శ్రీధర మాధురి - 3 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 3

Share This
శ్రీధర మాధురి - 3
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)

భార్యాభర్తల సంబంధం ఎంతో పవిత్రమైనదని, ఏ ఇతర అనుబంధాలు దానికి సాటిరావని చెప్తారు పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురుజి. మరి గురూజి అమృత వాక్కులను చదువుదామా...   మీరు మీ అమ్మకు లేక నాన్నకు విడాకులు ఇవ్వలేరు... మీరు మీ అన్నదమ్ములకు లేక అక్కచెల్లెళ్ళకు విడాకులు ఇవ్వలేరు... కాని, భార్యాభర్తల విషయంలో విడాకులు సాధ్యమే.... ఇతర సంబంధాలు శాశ్వతంగా నిలచిపోతాయని తెలుస్తోంది... కేవలం భార్యాభర్తల సంబంధాన్నే విడదియ్యవచ్చు ... ఎందుకని ?   

 జీవితంలో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మొట్టమొదటి రోజు నుండి అమ్మ, నాన్న, మనం నేర్చుకునేందుకు సహకరించారు. తర్వాత అక్కచెల్లెళ్ళు, చుట్టాలు, స్నేహితులు, టీచర్లు, ప్రొఫెసర్లు, పాలవాడు, ఆటో డ్రైవర్, భార్య, భర్త, ఆఫీస్ లో బాస్, సహోద్యోగులు... ఇలా ఎందరినుండో నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా మీరు చాలా విషయాలు ప్రకృతి నుంచి నేర్చుకుంటారు. అవన్నీ ఏమిటనుకుంటున్నారు ? కేవలం దత్త స్వరూపాలు. మనం ఆహ్వానించకుండానే దత్తుడు మనతో ఉన్నాడు. అంతా దైవానుగ్రహం, దయ.   

 మీరు మీ కోసం జీవించి, తర్వాత ఇతరుల కోసం జీవిస్తారు. మీరు మీ జీవితంలో సంతోషంగా లేకపోతే ఖచ్చితంగా ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. అందుకే ముందుగా మీ జీవితంపై, మీ కుటుంబంపై దృష్టిని కేంద్రీకరించి, దానిలో శాంతిని సాధించండి. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. వేరెవరినీ మీ దుఃఖానికి కారకులుగా మీరు నిందించలేరు. నా భార్య సరిగ్గా లేదనీ, నా భర్త సరిగ్గా లేరని, మా అత్త నన్ను వేధిస్తోందని, మీరు అనలేరు. కొందరు ఇండియా కి తిరిగి వస్తే, ఈ సమస్యలన్నీ వస్తాయని, బంధువులు ఇబ్బందులు సృష్టిస్తారని, భావిస్తూ ఉంటారు. ఇదంతా మీ దృక్పధం మాత్రమే ! ఇది మీరు బలహీనులని, మీరు పరిస్థితులను తప్పుకు తిరగేందుకు మార్గాలను అన్వేషిస్తున్నరనీ సూచిస్తుంది. 

ఒక వ్యక్తి ఆనందం డబ్బుపై, లేక ఇతరులు తన గురించి చెప్పే వాటిపై ఆధారపడి ఉండదు. ఇది కేవలం ఉల్లాసంగా జీవించడానికే కాని, ఇతరుల వ్యాఖ్యలను లెక్క చెయ్యడం గురించి కాదు. మెదడుకు ప్రాముఖ్యత ఇవ్వకండి, మనసుకు ఇచ్చి, ప్రకృతిని పూర్తి స్థాయిలో ఆస్వాదించండి. మీరు ఆనందంగా ఉండకపోవడానికి కారణాలు చెప్పకండి. అది మీ ప్రాధమిక బాధ్యత.   భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, స్పష్టత ఉంటే, అత్తమామలు వాళ్ళను ఎలా విడదియ్యగలుగుతారు ? ఒకవేళ అవగాహన లేకుంటే, ఏ కుక్కైనా వారిని తేలిగ్గా విడదియ్యగలదు.   

