వడ్లగింజలో బియ్యపుగింజ - అచ్చంగా తెలుగు

వడ్లగింజలో బియ్యపుగింజ

Share This
వడ్లగింజలో బియ్యపుగింజ
పెయ్యేటి శ్రీదేవి
' హలో......'' హలో!  హలో........' ' హలో....హలో.....భారతీ!.......'
          ' ఆ!  హలో.......అమ్మా!  నువ్వా!........బాగున్నావా?  కాళ్ళనొప్పులు తగ్గాయా?  ఏమిటీ, ఈ మధ్య ఫోను చేయడంలేదు?  నాకేమో కంగారుగా వుంటోంది.  బామ్మ, చెల్లి, శ్రావణి ఎలా వున్నారు?  ఉండు, స్పీకర్ ఆన్ చేస్తా.  సతీష్ కూడా వింటాడు.  ఊ, మాట్లాడు.'' మీరంతా ఎలా వున్నారు?' ' అంతా బాగానే వున్నాం.  మీరెలా వున్నారు?  ఈమధ్య ఫోను డెడ్డయింది.' ' ఔను భారతీ.  మా ఫోనూ డెడ్డయింది.  నీ మాట వినిపించటల్లా.  గట్టిగా మాట్లాడు.' ' చాలా గట్టిగా గొంతు చించుకు మాట్లాడుతున్నా.  మీ ఫోను ఫాల్టేమో!  బాగా డిస్ట్రబెంస్ కూడా వస్తోంది.' ' రోజా ఎలా వుంది?  ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా?' ' ఆ?  ఏమిటీ..........?  రోజాకా?  అప్పుడే పెళ్ళేమిటమ్మా?  ఇంటర్ పరీక్షలు మొన్నేగా రాసింది?  ఐనా పాతకాలంలోలా మాట్లాదతావేమిటి?  ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు కూడా పెద్దచదువులు చదివి, అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెడుతున్నారు.  ఇప్పుడు ఎమ్.సెట్.కోచింగ్ తీసుకుంటోంది.  ఉదయం నించి, సాయంత్రం దాకా ట్యూషను.  ఆ సిటీబస్సుల్లో వెళ్ళిరావడం.  ఒకటే తిరుగుడై పోతోంది.  ఈమధ్య నాలుగు రోజులనించి బాగా ఫీవర్ గా కూడా వుంటోంది.  అలాగే నీరసంగా ట్యూషన్లకెడుతోంది.  వెళ్ళద్దని చెప్పినా వినదు.' ' డాక్టరుకి చూపించి మందులు వాడు.' ' ఆ....ఆ....మందులు బలవంతంగా మింగిస్తున్నాంలే.  నువ్వేం కంగారు పడకు.  సరిగా తిండి తినదు.  చెబితే కోపం.  నా మాటంటే లెక్క లేకుండా పోతోంది ఈ ఇంట్లో ఎవరికీ.  మీ అల్లుడుగారు కాన్ ఫరెంసుకి అమెరికా వెళ్ళారు.  ఇంకో నెల్లాళ్ళు అక్కడే వుండాలి.  ఇక ఇంటి సంగతులేం పట్టించుకుంటారు?  ఇంటా బయటా అన్ని పనులూ నేనే చూసుకోవాలి.' ' సతీష్ ఎలా వున్నాడు?' ' సతీషా?  వాడికేం, బాగానే వున్నాడు.  ఏ.జి.బి.ఎస్ సి.లో చేరాడు.  బానే చదువుతున్నాడు.  అన్నట్టు రమణికి సంబంధాలు చూస్తున్నారా?  నాన్నగారు కేంపు నించి వచ్చాక ఒకసారి ఫోను చెయ్యమను.  చాలా రోజులైంది మాట్లాడి.  అన్నట్టు సెల్ కొన్నారట కదా?  ఫోను చెయ్యచ్చుగా?  సరే, ఉంటా.  ఫోను సరిగా వినిపించటల్లా.  బాగా గరగర సౌండ్ వస్తోంది.  మళ్ళీ ఎక్స్ ఛేంజి వాళ్ళకి కంప్లైంట్ ఇయ్యి.'
*************************
          ' **************'' ఊ, హలో......' ' హలో, భారతీ, ఏమిటీ, అంత డల్ గా మాట్లాడుతున్నావు?' ' ఏమీ లేదు.  మనసేం బాగా లేదు.  అందుకే మాట్లాడలేక పోతున్నాను.'  (వెక్కి వెక్కి ఏడుస్తోంది) ' భారతీ, భారతీ!  ఏమైందమ్మా?' ' రోజీ పోయింది.' ' అయ్యో, ఎలా?' ' .................' ' హలో.....హలో.....హలో, హలో.......ఊ, మళ్ళీ ఈ పాడుఫోను డెడ్డయినట్లుంది.'
