అమ్మ ప్రేమ అమరామృతం - అచ్చంగా తెలుగు

అమ్మ ప్రేమ అమరామృతం

Share This

అమ్మ ప్రేమ అమరామృతం

- శ్రీకాంత్ కానం

"ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం" - అని అన్నాడొక సినీ కవి.  ఈ ఒక్క పాట చాలు విశ్వంలో మాతృమూర్తికున్న అత్యున్నత స్థానాన్ని తెలియపరచడానికి.  ఈ ప్రకృతిలో సృష్టించబడిన అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో మిన్న. అటువంటి మానవ జన్మకే జన్మను ప్రసాదించిన "అమ్మ" ఎంతో గొప్పది.
మనిషికి మానవత్వం, మనసుకి మాధుర్యం ఉంటే వాటి రుచి చుసిన రెండు మనసుల మధ్య ప్రేమ మొదలౌతుంది. ఇలాంటి ప్రేమలు ఎన్నో ఉన్నా తన బిడ్డపై తల్లి చూపించే ప్రేమ ఈ ప్రపంచం.. కాదు కాదు ఈ విశ్వంలోనే మొట్ట మొదటిది.. అపూర్వమైనది.. శాశ్వతమైనది.. ఈ ప్రేమకి మరే ప్రేమ సాటి కాదు.. సాటి లేదు.. ఇకపై రాదు కూడా. అలాంటి అమ్మ ప్రేమను పొందుతున్న ప్రతి ఒక్కరు ధన్యులు. మరి అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న మాతృమూర్తి, ప్రేమను వర్ణించడానికి ఎన్నో భాషలున్నా, అందులో ఎన్ని వేల కవితలు రాసిన, ఆ తల్లి ప్రేమ మాత్రం అమోఘం.. అనిర్వచనీయం. ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ మూర్తి, మరొకరికి జన్మను ఇచ్చి "అమ్మ" అను హోదాను అందుకోవాలనుకుంటున్నారంటే ఆ స్థానంలో వారు పొందే ఆనందానుభూతులను అర్థం చేసుకోవచ్చును. మన భారాన్ని మనమే మోయలేని స్థితిలో ఉన్నటువంటి ఈ సమాజంలో తనకలల రూపాన్ని, తన కంటి దీపాలను, ఎన్నో బాధలున్న వాటిని చిరునవ్వుతో స్వీకరించి, ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలు తన ఉదరాంతరాలలో  భద్రంగా దాచి, పోషించి.. ఒక శిశువుకు జన్మను ప్రసాదించడం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. బయటి ప్రపంచానికి పరిచయం కాబోయే ఆ చిన్నారి శిశువు గర్భంలో చేసే గోలను, సంతోషంతో స్వీకరించే దేవతామూర్తి అమ్మ. అటువంటి జనని గురించి ఎన్ని చెప్పినా తక్కువే.. తనకు ఏమి చేసినా తక్కువే..ఏమి ఇచ్చినా తక్కువే.
ప్రసవించిన వెంటనే ఏడుస్తున్న పాపాయిని ముద్దాడి తన కంటి పాపలా చూస్తూ, ఇంటికి జ్యోతిని వెలిగించే దీపమవ్వాలని తన అమృత హస్తాలతో ఆశీర్వదిస్తుంది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న పాపాయి.. ఆకలి బాధ తీరాలంటే, తల్లి అందించే పాలు కావలి. తన బిడ్డ ఆకలి తీర్చడం ద్వారానే, తను కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలుగుతుండడం తల్లికి, తన బిడ్డకి ఉన్న అనుబంధం ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అది మొదలు ఈ పసిపాప తల్లి గుండెల నుండి పాలామృతాన్ని సేవిస్తూనే, అమ్మని తన ఎదపై తన్నడం మొదలుపెడుతుంది. మాతృమూర్తి వాటిని తన బిడ్డ తొలి ముద్దులుగా భావించి, చిరునవ్వును మోమున నింపుకుని స్వాగతిస్తుంది. తన బిడ్డకు లోకజ్ఞానం అందించుటకు గురువుగా అవతారం ఎత్తుతుంది. అన్నం తిననని మారం చేసే పాపాయిని చంకన పెట్టుకుని నునువెచ్చని గోరుముద్దలు ఒక చేత తినిపిస్తూ , పాలరంగు చందమామను మరో చేత చూపిస్తూ  "చందమామ రావే.. జాబిల్లి రావే.." అంటూ తనని బుజ్జగించి లాలించబోతే, ఆ చందమామనే తనకు కావాలంటూ మరో మారం చేసే తన పాపకి, అద్దంలో చందమామని చూపించి తన అచ్చటని ఆమె ముచ్చటగా తీర్చే ఆ ప్రేమ పదిలము.. అమరామ్రుతము..  అందుకేనేమో పుట్టిన ప్రతి మనిషి పలికే తొలిపలుకు "అమ్మ".. చూసే మొదటి రూపం "అమ్మ".. వినే మొదటి మాట "అమ్మ"..
