సమతూకం - అచ్చంగా తెలుగు

సమతూకం 

డా.నీరజ అమరవాది
         దీపిక తన మూడేళ్ళ కొడుకు ప్రభుతో కలిసి అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చింది . ఎప్పుడూ విమానం దిగగానే మామగారు కారు పంపించేవారు . ఇప్పటి పరిస్థితి వేరు . రఘుతో పెళ్ళి తర్వాతే మొదటిసారిగా దీపిక అమెరికా  వెళ్ళడం . అప్పటినుండి ఎప్పుడు భారత దేశానికి వచ్చినా రఘుతో కలిసే వచ్చేది . అన్ని ఏర్పాట్లు రఘు చూసుకునేవాడు . ఈసారి తను మొదటిసారిగా కొడుకుతో స్వదేశానికి వచ్చింది . మామగారు కూడా కాలంచేసి రెండు సంవత్సరాలు అవుతోంది . దీపిక అమ్మ చిన్నప్పుడే పోయింది . ఇద్దరు అన్నలు , వదినలు , నాన్న అందరూ కలిసి హైదరాబాద్ లోనే ఉంటారు . వాళ్లకి కూడా తను వస్తున్నట్లు ఫోన్ చేయలేదు .
            దీపిక తను కూకట్ పల్లి లోని అత్తగారి దగ్గరికి వెళ్ళాలా లేదా గాంధీనగర్లోని నాన్న దగ్గరికి వెళ్ళాలా అని తేల్చుకొనే లోపే సికింద్రాబాద్ వైపు వెళ్ళే "ఏరో ఎక్స్ ప్రెస్ " బస్సు వచ్చింది . మారు ఆలోచన లేకుండా ఆ బస్సు ఎక్కి సికింద్రాబాద్ లో దిగింది . సికింద్రాబాద్ కి దగ్గర గాంధీ నగర్ అనుకోని ఆటో ఎక్కి గాంధీ నగర్ కి తీసుకెళ్ళమని చెప్పింది .
           గాంధీ నగర్ లో దీపిక వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగుతుండగానే పెద్దన్న బయటికి వచ్చాడు . దీపికను చూడగానే నమ్మలేనట్లు "దీపా" అంటూ దగ్గరకు వచ్చాడు . ఆ కేక కు ఇంట్లో ఉన్న దీపిక రెండో అన్న , వదినలు , నాన్న అందరూ బయటకు వచ్చి ఆనందం , ఆశ్చర్యం ,ప్రశ్నలను కురిపిస్తూ సామానుని దీపికని లోపలకు తీసుకెళ్ళారు . ఒకళ్ళు ప్రభును ఎత్తుకున్నారు . బావగారు రాలేదా అని ఒక అన్న , అన్నయ్యగారు వాళ్ళు అమ్మ దగ్గరకి వెళ్లారా అని వదినలు , అల్లుడుగారితో కలిసి అటు వెళ్ళకుండా ఇటు వచ్చవేమిటి అని నాన్న అడిగారు .
          అవి కుశల ప్రశ్నలా లేక తాను ఇక్కడికి రావడం నచ్చక అలా మాట్లాడారా అనేది దీపిక కు అర్ధం కాలేదు .
                     ఏది ఏమైనా తనవాళ్ళు అనుకొని నాన్న ! ఆయనకి సెలవ దొరకలేదు . నాకు మీరందరూ గుర్తుకు వస్తున్నారని
చెబితే , సర్ ప్రైజ్ విజిట్ టికెట్స్ అంటూ నా చేతిలో ఇండియా టికెట్స్ పెట్టారు . అలా నేను ఇండియా కి వచ్చాను అని చెప్పింది .
                    వదినలు అక్కలాగా ఆదరించారు . అన్నలు అమ్మ లాగా లాలించారు . నాన్న కు ముద్దుల కూతురు దీపిక . వారి ప్రేమానురాగాల వెల్లువలోవారం రోజులు గడిచాయి .
