Wednesday, October 22, 2014

thumbnail

డా.గయ్యాళి గుండక్క

డా.గయ్యాళి గుండక్క
              - రచన : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల.

  ఆకాశపు రేడు రవికన్న, వేడైన కాంతం కాంతల గుండెలు ఝల్లుమనిపించు కాంతం ఆంధ్ర కోడళ్ళను హడలెత్తించు గయ్యాళి కాంతం ఏకాంతం ని భయంతో నింపేసే కాంతం వెర్రి మొగుడి డిప్పపై మొట్టే కాంతం అసమర్ధ భర్తకు గడుసు భార్య కాంతం మొండి కూతుళ్ళ బరువైన పరుసు కాంతం   సినీమాతకు దొరికిన ఏకైక నటనా పంతం నిర్మాతల పాలిట సొమ్ముల అయస్కాంతం మనసేమో చంద్రకాంతం మనిషేమో సూర్యకాంతం ఎందరో మెచ్చిన ఏకైక కాంతం మన సహజ నటి సూర్యకాంతం...   - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 21.10.2014   ప్రపంచంలో అలాంటి ఒక నటీమణి వుండేదా?! అని ముందు తరాలు ఆశ్చర్యపోయేంతటి హావభావాల మేటి సూర్యకాంతం. గంప అంత గయ్యాళి నోరేసుకుని, ఎడమచేతిని తిప్పుతూ ..నడుము మీద కుడిచేయి ఉంచి, ఆమె చేసే ప్రతి పాత్రా సెల్యులాయిడ్ పై ఓ సంచలనమే..!     
బాల్యం, కుటుంబ నేపథ్యం: తూర్పుగోదావరి జిల్లాలోని వెంకట కృష్ణరాయపురం లో 28 అక్టోబర్, 1924 న వారి కుటుంబంలో పద్నాలుగో సంతానంగా,  ముందర పది మంది పుట్టి మృతి చెందిన అనంతరం పుట్టారు సూర్యకాంతం. అల్లారు ముద్దుగా పెరుగుతూ, ఆరవ ఏటనే నృత్యం, పాడటం నేర్చుకున్న సూర్యకాంతం హీరోయిన్ గా చలనచిత్ర రంగంలో వెలిగి పోవాలని కలలు కన్నారు... ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించాలనేది ఆమె చిరకాల కోరిక.  1950 లో హైకోర్టు జడ్జి అయిన , శ్రీ పెద్దిబొట్ల చలపతిరావు తో వివాహం జరిగింది సూర్యకాంతం కి.  
సినిమా అడుగు..: గయ్యాళి అత్తగా విస్తృత ప్రేక్షకాదరణ ఉన్న నటిగా ఎదిగిన సూర్యకాంతం, మొదట జెమిని స్టూడియో నిర్మించిన 'చంద్రలేఖ' సినిమాలో డాన్సర్ గా నటించారు., 1949 లో వచ్చిన 'ధర్మాంగద' చిత్రంలో, మూగపాత్ర లో నటించాల్సి వచ్చింది,  కొంతకాలం  చిన్నా చితకా వేషాలు వేసినా, తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా 'నారద నారది' సినిమాలో నటిగా అవకాశం వచ్చింది. కానీ సూర్యకాంతం ఆశలన్నీ బొంబాయి చిత్రపరిశ్రమ మీదే ఉండేవి..సినీరంగ ప్రవేశం జరగడంలో ప్రముఖ రచయిత , దర్శకులు పుల్లయ్య గార్ల ప్రోత్సాహం బాగుండేది సూర్యకాంతంకు.   
