకు transfer చేస్తాననే వారండీ", అన్నాడు. "మీరు భయపడనవసరము లేదు. నేను మీకు నాకు చేతనైన అన్ని విధాలా సహాయ పడగలను" అని నేనన్నాను. అతనికి కాస్త ఊరట లభించివుంటుంది.
CO (CASH OFFICER) కాబట్టి కోశాగారము లోని డబ్బు బంగారు నగలు సరిచూచు కొనుట ఆరంభించినాడు. మాకు branch సాయంకాలము 5 గం. ల వరకైనా clerks అంతా పని కలిసి మెలిసి చేసి main day book tally చేసి 4 ,4-30 గం. లకు ball badminton  ఆడను పోయే వాళ్లము. సాయంకాలము 6 గం. లకు play ground కు messenger ఆఘమేఘాల మీద వచ్చి " సార్ మిమ్మల్ని కొత్త CO సారు సైకిల్ లో కూర్చోబెట్టుకొని వెంటనే పిలుచుక రమ్మన్నారు " అన్నాడు. నా చేతిలోని bat (racquetఅణా వలెనేమో) వేరే స్నేహితునికి ఇచ్చి వెంటనే అతని తో సైకిల్ లో బయలుదేరినాను. branch లోనికి వెళ్ళగానే ఆయన చాలా భయ పడుతూ కనిపించినాడు. నన్ను చూసిన వెంటనే ప్రక్కకు గొనిపోయి "సార్ దొంగ బంగారు నెక్ లెస్ బయట పడింది వెంటనే హైదరాబాదు లోని head office కు తెలియబరుస్తాను" అన్నాడు.
నేను అతనిని చల్లబరచి, మీరు ఈ పనిని రేపు ఉదయము కూడా చేయ వచ్చును కాబట్టి మనము ప్రొద్దుటే bank jeep లో ఈ లోను తీసుకొన్న వ్యక్తి వద్దకు పోయి విషయము తెలుసు కొందాము. అంతవరకు ఏమీ చేయవద్దు.మీరు తొందరపడితే మీకు charge ఇచ్చే వ్యక్తికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆలోచించండి. మనము వాస్తవము తెలుసుకొన్న పిదప ఒకవేళ అతను నిజముగానే తప్పు చేసి ఉంటే తప్పక head office కు తెలియబరచుతాము " అన్నాను. ఆయనా సరేనన్నాడు. ప్రొద్దుటే, bank 10 గం. లకు మొదలు కావలసినది ఉన్నా 8 కె జీపులో ఆ లోను తీసుకొన్న రెడ్డిగారి ఇంటికి బయలు దేరినాము. జీపు అందులో నన్ను చూసి అతను గుర్తించి, ఉదయము కాబట్టి మరియు పెడ నీళ్ళు చల్లుటవల్ల, చల్లగా వుంటుంది కాబట్టి బయట మంచము వేసి దానిపై దుప్పటి పరచి కూర్చో బెట్టినాడు.
విషయము చెబుదామని నేను నోరు తెరిచే లోపలే " సార్ gold lone విషయములో ఏదయినా గోల్మాల్ జరిగిందా " అన్నాడు. ఆశ్చర్య పోవటం మా వంతైనది.  నేను " అవును రెడ్డి అందుకే వచ్చినాము అన్నాను." మిమ్ముల చూస్తూనే నాకు అర్థమైనది సార్. మా అన్న చాలా దుర్మార్గుడు. మా అమ్మ నాయన ఇటీవల లోను తీసుకోనేదానికి కొద్ది రోజుల ముందుగా మరణిస్తే వెంటనే భాగ పరిష్కారము చేసినాడు. అప్పుడు ఈ నేకేసు నాకు వద్దు దీనికి బదులు గాజులు ఇవ్వు అని అన్నా కూడా ఇదే ఇచ్చినాడు. ప్రోద్దుటూరిలో( ప్రొద్దటూరు బంగారుకు ప్రసిద్ధి) కంసాలివద్ద ఈ నెక్లెసు తీసుకొనేది నా స్నేహితుడు చూసి నాకు చెప్పినాడు. నాకు పొలం పనులకు డబ్బు అవసరమై ఈ నాగ bank లో పెడితే ,ఇది అసలా నకిలీనా అనేదీ తెలుస్తుంది మంచిదైతే నాకు లోనూ వస్తుందని పెట్టినాను. మీ వాళ్ళు లోను ఇచ్చినండువాల ఇది మంచిదనుకొన్నాను. మీరు భయపడ నవసరము లేదు. ఇప్పుడే మీతోబాటు వచ్చి డబ్భు కట్టేస్తాను. పంటడబ్బులున్నాయి అని ఇంట్లోకి వెళ్లి డబ్బు తీసుకొని చొక్కా వేసుకొని మాతోనే బయలుదేరినాడు.