భార్య – మీ అమ్మ నన్ను వేధిస్తోంది. భర్త – పట్టించుకోకు. భార్య – నేను పట్టించుకోకుండా ఉండలేక పోతున్నాను. భర్త – నేను నీకు సులభ మార్గాన్ని చెప్పాను. మనం జీవితంలో ఎదిగే కొద్దీ విస్మరించడం నేర్చుకోవాలి. మనం పోటీ పడుతూ ఉండలేము. వయసు వచ్చే కొద్దీ అంతా ఇదే చేస్తూ ఉంటారు, కొద్ది మంది అతి జాగ్రత్తపరులు తప్ప !ఏదో అభద్రతా భావం వల్ల ఇలా జరుగుతుంది. 70 లేక 80 ఏళ్ళ వయసులో వాళ్ళు మారతారని నువ్వు ఆశించలేవు. నువ్వు చిన్న దానివి, తేలిగ్గా విస్మరించాగలవు. నువ్వెలా ఉండాలంటే, ఆమె అనేవన్నీ నీ చెవుల్లోకి వెళ్ళకూడదు. ఆ వ్యక్తి మాటల్ని అలక్ష్యం చెయ్యి, కానీ వ్యక్తిని కాదు. అటువంటి వారికి సాయం అవసరం. వారు రోగి వంటివారు. కాబట్టి, నువ్వు విస్మరించడం నేర్చుకుని ఎదుగు. నువ్వు అత్తవైనప్పుడు ఇదంతా నిరోధించేలాగా జాగ్రత్త వహించు. ఇది నేర్చుకునేందుకు గొప్ప అవకాశం. ఎలా ఉండకూడదో చెప్తుంది. అప్రమత్తంగా ఉండి, నేర్చుకుని, ఎదుగు. అంతా దైవానుగ్రహం, ఆనందంగా ఉండు.   

