దాశరథి సినీగీత - అచ్చంగా తెలుగు
దాశరథి సినీగీత
 - మామిడి హరికృష్ణ
           9908844222
 తెలుగు సినిమా ఓ ఏడురంగుల ఇంధ్రధనుస్సు. దాని ఏడు వర్ణాలలో కథ రచన , నటన, సినిమటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, కళాదర్శకత్వం, అనేవి అరు రంగులైతే ఏడో రంగు మాత్రం ఖచ్చితంగా పాటలదే..! అలాంటి సినిమ పాటలకి  కావ్య గౌరవాన్ని , సాహిత్య ప్రతిపత్తిని తెచ్చి, తరాలకు అతీతంగా ప్రేక్షకుల హృదయ సామ్రాజ్యాలను గెలుచుకున్న కవి – దాశరధి కృష్ణమాచార్య.! సినీ గీతాల పరంగా అయన, రెండు వైపులా పదునున్న కలం. ఆయనకు తన పదాలను బాణాలుగా ఎక్కుపెట్టడం తెలుసు! అలా అక్షరాలా అక్షరాలతోనే ప్రజల హృదయ క్షేత్రాలలో తిరుగులేని స్థానం సాధించిన హాలికుడు - దాశరధి! సాధరణంగా దాశరథి అనగానే సీరియస్ సాహిత్య సృష్టి చేసిన కవిగానే మన మనసులలో ముద్ర వేసుకున్నారు. కానీ సీరియస్ కవిత్వాన్ని ఆయన ఉధృతిలో సృజించాడో అంతే సరదాగానూ , వినోదాత్మకంగనూ సినీ సాహిత్యాన్ని కూడా సృష్టించాడనే చెప్పాలి. అయితే పామరజనరంజకంగా ఉండే సినీ గేయ రచనలో సైతం స్వచ్ఛమైన సాహితీ సొబగులను అద్ది వాటినీ  సామాన్య ప్రేక్షకులకు నిత్యస్మరణ గేయంగా , ప్రాత: రమణీయంగా, నిత్యగాన యోగంగా మలచిన ఘనత దాశరథి కలానిది.! అందుకే ఆయన రాసిన సినిమా పాటలు వినోదం చాటున వికాసాన్ని సరదాల చాటున సత్యాన్ని మబ్బు చాటు  చందమామలా ఆవిష్కరించాయి. ********************************* " రచయిత ఎవరైన తన రచనలలో/ కవిత్వంలో ఎంతో కొంత కనిపిస్తాడు." అనేది సైకాలజిస్టులు చెప్పే మాట. తెలుగు గీత రచనలో తనదైన ముద్రవేసిన దాశరథి రచన విశ్వరూపాన్ని పై మాటల వెలుగులో వైవిధ్యంగా అందించాలని సంకల్పించాను. అందుకని ఈ వ్యాసంలో దశరధి జీవన ప్రస్థాన్నాన్ని , ఆయన సాహితీ కృషినీ ఆయన రాసిన సినీ గీతాలకు అన్వయించి చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే ఆయన " కవిత్వం- జీవితం" లోని సాహితీ విలువలను, పద సౌందర్యాన్ని, భావ చిత్రాలను, జీవన సత్యాసత్యాలను, జీవితరేఖలను , ఆయన రాసిన సినీ గీతాల కళ్లలోంచి తిలకించే ప్రయత్నం చేసాను. కొండను అద్దంలో చూపించే ప్రయత్నం చేసాను. అవధరించండి...   దాశరధి కృష్ణమాచార్య 1925 సంవత్సరం జులై 22 న వరంగల్ జిల్లా గోడూరులో జన్మించారు. ఆనాటి  సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక  ప్రతిబంధకాలను అన్నింటినీ అధిగమించి ఉన్నత విద్య కోసం భోపాల్ యూనివర్శిటీకి వెళ్ళారు. ఉస్మానియా యూనివర్శిటిలో ఇంగ్లీష్ లిటరేచర్ ని అధ్యయనం చేసారు. వెనుకబడిన తెలంగాణా ప్రాంతం నుండి సాహిత్యం మీద ప్రేమతో , అక్షరం పై అభిమానంతో ,జ్ఞానకు మార్గంగా పయనించిన యాత్రికుడు - దాశరథి. ఈ సాహిత్య ప్రయాణంలో పట్టుదలతో ఒక్కో గమ్యాన్నే చేరుకున్న దాశరథి తన మనసును కోవెలగా మలచి, మమతలను మల్లెలుగా చేసి సాహిత్య భారతి మెడలో పాటల హారాన్ని వేశారు.   " ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను ప్రతిరేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపాను" అని అంటూనే.. " నీ  చూపులలో  చూపులతో నీ ఆశలలో ఆశలతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై "  సాహితీ జీవనాన్ని ఆరంభించాడు దాశరథి మాతృదేవత(1969) లో . దాశరథి పాటల్లో మనిషి హృదయం ఎంతగా అవిష్కృతమైందో, భారతీయ కుటుంబ జీవన విలువలు కూడా అంతే హృదయంగమంగా పల్లవించాయి. అదే సమయంలో ఆయన రాసిన పదాల్లో తెలుగు జన జీవనం , కుటుంబ అనుబంధాలు చక్కడా ఒదిగి పోయాయి. ఆయన అక్షరాల్లో " అమ్మ “ఒకనాటి మాట"గానే కాక " మమతల మూట " గా కూడా ఉదాత్తీకరణం చెందింది. తెలుగు సినిమాల్లోని అమ్మ పాటలలో శిఖరాయమై నిలిచింది. " దేవుడలేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు