నటయశస్వి యస్వీఆర్
              -- రచన:  కరణం కళ్యాణ్ కృష్ణ కూమార్

 "సాహసం సేయరా ఢింబకా.." "లెస్సపలికితివి.. వెయ్యి వీడికి రెండు వీరతాళ్ళు" "వివాహ భోజనంబు అహహ్హ నాకేముందు" "" నీ సొగసు చూసి మాయని మనస్సు రంజిల్ల కుండునా... నా సందిట రాలకుండునా... ఓహో.. ఏ అందెల సవ్వడి విన్ననూ ఆ సుందరేమోనని మనసులో ఆందోళన అధికమౌతున్నదే! "అంటూ పౌరాణిక పాత్రలలో..రౌద్ర బీభత్స భయానక రూపాలలోనే కాక ,,, కన్నీరొలికించే  సాంఘిక పాత్రలలో ఇట్టే ఇమిడి పోయి ఇచ్చిన పాత్రలో జీవించి.. ప్రేక్షకుడి కళ్ళు చెమర్చేలా చేయగలిగిన సమర్ధుడు నటశిరోమణి యస్వీఆర్. ఆయన నటించిన సినిమా పేర్లు చెప్పగానే, కధానాయకుని కన్నా ముందు గుర్తొచ్చే పేరు  స్ఫురధ్రూపి  యస్వీఆర్ దే..! . సినీ వాలిగా ..చిత్రలోకంలో విహరించి తన నటనతో వెన్నెలలు కురిపించిన మహానటూడు యస్వీ రంగారావు.. తాను నటించిన చిత్రాలలోని కథానాయకులెవ్వరికీ  దక్కకున్నా.. ముందుగా అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఏకైక నటుడు యస్వీఆర్.   
  యస్వీఆర్  వివరాలు సంక్షిప్తంగా... పూర్తి పేరు : సామర్ల వెంకట రంగారావు తండ్రి    : కోటేశ్వరనాయుడు తల్లి      : లక్ష్మీ నరసాయమ్మ భార్య    : లీలావతి సంతానం : విజయ, ప్రమీల, కోటేశ్వరరావు పుట్టిన తేది :  జులై 3, 1918 పుట్టీన ప్రదేశం : నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరణం : జులై 18, 1974   
  బాల్యం  కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు.  తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. కళాశాలరోజుల నుంచి నటనంటే మక్కువ ఎక్కువ యస్వీఆర్ కి.   
జీవితం  వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. దైవ భక్తుడే కాక దేశభక్తుడు కూడా..! ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు ఆయన..బాదాటి వెంకట రమణయ్య,కోటేశ్వరమ్మల సుపుత్రిక  లీలావతి తో డిసెంబర్ 27 1947 లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. యస్వీఆర్ వివేకానండునికి ప్రియభక్తుడు. వేదాంతి కూడా. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చిన వితరణ శీలి రంగారావు గారు.   
నటనాశక్తి.. తెరంగ్రేట్రం: షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించటంలో రంగస్థలంలో అప్పట్లో ఆయనకెవ్వరూ లేరు సాటి అనిపించుకున్నారు.  అనుకోకుండా దర్శకులు బి.వి.రామానందం గారి దృష్టిని ఆకర్షించిన రంగారావు ...ఆయన  దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో కథానాయకుడైన ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. నాటి నుండి చిత్రసీమకు వెలలేని సేవచేసిన నటయోగిపుంగవుడు యస్వీ రంగారావు గారంటే అతిశయోక్తి కాదేమో ..!  సినిమా కలగా భావించే రోజుల్లోనే 300 వందల చిత్రాలకు పైగా నటించి మెప్పించి.. మదిలో ఆ పాత్రలకు జీవం పోసిన ఘటోత్కజుడు రంగారావు గారు. సినిమాలో విలనీకి కొత్తగ తనదైన శైలిలో  మెరుగులు దిద్ది ప్రతినాయక పాత్రకి  కొత్త హంగు ఆర్భాటం.. తెచ్చిన నటనా కౌశలం యస్వీఆర్ ది. రాక్షసుడు అంటే ఇదిగో ఇలాగే వుంటాడేమో.. కీచకుడు అంటే ఇంత భయంకరంగానా??? అమ్మో.. పాతాళ మాంత్రికుడు అంటే ఇలాంటి అవతరం అన్నమాట. గర్వమదాంధకారంతో ఉండే రాజు అంటే ఇదిగో  ఇతనే.. కీచకుడు. రావణుడు,, కంసుడు హిరణ్యకశిపుడు,ఇలా ఎన్ని రకాలు  పాత్రలను గుర్తుతెచ్చుకున్నా గుర్తొచ్చే రూపం యస్వీఆర్ దే..! ..... తాను శూన్యంగా (యస్స్వీఆర్) పాత్ర  ఔచిత్యం జీవం పోసుకునే తీరు వీరి నటనది.. ఆ కాలంలో తెరమీద యస్వీఆర్ కనబడగానే హుందాతనం కొట్టుకొచ్చేది.... వీలలు గోలలు ఒకవైపు.. పోటాపోటీగా కథానాయకులకు పోటీ నటన ఒక వైపు... ఇదికాక వీరి నటనలో మరో కోణం కూడ వుంది.. యస్వీఆర్ తెరపైన కనబడగానే చిన్నపిల్లల నిక్కర్లు భయంతో తడిచిపోయేవంటే..  