కథ సుఖాంతము. కొత్త CO ఆ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పి పంపిన తరువాత నా చేయి పట్టుకొని "మీ సహాయము మరవను అని అంటూ ఈ రోజుతో మీ రాయల సీమపై ఉన్న అభిప్రాయమును పూర్తిగా మార్చుకొంటున్నాను. మా ప్రాంతము లో ఇంత నిజాయితీ చూడలేము" అన్నాడు. ఆయనకు ఆ వూరు ఎంత నచ్చిందంటే retire కాబోయే మునుపు LFC లో ఆవూరు వెళ్లి అందరినీ పలుకరించి వచ్చినాడు. అప్పుడు నేను మద్రాసు లో ఉన్నందువల్ల ఆయనకు తెలియక కలువలేక పోయినాడు.ఆ విషయము ఇటీవల అనుకోకుండా కలిసినపుడు ఆయనే చెప్పినాడు.
ఇక్కడ అన్న దుర్మార్గుడే కానీ మోసగించింది తమ్ముడినే,పరులను కాదు, అదీ ఆస్తి కోసము గడ్డితిని. ఇక ఆ తమ్ముని మంచితనము మనసారా గుర్తించండి.అక్కడి ప్రజలు, ముఖ్యముగా రెడ్లు ఇంత మంచి స్వభావము కలిగి యుంటారు. ఈ జమ్మలమడు నోస్సము, కోవెలకుంట్ల, పాణెము మొదలైన, ఇంచు మించు 80 ప్రాంతాలు కడప మండలము క్రింద వుండవని విన్నాను. దీనినే కాకుండా ఇంకా కర్నూలు (కందెన ఓలు ) బళ్ళారి అనంతపురము లొని అనేక ప్రాంతాలను కలిపి రేనాడు అనేవాళ్ళు. కర్నూలు కడప కు ముస్లీములను నిజాం నవాబు నియమించియుండినాడు. తరువాత కాలములో ఈ మొత్తము రేనాటిని ఆంగ్లేయులకు దారపోసినాడు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి
ఇక నరశింహా రెడ్డి గారి రూపు రేఖలు ఎంత ధీర గంభీరంగా వున్నాయో చూస్తాము, కవి శేఖరులగు కీ.శే, నరసరామయ్య గారి పలుకులలో:

కలికి తురాయి గిల్కొలుపు పట్టు రుమాలు
గట్టిన యుత్తమాంగమ్ము తోడ
వైష్ణవ భక్తీ భావము చాటు నూర్ధ్వపుం
డ్రమ్ము నీటు గొల్పు ఫాలమ్ము తోడ
గ్రేవల కెంజాయ రేకలింపారు నా
తత దీర్ఘ నేత్రముల తోడ
జిరు నిమ్మకాయల నిరువైపు నిల్పుకో
జాలిన గుబురు మీసముల తోడ

వైరి హంవీర విదళన ప్రళయకాల
దండ నిభ ఖడ్గ కలిత హస్తంబు తోడ
ప్రజకు భయభక్తి సంభ్రమ భావములను
గొలుపు వర్కాస్సు తోడ నబ్బలియుడలరు

కలికి తురాయి కలిగి పట్టుబట్టతో చుట్టిన తలపాగా గలిగిన శిరస్సు గలవాడై,వైష్ణవాచార సంపన్నతను చాటునట్టి ఊర్ధ్వ పున్ద్రములు గలిగిన వాడై,కెంజాయగల ఆకర్ణాంత లోచనుడై, చిన్న నిమ్మకాయలను నిలబెట్టగల పురితిప్పిన మీసములు గలవాడై, వైరి వీరుల ప్రాణాంతకమగు యమదండమును బోలిన ఖడ్గము గలవాడై, ప్రజలలో భయము, భక్తి, సంభ్రమ,విభ్రమాది  భావాలను కలిగించు ముఖ వర్చస్సు కలవాడై ఆ మహావీరుడు యొప్పారుచుండెను.
