ఢమాల్ ఢమాల్ - జమాల్ జమాల్
- పెయ్యేటి రంగారావు


నాకు కొత్తగా పెళ్ళయింది-అనే కన్నా-నేను కొత్తగా పెళ్ళి చేసుకున్నాను-అనడం సమంజసమేమో!
నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని. గంత ఎప్పుడు బొంతనే వరిస్తుంది అన్న నానుడిని అనుసరించి-అవునండి మరి-డాక్టరు డాక్టరు నే వివాహమాడుతాడు-అయస్కాంత సూత్రం ఇక్కడ వర్తించదు కదా!- ఇక్కడ భిన్న ధృవాలు ఆకర్షించుకోవు. ఏక ధృవాల మధ్యనే ఆకర్షణ-పుట్టుకు రాదు-కలిపించుకుంటాం. అల్లాగే నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని కనుక మరొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్నే మనువాడాను. నాకు ఏభైవేలు జీతం. ఆమెకి ఏభైవేలు జీత్రం. అందువల్ల ప్లస్ ప్లస్ ని చేరితే ధనమే ధనం కదా! ధనధృవాలు మాత్రమే ఆకర్షితమవుతాయి అన్న విపరీత సూత్రాన్ని ఆమె కూడా నాకన్నా ఎక్కువగా నమ్ముతుంది కనుక, "ఒరేయ్, మధ్వాచారీ! మనిద్దరం మనువాడదాం" అంది. నేను మహదానందంగా అంగీకరించాను. ఆ విధంగా నేను, ఆమె ఒకటయ్యాం. ఆమెని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆమె కుముదవల్లి కూతురు నందిని. కుముదవల్లి కూతురని ఎందుకన్నానంటారా? వారి కుటుంబంలో పురుషస్వామ్య వ్యవస్థ మృగ్యం. అంతా స్త్రీస్వామ్య వ్యవస్థే! త్రినాధన్రావు, అదే, కుముదవల్లి భర్త, భార్య కనుసన్నలలో మెలుగుతూ, పత్నియే కదా ప్రత్యక్ష దైవం అని మనస్ఫూర్తిగా భావించి, పొద్దున లేవగానే ఆమె చరణారవిందాలని ముద్దాడి, ఆ తర్వాత తన రోజువారి చర్య ప్రారంభిస్తాడు. ఆ కుముదవల్లి కూతురు నందిని నా సహోద్యోగిని.
మూడు రాత్రులు, ఆషాఢమాసం అన్నిటినీ అధిగమించాక, లలిత లవంగలత, నా నందిని కాపురానికి వచ్చింది. ఆమె కాపురానికి వచ్చిన మొదటి రోజు-ఇద్దరం ఆఫీసు నించి అలసి సొలసి చేరుకున్నాం.
"నందినీ! కాస్త కాఫీరా." అన్నాను అలసటగా
ఆమె చిన్నగా నవ్వి, "ఒరేయ్ మధ్వా! నేను కూడా ఆఫీసులో అలిసిపోయి వచ్చాన్రా. నువ్వే కాఫీ కలిపి, నాకాస్త ఇచ్చి, మిగిలిందంతా నువ్వే జుర్రెయ్యి" అంది.
నేను కంగు తిన్నాను. అయినా అదేమంత పెద్ద పని అని సమాధాన పడి, మైక్రోఓవెన్ సాయంతో ఇన్ స్టెంట్ కాఫీని రెండు కప్పుల్లో పోసి, ఒకటి ఆమెకందించి, రెండోది నేను అందుకున్నాను. ప్రణయ సల్లాపాలతో కాఫీ ఎప్పుడు తాగేశామో నాకే తెలీలేదు.
సరే! తర్వాతా "ఒరేయ్ నందీ! ఇవాళ వంటేం చేస్తున్నావు? అనడిగాను.
ఆమె విచిత్రంగా నాకేసి చూసి, "నేనా? వంటా? పిచ్చి మధ్వా! వంటింటిలోకి ఇంతవరకు అడుగుపెట్టినదాన్ని కాదు నేను. అందుకని ఆ బాధ్యత కూడా నీదేరా" అంది
నేను మళ్ళీ కంగు తిన్నాను. అప్పుడే టి.వి.116 ఛానెల్ లో "నా ఇంటి వంట" కార్యక్రమం వస్తోంటే, దాన్ని ఫాలో అవుతూ వంట చేశాను. ఆ వంట మేము తిన్నామో లేదో పాఠకుల ఊహలకే వదిలేస్తున్నాను. కాని ఆ కార్యక్రమం చూశాక నా ఆకలి కడుపు నకనక మండిపోయింది. అందుకని కార్యక్రమం చివర వాళ్ళీచ్చిన ఫోన్ నంబరు చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళ సిబ్బంది మొత్తం ఒక ఆదివారం మా ఇంటికి విచ్చేశారు. వాళ్ళాకి నేను చెప్పిన "నా ఇంటి వంట" పాఠకుల సౌకర్యార్ధం ఇక్కడ వివరిస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవండి.