********************
          ' రోజా పోయిందని ఫోన్లో చెప్పగానే నా మనసాగలేదే తల్లీ.  ఫోన్లో నీ మాటతీరు చూసి భయమేసిందే అమ్మా.  మీ నాన్నగారు రాగానే వెంటనే ఇంటికి తాళం పెట్టి టాక్సీ చేసుకుని బయలుదేరాం.  అయ్యో, ఈ వయసులో నీకెంత కష్టం కలిగిందే అమ్మా!  అదేం డాక్టరమ్మా?  ఆ మాత్రం జ్వరం కూడా తగ్గించలేక పోయాడా?  సిటీలో డాక్టర్లు బాగా డబ్బులు గుంజుతారు గాని, వైద్యం సరిగ్గా చెయ్యరు.  ఫోన్లో రోజాకి జ్వరం అని చెప్పగానే నా మనసాగలేదు.  వెంటనే వచ్చేద్దామనే అనుకున్నా.  మళ్ళీ నువ్వు ఏ సంగతీ ఫోను చేసి చెప్పలేదు.  నేనే నీకు ఫోను చేద్దామనుకుంటే, పాడు ఫోను, అదీ చచ్చూరుకుంది.  మొన్న నీతో మాట్లాడుతుండగా ఫోను మళ్ళీ డెడ్డయింది.  ఇంక పిన్నీ, బాబాయ్, అక్క, బావ, వదిన, అన్నయ్య అందరికీ రమణి సెల్ ఫోన్లో చెప్పింది.  ఈపాటికి వాళ్ళూ బయలుదేరి వస్తూంటారు.  కంగారు పడుతుందని అమ్మమ్మకి చెప్పలేదు.  హయ్యో, హయ్యో!  ఉట్టి జ్వరానికి ప్రాణం తీసుకుపోవాలా ఆ దేముడు?  అప్పుడే నీకు నూరేళ్ళూ నిండాయా తల్లీ?  నిన్ను నేనేమని ఓదార్చగలనే భారతీ?  నీ బాధ ఎలా తీరుతుందే అమ్మా?  హయ్యో, ఎంత ఘోరం జరిగిందే అమ్మా?'' అయ్యో, అయ్యో!  ఏమిటమ్మా భారతీ?  టి.వి.లో న్యూస్ ఛానెల్ లో రోజా ఇంజక్షనుకి రియాక్షనొచ్చి పోయిందని వార్త చూసి స్పృహ తప్పి పడిపోయాను.  తరవాత రమణి కూడా ఫోను చేసి చెప్పింది.  అప్పుడు బాబాయిగారు ఎలాగో తీసుకొచ్చారు.  ఇప్పుడు నీకీ కష్టమేమిటే అమ్మా?' ఆటో దిగి లోపలికొస్తూనే పిన్ని శ్రావణి ఒకటే ఏడ్చేస్తోంది. గుమ్మంలో మరో ఆటోలోంచి దిగుతూనే భారతి అన్న, వదిన వస్తూనే ఏడుపు లంకించుకుని, తర్వాత సాధింపుల భాగవతం మొదలుపెట్టారు. ' ఏం, రోజాకి ఒంట్లో బాగుండకపోతే మాకు కబురు చేయనక్కర్లేదా?  అందరిళ్ళలోనూ ఫోనులున్నాయి.  మాకు మాత్రం ఫోను చెయ్యరు.  ముంబైలో వున్నంత మాత్రాన మేం రామనుకున్నారా?  మేమంటే అసలెవరికీ గిట్టదు.  పోనీ ముంబై తీసుకువస్తే అక్కడ మంచి వైద్యం చేయించే వాడినిగా?  నాకు అక్కద డాక్టర్లందరూ తెలుసు.  అన్నీ చేతులారా చేసుకుంటారు.  మాట్లాడితే దేముడిని తిట్టేస్తారు.  విధి అని, జాతకాలని, ఖర్మ అని, వాస్తు బాగాలేదని, దేముడే చేసాడని, మనకి ప్రాప్తం లేదని, ఋణం తీరిపోయిందని, ఇలా నోటికొచ్చిన చెత్త వాగుడు వాగి, ఆత్మవంచన చేసుకుంటూ బతికేస్తారు..  కాని మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏవిధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించి చెయ్యరు.' ' ఒరే అన్నయ్యా!  అక్కయ్యసలే బాధలో వుంటే ఓదార్చాల్సింది పోయి నీ సాధింపులేమిట్రా?  