చూచినారు కదా నరసరామయ్య గారి పద్యవిన్యాసము.ఒక్క సీసములో మొత్తము రెడ్డిగారి రూపు రేఖలే కాక గుణగణాలు కూడా కళ్ళకు చిత్ర రూపమును ఎంతో విచిత్రముగా చూపించినారు.
ఇక జానపదుల మాటలలో ఆయన వీరత్వమును గమనించుదాము.

సై సై నరసింహా రెడ్డి ,రెడ్డి
నీపేరే బంగారపూ కడ్డీ
రాజారావు రావు బహద్దర్ నారశింహ రెడ్డి
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
అంటూ నాలుగు గ్రామాలందున మంది లేచినారు

అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
ఆల మందలో పులి దుమికిన చందాన దూకినాడు
ముల్లు కోల తన చేతినవుంటే మున్నూటికి బదులిస్తాడు

మన దేవుడినే మట్టు పెట్టుటకు వచ్చిరి తెల్లోల్లు
రెడ్డి కోసము ప్రాణం పోయిన స్వర్గం వస్తుంది
ఈపోద్దిదియ రేపు తదియ రా, బెదుర బోకుమోయి
నీటిమీదను బుగ్గ వంటిది నరుని పానమోయి
నీతి మాలిన తెల్లోల్లను తెగ నరుకుదాము రండోయ్

ఇది మా రోజులలో జానపదుల నోళ్ళలో ఎప్పుడూ నానుతూ వుండేది. ఈ పాట బాణీని.తల్లా పెళ్ళామా అన్న సినిమా లో ననుకొంటాను,
రాజనాల పై 'సై సై జోడెడ్లా బండి బండి . ఇది మేలైన దొరలా బండి' అన్న పాటకు వాడుకోన్నారని నా సహపాటి, ఆప్త మిత్రుడు మరియు జానపద బ్రహ్మ బిరుదాంకితుడు కీర్తి శేషుడు మునయ్య చెప్పేనాడు.

నరసింహా రెడ్డి18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలో 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.ఒకప్పుడు కడప పాలెగాళ్ళ ఏలుబడిలో వున్నఉయ్యాలవాడ గ్రామం ఇప్పుడు, ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. 
 ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సంజమీదారు అయిన చెంచుమల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరుకుమారులు జన్మించారు.భరణము తెల్ల వాడయిన తహశీలుదారు పంపకపోవడముతో రెడ్డి తన వార్తాహరుని  యాతని వద్దకు పంపవలసి వచ్చింది. గతములో ఎప్పుడో తనకు మర్యాద ఇవ్వలేదనే నెపముతో ఆతను ఆ వచ్చిన వ్యక్తిని అవమాన పరచి, "మీ రెడ్డికి అవసరమైతే తననే వచ్చి తీసుకొమ్మను" అని అవమాన పరచి పంపినాడు తనకు రోజులు తీరినాయని తెలుసుకోలేక.1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు,గతములో రెడ్డిగారు తనకు తగిన మర్యాద ఇవ్వలేదనే అపోహను కారణముగా చూపి, ఆ వచ్చిన వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరినారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్,కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో,తన అంగ రక్షకుడు వడ్డె ఓబన్న వెంటరాగా కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసినాడు. వచ్చినాడని తెలియగానే తలుపులు లోపలికి బిగించుకొని కిక్కురుమనకుండా లోన కూర్చున్నాడు. అంతట భీషణ రోషారుణజ్వాలానేత్రుడై, ఆ అరుణ కాంతి ముఖమందలమంతయు వ్యాపించ" నా కరవాలమును నిచ్చెనగా చేసి నిన్ను యమసదనమునకంపెద" ననుచు తన ముష్టిఘాతంముచే ఆ తలుపులు బ్రద్దలు జేసి ,నరసరామయ్య గారి మాటలలో, ఈ విధముగా చంపినాడు.