                      ఒక రోజు పొద్దున్న దీపికవాళ్ళ పెద్ద వదిన "దీపా" నువ్వు వస్తావని ముందుగా మాకు తెలియదు కదా ! మీ నాన్నగారు "మానససరోవరం" చూడాలని ఉంది అని చెప్పారు . అందరం కలిసి ఒక వారం రోజులు యాత్రలకి టికెట్లు బుక్ చేసుకున్నాము . ఇప్పుడు కాన్సిల్ చేద్దామని మీ అన్నలు అంటున్నారు . కానీ నాకు మీ నాన్నగారికి ఓపిక ఉన్నప్పుడే తీసుకెళ్లాలని అనిపించింది . అందుకని నేను నీకు తోడుగా ఉంటాను , వాళ్ళని పంపిస్తాను , నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది . దీపిక జవాబు  చెప్పేలోపే చిన్నవదిన వచ్చి అక్కా ! దీపిక ఎలాగూ వాళ్ళ అత్తగారిని చూడడానికి వెళ్ళాలి కదా ! మనం ఒక వారంలో వస్తాము కదా ! ఆ వారం అక్కడ ఉంటుంది అని చెబుతూ , అంతే కదా దీపా ! అని అడిగింది .
                దీపిక వారి మాటలను ఖండించలేక పోయింది . అసలు గొడవ అత్తగారి విషయం వల్లనే వచ్చింది అందుకనే భర్త దగ్గరనుండి ఇక్కడికి వచ్చింది . దీపిక వాళ్ళ మామగారు రెండేళ్ళ క్రితమే పోయారు . వాళ్లకి రఘు ఒక్కడే కొడుకు . ఆయన యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు . సడన్ గా గుండె నొప్పితో పోయారు . అత్తగారు ఆరోగ్యంగానే ఉన్నారు . ఈ మధ్య తరుచూ రఘు ఇండియా లో మా అమ్మ ఒక్కతే ఉండటం నాకు నచ్చటం లేదు . ఇక్కడికి తీసుకొద్దామనుకొంటున్నాడు అన్నాడు .  దీపిక ఏమీ మాట్లాడలేక , అయినా రమ్మనగానే అత్తగారు కూడా రాదనుకొని , మీ అమ్మగారి అభిప్రాయం కూడా కనుక్కోండి . ఈ వయసులో వాళ్లకి ఎక్కడ వీలుగా , సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండటమే బాగుంటుంది అని చెప్పింది .
                అప్పటినుండి దీపిక అత్తగారికి ఎప్పుడు ఫోన్ చేసినా అంటీ ముట్టనట్లు మాట్లాడుతోంది . వీలయితే అత్తగారికి కష్టం కలిగించేలా మాట కూడా అంటోంది . ఎందుకంటే అత్తగారు అమెరికా కి వస్తే తన మీద పెత్తనం చేలాయిస్తుందని , ఖర్చులు పెరగుతాయని , తమ ఏకాంతానికి భంగం కలుగుతుందని  రకరకాలుగా ఆలోచించింది . దానితో ఇరుగు పొరుగు ఆంధ్ర వనితలు , నేటి మహిళలు కూడా అత్తగారు వస్తే ఆరళ్ళు తప్పవు ఆమె రాకుండా నువ్వే చూడాలి అని నూరిపోసారు .అందుకనే అత్తగారికి తనపై అయిష్టం కలిగేలా సూటిపోటి మాటలు అంటోంది .
               అయిన సరే రఘు ఎలా ఒప్పించాడో వాళ్ళ అమ్మని అమెరికా కి రావడానికి , ఒకరోజు దీపిక తో రఘు "అమ్మ ని వచ్చే నెల ఇక్కడికి తీసుకొద్దామనుకుంటున్నాడు . నేను ఒక్కడినే ఇండియా కి వెళ్లి అమ్మను తీసుకు వస్తాను" అని చెప్పాడు . ఆ మాటలతో రఘు వాళ్ళ అమ్మ ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది అని దీపిక కు అర్ధం అయింది .
               దీపిక రఘు తో "ఇప్పుడుమీరు అమెరికా లో ఉన్నారు . "అమెరికన్" లాగా ఉండండి . అమెరికన్ లాగా ఆలోచించండి . ఇక్కడ ఎవరైనా తల్లులని తమతో ఉంచుకుంటున్నారా ! చూసి కల్చర్ నేర్చుకోండి . కావాలంటే మీ అమ్మ కి డబ్బు పంపండి . వస్తువులు పంపండి . అంతేకాని ఆవిడిని ఇక్కడికి తీసుకువస్తే నేను సహించలేను " అన్నది . ఆ మాటలు విన్న రఘు ఏమీ మాట్లాడలేదు . కానీ ఒక వారం రోజులు తరువాత దీపిక కి ఒక కవరు ఇచ్చాడు . ఏమిటా అని చూస్తే విడాకుల పత్రాలు . ఇవేంటి అని అడిగింది దీపిక . రఘు "నువ్వే అన్నావు కదా ! అమెరికన్ లాగా ఆలోచించమని . ఇక్కడ ఒకరికొకరు నచ్చకపోతే విడిపోతారు . నా అభిప్రాయాలు నీకు నీ ఆలోచనలు నాకు నచ్చడం లేదు కనుక గొడవలు లేకుండా , స్నేహపూర్వక వాతవరణంలోనే మనం విడిపోదాము " అని చెప్పి మారుమాట  లేకుండా వెళ్ళిపోయాడు . ఆనాటినుండి ఇద్దరి మధ్య మాటలు లేవు . పడకలు వేరైపోయాయి . ఉన్నట్లుండి ఒక రోజు రఘు ఇక నువ్వు ఇక్కడ కష్టంగా ఉండక్కరలేదు . విడాకులకి సమయం పడుతుంది కదా ! నువ్వు నీకు నచ్చిన చోటుకి వెళ్ళవచ్చు . కానీ నువ్వు ఎక్కడ ఉన్న సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను . అని చెబుతూ ఇండియాకి రెండు టికెట్లు ఇచ్చి రేపే మీ ప్రయాణం అని చెప్పాడు .
                  బాధ , కోపం , పౌరుషాలు తన్నుకోస్తున్నా దీపిక ఏమీ మాట్లాడలేదు . వెంటనే కొడుకుని తీసుకొని బయలుదేరింది .
                  ఇండియా లో తన వదినలు తన నాన్న ని వాళ్ళ నాన్న లాగా చూసుకుంటున్నారు . వాళ్ళతో తన బాధ్యతని సమస్య గా చెప్పుకోవటం నచ్చలేదు . ఇవన్నీ ఆలోచిస్తుండగానే అన్నలు , నాన్న " అమ్మా దీపా ! మేము కుడా మీ అత్తగారిని చూసి చాలా రోజులైంది . నిన్ను అక్కడ దింపి , మీ అత్తగారి క్షేమ సమాచారాలు కనుక్కొంటాము" అంటూ అందరు బయలుదేరారు .
                  అత్తగారింటి ముందు కారు ఆగగానే "దీప" దిగడానికి సంశయిస్తుంటే "ప్రభు" మటుకు దిగి గేటు దగ్గర కాలింగ్ బెల్ నొక్కాడు . లోపలినుండి "భారతి" వచ్చి "ప్రభూ" అంటూ ఒక్కసారి దగ్గరికి తీసుకొని దీపికను రామ్మా ! అంటూ ఆహ్వానించింది . దీపిక తండ్రిని కూడా అన్నయ్యగారూ మీ ఆరోగ్యం బాగుందా అని బాగోగులు కనుక్కొంది . అన్నయ్యలు "అత్తయ్యా మీకు" అంటూ , ఆవిడకు  ఇష్టమైన వేడి వేడి జిలేబీలు చేతికి అందించారు . ఆవిడ కూడా మేమందరం వస్తాము అని తెలిసినట్లుగానే "నేను మీకు ఇష్టమైన గారెలు చేసాను" అంటూ తేవడానికి లోపలి వెళ్లారు . అన్నయ్యలిద్దరూ ప్లేట్లలో అన్ని సర్ది అందరికీ పెట్టారు .
                  దీపిక అత్తగారు తనను ఎప్పుడు వచ్చావని , అక్కడికి ముందు ఎందుకు వెళ్లావు లాంటి ప్రశ్నలు అడుగుతుందని ఊహించింది . కానీ భారతి అవేమీ కాకుండా "అమ్మా దీపికా ! నేను మీకిష్టమని గులాబ్ జామ్ లు కూడా చేశాను , లోపల ఉన్నాయి . తినమని చెప్పి వంట ప్రయత్నంలో మునిగిపోయింది .
                    మరునాడు ఉదయం భారతి దీపిక తో "నా పట్టు చీరలు కొన్ని ముదురు రంగు వి ఉన్నాయి . అందులో నీకు ఇష్టమైనవి తీసుకో అని బీరువా తెరచింది . లోపల ఉన్న వెండి సామాను కూడా తీసి ఇవి నేను వ్రతం చేసుకునేటప్పుడే బయటకు తీస్తాను . ఇక ఆ అవసరం లేదు . నువ్వు తీసుకెళ్ళు అని ఇచ్చింది . మనం ఈ రోజు బ్యాంక్ కి వెళ్దాము . లాకర్ లో ఉన్న నా నగలు చూసి నచ్చినవి తీసుకో ." అని చెప్పింది . దీపిక కి మాట రావడంలేదు . తను అత్తగరి దగ్గరి నుండి ఇటు వంటి ఆదరణ ఊహించలేదు .