ఆయన విలనిజం కు నిజం.. ఇజం కట్టపెట్టారనటంలో సందేహం ఎవ్వరికీ ఇసుమంతైనా ఉండదు.. అంతటి రౌద్రరూపి.... విడిగా మాత్రం ఆయనా.. ఈయన ఒకరేనా.. అన్నంత సాత్వికులు యస్వీఆర్.. సాంఘిక పాత్రలలో సూర్యకాంతం భర్తగా నటించిన పాత్రలు ఆయన నిజ స్వభావాంలాంటి వంటారు ఆనాటి సినీ ప్రముఖులు.    
ప్రతినాయకుడికి కేరాఫ్ యస్వీఆర్: వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా తన ప్రస్థానం మొదలెట్టిన రంగారావు గారి నటన అప్రతిహతం గా కొనసాగింది... తనదైన ముద్ర వేసుకుని అజరామరం గా నిలిచిన చిత్రాలలో వీరు నటించి మెప్పించిన మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు వంటివి అనేకం వున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పౌరాణికాలలో..దానవాగ్రణిగా... సాంఘికాలలో సూటు, బూటు వేస్తే జమిందారు.. పంచె జుబ్బా వేస్తే.. పెద్దన్న. కోటు టోపీ పెడితే రౌడీ గా ఇట్టే పాత్రలో జీవించే వారు రంగారావు గారు. అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు యస్వీఆర్.  మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అలుపెరుగని యోధుడిలా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించారు . ఆయా పాత్రలలో యస్వీఆర్  ఎంత మమేకమైపోయారంటే , మరెవ్వరూ ఇంతవరకూ ఆ పాత్రలలో  ఇమడలేకపొయ్యారు... పోషించే ధైర్యం చేయలేకపోయారు.. కొండకచో జరిగినా  మెప్పించలేక పొయారు. అందుకే నటయశస్విగా.. విశ్వనట చక్రవర్తిగా సినీ రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా మూడు దశాబ్ధాలు ఏలారు... ఆఖ్యాతితో ఇంకా ఏలుతూనే ఉన్నారు.   
  దర్శకునిగా- నిర్మాతగా : నటుడిగా తనేంటో నిరూపించుకున్న యస్వీఆర్..దర్శకత్వ శాఖలో తన ప్రతిభకు పట్టం కట్టారు. దర్శకత్వం వహించిన రెండూ చిత్రాలూ అవార్డులు దక్కించుకున్నాయంటే ఆయన ప్రతిభకు కొలమానం లేదేమో అనిపిస్తుంది. వీరి దర్శకత్వంలో ... బాంధవ్యాలు (1968) చదరంగం (1967) వచ్చాయి. ప్రేక్షకులలో చెరగని ముద్రవేశాయి. ఇక నిర్మాతగా బాంధవ్యాలు, చదరంగం  చిత్రాలు స్వీయదర్శకత్వంలో నిర్మించగా.. నాదీ ఆడజన్మే (1965) సుఖదుఖాలు (1969) అనే చిత్రాలు నిర్మించారు యస్వీఆర్. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదనేది ఆయన ప్రధానోద్దేశ్యం.. ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇవ్వటానికి సరైన వేదిక సినిపరిశ్రమ అనేది యస్వీఆర్ మనోగతం.   అవార్డులు- రివార్డులు :        రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి బారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి. రౌద్రం.. బీభత్సం,భయానకం, ఆగ్రహం, ఆవేశం,, శాంతం,,, మౌనం వంటి అనేక హావభావలు పండించి తెలుగు..ప్రజలేకాక ప్రపంచంలోని అనేక మండి ప్రేక్షకుల హృదాంతరాలలో నిలిచిపోయాడు యస్వీఆర్. అందుకే  ఆయనను అభిమానులు   నట యశస్వి, నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి,  నటసార్వభౌమ, నటసింహ మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు.   