Monday, June 23, 2014

thumbnail

రామానుజులు (భరత లక్ష్మణ శతృఘ్నులు)

రామానుజులు (భరత లక్ష్మణ శతృఘ్నులు)
              -  చెరుకు రామమోహనరావు 
ఆనన గ్రంథ మిత్రులైన వల్లభనేని శ్రీనివాస్  'రామ భారత లక్ష్మణ శతృఘ్నుల 'కూర్చిన ఒక విశ్లేషణ వ్రాయమన్నారు . తెలిసిన కొద్ది లో జ్ఞాపకమున్న బహుకొద్ది తెలిపే ప్రయత్నమూ చేయుచున్నాను . రామాయణమును గూర్చి మునుపు 'రామాయణ ముఖద్వారము'లో  తెలియబరచి యుండినాను . అందువల్ల కాస్త ముందుకు నడుస్తాను. దాసరి తప్పులు దండముతో సరి. రాముడు మానవునిగా జన్మించినాడు. మానవేంద్రునిగా  భాసించినాడు. మానవాతీతుడై మనకు పరమాత్మగా సాక్షాత్కరించినాడు. ఇటువంటి నాయకుని కథావస్తువుగా తీసుకొని మనకు కమనీయ రమణీయ రామాయణ కావ్యమును అందజేసిన వాల్మీకి మహర్షికి సాష్టాంగ దండప్రమాణములు. రాముడు భూమి పైకి ముగ్గురు తమ్ములతో వచ్చినాడు.వారు ఆయనకు స్థూలముగా చూస్తే సహ ఉదరులు(సహోదరులు) కారు. కాకున్నా ఏమిటి  సంబంధం ఎందుకీ అనుబంధం. తండ్రి ఒకడే అయినా వారి తల్లులు వేరే కదా. అట్లాగుచో లక్ష్మణ శతృఘ్నులే  ఏకోదరులు లేక సహోదరులు.ఇరువురు సుమిత్రా గర్భ సంజాతులే. కానీ ఆనలుగురూ ఒకరితోనొకరు సహోదర భావమును కలిగి అత్యంత ప్రేమాభిమానాలతో మెలగుతారు  అట్లు కాక మనకు వేరువిధముగా మనకు రామాయణములో కనిపించరు .అసలు ఈ విషయాన్ని శ్రీ రాముడు బాహిరముగానే వ్యక్తపరచుతాడు. రావణ శక్తిపాతముచేత  లక్ష్మణుడు మూర్ఛిల్లినపుడు రాముడు లక్ష్మనునిపై తనకుగల రాగశోకోద్వేగాము నాపుకోలేక  సుగ్రీవాడులను చూసి ఇట్లు వాపోతాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశేచ బాంధవాః తంతు దేశం నపశ్యామి యాత్ర భ్రాతా సహోదరః  భార్య పోతే మరొక భార్యను చేసుకోవచ్చు . చుట్టాలు కావాలనుకొంటే  ఒకనికి బదులుగా వందమంది లభించుతారు.మరి సహజన్ముని పోగొట్టుకుంటే తిరిగీ ఎదేశములో లభించగలడు. చూడండి తమ్ముడంటే శ్రీరామచంద్రునకు ఎంత అభిమానమో . మరి నేడో! 'అబ్బిగాడు పోతే ఆ పంచగుడ్డ నాదే' అంటారు. ఒక వేళ రాముని వంటి ఆదర్శపురుషులు  మరి నేటికీ వున్నారేమో నాకు తెలియదు. ఆయన లక్ష్మణుని భ్రాత అంటూనే 'సహోదరుడు' అన్నాడు. ఎంత అభిమానమో ఆయనకు తమ్ములంటే. ఒకవిధముగా ఆలోచించితే అందరూ సహోదరులేనేమో అనిపిస్తుంది. పాయసపాత్రే వారిజన్మలకు కారణమైనపుడు వారు ఎకగార్భాజనితులు అన్నా తప్పులేదేమో .ఇంకొక విషయము కూడా మనము గమనించవచ్చు. దేవతలు,ఋషులు ఆయనను రావణ సంహారమునకు భూమిపై పుట్టమన్నపుడు ఇలాగా అంటారు.'దేవా నీవు దశరథుని ముగ్గురు భార్యలలో నాలుగు అంశాలుగా విడిపడి జన్మించ'మంటారు.ఇంకొక విశేషమేమిటంటే  పట్టపు రాణికి పెద్దవాడు ,ఇష్టపు రాణికి  రెండవవాడు కలుగుతారు. మధ్య రాణి మాత్రము పక్షపాతము లేకుండా తన పెద్ద కొడుకును పెద్ద వానికి చిన్న కొడుకును చిన్నవానికి  అండ దండగా వుంచివేస్తుంది. వారు కష్టసుఖాలలో ఆసాంతము ఎంత అన్యోన్యముగా ఉంటారో మనకు తెలిసినదే.