  నటనే సర్వం: 1950 మొదలు నుంచి 1970 చివరి వరకూ సూర్యకాంతం- సినీమాతల్లికి విశిష్ట సేవల్లు అందించిందనొచ్చు.. ఈ కాలంలో సూర్యకాంతం లేని సినిమా ఉండంటే ఆ నిర్మాత దురదృష్టవంతుడై వుండాల్సిందే..! విజయ సంస్థ ఐనా, మరోసంస్థ అయినా సూర్యకాంతం లేకుండా సినిమా తీయడానికి ఇష్టపడేవారు కాదంటే.. ఆమె ప్రతిభ ఇట్టే తెలిసిపోతుంది. అసలు తెరమీద సూర్యకాంతం కనిపిస్తే గజగజ ఒణికే ప్రేక్షకులు ఆమె లేని సినిమా చూడటానికి మాత్రం వెనకడుగు వేసేవారు..   " సుపుత్రా" అంటూ హిడింబి వేషంలో ఘటోత్కజుడి తల్లిగా నటించినా? మరో గయ్యళి గా పేరొందిన చాయాదేవి తో గుండమ్మక్క గా జుట్టుపట్టినా.. రేలంగి, రమణారెడ్డి వంటి హాస్య నటుల ఇల్లాలిగా, ఎస్వి  రంగారావు వంటి దిగ్గజాల సరసన నటించినా.. చిత్తూరు నాగయ్య లాంటి వారిని పాత్రలో  లీనమై తిట్టి పోసినా.. సూర్యకాంతం తిప్పే ఎడమచెయ్యిలో ఏదో మంత్రదండం వుండేదంటారు అప్పటి ప్రేక్షకులూ.. సినీ జనాలూ.. ఆమె నటించి మెప్పించిన వాటిలో 'గుండమ్మ కథ ' ఒక హైలెట్ . 
ఎన్.టి.ఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు హరనాథ్, సావిత్రి, జమున, వంటి హేమాహేమీలతో పొటీపడి టైటిల్ రోల్ కి న్యాయం చేశారు ఆమె. సౌదామిని చిత్రం సమయంలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యకాంతంకు తనకు హీరోయిన్ అవకాశం పోగొట్టాయి.. సంసారం చిత్రం లో గయ్యళి అత్త పాత్రలలో లీనమై ప్రేక్షకలను.. భయపెట్టారు. ఎంతగా అంటే.. ఆమె పేరు కనబడితే ఇంటి కోడళ్ళు హడలేంతగా..! ఇంకా ఎంతగా అంటే.. ఇంత వరకూ అందమైన ఆ సూర్యకాంతం పేరు ను తెలుగు వాళ్ళెవ్వరూ తమ కూతుళ్ళకి పెట్టుకోవడానికి సాహాసం చేయనంతగా..!   మాటను కట్టె విరిచి పొయ్యిలో పెట్తేంతగా , సినిమా పాత్రలో మాట్లాడే సూర్యకాంతం షూటింగ్ లో ఉన్న  సమయంలో జనాలు ఆమె దగ్గరకు పోయేందుకు కుడా హడలెత్తే వారు ఆ రోజుల్లో..!   
  అవార్డులు- రివార్డులు :   గయ్యాళి అత్త, సహజ నట శిరోమణి, హాస్య నట శిరోమణి' బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి, అరుంగలై మామణి,  వంటి బిరుదులతో పాటు 'మహంతి సావిత్రి మెమోరియల్' అవార్డ్ ను 'పద్మావతి మహిళా యూనివర్శిటీ ఆంధ్రప్రదేశ్ వారి నుంచి గౌరవడాక్టరేట్ ను పొందారు సూర్యకాంతం.   తరువాత అనేక చిత్రాలలో  సహనటిగా..తన చివరి క్షణాల వరకూ నటించిన - నట విదూషీమణి సూర్యకాంతం..! మాట సూరేకారం గా.. మనసు నవతీనం ఐన సూర్యకాంతం వంటి మరో నటీ మణిని మరలా తెలుగుప్రేక్షకులు చూడలేనంత విలక్షణ నటి సూర్యకాంతం.. 1996 డిసెంబర్ 17 న తెలుగు సినీ తెరను అత్తలేని 'ఉత్త'మురాలును చేసి.. తెలుగు ప్రేక్షకులకు  దూరంగా వెళ్ళిపోయారు ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త  సూర్యకాంతం.. భౌతికంగా లేకున్నా.. తన మాటల తూటాలను ఇంటింటా నేటికీ పేల్చుతున్న సూర్యకాంతం ఖ్యాతి సూర్య కాంతి ఉన్నంతవరకూ విలసిల్లుతూనే ఉంటుంది.  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information