వినదగునెవ్వరు చెప్పిన : పెయ్యేటి రంగారావు - అచ్చంగా తెలుగు

వినదగునెవ్వరు చెప్పిన : పెయ్యేటి రంగారావు

Share This
వినదగునెవ్వరు చెప్పిన
పెయ్యేటి రంగారావు

కలియుగంలో యోగానికి, యాగానికి, జపానికి, తపానికి సావకాశాలు సన్నగిల్లుతున్నాయి.  అందువల్ల మానవులకి తరించడానికి ఏకైక సులభమార్గం రామనామ జపం.  నిత్యం ఏ పని చేసుకుంటున్నా, రోడ్డు మీద నడిచి వెళ్తున్నా రామనామ జపం చేసుకోవడం చాలా మంచిది.
అడవుల వెంబడి, పర్వతాల వెంబడి తిరిగి ప్రయాస పడినందువల్ల ముక్తి లభించదు.  ముందు మనస్సుని నిశ్చలం చేసుకో్వాలి.  మనసుని జయించిన వాడు ఇహాన్ని పరాన్ని కూడా సాధించగలడు.
జిహ్వచాపల్యం వల్ల మనసుకి నిలకడ వుండదు.  జిహ్వచాపల్యాన్ని చంపుకోవాలి.  అప్పుడు మనసు అదుపులోకి వస్తుంది.  అందుకే తరచుగా ఉపవాసం ఉండడం చాలా మంచిది.
ఉన్నంతలో కొంతభాగం దానధర్మాలకి కేటాయించాలి.  దానం చేసేటప్పుడు పాత్రాపాత్రతలు చూడడం కూడా అనవసరమే.  మన విధి దానం చేయడం.  అంతే.  అంతవరకే మనం ఆలోచించాలి, ఆచరించాలి.  బిచ్చగాడు కుంటివాడా కాదా, అతడికి బిచ్చమెత్తుకునే అవసరం వుందా లేదా - ఇన్ని ఆలోచనలు అనవసరం.
పుట్టుకతో సంక్రమించిన గొప్పతనానికి మూర్ఖులు అహంకరిస్తారు.  తనది ఉత్తమమైన బ్రాహ్మణకులం అనో, రజోగుణ ప్రధానమైన క్షత్రియకులమనో, తాను ధనికుల కుటుంబంలో జన్మించినందువల్ల అందరికన్నా ఉత్తముడిననో భ్రమించి అహంకారాన్ని ప్రదర్శించడం మూర్ఖత్వం.  మురికి చుట్టూ కీటకాలు ముసురుకున్నట్లు మూర్ఖులు అటువంటి భ్రమను చుట్టుతూ, ఆ భ్రమలోనే బ్రతుకును వ్యర్థం చేసుకుంటారు.  అహం అన్ని అనర్థాలకు మూలం.  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించింది కూడా ఇదే.
అన్నం తినేటప్పుడు, ఒకే కుటుంబంలోని సభ్యులైనా ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ తింటారు.  ఐనా ఒకరు ఎక్కువ తినేసారని, మరొకరు తక్కువ తిన్నారని ఎవరూ బాధ పడరు కదా!  అలాగే ఒక తల్లి బిడ్డలలో, ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కువ తక్కువల గురించి ఎందుకు విచారించాలి?  ఇచ్చేది, ఇవ్వవలసినది భగవంతుడు.  అందిన దానితో అందరూ తృప్తి పడాలి.  అత్యాశ పనికిరాదు.  మనసు అదుపులో వున్ననాడు ఆశలు కలగవు.
దూరం దగ్గరతనాన్ని, దగ్గరతనం దూరాన్ని కలిగిస్తుంది.  ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయభేదాలు వస్తుండడం సహజం.  ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనైతే ఇది మరీ తప్పనిసరి.  ఎందుకంటే ఇద్దరూ వారి వారి దృక్పథాలతో ఆలోచించి, తమ సంసారాన్ని తీర్చి దిద్దాలని ప్రయత్నం చేస్తారు.  ఆశయం ఒకటే ఐనా, కార్యాచరాణవిధానం వేరు కావడం వలన పొరపొచ్చాలు వస్తూ వుంటాయి.  హాల్లో సోఫా ఎక్కడ పెట్టాలి అన్న చిన్న చిన్న విషయాల దగ్గరనుంచి పెద్ద పెద్ద విషయాల దాకా అభిప్రాయభేదాలు రావచ్చు.  అప్పుడే ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించి, రాజీ పడి సంసారంలో రాగాలు పండించుకోవాలి.  జీవితమంటే రాజాలా బ్రతకడం కాదు, రాజీ పడి బ్రతకడం.  ఇది ఇంటా బయటా, పనిచేసే కార్యాలయాలలోను, అన్ని చోట్లా, అన్ని వేళలా వర్తిస్తుంది.
' చంకలో పిల్లనుంచుకుని ఊరంతా వెతికినట్టు ' అన్న సామెత మనం తరచుగా వింటూ, అంటూ, నవ్వుకుంటూ వుంటాము.  కాని మన విషయంలో ఈ సామెత అక్షరాలా వర్తిస్తున్నదనే విషయాన్ని గమనించలేక పోతున్నాం.  పరమాత్మను వెదకడం కోసం అరణ్యాలు, పర్వతాలు పట్టి పోతున్నాం.  కాని ఆ పరమాత్మ మనలోనే వున్నాడని, జీవాత్మకు, పరమాత్మకు భేదం లేదని మనం గ్రహించలేకపోతున్నాం.
ఏదో నాకు తోచిన విషయాలు వ్రాసాను.  విజ్ఞులైన పాఠకులు హంసల మాదిరి క్షీరాన్ని గ్రహించి, నీటిని వదిలి వెయ్యమని కోరుతున్నాను.
******************

No comments:

Post a Comment

Pages