కరకర పండ్లు నూరి చెడుగా! ఇటు రమ్మని పట్టి ఈడ్చి నిర్భరమగు నక్కసమ్ము మెయి, వాని శిరమ్మును కాలదన్నుచున్గరకు కటారు కేలగొని గ్రక్కున వైవ,శిరమ్ము మొండెమున్
ధరణిపయిం బడెన్ రుధిర ధారలు మందిరమేల్ల జిమ్మగన్
వానిని ఆ విధముగా పరిమార్చి బొక్కసము వైపునకు దారి తీసినాడు రెడ్డి తన అంగ రక్షకునితో. అక్కడ తారసపడినాడు క్షత్రియుడగు 'బొందిలి నారసింగ్' అనెడు ఖజానా కాపుదారు. వీరి పూర్వీకులు బుందేలుఖండ నివాసులట. రెడ్డి అతనితో "మనము మనము కొట్టుకొని చచ్చుట ఎందుకు మాతో కలసిన అందరమూ కూడి ఆంగ్లేయులను ప్రతిఘటించూదాము" అని
అన్నాడు. అప్పుడా వీరుడు " మీ మాట ఎంతో సమంజసముగా వున్నది కానీ నాకు ఆంగ్లేయులతో ఉప్పు తిన్న ఋణమున్నది. కడుపు కాలే నాకు నౌకరి ఇచ్చి నా సంసారాన్ని నిలబెట్టినారు. నేను భారతములో కర్ణుడనైనాను. ఋణము తీర్చుకోనక తప్పదు" అంటూ చేతిలోని తుపాకీ వదిలి నడుమున వున్నా కరవాలమును సర్రున లాగినాడు. అంతలో అంగ రక్షకుడైన ఒడ్డె ఓబన్న అడ్డుపడి తన కరవాలమును అడ్డువేసి, యుద్ధము చేసి అతనిని కూలవేసినాడు.మరి నారసింగ్ కు ఉన్నకృతజ్ఞత అసలు ఆంగ్లేయులకే ఉండివుంటే మన దేశమును మోసము తో పొందియుండరు కదా! ఆ విధంగా అక్కడ కత్తి దూసిన సిబ్బందిని పరిమార్చి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను గ్రహించి తనకు ముత్తవలసింది తీసుకొని మిగతది పేదలకు పంచి అచటి నుండి వెడలినాడు రెడ్డి. ప్రొద్దుటూరు సమీపంలోనిదువ్వూరు ఖజానాను కూడా కొల్లగొట్టినాడు.
బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి కడప తాత్కాలిక మండలాధిపతి యైన 'కాకరెన్' అనువాడు ఈ అవమానమును తన అవమానముగా భావించి తన సైన్యమున కొంత ఉయ్యాలవాడకు పంపించెను. రెడ్డి గారు కత్తి చేతబూని తన గృహము బయటికి వచ్చి "నాదేశస్తులగుటచే,మీతో నాకు వైరము లేదు
కావున, మొదటి తప్పుగా భావించి మిమ్ము ప్రాణాలతో వదలుచున్నాను. మీరుతెచ్చిన కత్తులు కటార్లు ఈటెలు బాకులు తుపాకులు అన్నింటిని సమర్పించి  తిరుగు ముఖం పట్టండి." అన్నదే తడవుగా పరుగెట్ట ప్రారంభించిందా సైన్యము.అహంకార పూరితులౌ తెల్ల దొరలకు ఇది కంటగింపాయెను. రెడ్డిగారు ఒక సందర్భములో తన అనుచరులతో ఈవిధంగా చెబుతారు :
దైవ వశమున తహశీలు దారు గాథ
కాకతాళీయమైయోప్పే గాని, మునుపే
సిద్ధపడియుంటి, నీ విదేశీయ విభుత
పైని, మన ప్రాంతమందు విప్లవము రేప
అంతటి దేశాభిమాని ఆయన.
తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలినాడు. సహృదయుడు వీరాగ్రేసరుడు అయిన   ఔకు దుర్గాన్ని పాలించే, కృష్ణ దేవరాయల అల్లుడైన అళియ రామామరాజు గారి గోత్రికుడైన నారాయణరాజుతో మంతనాలు జరిపి తగిన సమయములో ఆంగ్లేయులపై దండెత్తుటకు తగిన సమాలోచనలు జరిపినారు. తన సహాయము అన్ని విధాలా ఉంటుందని రాజు గారు రెడ్డి గారికి మాట ఇచ్చినారు.రెడ్డి తన బస నోస్సము కోటకు మార్చుకొన్నాడు . ఆకు మళ్ళ అన్న ఊరిలో బస చేసిన గోసాయి వెంకన్న అన్న బైరాగి మరియు యుద్దవీరుని చేర దీసినాడు రెడ్డి . ఈ గోసాయి దాదాపు 20 మైళ్ళ దూరమున జరిగే విషయాలు చెప్పగలిగే వాడట.అంటే సంఘటితమైన దాడుల గూర్చి తెలుపగలిగేవాడు . ఇది ఇట్లుండగా ఆంగ్లేయులు లేఫ్టినంట్ కల్నల్ వాట్ సన్ అనువానిని రెడ్డిని బంధించుటకు నియోగించినారు.రెడ్డి మహాదాశ్యమును గౌరవిన్చినవారై 'ముక్కామల్ల' 'ముదిగోడు' 'కానాల' 'సంజామల' మొదలగు జానపదముల బోయలంతా రెడ్డి పక్షమున జేరి తెల్లవారి బ్రతుకును తెల్లవార్చాలనుకొన్నారు. ముట్టడిలో రెడ్డి గారు ఆంగ్లేయులు ఎట్లు తలపడినారన్నది , శ్రీ నరసరామయ్య గారు ఈ విధముగా వర్ణించుచున్నారు:వడిసెల రాల్ శరంబులు తుపాకుల గుండ్లను రెడ్డి సైన్యముల్ 
వడి గురిపింపజొచ్చె జడివానగ దుర్గమునుండి హూణులుం
బెడిధముగా శతఘ్నికలు పెల్చుచు భీకర మారణాస్త్రముల్ 
విడుచుచు  బోరసాగిరి , కడింది మగంటిమి కచ్చె మీరగన్ఆంగ్లేయుల శాస్త్ర,సైనిక సంపత్తి చాలలేదు.రెడ్డి చండ ప్రచండుడై వెలుగొందు చుండ తెల్లవారన్న తెల్ల కాలువలు వాడి, వడలి , కమిలి నల్లగా అయిపోయినాయి. పాలు పోవని వాట్ సన్ మార్గాంతరము గానక తమ ఆయుధ గిడ్డంగులున్న బళ్ళారి నుండి మందు గుండు సామాగ్రి కి పురమాయించినాడు. అది పసి కట్టిన నారాయణ రాజు మహాశయుడు తన బుద్ధి బలముచే , వారు ఆయుధములు తెచ్చునపుడు మార్గ మధ్యమున ఛద్మ వేషములలో యుక్తి యుక్తముగా వారిని పారద్రోలి ఆయుధములను చేజిక్కించుకొన్నాడు.తనకత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని నియమించి ఈ వార్తను రెడ్డి కి చేరవేయమన్నాడు రాజు. ఆతడు అర్థ రాత్రమున, ఆంగ్లేయులు కోట బయట నిదురించునపుడు తన బాణమునకు సందేశమును సంధించి కోటలో బడునట్లు చేసి తన దారిన తానూ పోయినాడు. ఆ వార్తను విని రెడ్డి పరమానంద భరితుడై రెట్టించిన ఉత్సాహముతో, ఆహా సహవసమునకు రాజు ఉపమానము కదా యని తలంచి, పోరుచేయ దొడగెను. బ్ర.శ్రీ. నరసరామయ్య గారి మాటల్లో రెడ్డి దక్ష యజ్ఞమున వీరభద్రుని వలె ఏ విధముగా వైరులను దునిమినాడంటే :నడుము దాపల యున్న యదిడంబు చేబూని 
శిరములు పైకెగజిమ్మిజిమ్మి
మొలనున్న పిడిబాకు వలనొప్ప ధరియించి
కుఉతుక క్రోవులన్ కోసికోసి
కడిమి మూపున నున్న గండ్రగొడ్డలి దాల్చి
కరములు పాదముల్ నరికి నరికి
తురగంబుపై భద్రపరచిన బల్లెంబు 
గొని,వడి రోమ్ములం గ్రుమ్మిగ్రుమ్మి
దక్షవాటీ భయానకోద్దండ మూర్తి
వీరభద్రుని యాపరావతారమనగ
జండతేజుండు, రెడ్డివీరుండు,సమర
సీమ  పీనుగు పెంటగా జేసి వైచెరాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా పగులునంటారు పెద్దలు. ఇద్దరు HOT SUNS తో యుద్ధము చేయలేక WHAT SON తోక ముడుచుకొని తన ఆంగ్లబలముతో వెనుదిరిగినాడు.