తెలుగు, తమిళం, హిందీ భాషలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించిన యస్వీఆర్ కు ఎన్నో అవార్డులు వరించాయి.  1962,1963 సంవత్సరాలు వీరి నటనకు పరాకాష్ట అనవచ్చు.. ఇదే సంవత్సరాలలో అన్నయ్య (1962), శారద (1962), నానుం ఒరుపెన్ (1963) కర్పాగం (1963),నర్తనశాల (1963) చిత్రాలలో నటనకు గాను రాష్ట్రపతి అవార్డునందు కున్నారు యస్వీఆర్. స్పెషల్ ఫిలింఫేర్ (దక్షిణం)విభాగంలో నానుం ఒపెరియాన్ (తమిళ్) చిత్రానికి అవార్డునందుకున్నారు ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో కీచకపాత్రకుగాను ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్నారు . అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఎస్వీ రంగారావుపై 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా  తపాళా బిళ్ళ విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుని సంచలనం సృష్టించింది. రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుని తనలోని దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చాటారు యస్వీఆర్.   నేలరాలిన మాహావృక్షం... ఎన్నో పాత్రలను సజీవంగా నిలిపిన మేరునగధీరుడు... చిత్రరంగానికి నీడనిచ్చిన సినీ వృక్షం  1974 జూలై 18వ తేదీన నేలరాలింది.. సినీలోకంతో పాటు ప్రేక్షక లోకాన్నికన్నీటి పర్యంతం చేసి.. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటును చిరునవ్వుతో స్వీకరించి శాశ్వతం గా  దూరమయ్యారు  యస్వీరంగారావు గారు.. అయినా ఆయన చిరునవ్వు ఆయన పాత్రలలో సజీవం.. ఆయన ఖ్యాతి అజరామరం . ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు, బాపువేసిన చిత్రానికి ముళ్ళపూడి వారు వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు. ఒక్క ముక్కలో యస్వీఆర్ జీవితాన్ని ముందుంచారు...  
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి 'ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు   -  ముళ్ళపూడి
  అని అభిమానంగా తన కలం కు పని చెప్పారు రమణ గారు. బాపూ, రమణలనే గాక తన నటనతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్న నట యశస్వి యస్వీ రంగారావు... యస్వీ రంగారావు గారు నటించిన  మేలిముత్యాలు వంటి చిత్రాలలో కొన్ని...
 సున్నం రంగడు గా షావుకారు... ధూపాటి వియ్యన్న గ పెళ్ళిచేసి చూడు
గుడ్డివాడు గా సంతానం.... ఘటోత్కచుడు గా మాయాబజార్
యముడు గా సతీ సావిత్రి.... హిరణ్యకశిపుడు గా భక్తప్రహ్లాద
కంసుడు గా శ్రీక్రిష్ణ లీలలు.... కంసుడు గా యశోద కృష్ణ
దుర్యోధనుడు గా పాండవ వనవాసం.... కీచకుడు గా నర్తనశాల
హరిశ్చంద్రుడు గా హరిశ్చంద్ర.... బలరాముడు గా శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
రావణుడు గా సంపూర్ణ రామాయణం... నరకాసురుడు గా దీపావళి
అక్బర్ గా అనార్కలి....భోజరాజు మహాకవి గా కాళిదాసు
మాంత్రికుడు గా పాతాళభైరవి.... మాంత్రికుడు గా భట్టి విక్రమార్క
మాంత్రికుడు గా బాలనాగమ్మ.... మాంత్రికుడు గా విక్రమార్క
కోటయ్య గా బంగారుపాప.... తాండ్ర పాపారాయుడు గా బొబ్బిలియుద్ధం
  వంటి అనేక చిత్రాలు తన నటనతో ప్రేక్షకుల ముందు నడిపించిన ధీరోధాత్తుడు మన యస్వీఆర్. నటనను ప్రేమించి ఆ నటనను పండించే యస్వీ రంగారావు లాంటి  నటుడు గతంలో లేరు ముందుముందు రారు అనేది నగ్న సత్యం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top