మనసారా అభినందించండి... - అచ్చంగా తెలుగు

మనసారా అభినందించండి...

Share This
ఈ రోజు మీరు ఈ పత్రిక చదవగలుగుతున్నారు అంటే, దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. మేధో మధనంతో రచనలు అందించే రచయతలు, చక్కటి బొమ్మలు వేసి ఇచ్చే నగేంద్ర గారు, ఇతర ఆర్టిస్ట్ లు, కార్టూనిస్ట్ లు, వెబ్ సహకారం అందించే శ్రీకాంత్, స్లైడ్స్ అవీ చేసి ఇచ్చే పరవస్తు సూరి...
వీరు అందరితో పాటు కనిపించని కొన్ని చేతులు ఎంతో సహకారం అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ టైపింగ్ సాయం అందించిన కాట్రగడ్డ భారతి గారు, చెరువు దుర్గ, నూతులపాటి ఉషారాణి గారు, వాసుదేవ రావు గారు, కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు.... వీరందరితో పాటు, ఎప్పుడు అడిగినా, ప్రూఫ్ చదివి, చక్కగా తప్పులు దిద్ది ఇచ్చే ఈవని కమల గారు. వీరంతా భాష మీద, నా మీద, అభిమానంతో ఉచితంగా సహకరిస్తున్న వారే !ఇన్ని చేతులు, మేధస్సులు, రంగులు కలిస్తేనే పత్రిక వస్తోంది.
పూర్తిగా ఒక నెల కష్టం... పిన్నలూ, పెద్దలూ అందరినీ ఒక త్రాటి పైకి తెచ్చి, యెంత మంది రచనలు సేకరించాలి, ఎన్ని బొమ్మలు వేయించాలి, యెంత నాణ్యమైన, ఆసక్తికరమైన విషయాలు అందించాలి, వీటన్నింటికీ యెంత సమయం కేటాయించాలి...   వీటి వెనుక యెంత కష్టం దాగుందో, వీటన్నింటికీ యెంత సమయం కావాలో ఆలోచించండి.... మరి ఇంత ప్రయత్నానికి, మీరిచ్చే చిన్న ప్రోత్సాహం యెంత ఉత్సాహం ఇస్తుందో ఆలోచించండి...
చిన్న మెప్పు, చిన్న మన్నన, చిన్న అభినందన కళను కొత్త పుంతలు త్రొక్కిస్తుంది... అయితే, ఈ చిన్న పనులకు చాలా పెద్ద మనసు కావాలి. అంతటి సహృదయంతో మీకు నచ్చిన ప్రతీ అంశాన్ని మనసారా అభినందించండి, కళాకారులకు, పత్రిక ఎదుగుదలకు మీ సహకారం అందించండి. మీ వ్యాపార ప్రకటనల ద్వారా పత్రికకు ఆర్ధిక చేయూత అందించండి.
పత్రిక పనుల్లో సహకరిస్తున్న ఇందరు మహానుభావులకు, సవినయ నమస్కారాలతో, మీ ప్రోత్సాహానికై ఎదురుచూస్తూ ...
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages