భైరవకోన (జానపద నవల 5 వ భాగం ) - అచ్చంగా తెలుగు

భైరవకోన (జానపద నవల 5 వ భాగం )

Share This
భైరవకోన (జానపద నవల 5 వ భాగం )
(జరిగిన కధ : సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. భైరవారాధన విశిష్టతను తెలుసుకుని, గుహ్యమైన గుహలోని భైరవ-భైరవి శక్తుల కృపను పొందడానికి వెళ్తున్న విజయుడిని అడ్డగిస్తాడు కరాళ మాంత్రికుడు. అతడిని జయించి, భైరవ కృపతో ఒక దివ్య ఖడ్గం, వశీకరణ శక్తి  పొందుతాడు విజయుడు. తన గురువుకు అవి చూపాలని, ఆత్రంగా వెళ్తున్న విజయుడిని ఢీకొని స్పృహ కోల్పోతుంది ఓ రాకుమారి. ఆమెను చిరుతపులి నుంచి రక్షించి, ఆమె అందానికి విస్మయుడై, ఆమెను స్పృహలోకి తెప్పించి, ఆమె ఎవరో తెలీకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు విజయుడు. ఆమె కూడా అదే భావానికి గురౌతుంది... ఆమె కుంతల దేశపు రాకుమారి ప్రియంవద అని, ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన చెలుల ద్వారా తెలుసుకుంటాడు విజయుడు.) సదానందమహర్షి పాదాలకు సాష్టాంగనమస్కారం చేసాడు విజయుడు. విజయుడిని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు మహర్షి. అతడి మొహంలో కనిపించే దివ్య తేజస్సును, ఆనందాన్ని చూసి, తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని, ‘విజయోస్తు ! శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు !’ అంటూ దీవించారు. గురు- శిష్య సంబంధంలోని మాధుర్యం ఇదే ! శిష్యుడి స్థితిగతులు సదా ప్రేమతో పర్యవేక్షిస్తూ, వెన్నంటి ఉంటారు గురువు. “ నాయనా విజయా ! అకుంఠిత దీక్షతో భైరవ ప్రసాదితమైన దివ్య ఖడ్గం సాధించావు. శభాష్. ఇక నీకు కర్తవ్యం బోధించాల్సి ఉంది. రా, ఇలా కూర్చో,” అంటూ ఒక రావి చెట్టు మొదట్లో విజయుడిని కూర్చోపెట్టారు మహర్షి. చెంగు చెంగున గెంతుకుంటూ స్వేచ్ఛగా ఆయన ఒడిలో తల పెట్టుకు కూర్చుంది హరిణి. అది ఆయన పెంపుడు లేడి. ప్రేమగా దాని తల నిమిరి, ఇలా చెప్పసాగారు మహర్షి. “ విజయా ! అందరినీ సమాన హక్కులతో పుట్టించాడు భగవంతుడు. అందరూ సౌభ్రాతృత్వంతో అనుభవించాల్సిన తిండి, గుడ్డా, నీడ, కొందరి స్వార్ధం, లోభం వల్ల అందరికీ అందట్లేదు. యెంత విచిత్రమైనది మనిషి ప్రవృత్తి ? పట్టెడు మెతుకులు కరువైనప్పుడు కడుపు నిండితే చాలు, అనుకుంటాడు. కడుపు నిండగానే దేహాన్ని కప్పుకోడానికి ఒక్క గుడ్డ ముక్క చాలనుకుంటాడు. అదీ తీరాకా... ఆకలి, ఇతర అవసరాలకు తగినంత డబ్బు కావాలనుకుంటాడు. తర్వాత అధికారం, సమాజంలో బలీయమైన స్థానం, స్త్రీ సౌఖ్యం, చివరికి... ప్రపంచాన్నే ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాలన్న దురాశ. అటువంటి దురాశాపరుడే మనకు గుహ వద్ద ఎదురైన మాంత్రికుడు కరాళుడు. విశ్వ విజేత కావాలన్న వెర్రి ఆశతో అనేక క్షుద్రోపాసనలు చేసాడు. భేతాళుడి అనుగ్రహంతో దుష్టశక్తులు సంపాదించాడు. ఇప్పుడు వాడి గురి ‘చంద్రకాంత మణి’ !” అంటూ ఆపి అర్ధోక్తిలో విజయుడి ముఖంలోకి చూసారు మహర్షి. ‘గురువర్యా ! అది మాకు మా పూర్వీకుల వద్ద నుంచి సంక్రమించిందని ఒకసారి విన్నాను...’ అన్నాడు విజయుడు. ‘అవును నాయనా ! విను. పూర్వం మీ ముత్తాతల కాలంలో ధర్మబద్ధంగా పాలించే  వేద వర్మ అనే రాజు ఉండేవారు. అత్యంత నిష్టతో ఈ కొనలోని దుర్గమ్మను ఉపాసించేవారు. రాజు న్యాయ నిరతికి, భక్తికి ప్రసన్నురాలైన అమ్మవారు, ఆయనకు ప్రత్యక్షమై ఒక దివ్య మణిని ప్రసాదించింది. అదే చంద్రకాంత మణి. ప్రతీ కార్తీక పున్నమికి, చంద్రుడి కిరణాలు భైరవకొన లోని అమ్మవారి ఎదుట ఉన్న కొలనులో ప్రతిబింబించి, అమ్మవారి నుదుటిపై సూటిగా పరావర్తనం చెందుతాయి. అప్పుడు అమ్మ, నుదుట వజ్రాన్ని కుంకుమగా ధరించినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ సమయంలో ఈ చంద్రకాంత మణిని అమ్మ ఎదుట ఉంచితే, ఆమె నుదుట మెరిసే చంద్ర కిరణం మణి పై ప్రతిబింబించి, ఒక్క సారిగా ఆ ప్రదేశమంతా దివ్యకాంతులు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ మణిలో అమ్మవారి శక్తి నిక్షిప్తమై, ఆ మణి ఉన్న దేశంలో సుభిక్షం, శాంతి సామరస్యాలు, వర్ధిల్లుతాయి. ఎంతటి వారినైనా అవలీలగా ఓడించే పరాక్రమం ఆ రాజుకు సొంతం అవుతుంది. అయితే, మీ వంశం వారు ఆ మణిని ప్రజల శ్రేయస్సు కొరకు తప్ప, స్వార్ధ ప్రయోజనాలకు వాడలేదు. ప్రాణప్రదంగా మణిని సంరక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు కరాళ మాంత్రికుడి దృష్టి ఆ మణి పై పడింది. ఒకానొక క్షుద్ర పూజలో, స్వాతి నక్షత్రంలో పుట్టిన ఆరు శుభ లక్షణాలు కల రాకుమారిని, అమావాస్య నాడు,  భేతాళుడికి బలి ఇచ్చి, ఈ మణిని ఆయనకు సమర్పిస్తే, విశ్వ విజేత అవుతాడని ప్రతీతి. అందుకే ఇప్పుడు కరాళుడు ఆ మణి కోసం, అటువంటి రాకుమారి కోసం అన్వేషిస్తున్నాడు. అతడి ఎత్తులు ఫలించాయా, ఇక ఈ ప్రపంచమే అతడి వశం అవుతుంది. విజయా ! ఇక్కడ మరో విషయం. ఏ మనిషిలో అయినా క్షత్రియుడు సంహరించాల్సింది దుష్టత్వాన్ని కాని, దుష్టుడిని కాదు. ఒక దుష్టుడిలో మానసిక పరివర్తన తీసుకు వచ్చినప్పుడు, అతడు జీవితాంతం సమాజానికి ఉపయోగపడతాడు. అందుకే, తన ఆత్మ రక్షణ కోసం మరీ అవసరమైతే తప్ప, ఇతరుల ప్రాణాలు తియ్యకపోవడం క్షాత్ర ధర్మం. ఇది నీవు కాబోయే రాజుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం. నీవు ఇక నీ రాజ్యానికి తిరిగివెళ్లు. నీ మాతాపితరులు నీ రాకకై నిరీక్షిస్తున్నారు. వెళ్లి, పట్టాభిషిక్తుడవై కుంతల రాకుమారిని చేపట్టు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ, ఈ కొనకు క్షేత్రపాలకుడైన భైరవుడిని, కోనలోని   అమ్మవారిని ఆరాధించు. కరాళుడి పాపం పండి, వాడి పీచమణచే రోజు కోసం  నిరీక్షిద్దాం ! నా ఆశీస్సులు సదా నీకు శ్రీరామరక్ష !” అన్నారు. మరొక్కసారి గురువు పాదాలకు ప్రణమిల్లి, తన శ్వేతాశ్వంపై భైరవపురం దిశగా పయనం సాగించాడు విజయుడు.... (సశేషం ...)

No comments:

Post a Comment

Pages