తరవాతందరూ ఇలాగే మాట్లాడతార్లే.' అంది రమణి. ' చూడమ్మా చూడు.  ఆ రాక్షసి ఎలా మాట్లాడుతోందో!  నేనన్న దాంట్లో తప్పేముంది?' ' అవున్రా.  తప్పా, తప్పున్నరా?  ఓమూల అది బాధలో వుంటే ఇప్పుడు సాధింపులు మొదలెడతావా?  వుట్టి జ్వరానికి హైదరాబాద్ నించి ఎక్కడో ముంబైకి తీసుకురావాలా?  అక్కడయితే బతుకుతుందా?  ఒంట్లో బాగుండని పిల్లని అసలంత దూరం ఎలా తీసుకొస్తార్రా?  అప్పుడయితే దార్లోనే ప్రాణం పోయుండేది.  అప్పుడూ నువ్వు తిట్టుండేవాడివి.  ఈమాత్రం జ్వరానికి ముంబై తీసుకు రావాలా, అక్కడే డాక్టర్లకి చూపించివుంటే దక్కేది కదా అని వుండేవాడివి.  నాయనా!  అందుకే విధిరాత అని, ప్రాప్తం లేదని, ఇలా అనేకరకాలుగా మనసుకి సర్ది చెప్పుకోవడం.  విధి అంటే వేరేగా ఏమీ వుండదు.  మనుషులు చేసే పాపకర్మల ననుసరించే బుధ్ధి కూడా వుంటుంది.  ఆ విధంగానే జాతకాలు కూడా రాయబడతాయి.  విధి ఎలా వుంటుందో ముందరే తెలిసుంటే ఏ ప్రమాదాలూ జరగకుండా మనిషి ముందరే జాగ్రత్త పడతాడు.  కాని జరగబోయేది ముందరే తెలిసుంటే మనిషెందుకవుతాడు?  దేముడే అవుతాడు.  పోనీ వైద్యం చేయించకుండా ఏంలేదుగా?  అది మాత్రం ఏం చేస్తుంది?  నాకు ఫోన్లో అన్నీ చెప్పిండీ.'  తల్లి సర్దిచెప్పింది. ' ఔన్లే, అందరికీ అంటే ఫోనులు చేస్తావు.  నాకైతే చెయ్యవు.  నేనసలు అమెరికా ఛాన్ సు వచ్చి వెళిపోతానంటే, నిన్ను చూడకుండా వుండలేను, వద్దు, ఇండియాలోనే వుండు అంటూ నన్ను వెళ్ళనివ్వలేదు.  నీగురించి అన్నీ వదులుకుని ఇండియాలోనే వుండిపోయాను.  ఐనా నన్నెవరూ లెక్క చెయ్యరు.' ' మా ఫోనూ చచ్చూరుకుంది నాయనా.  నిన్ననే బతికింది.  పైగా నీకు ఫోను చెయ్యడం అంత బుధ్ధితక్కువ పని ఇంకోటి లేదు.  ఎప్పుడూ నీ ఫోనుకి ఎంగేజే తప్ప ఓల్డేజి రాదు.  లేకపోతే, ఈ నంబరు ఒకసారి సరిచూసుకోండనో, ఈ నంబరు మీద ప్రస్తుతం ఏ టెలిఫోనూ పని చెయ్యటల్లేదనో, కవరేజి ఏరియాలో లేదనో, ప్రస్తుతం స్పందించుటలేదనో మూడు భాషల్లోనూ ఒక తియ్యని గొంతు వినిపిస్తుంది.  ఇంక నీకేం ఫోను చెయ్యాలి?  నువ్విక్కడుండి ఉద్ధరించేదేం లేదు.  నీ సాధింపులు పడేకన్న అమెరికాయే వెళ్ళు.' తల్లి అంది. తల్లి మాట్లాడే మాటలకి భారతి ఫక్కున నవ్వింది. ' అయ్యో భారతీ!  అన్నయ్య మాటలు నువ్వేం పట్టించుకోకు.  వాడలాగే అడ్డదిడ్డంగా వాగుతాడు.  చూడు, ఎలా నీరసపడిపోయావో.  కొంచెం అన్నం తిను.' ' నాకేం, నేను బాగానే వున్నాను.  మీరందరూ ఎందుకింతగా బాధపడుతున్నారో అర్థం కావటల్లేదు.  ఈమాత్రానికి మీరందరూ రావాలా?  ఎప్పటికైనా అందరం పోయేవాళ్లమే.  కొన్నాళ్ళకి నేనూ చచ్చిపోతాను.  నువ్వూ చచ్చిపో్తావు.  