                   రఘు తనకి విడాకులు ఇవ్వబోతున్నాడు .అమెరికన్ అయిపోతాదట . కానీ తను "అమెరికన్" కాలేక పోతోంది . తన సంసారాన్ని నిలబెట్టే పెద్ద దిక్కు ఇక తన అత్తగారు అని గ్రహించింది .
                  దీపిక తన అత్తగారితో "మీకు కూడా కొంచెం మార్పుగా ఉంటుందని మిమ్మల్ని మాతో అమెరికా తీసుకెళ్దామని నేను  ఇక్కడికి వచ్చాను . వచ్చే వారం బయలుదేరదాము . మీ అబ్బాయి తో కూడా ఒక మాట చెప్పండి "అని అంది .అంతలో ప్రభు , "నాయనమ్మ ! నాన్న ఫోన్ " అని  ఇచ్చాడు . కుశల ప్రశ్నల తరవాత " మేము వచ్చేవారం బయలుదేరదామనుకొంటున్నాము " అని చెప్పింది . రఘు టిక్కెట్లు పంపిస్తానని చెప్పినట్లున్నాడు . దీపిక కు ఫోన్ ఇస్తున్నాను అని భారతి అంటుండగానే ఫోన్ కట్ అయింది .
                వారం రోజుల్లో టిక్కెట్లు రావడం దీపిక అత్తగారితో కలిసి అమెరికాకి వెళ్ళడం జరిగింది . అమెరికా లో దిగ గానే రఘు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు . ఇంటికి వెళ్లేసరికి వంట కూడా చేసి పెట్టాడు . "ప్రయాణంలో అలిసిపోయినట్లున్నావు  పడుకో అమ్మా !" అని రఘు ప్రభు గదిలోకి వాళ్ళమ్మని తీసుకెళ్ళాడు . ప్రభు కూడా "నాయనమ్మ తో కథలు చెప్పించుకుంటూ పడుకుంటా " అని ఆనందంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు .
                  దీపిక కి కూడా నిద్ర వస్తోంది . ఇండియా కి వెళ్లేముందు నుంచి రఘు తో మాటలు లేవు . ప్రభు తోనే పడుకునేది . ఇంటికి వచ్చినప్పటినుండి రఘు దీపిక ను పట్టించుకోవట్లేదు . ఇప్పుడు ఎక్కడ ఎలా పడుకోవాలి ? తన పరిస్ధితి ఏంటో అర్ధం కావట్లేదు . రఘు వంట గదిలో ఎదో చేస్తున్నాడు . దీపిక నెమ్మదిగా బెడ్ రూమ్ లో బల్ల మీద విడాకుల కాయితాలు ఉన్నాయో లేదో చూడడానికి వెళ్ళింది . ఆ విడాకుల కాయితాల స్థానం లో "స్వీట్ మెమోరీస్ " అని రాసి దాని కింద దీపిక రఘుల పెళ్లి ఫోటో అతికించిన కార్డు ఉంది .
అది చూస్తుండగానే రఘు రెండు కప్పులలో వేనేలా ఐస్ క్రీమ్ పైన పికాన్ టాపింగ్ వేసి తీసుకొచ్చాడు . అది దీపిక కి చాలా  ఇష్టమైన ఫ్లేవర్ . రఘు ఐస్ క్రీమ్ అందిస్తూ "విష్ యు హ్యాప్పి మ్యరీడ్ లైఫ్ " అని విష్ చేసాడు . అప్పుడు గడియారం చూస్తె 12 గంటలు దాటుతోంది . ఆరేళ్ళ క్రితం ఇదే రోజు ఇదే సమయంలో వారిద్దరూ ఒకటైయ్యారు . దీపిక " మరి విడాకులు " అని అడిగే లోపు "తమలపాకులు పంచుకున్న మనకు విడాకులు ఎందుకు" అంటూ  దగ్గరకు తీసుకున్నాడు .
డా.నీరజ అమరవాది

No comments:

Post a Comment

Pages