రాముల వారు కూడా దేవ ఋషి గణములతో  అలాగే నంటూ ఈమాట చెబుతాడు. కృత్వాత్మానం చతుర్విధం -పితరం రోచయోమాస -తాథా దశరథం నృపం తనను తానూ నాలుగు భాగాలుచేసుకొని దశరథుని తన తండ్రిగా భావించినాడట.అసలు దశరథుడు అంటే పది దిక్కులకూ తన రథాన్ని మరలించగలడంటేఅంటే  ఆయనా విష్ణవంశయే కదా! పైగా 'నావిష్ణుర్  పృథివీ పతిః' అన్నది ఆర్య వాక్కు. ఎటువంటి అన్వయమో గమనించండి. ఆయనకు కలిగిన నాలుగూ విష్ణ్వంశలే  మరియు అన్నిటికీ మూలమా మూలవిరాట్టే .అందుకే ఆ అన్నదమ్ముల నడుమ అయాజమైన అనుబంధము పెనవేసుకొందేమో!  వారి నామకరణములో కూడా ఎంత అర్థముందో చూడండి. . పెద్దవాడు రాముడు. తాను రమిస్తూ లోకాన్ని రమింప జేస్తున్నాడు. ఇపుడాయన చైతన్య రూపుడు. ఇక లక్ష్మణుడు.లక్ష్మమంటే లక్షణము.లక్షము కలవాడు లక్ష్మణుడు.పరమాత్మ లక్షణము ప్రాణశక్తి. చైతన్యరూపుడైన మానవుని స్థితికి హేతువు ప్రాణమే కదా. భరతుడు ఆయన సంకల్పరూపమైన మనశ్శక్తి. ఈ సంకల్పాన్ని వహించేది,నిర్వహించేది చైతన్యము.ఆయన సంకల్పము 'దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ' . కావున తన సంకల్పమును రెండుగా చేసుకొని మొదటిది (మొదటి అంశ) పెద్దవానిగా తాను గ్రహించి రెండవది తన (రెండవ అంశ) తమ్మునికి అప్పగించినాడు.అందువల్ల భరతుడు రాముడు వచ్చువరకు శిష్ట రక్షణ గావించుతూ రాజ్యముతో  నిలచినాడు.  శత్రుఘ్నుడు అంటే శతృ సంహారకుడు.పరమాత్మ తనచేతులలోగలిగిన అయుధ సామాగ్రికి ఈయన అధిపతి. ఆయుధాలు శిష్ట రక్షణకే కదా. శిష్టులను శిక్షించేవారు స్వామికి శతృవులౌతారు. అందువల్ల శిష్ట రక్షణ చేయుచున్న తన సంకల్పముతో  శతృఘ్నుడుండిపోయినాడు.అదికాక మానవునికి అంతఃశతృవులారు. అవి కామ,క్రోధ లోభ,మద, మోహ మాత్సర్యములు . భగవంతుడు ఎల్లపుడూ  వాటిపై విజేతయే కదా.పైగా శిష్ట రక్షణలో దుష్టులు పైబడితే , ఆ శత్రువులను చంపుటకు ఏర్పడినవాడు శత్రుఘ్నుడు. అఖండమైన ఈ రామతత్వానికి ఒక అద్భుతమైన ఉపమానము తెలుపుతారు వాల్మీకి మహర్షి.'సర్వఎవతు తస్యేష్టాశ్చత్వారః  పురుషర్షభా--స్వ శరీరా ద్వినిర్వృత్తాచత్వార ఇవ బాహవః' దశరథునికి ఆ నలుగురూ ఎంత ఇష్టమంటే  వారిని తన మేనినుంది పుట్టిన నాల్గు చేతులుగా వ్చారిని భావించేవాడు.అంటే దసర్తుడు కూడా విష్ణువు అంశే కదా. ఆ మాట ముందే చెప్పుకొన్నాము. 'దశరథు'ని లోని రథ శబ్దము శరీరమునకు అన్వయము.అంటే దశరథుడు , ఆయన నలుగురు పుత్రులు ఒకే విష్ణు స్వరూపమనియే కదా. వైష్ణవులలో ఒక తెగయైన పాంచరాత్రులు విష్ణువుకు నాలుగు వ్యూహాలు వర్ణిస్తారు.1.వాసుదేవ వ్యూహం 2.ప్రద్యుమ్న వ్యూహం  3.సంకర్షణ వ్యూహం  4.అనిరుద్ధ వ్యూహం . ఇందులో ప్రధానమైనది వాసుదేవ వ్యూహము. మిగత మూడూ నిదానికి అంగ భూతములు. వారు వాసుదేవయంటే  పరమాత్ముడనీ ప్రద్యుమ్నుడంటే  మనస్సని, అనిరుద్ధుడంటే ఆహంకారమని, సంకర్షణుడంటే జీవుడని,అర్థము చెబుతారు. నామ స్వారస్యమును బట్టి కూడా మనము ఈ క్రింది విధముగా యోచించ వచ్చు. 