ఆ చెట్టూ పోతుంది.  అదిగో, ఆ వెళ్ళే ఆవూ చచ్చిపోతుంది.  ఈ పిల్లీ చచ్చిపోతుంది.  ఆ ఆటోవాడూ చచ్చిపోతాడు.  పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు.  కాదంటే కొంచెం ముందూ వెనకా.  అంతే.   రైలు ప్రయాణం లాంటిదీ జీవితం.  స్టేషను రాగానే దిగిపోతారు.  ఎవరి్కెవరు?  అంతా ఋణానుబంధం!  అంతే.  చచ్చిపోతే ఏమీ తెలియదు.  దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతారు.  బతికున్నవాళ్ళే పోయినోళ్ళకోసం ఏడుస్తారు.  అల్లా ఎన్నేళ్ళేడుస్తారమ్మా?  మిగతా పనులు చేయవద్దా?  పోయినోళ్ళతో మనమూ పోతే ఈ ప్రపంచంలో ఎవరూ మిగలరు.  ప్రతి చిన్నవిషయానికీ అలా బాధ పడిపోతుంటే ముందుకు సాగలేం.  మీ ఏడుపులూ, గొడవలతో నాకు పిచ్చెక్కేటట్లుగా వుంది.  అసలు మీరందరూ వచ్చి ఎందుకేడుస్తున్నారో నాకు అర్థం కావటల్లేదు.' అంటూ భారతి కంచం నిండా అన్నం వడ్డించుకుని టేబులు మీద వున్న ఆవకాయ, కందిపొడి, ఆంధ్రమాతని అన్నీ శుభ్భరంగా కలుపుకుని, గడ్డ పెరుగు వేసుకుని సుష్టుగా భోంచేసి గదిలోకి వెళ్ళి హాయిగా ముసుగు తన్ని పడుకుంది. భారతి వేదాంతధోరణికి అందరూ విస్తుపోయి చూస్తూ నిలుచుండి పోయారు.  భారతి పరిస్థితి అర్థం కాక డాక్టర్ని పిలిపించారు.  ఆయన మరేం ఫరవాలేదంటూ మందులు రాసిచ్చారు. ' ఈ డాక్టర్లు అలాగే అంటారమ్మా.  ఎంత ప్రాణం మీదకొచ్చినా మరేం ఫరవాలేదనే అంటారు.  భారతిని నేను ముంబై తీసికెళ్ళి మంచి డాక్టర్లకి చూపించి వైద్యం చేయిస్తానుండు.' అంటూ భారతి అన్న మోహను మళ్ళీ పాత పాట మొదలుపెట్టాడు. భారతి సుష్టుగా భోంచేసి పడుకున్నా మిగతా అందరూ బాధలో భోజనాలు చేయక నీరసంతో పడుంటే, భారతి పిన్ని శ్రావణి అందరికీ టిఫిన్లు తినిపించి కాఫీలు ఇచ్చింది.  అందరూ బాధ పడుతూంటే భారతి ఏ బాధా లేకుండా సుష్టుగా భోంచేసి హాయిగా పడుకోవడం -  ఆమె వింత ప్రవర్తన ఎవరికీ ఏంఈ అర్థం కాలేదు. ఇంతలో ఆటోలోంచి ఒక నడివయస్సాయన, పంజాబీ డ్రస్సు వేసుకున్న పదహారేళ్ళ అమ్మాయి దిగారు.  ఆ అమ్మాయి చేతిలో కుక్కపిల్ల, మరో చేతిలో బుక్సు వున్నాయి.  కుక్కపిల్లని ఒకటే ముద్దులాడుతోంది ఆ అమ్మాయి. ' అరే, అందరూ ఇక్కడే వున్నారే?  పెళ్ళి సడెన్ గా కుదిరింది.  వారం రోజులు కూడా టైము లేదు.  శుభలేఖలు అందకపోయినా రమ్మని చెబుదామని ఫోను చేద్దామంటే......' లైన్ స్ ఆర్ బిజీ, డయల్ ఆఫ్టర్ సమ్ టైము' అంటూ ఓ అందమైన గొంతు వినిపిస్తూంటుంది.  ఒక్కోసారి రేడియో ప్రోగ్రాంసు వినిపిస్తూంటాయి.  మరోసారి క్రాస్ కనెక్క్షన్ స్ వినిపిస్తూంటాయి.  అన్నయ్య కేంపులో ఉన్నారని ఆ మధ్య చెప్పావుగా?  అక్కడికి ట్రై చేసాను.  లక్కీగా దొరికాడు.  