ఈ దుండగులు తిరిగీ రెట్టింపు సైన్యముతో దాడి చేయగలరని భావించిన రెడ్డి, నోస్సము మైదాన ప్రాంతమయినందువల్ల , తన నెలవును నలమల శ్రేణి లోని అహోబల  క్షేత్రమునకు యోజనము దూరము ఉత్తరమునగల చిక్కటి అడవి ప్రాంతమున గల దుర్గమమైన దుర్గమునకు మార్చినాడు.
 ఆ సమయమున Forest Ranger ఒకడు అమిత కౄరుడై అడవుల నానుకొనియుండు పల్లె వాసులను నిర్దాక్షిణ్యముగా హింసించుచుండెను. ఆతని దురాగాతములకు ఓర్వలేక ఆ పల్లెల ప్రజానీకములోని ప్రముఖులు ఆంగ్లేయుల పోబిడి (కదలికలు) తెలుసుకోన పల్లెలలో తిరుగు రెడ్డి గారి గూఢచారులతో తమ మొరలను ఆయనకు వినిపింప జేసినారు. అది మొదలు ఆయన కూడా అప్రమత్తుడై ఆ Ranger కదలికలను గమనించ సాగినాడు. ఒకనాడు వాడు 'రుద్రవర'మను గ్రామమున ఉన్నాడని తెలిసి తన బహిఃప్రాణమైన వడ్డె ఓబన్నతో బయలుదేరినాడు. రేంజరు బంగాళా ముందు నిలిచి 'రారా బయటికి' అని ఒక్క ఉరుము ఉరిమినాడు రెడ్డి.అంతే, పలాయన మంత్రం పఠించినాడు రేంజరు.ఊరిలో ఎవరూ ఆశ్రయమివ్వకపోగా ఒక చాకలి వానిని ఆశ్రయించి డబ్బు ముల్లెను ఆశ జూపి ఆతని మైలబట్టల గుట్టలో దాక్కొన్నాడు. రెడ్డి కూడా వానిజాడ తెలుసుకొని చాకలి ఇంటిని చేరుకొన్నాడు. రెడ్డి రోషారుణ నేత్రాలను చూసి పండుటాకువోలే పదురనారంభించినాడు చాకలి. తన భయములో మైలబట్టలవైపు పదే పదే చూచుచున్న చాకలిని గమనించినవాడై ఆ ధూర్త కిరాతకుని పసిగట్టి జుట్టుబట్టి బయటికి లాగి నిర్దాక్షిణ్యముగా నరికినాడు. వణుకుచున్న మడేలన్నను మందదలించి,బయటికి వచ్చి, పారిపోవుచున్న ranger యొక్క ఇద్దరు అనుచరులను ఓబన్న తో కూడా వెంబడించి ఇరువురు వారి కుత్తుకలనుత్తరించినారు. 
అదే సమయములో రెడ్డికి కంభము మొదలగు ప్రాంతముల వారంతా ఇతోధికముగా ధన ధాన్య వస్తు సముదాయముల నివ్వగా ఆ ప్రాంతపు తహశీలుదారుడైన ఒక భారతీయుడు  పదవీ వ్యామోహముచే రెడ్డి కదలికలను చేన్నపట్టణములోని తన ప్రభుత్వమునకు చేరవేయనారంభించినాడు.తన వేగులచే సమాచారమందుకొన్న రెడ్డి చెడిన శరీరాంగమునుత్తరించకున్న శరీరమునకే చేటు కలుగునని తలంచి ఆతనిని చంప నిశ్చయించెను.
