తొండపుదొర కావరా!
 
పెయ్యేటి రంగారావు

దేవర - ఓ దేవరా!
తొండపుదొర కావరా! ||

1. అతనువైరి అరకాయపు ముద్దుల కొడుకా!
దయ గొనుమిక మా నేరములెంచక ||

2. తొట్టతొలుత నిన్నే పూజింతుము దేవరా!
నిన్నే శరణంటిమి విఘ్నేశ్వరా! ||

3. భాద్రపదమ్మున నాల్గవ రోజున
నిన్నే కొలిచేమురా తొండపుదేవరా! ||

4. చల్లని జాబిల్లి వలె  నిన్ను జూచి నవ్వము
నల్లని దొర తీరు పాల, చంద్రుని మరి జూడము ||

5. కుడుములిడుచు మనసారా అర్చింతుము దేవరా!
ఇడుము బాపి కావమంచు వేడెద విఘ్నేశ్వరా!  ||

6. పొగను బెట్టి, దివ్వె జూపి, పదారు తీర్ల కొలిచెదము
వేరెవరు లేరు నీవే దిక్కనుచు నీకు మొక్కెదము ||

7. ఎలుక తోడ బువ్వ మెసవి తనివినొందు గణపతీ!
కేలు సాచి దీవెనలిడు, ఇదియే మా వినతి ||
*******************

  1. తొండపుదొర = వినాయకుడు. 2. అతనువైరి = శరీరము లేని వాని అనగా మన్మధుని శత్రువు అనగా శివుడు. 3. శివుని యొక్క అరకాయపు = శివుని యొక్క అర్థ శరీరపు అనగా పార్వతీదేవి యొక్క, ముద్దుల కొడుకా = గణపతీ. 4. నల్లని దొర = కృష్ణుడు (కృష్ణుని వలె పాలలో చంద్రుని జూడము). 5. ఇడుము = కష్టము. 6.పొగను బెట్టి = ధూపమాఘ్రాపయామి, అనగా అగరువత్తి వెలిగించి. 7. దివ్వె జూపి = దీపం దర్శయామి, అనగా వెలిగించిన దీపమును జూపి. 8. పదారు తీర్ల కొలిచెదము = షోడశోపచార పూజలు చేసెదము. 9. వేరెవరు లేరు, నీవె దిక్కనుచు = అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. 10.బువ్వ మెసవి = బువ్వ తిని, అనగా ప్రసాదమును స్వీకరించి. 11. తనివినొందు = తృప్తి చెందుము. 12. కేలు సాచి = చేయి చాచి అనగా చేయి నెత్తి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top