కేంపు పూర్తి చేసుకుని అప్పుడే ఊరికి బయలుదేరుతున్నాడుట. పెళ్ళికి అందర్నీ రమ్మని చెప్పాను.  పోనీలే, శుభలేఖలు అందక పెళ్ళికి రారేమోనని భయపడ్డాను.  అన్నయ్య అందర్నీ తీసుకొచ్చాడు.  నాకు చాలా సంతోషంగా వుంది.' అంటూ అందరికీ పెళ్ళి శుభలేఖలు ఇచ్చాడు భారతి బాబాయ్ కృష్ణమూర్తి. కాని అతను చెప్పే మాటలు వినిపించుకోకుండా అసలు బాధ మర్చిపోయి, ' చిట్టిరాజా1  బుజ్జి రాజా1  మళ్ళీ మనింటికొచ్చేసాం.  ఇంక నువ్విక్కడే వుందువు గాని.  సరేనా?' అంటూ కుక్కపిల్లని ముద్దులాడుతున్న అమ్మాయిని చూస్తూ అంతా తెల్లబోయి నుంచున్నారు. ' ఏమిట్రా అబ్బాయ్ ఈ కార్డు?  ఇంట్లో అందరూ కులసాగా వున్నారా?  మీ ఇంటికి తీసికెళ్ళరా నన్ను.  ఇక్కడేమిటో అందరూ విచారసముద్రంలో మునిగి వున్నారు.  ఎందుకో విషయం చెప్పరు.' అంది ఎనభయ్యేళ్ళ ముసలితల్లి. ' ఆ, అందరూ బాగున్నారు.  అమ్మాయికి పెళ్ళి..........పెళ్ళి కుదిరింది.  ఇదే మొదటి శుభకార్యం కదా, నీ కోడలికి సలహాలు చెబుదూ గాని, నాతో వచ్చెయ్ మా ఇంటికి.' అంటూ గట్టిగా అరిచినంత పని చేసి, మెళ్ళో తాళి కడుతున్నట్టుగా చూపించి ఆ చెవిటితల్లికి అర్థమయ్యేలా చెప్పేసరికి గొంతు జీరబోయి గ్లాసుడు నీళ్ళు తాగాడు. ' హాయ్ అమ్మమ్మా!  మామయ్యా!  అత్తయ్యా!  తాతగారూ!  భారతమ్మమ్మా!  హాయ్ రమణీ!  ఏమిటీ అందరూ ఒక్కసారిగా ఊడిపడ్డారూ?  ఏమిటీ విషయం?  ఏమైంది మీకు?  ఏ దెయ్యాన్నో, భూతాన్నో చూసినట్టు గుడ్లప్పగించి నన్నందరూ అలా వింతగా చూస్తున్నారేమిటి?  మమ్మీ ఎక్కడ?  హయ్ మమ్మీ!  మన రోజీ పోయిందని చాలా దిగులు పడుతున్నావుగా?  అందుకే నీకేం తెచ్చానో చూదు?  ఇదుగో, బుజ్జి కుక్కపిల్లని తెచ్చాను ట్యూషను నించి వస్తూ.  ఇదివరకు మా ఫ్రెండు అడిగితే రోజీ కుక్కపిల్లల్ని రెందింటిని ఇచ్చాంగా?  అందులో రాజా అన్న కుక్కపిల్లని తెచ్చాను.' అంది రోజా. ఆ కుక్కపిల్ల గమ్మున సరోజ చేతిలోంచి ఒక్క ఉదుటున దూకి భారతి ఒళ్ళో కూచుని ఆమె ఒళ్ళంతా ప్రేమగా నాలికతో నిమిరింది. జరిగిన ఘోరాతి ఘోరమైన పొరపాటుకి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో అందరూ చేష్టలుడిగి నుంచున్నారు.  అందరూ తేరుకుని, ' సరోజా!  నువ్వు బాగున్నావా?  జ్వరం తగ్గిందా?' అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని ఏడ్చేసారు. ' ఆ, ఏదో మామూలు జ్వరంలే.  ఏం, మమ్మీ చాలా ఎక్కువగా చేసి చెప్పేసిందా?  ఆవిడకంతా కంగారే.  ఆవిడ కంగారు పడి అందర్నీ కంగారు పెట్టేస్తుంది.  రోజీ పోయాక ఆవిడ మనసేం బాగా లేదు.  ఆ డాక్టరు ఇచ్చిన ఇంజక్షనుకి రియాక్షను వచ్చి పాపం రోజీ చచ్చిపోయింది.  