ఇంతలో ఆ ప్రాంత ప్రజలు, బహుశ సంక్రాంతి పండుగ ఏమో, వేడుకలలో భాగంగా కోడి పందేముల నిర్వహించ దలచి రెడ్డి గారిని కూడా రమ్మని మనసారా ఆహ్వానిన్చినారు.రెడ్డి కూడా మ్లేచ్చులతో పోరి యలసిన వాడైనందున సంబరాలలో తానూ కూడా పాలుపంచుకోనెంచినాడు. ఈ విషయమును తెలుసుకొన్న తహశీలుదారుడు తెల్లవాడైన అప్పటి పోలీసు సూపరింటెండెంటును తోడు గొని ఎంతో ఆనందముగా కోడిపందెములు చూచుచున్న రెడ్డిని పోలీసులతో చుట్టుముట్టినాడు.తన చుట్టూ రక్షణ వలయమునేర్పరచ దలచ రెడ్డి వారిని వారించి ఆగ్రహోదగ్రుడై కరవాలము కైగొని వారి పై బడెను . ప్రాణములనరచేతనుంచుకొని తహసీలుదారుడు సుపరింటెండెంటు పరుగెట్ట నారంభించినారు.రెడ్డి వారిని పట్టి పీకలు గోసి మాత్రు భూమికి రక్త తర్పణము గావించినాడు.ఓబన్న మిగత సైన్యముతో పోలీసులను విగత జీవుల జేసినాడు.
ఈ వార్తను విని తెల్లబోయిన తెల్లవారు ఇక ఏమాత్రము జాప్యము చేసినా తమ ఉనికికే మోసము వాటిల్లగలదని తలంచి 'కెప్టెన్ నార్టన్'అను వానిని విరివిగ సైన్యమునే కాక సాధనములను కూడా నొసంగి, రెడ్డిని  ఇక ఉపేక్ష చేసిన తమ ఉనికికే ముప్పు వాటిల్ల గలదని తలంచి , ఆ మహావీరుని తుదముట్టించ పంపినారు. రెడ్డి ఈ వార్తలు విని అప్రమత్తుడై తన సైనిక బలంబులను వ్యుహాత్మకముగా యుండజేసి యుద్ధమునకు సంనద్ధమాయెను. నార్తను గిద్ధలూరి వద్ద తన సైన్యమును విడిది చేసి యుద్ధతంత్రమును తన అనుయాయులకు వివరించి , రెడ్డి కోటకు ముందు మార్గమును ఏర్పరచ నాజ్ఞాపించేను. వారు అంతయును అదేవిధముగా అమలుజేసిన పిదప, మెరుపు దాడులచే తెల్లవారి ప్రాణములు కొల్ల గొట్టేను.స్వేతమూకలకు చేతగాక చింతించుచున్న తరి నార్టన్ బళ్ళారి నుండి మరుల సైన్యమును రప్పించెను. సంగ్రామము భీషణమై రెడ్డి దండుకు గూడా బహుళముగా ముప్పు వాటిల్లెను.మంచినీటి బావులలో నీటి మట్టము బాగా తగ్గిపోయి త్రాగునీటికి తలలత ఏర్పడెను. ఇంతలో రెడ్డిగారి సతీమణి అనారోగ్యముతో స్వర్గాస్తురాలయ్యేను.కాశీ కి వెళ్ళిన తల్లి విశ్వనాథ దర్శనముతో, వెనుకకు రాలేక, కైలాసమును జేరెను.
అచంచల మతియైన రెడ్డి ఇదియంతయు దైవఘటన యని తలచి, శత్రువుల సంఖ్యా బలమును అంచనా వేసి, మాసముల పర్యంతము యుద్ధము చేయుటవలన తమ కోటలోని అనుపానములన్నియు శత్రువులకవగతమైయుండునని తలపోసి తన నెలవు ఎర్రమల ప్రాంతమునకు కోట వెనుకవైపు దారినుండి తన ముఖ్య అనుచరులతో మార్చినాడు. అచ్చట,పేరుసామల అన్న వూరికి దగ్గరగానున్న  జగన్నాథఆలయమను ప్రాంతమున గల నరసింహస్వామి దేవాలయమును తన స్థావరముగా చేసుకొనెను.ఆ దేవాలయమునకు దగ్గరగు అల్వకొండ యను ప్రాంతము నుండి రెడ్డిగారి బంధువులు తమకు నమ్మకస్తుడనిపించిన నొక గొల్లవానితో ఆయనకు భోజనము పంపెడివారు.