"నమస్కారమండి! ఇవాళా మా టి.వి.116 ప్రేక్షకులకి మీరేం వంట చేసి చూపించబోతున్నారు?"
నేను కుండెడు నవ్వు మొహం నిండా పులుముకుని అన్నాను,"ఢమాల్ ఢమాల్ - జమాల్ జమాల్" అండీ!
"ఈ పేరు చాలా విచిత్రంగా వుందే!"
"ప్రిపరేషన్ అంత కన్నా విచిత్రంగా ఉంటుందండీ!"
"అవునాండీ మధ్వగారూ! జనరల్ గా వంటలు ఆడవాళ్ళు చేసి చూపిస్తారు. ఇవాళ డిఫరెంట్ గా మీరేమిటి వంటింట్లో దూరారు?" అని అడిగింది యాంకర్ మొహం ముఫ్ఫై వంకర్లు తిప్పి.
"అవునమ్మా, నేటి ఆధునిక యుగంలో మగాడేమిటి, శక్తిస్వరూపిణి అయిన స్త్రీ ఏమిటి-అందరూ సమానమే. నా భార్య నాతో సమానంగా ఉద్యోగం చేస్తోంది. అందువల్ల గర్భం ధరించటం మినహా మిగిలిన పనులన్నీ ఇద్దరం సమానంగా పంచుకుంటూ ఉంటాం."
"ఓహ్! అమోఘం! మిమ్మల్ని చూసి మా టి.వి.116 ప్రేక్షకులు నేర్చుకోవలసింది చాలా వుంది."
"అవునండీ!"
"సరే, ఇంక ఈ "ఢమాల్ ఢమాల్ - జమాల్ జమాల్" అన్న వంట ఎల్లా తయారు చెయ్యాలో మా ప్రేక్షకులకి వివరిస్తారా?"
"తప్పకుండానండీ! ముందుగా ఒక అరకిలో బొంబాయిరవ్వ తీసుకుని దోరగా వేయించాలి."
"అలాగేనండి"
"చూశారా? దోరగా వేగింది కదా? ఇందులో అరకప్పు మైదా, అరకప్పు శనగపిండి, అరకప్పు వరిపిండి వేసి, అందులో ఆరు కప్పుల నీళ్ళూ పోసి బాగా కలియబెట్టాలి."
"ఓహో, ఉండలు కట్టకుండా బాగా కలియబెట్టాలన్న మాట. ఆ తర్వాత?"
"ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు, వేపాకు రెబ్బలు తగినంతగా వెయ్యాలండీ."
"వేపాకులెందుకండీ?"
"వేపాకు మహాత్మ్యం మీకు తెలీదా? అయితీ ఆయుర్వేద భిషక్ సనారా అప్పన్న గార్ని అడగండి."
"ఆయనెవరండి?"
"ఆయన్నెరగరా? టి.వి.115 లో తెల్లవారుఝామున వచ్చి ఉపన్యాసాలు దంచుతారండీ."
"ఓహో అలాగా?"
"సరి. ఇప్పుడిందులో మెత్తగా పిసికిన చింతపండు కలపండి."
"ఆ తర్వాత?"
"ఇందులో ఆరు నిమ్మకాయలు చెక్కలుగా కోసి, గింజలు పడకుండా ఆ రసం పిండాండి."
"బాగుందండీ, తర్వాత?"
"చూశారా, ఎల్లా తయారయ్యిందో? ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, మిరియాలపొడి, సాంబారు పొడి, రసం పొడి వేసి బాగా కలియబెట్టండి."
"వావ్! చాలా డిఫరెంట్ గా ఉందే? ఆ తర్వాత?"
"అందులో వేయించిన అరకప్పు పెసరపప్పు, అరకప్పు మినప్పప్పు, పావుకప్పు శనగపప్పు, పావుకప్పు పుట్నాలపప్పు కలపండి."
"బాగుందండీ, తర్వాత?"
"అందులో అరకిలో జీడిపప్పు వేయించి, మిక్సీ చేసి, ఆ జీడిపప్పు పొడిని కలపండి."
"వావ్! జీడిపప్పు అంటే నాకు భలే ఇష్టమండీ!"
"ఈ మిశ్రమాన్ని పొంగు వచ్చేదాకా బాగా మరగబెట్టండి."
"వావ్! చాలా గమ్మత్తుగా ఉందండీ. ఇప్పుడేం చెయ్యాలండీ."
"ఇందులో నాలుగు క్యారెట్ ముక్కలు, కొద్దిగా పంచదార కలపండి."