'వసతి దివ్యతీతి వాసుదేవః' అంటే సర్వత్రా వసిస్తూ ప్రకాశిస్తూ వున్నా తత్వము పరమాత్మ. మరి మన రాముడంతే కదా! ఇక అనిరుద్ధుడు అంటే నిరుద్ధము అంటే అడ్డగింపు అన్నదే లేనివాడు.న+నిరుద్ధము= అనిరుద్ధము.అంటే ప్రాణము . ఇది ఉన్నంతకాలము 'శరీరి'తో  ఉండవలసినదేకదా! ఈ ప్రాణమే లక్ష్మణుడు.ప్రాణము పోతే శారీరి లేడు. అందుకే 'లక్ష్మణు'ణి తదనంతరము రాముడు లేడు.భూమోపై రాముడు మానవుడనేకదా !వాల్మీకి  మనకు చెబుతూ ,వివరించుతూ వచ్చినది అదేకదా. ఇక ప్రద్యుమనుడు. ద్యుమ్నము అంటే కాంతి,ప్రద్యుమ్నము అంటే విశేషమైన కాంతి.అదే ఆ పరమాత్ముని మనసు. అదే భరతుడు.ఇక సంకర్షణుడు. . కర్షణము అంటే చిలికి వేయుట.అంటే రూపు మాపుట.'సమ్' అంటే శేష రహితముగా అని అర్థము. అంటే శత్రువులను నిశ్శేషముగా నిర్జించేవాడు, ఎవరు, శతృఘ్నుడు.కావున తానూ తన మూడు ఉపాధులతో  సాక్షాత్కరించినాడు పరమాత్మ.  లక్ష్మణునిగా ఆదిశేషుడు,భరతునిగా విష్ణు చక్రము మరియు శంఖమగు పాంచజన్యము శతృఘ్నునిగా జన్మించినారన్న విషయము వాల్మీకి ఋషివర్యులు  చెప్పినట్లు నాకు తెలియదు. ఆపై  రాముడు..ధర్మం
లక్ష్మణుడు..సత్యం
ఆయణం అంటే నడక (రాముడు..నడిచింది..ధర్మము..సత్యము..అనే రెండు..కాళ్లతో..అని సూక్ష్మం.. భరతుడు..భక్తి శతృఘ్నుడు...శక్తి...  అని విన్నట్లు చి.వల్లభనేని శ్రీనివాస్ తెలిపినాడు కానీ ఈ నాలుగు గుణాలూ రామునికి అన్వయమౌతాయి . 'రామో విగ్రహవాన్ ధర్మః' అని వాల్మీకి మహర్షే నుదడివినారు. ' జయత్యతిబలో రామో' అన్నారు వాల్మీకి.' వెంటనే 'లక్ష్మణస్య మహాబలః' . విశ్వామిత్రుని విషయములో రాముని భక్తి, రావణ సంహారములో రాముని శక్తి, మేఘనాదునిపై బాణము వదులు నప్పుడు లక్ష్మణుడు ' ధర్మాత్మా సత్యసంధస్య...' అని రాముని తలచి ఇంద్రజిత్తు పై బాణము వదులుతాడు, దీనినిబట్టి ఆయన సత్యసంధతా అన్నీ మనకు అవగాతమౌతున్నాయి. అంటే పై నాలుగు గుణములు రామునిలో నిబిడీకృతమై వున్నాయి. ఇక ఆయనము అన్న విషయాన్ని గూర్చి విశధముగా ఇంతకు మునుపే వివరించి యున్నాను. పాఠకులు ఆ వ్యాసము చదువ గలరు .  రాముని మనసుగా, భరతుడు,తాను తన మనసులో రాముని రాజుగా నిలుపుకొన్నాడు కానీ వేరే యేమనోవికారము ఆయనలో కన్పట్టదు. ఆయన భక్తి ,శ్రద్ధ , వీర్యము శౌర్యము అన్నీ కలిగినవాడు.ఇక లక్ష్మణుడు ప్రాణము కాబట్టి ఎప్పుడూ యుద్ధములో తానూ ముందుంటానంటాడు అట్లని అన్న గారి మాట అతిక్రమించడు. భరతుడు నందిగ్రామములోనే వుండిపోయినా తల్లుల బాగోగు రాజధానిని కట్టుదిట్టముగా ఉంచుకొనుట మొదలనవి చేస్తూ అన్నివిధాలా అన్న భరతునికి సహకరించిన ధీరుడు శతృఘ్నుడు. లౌకికముగా చూస్తే ఒకే తండ్రి పిల్లలయిన అన్నదమ్ములు మెలగవలసిన విధివిధానములను  మనము నేర్చుకోవలససిన ఆదర్శ మూర్తులు వీరే .   తత్సత్ 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information