తల్లి ప్రేమ, నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు" అని అమ్మని దేవుని కన్న మిన్నగా చూపించిన దాశరథి, " అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇల వేలుపు అమ్మ ఒక్కటే " అని అమ్మల ఔన్నత్యాన్ని నిర్వేదంగా ప్రకటించాడు. (బుల్లెమ్మ బుల్లోడు 1972) అలాగే , తెలుగు జీవనంలో, భారతీయ సంస్కృతీ సేవనంలో అన్నా చెల్లెళ్ళ అనురాగం విశిష్టమైంది. అ విశిష్టతను చెప్పే తెలుగు సినిమా పాటలతో తలమానికంగా మిగిలిపోయే పాటను కూడా రాసిన ఘనత దాశరథికే దక్కింది. చెల్లి గుండెలలోకి పరకాయ ప్రవేశం చేసి ఈ పాటని రాసాడా అని అనుకునేలా చేసింది.   " అన్న నీ అనురాగం - ఎన్నో జన్మల పుణ్యఫలం" అని మొదలయ్యే  ఈ పాట చెల్లెలి విషయంలో అన్నయ్యల బాధ్యతలని " అన్నలు మీరే నాకన్నులుగా - నన్నే నడిపించాలి తల్లితండ్రి సర్వము మీరై - దయతో దీవించాలి " అని గుర్తుచేసింది. (ఆడపడుచు-)   సినీ గీతాలలో  దాశరథి ఎన్నెన్నో రసానుభూతులను సలలితంగా పదాల పాదాలలో నడియాడేల చేసింది. అయన పదం, వాక్యం, గీతం, గేయం, శ్రోతలను సినీ ప్రేక్షకులను , సాహితీ ప్రేమికులను ఆ పాత మధురమైన అనుభవాన్నీ, ఆలోచనమృతమైన అనుభూతిని అందించాయి. దాశరథి పదం - వసంత వేళల్లో వలపుల ఊయలలూగించి పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడించింది. దాశరథి వాక్యం - దోర వయసు చిన్నదాని జోరులో ఖూషీఖుషీగా నవ్వులనూ, చలాకీ మాటలనూ వినిపించింది. దాశరథి గేయం - ఎక్కడీ దూరాన కూర్చుని మనుషుల తలరాతలు రాస్తున్న దేవుడిని ఘాటుగా ప్రశ్నించింది. అన్నింటికి మించి దాశరథి గీతం – ఏ దివిలో విరిసిన పారిజాతన్నో తెలుగు తెరపై ప్రత్యక్షం చేసింది. " పాల బుగ్గలను లేతసిగ్గులను పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో మాటలడగా రావే..! కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజహంసలా రావే..! " అని తెలుగుసినిమా పాటకు ఉండాల్సిన లక్షణాలని  మానవీకరించి (Anthropomarphise ) చెప్పింది దాశరథి గీతం (కన్నె వయసు- 1973)     5   దాశరథి బహుభాషాకోవిదుడు. ఉర్ధూ భాషలోని కవితాత్మకత, సంస్కృత భాషలోని జ్ఞానసంపద.. ఆంగ్ల సాహిత్యంలోని ఆధునికత.. తెలుగుభాషలోని సామాన్యత.. అన్నీ కలిసి దాశరధిని కవితాపయోనిధిగా మలిచాయి. అంతేగాక కవికీ - కవితకూ మధ్య రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని దాశరథి పాటలలో అన్వయింపజేశారు. " రాధా హృదయం మధవ నీలయం" అయినట్లు ' కవి హృదయం కవితా నిలయంగా' గా మారాల్సిన స్థితిని దాశరథి గీతాం అన్యోపదేశం గా చెప్పింది. " నీ ప్రియ వదనం వికసిత జలజం నీ దరహాసం జాబిలి కిరణం నీ శుభ చరణం  - ఈ రాధకు శరణం" అని వెల్లడించింది. (తులాభారం - 1974) దాశరథి వృత్తి జీవితం ఉపాధ్యాయుడిగా ఆరంభమైంది. ఆ తర్వాత పంచాయితీ ఇన్స్ పెక్టర్ గా  , ఆకాశవాణి ప్రయోక్తగా, బహు పాత్రలను పోషించారు. ఒకదానితో ఒకటీ సంబంధం లేని ఎన్నో సంక్లిష్ట అంశాలను తన సాహితీ వ్యవసాయంలో ఒక్కటిగా చేశాడు. మనిషి మనసులొని అంతరంగాలను ,పదాలదారాలతో ఒకటిగా చేసి నింగి నేలను కలిపే సాహిత్య సృష్టికి శ్రీకారం చుట్టారు. అపుడు " మమతలు వలపుల పూలై విరుస్తాయని" చెపుతూ నీవు- నేను అనే భేదభావం తొలిగి పోతుందని " హృదయాలు జతచేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే నీవేనేనులే....నేనే నీవులే" అన్న ఏకత్వ భావన వెల్లివిరుస్తుందని చెబుతూ చివరికి " అధరాల  మెదిలింది నీదే నామము కనులందు కదిలింది నీదే రూపము" అని ద్వైధీ భావనలో చెరిగిపోయిన సంగమ స్థితి సంభవిస్తుందని ప్రకటించారు. (పూజ - 1979)   (2 వ భాగం వచ్చే సంచికలో...)    

No comments:

Post a Comment

Pages