అటువంటి ఆ తల్లి ప్రేమ సృష్టిలోనే వెలకట్టలేని కమ్మనైన, మధురమైన ప్రేమగా, పొందేకొద్దీ తరగని ప్రేమగా, పంచేకొద్ది పెరిగే ప్రేమగా చరిత్రపుటలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కోపంతో రగిలే గుండెను చల్ల బరిచే ప్రేమ, బాధలతో కుమిలినపుడు ఓదార్చు ప్రేమ, ఆకలితో అలమటిస్తున్న సమయంలో కడుపు నింపే ప్రేమ.. అమ్మ ప్రేమ. ఎడారిలాంటి ఈ విశ్వంలో, పయనించి అలసిపోయి, అర్థం కాని ప్రపంచంలో అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఒంటరిగా మిగిలి, పయనమెటో తెలియని జీవితంలో దిక్కుతోచక ప్రయాణం చేస్తూ అలసిసోలసే ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిలో మాత్రమే  సాంత్వన లభిస్తుంది. కారణం ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో స్వార్థపూరితంగా ప్రవర్తించే వారే. అది మానవ నైజం కూడా. కాని ఒక తల్లి స్థానంలో ఉన్న మహిళామూర్తి, తన సంతానం ముందు ఎప్పుడూ, ఎక్కడ స్వార్థాన్ని ప్రదర్శించాడు. జీవితనమే సాగరంలో వారు ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న, కన్న కొడుకులు కూతురుల నుంచే చీదరింపులకు గురైన ఎల్లప్పుడూ తన సంతన క్షేమమే తన క్షేమంగా భావిస్తుంది.
కడలి ఒక్కటే కెరటాలు అనంతం.. రవి ఒక్కడే కిరణాలు అనంతం.. అలాగే సృష్టిలో భగవంతుడు ఒక్కడే.. కాని ఆ భగవంతుడికి ప్రతిరూపంగా ప్రతి మనిషి శ్రేయస్సు కోరే విధంగా ఉద్భవించిన అనంత అవతార రూపమే అమ్మ. తను ప్రతి చోట, ప్రతి ఒక్కరి క్షేమాన్ని అన్ని వేళలా చూడలేనేమో అని భావించి, ఆ భగవంతుడు రూపొందించిన "అమ్మ" అన్న పాత్రనే ఈ సృష్టిలో ఉత్తమమైనది. అటువంటి మహిళా శిరోమణి రూపకల్పనలో భగవంతుడు కూడా ఎన్నో రకాల అంశాలను మేళవింపు చేశాడు. అమ్మ మోములో సూర్య భగవానుని వలె ప్రకాశవంతమైన చిరునవ్వును, స్వచ్చమైన బంగారానికి ప్రతీకలాంటి హృదయాన్ని, దగదగ మెరిసే చీకట్లను తొలగించే నక్షత్రములలాంటి కళ్ళను అందించి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి "అమ్మ" రూపంలో కానుకగా ఇచ్చాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే తూర్పు కిరణాల పరుగు పడమర చేరే వరకు మాత్రమే ఉంటుంది. అలాగే కడలిలో ఉన్న నీరు ఆవిరై వర్షం వచ్చే సమయంలో కనిపించే నీలిమేఘాల ఉరుము, నీటి దారలు కురిసే వరకు మాత్రమే ఉంటాయి. కాని బిడ్డపై అమ్మ చూపించే ప్రేమ పుట్టిన క్షణం నుండి, మన తుది శ్వాస అనంత వాయువులో విడిచే వరకు మన వెన్నంటే ఉంది, మనకు తెలియకుండానే మనలో సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది. ప్రగతి బాటలో మనకు తోడుగా, కీతి పథంలో మన నీడగా, మన అభ్యున్నతికి దన్నువుగానిలచి తనలో శక్తి స్వరూపిణి ఉందని తెలియచేస్తుంది.