 మీరెల్లప్పుడూ ఇంటిని ఆఫీస్ కు, ఆఫీస్ ను ఇంటికీ తెస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ‘వర్క్ ఫ్రం హోం’ కూడా ఉంది. ఆఫీస్ వ్యక్తిగతం కాదు, ఇల్లు మీ వ్యక్తిగతం. చాలా సార్లు మీరు ఒత్తిడికి ఎందుకు గురౌతారంటే, మీరు ఆఫీస్ లోని సమస్యల్ని ఇంటి దాకా తెస్తారు. మీ ఆఫీస్ లో సమస్యల్ని అక్కడే వదిలి, మీరు ఇంటికి రావాలి. ఈ పరిస్థితుల్లో మీ ఆశయాలు, లక్ష్యాలు, అహం, అన్నీ తెచ్చి మీ కుటుంబంతో పంచుకుంటారు. దాని వల్ల కుటుంబ సభ్యులు ఒత్తిడికి లోనౌతారు. ఇంట్లో సాధారణంగా చెప్పే కొన్ని విషయాలు...
  1. ఆఫీస్ లో రేపు ఏమి జరుగుతుందో నాకు తెలీదు.
  2. ఆఫీస్ లో నేను ఎన్ని సమస్యలను ఎదుర్కుంటానో నువ్వు అర్ధం చేసుకోలేవు.
  3. నా బాస్ నా పై అసంతృప్తిగా ఉన్నాడు.
  4. నా సహోద్యోగులు నమ్మదగ్గ వారు కాదు.
  5. నేను నా లక్ష్యాలను చేరుకుంటానో లేదో తెలీదు.
  6. నా ఉద్యోగం తీసేస్తారేమో !
  7. నీ పని సులభం కాని, నా పని చాలా కష్టం.
  8. నా అప్పులు నేను ఎలా కడతానో తెలియట్లేదు.
  9. త్వరలోనే నాకు బదిలీ అవ్వచ్చు.
అసలు సమస్య ఏమిటంటే, మీకు ఏది వ్యక్తిగతమో, ఏది కాదో తెలీదు. కనుక మీరు రెంటినీ కలిపేసి, ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు.   దైవానికి భయపడకండి. ఆయనే అన్నీ! హృదయపూర్వకంగా ఆయన్ను ప్రేమించండి. మీరు ఆయనకు భయపడితే, ఆయన్ను ప్రేమించలేరు. ఆయన మీ తల్లి, తండ్రి, భార్య, భర్త, సోదరుడు, సోదరి, ప్రేమికుడు, స్నేహితుడు, బాస్, నాయకుడు, పక్కింటివాడు... ఈ జాబితా అనంతమైనది. ఏదైనా ఆయనే, అన్నీ ఆయనే! ఆయన్ను కౌగిలించుకోండి, ముద్దు పెట్టుకోండి. ఆయన పట్ల మీ ప్రేమను పూర్తిగా చూపండి. ఆయనలో కరిగిపొండి, ఆయనలో కలిసిపోండి. ఆయన అంతటా ఉన్నారు. ఆఫీస్ లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. గుళ్ళో ఉన్నారు, క్లబ్ లో ఉన్నారు, తోటలో ఉన్నారు. ఆయన మీతో బస్సు లో, కారులో, విమానంలో ప్రయాణిస్తారు. ఆయన మీ సేవకుడు, మరియు నిస్సందేహంగా ఆయన మీ గురువు, రక్షకుడు. ఆయన్ను అంతటా చూడండి, అన్నింటా చూడండి. అన్నిట్లోనూ ఆయన్ను అనుభూతి చెందండి. ఆయన్ను త్రాగండి, తినండి, వాసన చూడండి. దేనిలోనూ ఆయన లేని వెలితిని పొందకండి. మీరిలా ఒకసారి చెయ్యడం మొదలు పెట్టగానే ఆయన మీతో పూర్తిగా అనుసంధానమై నాట్యం చేస్తారు. దైవాన్ని ఆరాధించండి, దైవాన్ని ప్రార్ధించండి, అంతా దైవానుగ్రహం.   

 ఆమె – నా భర్త ఓ త్రాగుబోతు. అతను గత 22 ఏళ్ళుగా నన్ను వేధిస్తున్నాడు. కొన్ని సార్లు నాకు పారిపోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు రాత్రి 12.30 అవుతోంది. అయినా అతను ఇంటికి రాలేదు. వచ్చేసరికి పూర్తిగా త్రాగి ఉంటాడు. నాకు అతన్నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తోంది గురూజి... నేను – ఇది ప్రసవ వైరాగ్యమా ? శ్మాశాన వైరాగ్యమా? ఆమె – నాకు వైరాగ్యం లేదు. నేను – అయితే ఇది సాధ్యం కాదు. ఆమె- దయుంచి చెప్పండి, నేను విముక్తి పొందాలనుకుంటున్నాను. నేను- గుడ్డు తినాలంటే నువ్వు పైనున్న పెంకును పగలకోట్టాల్సిందే ! ఈ ఉదాహరణ ఒక శాడిస్ట్(పరపీడన) మరియు మసోచిస్ట్ (స్వపీడన )నిరతికి ఉదాహరణ. భర్త శాడిస్ట్, భార్య మాసోచిస్ట్ . ఒక చక్కటి జంట. అతను బాధించడాన్ని, ఆమె బాధింపబడడాన్నీ ఇష్టపడతారు. ఏ ఇద్దరు శాడిస్ట్ లు లేక మాసోచిస్ట్ లు ఒక బంధంలో ఇమడ లేరు. ఇదిలా సాగుతూనే ఉంటుంది. నిజానికి అతనిలా చెయ్యడం మానేస్తే ఆమెకు బోర్ కొట్టి, నిరాశకు గురౌతుంది. మనం ఇటువంటి జంటల్ని చూస్తూనే ఉంటాం. ఒక స్థాయి తర్వాత వారు క్రూరత్వాన్ని ఆస్వాదిస్తారు, దానికి అలవాటు పడతారు. కాని మామూలు ప్రజలకు ఇది తప్పుగా అనిపిస్తుంది. అంతా దైవేచ్చ !   