సతీషు, నేను కాలేజికి వెళ్ళిపోతే ఆవిడకి దాంతోనే కాలక్షేపం.  అందుకే మమ్మీకి అదంటే ప్రాణం.  అది పోయినప్పుడు బాగా ఏడ్చేసింది.  అందుకే మమ్మీ బాధ చూడలేక దాని పిల్లనే తీసుకు వచ్చాను.' ' ఛీ, ఛీ!  సరిగ్గా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినిపించుకోక పోవడం మనింట్లో అందరికీ ఓ పెద్ద దురలవాటు.  కుక్క చచ్చిపోతే ఏమీ లేనిదానికి ఇంత రాధ్ధాంతం చేస్తారా?  ఐనా, ఏమిటి భారతీ?  నీ కూతురు పేరు సరోజ ఐతే రోజా అని పిలవాలా?  పోనీ రోజా అని పిలుచుకుంటున్నావు, కుక్కకి కూడా రోజీ అనే పేరు పెట్టాలా, ఇంకో పేరేదీ దొరకనట్టు?  మళ్ళీ ఇప్పుడు దీనికి రాజా అని పేరు పెట్టుకున్నారా?  పేర్లు కొంచెం సరిగ్గా చూసుకుని పెట్టుకోనక్కర్లేదా?  ఏం?  ఫోన్లు చేసుకునేటప్పుడు వివరంగా మాట్లాడుకోవచ్చుగా?  వడ్లగింజలో బియ్యపుగింజ!  ఏమీ లేనిదానికి వుట్టినే ఇంత రాధ్ధాంతం చేసారు.  అనవసరంగా బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ముంబై నించి ఫ్లైట్ లో కూడా వచ్చాం కదే?' అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు మోహను. ' నీ పిసినారితనం పాడుగానూ!  నీ ముంబై వాగుడు కట్టిపెట్టి నా మాట కొంచెం విను.  ఇందులో భారతి తప్పేం లేదులేరా.  అది సరిగ్గానే చెప్పింది.  కంగారులో నేనే పొరపాటుగా విన్నాను.' ' మామయ్యా!  నేను చెబుతానుండు.  మా కాలేజిలో ముగ్గురు సరోజలున్నారు.  ఒకరు సి.సరోజ, ఇద్దరు టి.సరోజలు వున్నారు.  అందుకే ఒకర్ని సి.సరోజ అని, మరొక అమ్మాయిని టి.సరోజ అని, నన్ను రోజా అని పిలుస్తారు.  అదే ఇంట్లో కూడా అలవాటై పోయింది.  ఇంక కుక్క సంగతంటావా?  ఇంతకు ముందే ఇంకొకళ్ళ ఇంటినుంచి తెచ్చేసరికే దాని పేరు రోజీ.  అందుకని దాని పేరు మార్చడం కుదరలేదు.' ' ఐనా ఒరేయి, మంచి జరిగిందని సంతోషించక, ఆ ఏడుపు మొహం ఏమిట్రా కోపిష్టి సన్నాసీ?  బాబాయి కూతురు రత్నమాల పెళ్ళికి అందరం ఎలాగూ వెళ్ళాలి కదా?  జరిగిన పొరబాటుని పీడకలగా భావించి, ఏదీ, అందరూ హాయిగా నవ్వండి.' అంటూ వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేసింది భారతి తల్లి. అందరూ ఎంతో సరదాగా నవ్వుతుంటే భారతి పిన్ని శ్రావణి కూడా మనసులో అనుభవించే నరకబాధని అణిచిపెట్టుకుని ఎవరికీ కనబడకుండా కళ్ళు తుడుచుకుని, పైకి మాత్రం గలగలా నవ్వేసింది.  ఆ నవ్వు వెనక దేశ సరిహద్దుల దగ్గర జరిగిన పరస్పర కాల్పుల్లో తన కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించి వీరమరణం చెందాడని సంతోషించాలా, లేక జీవితమంతా గర్భశోకంతో ఆ తల్లి నరకయాతన పడాలా? ఇంతలో భారతి శ్రావణి బుజం మీద చెయ్యి వేసి, ' పిన్నీ!  