అచట నార్టన్ కోట నుండి ఎదిరింపు గానక  తన యుద్ధ నైపుణ్యమును తానే మెచ్చుకొనుచూ కోట బురుజులను బ్రద్దలు చేసి లోనికి వెళ్లి రెడ్డిని గానక తానూ శిగ్గు పడుటయే గాక రెడ్డి యుద్ధ తంత్రమును మెచ్చుకోనేను. తన వేగులను వేగిరమే రెడ్డిజాడల నేరుకపరచ వినియోగించి రెడ్డిని మట్టుబెట్టు మార్గమునాలోచించ సాగెను.విషయమును తన గూఢచర్య వర్గము ద్వారా తెలుసుకొని రెడ్డియున్న ప్రాంతమునకు అతి చేరువకాని ప్రాంతములో తన విడిది ఏర్పాటుచేసుకొనెను . రెడ్డిగారి కుడిఎడమ హస్తములగు ఓబన్న వెంకన్నఅహోబల నారశింహుని దర్శనార్ధమై వెళ్ళగా, నార్టన్ ఆ విషయమును గ్రహించి వల పన్ని వారిని స్వర్గస్తులను జేసెను. రెడ్డికిధి ఆశనిపాతమాయెను. విధి బలీయమని తలంచెను కానీ తన పట్టుదలను సడలించలేదు.
ఎట్టకేలకు, గొల్లవాని ( వాడు అని ఉపయోగించుటను తప్పుగా అర్థము చేసుకోవద్దు. భాగవతములో నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు ,,, అన్న పద్యమును గుర్తు చేసుకొండి , వంటవాడు , ఇంటివాడు, చేయువాడు  ఇత్యాదులన్నీ యథా ప్రయోగమ్ములు. వ్యాకరణ పరముగా అవి తప్పులు కావు.) విషయము కనుగొన్న వాడై వానికి అపరిమితమౌ డబ్బును ఆశగాచూపి తానూ తీసుకుపోవు ఆహారములో విషము కలిపి రెడ్డికి పంపించు ఏర్పాటు చేయించెను. ఆ ఆశావహుని స్వార్తమునకు ఈ రాయల సీమ సింహము బలియైపోయెను. 1846 అక్టోబరు 6 న స్పృహ తప్పిన రెడ్డిని బంధించి, 1847 ఫిబ్రవరి 22 న, ఊరూరా చాటింపు వేయించి కలెక్టరగు కాక్రేన్ సమక్షములో ఉరి తీయించమని తీర్పు.  అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వ్రేలాడదీయ వలసిందిగా ఉత్తరువు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందినిపూచీకత్తుపై వదిలిపెట్టినారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించినారు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా ఉత్తరువు.రెడ్డిగారి ఉరితీతను చూసి కసాయి వాడే  కన్నీరు కార్చినాదని ప్రతీతి.నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినదట. ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూసినారట.
ఒక తార నేలవ్రాలెననవలెనో లేక  రెడ్డి తారయై నింగి చేరెననవలేనో నాకు తోచుట లేదు.
ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్నస్వాతంత్ర్యం.
 ఇటువంటి మహనీయుల గూర్చి తెలుసుకొండి. నాటి దాస్య శృంఖలములు నేడు కనిపించక పోవచ్చు కానీ అంతకన్నా భయంకరమైన దాస్యము లో కొట్టుమిట్టాడుతూవున్నాము.అవి భావ దాస్యము, భాషా దాస్యము,వేష దాస్యము,నడత,నడక అంతా దాస్యమే.మరి ఈ శృంఖల తెంపగలిగినది యువతనే. మనసు పెట్టి ఆలోచించితే అవగతము కాగలదు.
 నాకు అవసరమైన పనులు ఎన్నోవున్నా , నిముస నిముసము నన్ను ప్రేరేపించి ఈ వ్యాసము లోని మొదటి భాగమును పూర్తి చేయించిన ముసునూరి రవిసుధాకరునికి కృతజ్ఞతలు.

రెండవ భాగము బుడ్డా వెంగళ రెడ్డి గారి ఔదార్యము దానపరత్వము వారిని గూర్చి వ్రాసిన గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని గూర్చిన పరిచయము తో కాస్త నిదానముగా తెరపైకి వస్తాను.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information