 భార్య – గురూజి, నిన్న నా భర్త నాపై అరిచాడు. నేను – అతన్ని రోజంతా మొరగనివ్వు , రాత్రికి అలసి కుక్కలా పడుంటాడు.  

 భర్త కాముకుడు. భార్య అతన్ని భరిస్తూ వస్తోంది. అత్త మామలు కూడా అతని పక్షమే ! ఆమె చాలా బాధలు పడింది. ఇప్పుడతనికి HIV సోకింది. అయినా, భార్య అతన్ని విడిచి వెళ్ళలేదు. అతడు కాముకుడని తెలిసాకా, ఆమె అతన్నుంచి ఎటువంటి ప్రేమను ఆశించలేదు. ఆమె తన ధర్మం నిర్వర్తిస్తుంది. ఇంకా అతన్ని గౌరవించి, అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి స్త్రీలను చూస్తున్నాము. ఆమె నడవడి నన్ను కదిలించి వేసింది.   

 భార్య ఇతరులతో తన అనుబంధాన్ని గురించి చెప్పే వాటన్నింటికీ భర్త స్పందిస్తే, అతను ఇరుకున పడతాడు. అలాగే భర్త చేప్పే వాటన్నింటికీ భార్య స్పందిస్తే, ఆమె పిచ్చిదౌతుంది. మీ భాగస్వామి ఏదైనా చెప్పినప్పుడు, సానుభూతితో విని, కొన్ని మాటలతో ఓదార్చండి. స్వాభావికంగా అందరూ పక్షపాతులే ! వారి మాటల్ని మీరు నిజాలుగా భావించకండి. వారికి అనుకూలమైన వాటినే ఎత్తి చూపుతారు తప్ప, నిజాలను కాదు. కాబట్టి, వారనేదానిపై మీ ప్రతిక్రియ ఆధారపడకూడదు. మీరు వింటున్నట్లు గానే అభినయించండి, అది మితి మీరగానే ఆ చెత్తంతా చెత్త బుట్టలోకి వెళ్ళేలా జాగ్రత్త తీసుకోండి. మీ మనసుని మలినం కానివ్వకండి.   

 మీ భర్త లేక భార్యను గురించి ఇతరులతో చెప్పడం కాని, ఆరా తియ్యడం కాని చెయ్యకండి. ఇది చాలా ప్రమాదకరం. మీ బంధాన్ని నాశనం చేస్తుంది. ఎవరైనా మీ భర్త లేక భార్యను గురించి అమర్యాదగా మాట్లాడితే, గౌరవంగా వారికి బయటి దారి చూపండి. వారిని ప్రోత్సహించకండి. కొంత మంది పనిలేని వారు ఉంటారు. వాళ్ళు భార్యాభర్తల మధ్య అశాంతిని రేపెందుకే పొంచి ఉంటారు. ఇటువంటి వారు ఉన్మాదులు, మానసిక దుర్బలులు. భార్యా భర్తల బంధం ఎంతో స్వచ్చమైనది, ప్రేమ ద్వారా జనించేది. ఇటువంటి దేనికైనా తెగించే అన్యాయపు వ్యక్తుల వల్ల మీ శాంతిని కోల్పోకండి. అంతేకాక, మీ వ్యక్తగత జీవిత విషయాల్ని ఇతరులతో చర్చించడం చాలా అనుచితం. మీరు ఇలా చేసి, వివాహం యొక్క పవిత్రతను గౌరవించట్లేదు. ఇది తెలుసుకుని, జాగ్రత్త పడండి.  

No comments:

Post a Comment

Pages