అమావాస్యలో వెలుగు తారగా, అలసిన ప్రతిమనసుకు ఆలంబనగా, ఆరిపోయే దీపానికి వెలుగును ప్రసరించే జ్యోతిగా, అందమైన కలలన్నింటికి నిజరూపంగా కలకాలం మన తోడుండే అమ్మ గురించే అనుక్షణం ఆలోచించి, అనునిత్యం అమ్మపలుకులనే వేదమంత్రాలుగా జపించి, ప్రతి క్షణం అమ్మ కదలికలను గమనిస్తూ  వారు మెచ్చే మార్గంలో పయనించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజయపథంలో దూసుకుపోగలరు. ఆకాశంలో చుక్కలు లెక్కలేనన్ని ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి గుండెలో చెప్పలేనన్ని ఆశలు ఉంటాయి. ఆ తారలే దిగివచ్చినా, మన ఆశలన్నీ తీరిన కలిగే ఆనందం, స్వచ్చమైన అమ్మ ప్రేమ అందుకున్నామన్న ఆనందం ముందు దిగదుడుపే.
అయితే మాతృత్వానికి నోచుకోలేని వారు కూడా ఈ జీవకోటిలో చాలా మంది ఉన్నారు. వారు తమ పరిస్థితి గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, బాధపడకుండా.. "మాతృమూర్తి" లా అనుభూతి పొందాలన్న భావనతో ఎందరో అనాధలను, నిస్సహాయులను చేరదీసుకొని వారి ఆలనా పాలనా ద్వారా ఆ లోటును పూడ్చుకోగలుగుతున్నారు. అమ్మ అనిపించుకోవడానికి బిడ్డకు జన్మను ప్రసాదించవలసిన అవసరం ఏ మాత్రం లేదు.. ఆదరించి అభిమానించే మంచి మనసుతో అనునిత్యం ఎదుటివారి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ, చిన్నదైన ఈ జీవనంలో సాగే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికి అమ్మలాంటి వారేనని నిరూపించిన వ్యక్తి మథర్ థెరిసా. దేశం కాని దేశం వచ్చి, ఎందరో రోగులను తన సొంతబిడ్డల్లా భావించి, తన జీవితం చరమాంకం వరకు వారి సేవలోనే తరించిపోయి విశ్వమాతగా కీర్తిగడించిన ఆదర్శ మహిళామూర్తి తను. తన స్ఫూర్తితో ఇంకెందరో మహిళలు పరులసేవతో తమకు భగవంతుడు అందించిన ఈ మానవజన్మను సార్థకత చేసుకుంటున్నారు.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, మాతృత్వాన్ని కాదనుకుని అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఒక తల్లి రోడ్డు మీదనో, లేదా ముళ్ళ పొదలలోనో వదిలివేయడంతో తమకు ఆహారంగా వదిలేశారనుకుని వీధి కుక్కలు  పసికందులను పీక్కుతింటున్న సంఘటనలు మనము తరచూ వార్త పత్రికలలో చూస్తూనే ఉన్నాము. పుట్టి కనీసం కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూడకుండానే ఆ పసికందులు శాశ్వతంగా కళ్ళు మూయడం వెనక ఆడపిల్ల పుట్టిందనో, ఆర్ధిక పరిస్థితులో.. కారణం ఏదైనా కావచ్చు. కాని అదే ఆ చిన్నారుల పాలిట శాపమై చిరంజీవులుగా గడపాల్సిన జీవితం, ప్రారంభంలేని ముగింపుగా మిగిలిపోతుంది. అంతే కాకుండా ఆ పరిస్థితుల ప్రభావమే ఆ తల్లికి తీరని కడుపు శోకాన్ని మిగులుస్తుంది.
ఏది ఏమైనా "మాతృత్వం ఒక మధురమైన భావన" అన్నది ఒక భావనగానే మిగిలిపోకుండా, సమాజంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనసారా ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ.. - శ్రీకాంత్ కానం

No comments:

Post a Comment

Pages