రా వెడదాం.  అందరం కలిసి హోటల్లో డిన్నర్ చేద్దాం.' అంది. ' లేదమ్మా, ఇప్పుడు మీ బాబాయ్, నేనూ కలిసి మా ఊరెళ్ళిపోతాం.  నన్ను వదిలెయ్ తల్లీ.' అంది. ' అదేమిటమ్మా?  వీరమాతవి, అమ్మాయి పెళ్ళికి నువ్వు లేకపోతే ఎలాగ?  ఏదైనా సమస్య వస్తే అందరికీ మంచి సలహాలిస్తూ, సందడి చేస్తూ సరదాగా కబుర్లు చెబుతూ వుండే నువ్వుంటే మాకు ఎంతో ధైర్యం.  నువ్వే పెళ్ళికి ముఖ్యంగా వుండాలి.' అన్నాడు భారతి బాబాయ్. ' ఏమిట్రా అబ్బాయ్!  పొద్దుట్నించీ ఏమిటో అందరూ ఎంతో బాధ పడిపోతున్నారు, ఏడుస్తున్నారు, కాసేపేదో గొడవ పడుతున్నారు, ఇప్పుడందరూ ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నారు?  విషయం ఏమిటో చెప్పరా.' అంటూ ఆదుర్దాగా అడిగింది కొడుకుని ఆ బ్రహ్మచెమిటి ముసలితల్లి. ఆమెకేమని చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక కోడల్ని అడగమన్నాడు భారతి తండ్రి. కోడల్ని అడిగితే కొడుకు మోహనుకి అప్పజెప్పింది. ' ఏమిరా, ఏమిటీ విషయం?  నువ్వయినా చెప్పు నాయనా.  నాకు కంగారుగా వుంది.' ' నానమ్మా, నీకు ఏం చెప్పినా వినపడి చావదు.  చెవిలో పెట్టుకునే మిషను కొన్నాను.  పెట్టుకోవచ్చుగా?' ' ఆ...అవున్రా.  ఆ మాయదారి బట్టల మిషనోటి కొని పడేసావు.  అందరూ బట్టలు చేత్తో ఉతకటం మానేసి, ఆ మిషన్లో పడేస్తున్నారు.  అందుకే మరకలు పోక చీరిట్లా ఏడిసింది.  ఏమైనా చేత్తో ఉతికినట్టుంటాయా?  ఈ మిషన్లొచ్చాక బాగా బధ్ధకాలు పెరిగిపోతున్నాయనుకో.  పనులు చేయడం మానేస్తున్నారు.  ఐనా...అసలు విషయం ఏమిటో చెప్పకా....ఇప్పుడు బట్టలమిషను గొడవెందుకూ....అసలే కంగారు పడి చస్తూంటే?' ' అమ్మా, మీరు చేసిన నిర్వాకానికి నానమ్మను కూడా వెంటేసుకు రావాలా?' ' అమ్మో!  ఆవిడ్ని తీసుకురాకపోతే ఊరుకుంటుందట్రా?  నా ప్రాణాలు తోడేయదూ?  ఆమె దెప్పుళ్ళు పడేకంటే తీసుకురావడమే మేలు.  భారతిని చూసొస్తా, ఇంటో జాగ్రత్తగా వుండండి అంటే, నాకూ భారతిని చూడాలనుంది అంటూ బయలుదేరింది.  పైగా ఈ వయసులో కూడా ప్రయాణమంటే చాలు, ఉరకలేస్తూ తయారవుతుంది.  ఏమే శ్రావణీ!  ఆవిడకి నువ్వే ఎలాగో చెప్పమ్మా, మావల్ల కాదు గానీ.......' అంటూ శ్రావణికి అప్పజెప్పింది భారతి తల్లి. ' అమ్మా శ్రావణీ!  నువ్వన్నా చెప్పమ్మా ఏమైందో.' శ్రావణి శాయశక్తులా కంఠాన్నంతా విప్పి, ఆవిడకి వినబడేలా, సరిగ్గా అర్థమయ్యేలా గొంతు చించుకుని చెప్పసాగింది. ' భారతి కొడుకు సతీష్ వున్నాడు కదా?  వాడు అగ్రికల్చరల్ బి.ఎస్.సి. చదువుతున్నాడు కదా?  అంటే వ్యవసాయానికి సంబంధించిన చదువన్నమాట.' ' ఇప్పుడు వాడి చదువు గొడవెందుకు?  