"అరెరే! చాలా గమ్మత్తుగా వుందే? ఊ--- తర్వాత?"
"వేరే ఒక గరిటె తీసుకుని అందులో నూనె పోసి తగినంత వేడి చేసి అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించి ఆ పోపు ఇందులో కలపండి."
"వావ్! నాకు చాలా ఉత్కంఠగా ఉంది. ఆ తర్వాత?"
"ఇందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా కలపండి."
"ఊ... బాగా తయారవుంతోందండీ."
"ఇందులో మిఠాయి రంగు నాలుగు చెంచాలు కలపండి. ఆ తర్వాత చల్లరనివ్వండి.
"మధ్వాగారూ! ఇది చల్లారడానికి కాస్త సమయం పడుతుంది కదా? ఈ లోపుగా మా ప్రేక్షకులకి మీరేమన్నా చిట్కా చెబుతారా?"
"తప్పకుండానండీ. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఒళ్ళూ దురద పెడుతుంది కదండీ?"
"అవునండీ. నాక్కూడా ఆ ప్రబ్ల్లెం వుంది. అయితే ఏం చెయ్యాలండీ?"
"బాగా గోళ్ళూ పెంచుకోండి. ఎక్కడ దురద పెడితే అక్కడ బరా బరా, బర బర బర బరా గోకేసుకోండి. దెబ్బకి దురద తగ్గిపోతుంది."
"హ.హ.హ.. మీరు చాలా హాస్య ప్రియులండీ!"
"హాస్యమా, నా బొందా? దురద పెడితే గోక్కోకుండా దురద తగ్గుతుందండీ?"
"అవును సుమండీ. ఇది మాకెవరికీ తట్టలేదు. ప్రేక్షకులూ! వింటున్నారా? మీకు ఒంటి మీద ఎక్కడైనా దురద పెడితే చక్కగా గోళ్ళూ పెంచుకుని, ఆ దురద పెట్టే చోట బరా బరా, బర బర బర బరా గోకేసుకోండి. అంతే! దెబ్బకి దురద మాయం!"
"నేను హాస్యప్రియుడినన్నారు కదా? ఇంకో చిట్కా కూడా చెప్పమంటారా?"
"అంతకన్నానా? తప్పకుండా చెప్పండి."
"ప్రతి ఇంట్లోనూ దోమల బాధ ఎక్కువగా వుంటోంది కదా?"
"అవునండీ."
"సెంటు రాస్తే దోమలు కుట్టవండీ."
"అరె! ఇది మాకెవరికి ఇంతవరకు తెలీదే? విన్నారా ప్రేక్షకులూ? ఎంత అద్భుతమైన చిట్కాయో! సెంటు రాసుకుంటే దోమలు కుట్టవని మధ్వా గారు చెబుతున్నారు."
"మీరు పొరబాటుగా చెబుతున్నారు. నేను "సెంటు రాసుకుంటే" అని చెప్పలేదు."
"మరి?"
"సెంటు రాస్తే అని చెప్పాను. ప్రతి దోమని జాగ్రత్త పట్టుకుని దాని రెక్కలకి సెంటు రాస్తే అది ఆ సువాసనకి మైమరిచి మనల్ని కుట్టకుండా వెళ్ళిపోతుంది."
"హ.హ.హ! బాగ చెప్పారంద్డీ. సరే. ఇంక ఇది చల్లారినట్టుంది. ఇప్పుడేం చెయ్యాలండీ?"
"చెయ్యడానికేముంది? ఈ గిన్నెలో వున్నదంతా దొడ్లోకి తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పారబోసి, తూర్పు వైపుకి తిరిగి దణ్ణం పెట్టుకుని, ఇంకెప్పుడూ చేతకాని వంట జోలికి పోనని, చెవులు పట్టుకుని, అమ్మ మీద, నాన్న మీద ప్రమాణం చేసి, పెళ్ళాన్ని తీసుకుని, ఏదైనా స్టార్ హోతల్కెళ్ళీ, ఎవరిక్కావలసింది వాళ్ళూ ఆర్డరిచ్చి, హాయిగా తినేసి, బిల్లు మాత్రం ఆవిడ ఇవ్వదు కనుక మనమే ఇచ్చేసి, ఆనక ఇంటికొచ్చేసి, కాస్త భావనల్లం నోట్లోవేసుకుని, ఎందుకంటే, ఆ హోటల్ తిండి సరిగ్గ అరగదు కదా, అందుకని.....
ఆనక ఏ.సి. ఆన్ చేసుకుని, ఆవిడ చీర మార్చుకుని వచ్చేలోపున అర్జంటుగా నిద్రకి ఉపక్రిమించేయ్యాలి. లేకపోతే ఆవిడగారు తీసుకునే క్లాసు వింటే, మరి నిద్రరాదు కదా?

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top