నేనడిగిన దానికి సమాధానం చెప్పక?' ' ఊ, అదే చెబుతున్నా వినండి.  వాడు వ్యవసాయ శాస్త్రం చదువుతున్నాడు కదా?  వడ్లగింజల్లో బియ్యపుగింజలుంటాయని తెలుసుకున్నాడు.  అందుకే ప్రాక్టికల్ గా చూద్దామమని......... వడ్లగింజలన్నీ ఒలిచి బియ్యంగింజలు తీస్తున్నాడు.' ' ఈమాత్రం దానికి అంతలా నవ్వుతారెందుకు మరి?  వాడు చదువుకుని వడ్లగింజల్లో బియ్యపుగింజలుంటాయని తెలుసుకున్నాడు.  అప్పుడంటే మనం అనుభవంతో తెలుసుకున్నాం. పూర్వం వడ్లు దంచి తీసిన ఆ దంపుడుబియ్యంతోనే కదా, అన్నం వండుకునే వాళ్ళం?  అప్పట్లో మూడు నెలలకోసారి పనివాళ్ళు వచ్చి గాదెలో ధాన్యం తీసి, వడ్లు దంచి బియ్యం చేసేవారు.  ఆ దంపుడుబియ్యంతో వండిన అన్నం ఎంతో రుచిగాను, బలవర్ధకంగాను వుండేది.  అందుకే ఎనభై ఏళ్ళు వచ్చినా నేనెంత బలంగా వున్నానో చూడు?  కాళ్ళనెప్పులు, చత్వారాలు ఏవీ లేవు నాకు.  మీరూ వున్నారు, ఎందుకూ?  నువ్వు, నీ అక్క కాస్త పని చేసి కాళ్ళు నెప్పి, నడుం నెప్పి అంటూ మూలుగుతారు.  ఇహ సతీష్ గాడితో సహా మీకందరికీ ఇప్పట్నించే కళ్ళజోళ్ళు!  అది సరే, పొద్దుట్నించీ ఒకటే ఏడుస్తున్నారెందుకు మరి?' అని ఆవిడ మళ్ళీ సందేహం వ్యక్తం చేసింది. మళ్ళీ ఆవిడకి ఏం సమాధానం చెప్పాలా అనుకుంటూ, ' అదా.........అదీ....అదీ....ఆ....సరోజ కాలేజికి వెళ్ళి ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు అందరూ.  ఈలోగా మీ రెండో అబ్బాయిగారింటి కెళ్ళిందిట.  అందుకే ఇద్దరూ ఆటోలో కలిసి వచ్చారు.' ' ఏమిటీ, కుక్కపిల్లని కొనడానికి వెళ్ళి ఇంత లేటయిందా?  అవున్లే, ఇంట్లో కుక్క వుంటే మంచిదే.  దొంగల భయం వుండదు.  బుజ్జిముండ, తెల్లగా, ముద్దుగా బాగుంది.' అంటూ ఆవిడకి ఇంకోలా వినిపించి అంది ఆ చెవిటితల్లి. ఇంక ఆవిడతో మాట్లాడలేక దగ్గొస్తుంటే, ' ఇదిగో పిన్నీ!  అమోఘమైన నీ సమయస్ఫూర్తికి మెచ్చితిని.  ఇప్పటికే బాగా అలిసిపోయావు.  ఈ కూల్ డ్రింక్ తాగు.' అంటూ రమణి కూల్ డ్రింక్ అందించింది. ఈలోగా టి.వి.లో ' బ్రేకింగ్ న్యూస్ ' అంటూ యాంకరు చెబుతోంది. ' మొన్న రోజా అనే కాలేజి అమ్మాయి జ్వరం వస్తే డాక్టరు ఇచ్చిన ఇంజక్షనుకి రియాక్షను వచ్చి చనిపోయిందని పొరబాటుగా చెప్పినందుకు చింతిస్తున్నాం.  ఇప్పుడు మా విలేఖరి అందించిన వివరాల ప్రకారం, పోయింది అమ్మాయి కాదు, పెంపుడు కుక్క.  ఆ కుక్క పేరు రోజీ.  దానికి రియాక్షను వచ్చి చనిపోయింది.' అందరూ ఆ వార్త విని అవాక్కయ్యారు. సరోజకి అప్పుడు అర్థమయింది వీళ్ళంతా ఎందుకొచ్చారో. తరువాత రత్నమాల పెళ్ళి వైభవంగా జరిగింది.
******************************

No comments:

Post a Comment

Pages