విలక్షణ ‘స్పూర్తి’ – కార్టూనిస్ట్ ‘సత్యమూర్తి’ Vilakshana Spurthy - అచ్చంగా తెలుగు

విలక్షణ ‘స్పూర్తి’ – కార్టూనిస్ట్ ‘సత్యమూర్తి’ Vilakshana Spurthy

Share This
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది...’ పరిమళించడమే కాదు, తన నవ్యతతో, సుగంధంతో ఎన్నో మనసులను ఆకట్టుకుని, ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అటువంటి విలక్షణమైన మనస్తత్వం కలిగి, ఎన్నో అవరోధాలను సంకల్ప బలంతో అధిగమించి, కార్టూన్ రంగంలో, డిజైనింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆదర్శమూర్తి శ్రీ బి.వి.సత్యమూర్తి గారు. car21931 జనవరి 1వ తేదీన రావుసాహెబ్ భావరాజు సత్యనారాయణ, వెంకాయమ్మ గార్ల కుమారుడిగా జన్మించారు. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్( B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(LLB)పూర్తి చేశారు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి ,హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ అభ్యసించారు. 1958లో లా కాలేజీ విద్యార్ధిగా ఉన్నప్పుడే ‘సత్యమూర్తి’ అనే పేరుతో కార్టూన్లు వెయ్యటం మొదలుపెట్టారు. ‘బాపు’ గారికి వీరాభిమాని అయిన సత్యమూర్తి గారు, ఆయన వల్ల ప్రభావితులయ్యి, తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. కార్టూన్ రంగంలో బాపు గారి తర్వాత చెప్పుకోదగ్గ సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్ గా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శిల్పం చెక్కినట్లు తీరుగా ఉండే చక్కటి బొమ్మలు, ఆ బొమ్మలకు సందర్భానుసారంగా స్వదస్తూరితో రాసిన వ్యాఖ్యలు చదువరులను ఇట్టే ఆకట్టుకునేవి. ‘బాల’ పత్రికలో రేడియో అన్నయ్య శ్రీ న్యాయపతి రాఘవరావు గారు మొదట్లో వీరి చేత బొమ్మలు, అట్టమీది బొమ్మలు , బొమ్మల కధలు వేయించేవారు. ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ లో ఆయన సృష్టించిన ‘చదువుల్రావ్ ‘, ‘అల్లాటప్పయ్య’ అనే పాత్రలను తెలుగు పాఠకులు ఎప్పటికీ మరువలేరు. అప్పట్లో పత్రిక రాగానే మొదట సత్యమూర్తి గారి ‘చదువుల్రావ్ ‘ చదివాకే మిగతావి చదివేవారట! ఆ కార్టూన్లు కత్తిరించి దాచుకునేవారట ! తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో కార్టూన్లకు ముఖచిత్రాల స్థాయి(ఆంధ్ర పత్రిక ) కల్పించి, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతా 23 సంవత్సరాల పిన్న వయసులోనే సాధించారు సత్యమూర్తి గారు. chaduvulaవిజయానికి రెండు మార్గాలు అంటారు ... ఒకటి మార్గం కోసం వేచి ఉండడం, రెండు తన మార్గాన్ని తనే ఏర్పరచుకోవడం. రెండొవ పద్ధతికి ఎంతో తెగువ కావాలి. ఇబ్బందులను, సవాళ్ళను ఎదుర్కోవాలి. అలా తన కోసం పని వెతుక్కోకుండా, తన మార్గాన్ని తనే ఏర్పరచుకున్నారు సత్యమూర్తి గారు. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లో కొన్నాళ్ళు పనిచేసి, అక్కడి అసౌకర్య వాతావరణంలో ఇమడలేక, స్వతంత్రంగా, శ్రీ సత్యసాయి బాబా దీవెనలతో ‘శ్రీ సత్యసాయి డిజైనింగ్ స్టూడియో’ ను ప్రారంభించారు సత్యమూర్తి గారు. ఏ పని ఆరంభించిన ఎల్లలెరుగని సృజన, పని విషయంలో దీక్ష, నాణ్యత విషయంలో రాజీపడని కృషి, ఆయనకే సొంతం. కమర్షియల్ స్థాయిలో వ్యాపార ప్రకటనల్లో కార్టూన్లు, కవర్ ఫోటోలు, కంపెనీ లకు లోగోలు, ఇలస్త్రేషన్ లు, తయారుచేసారు. కార్టూన్లను క్యాలెండరులలో మొదట ప్రవేశపెట్టారు. అనేక తెలుగు సినిమాలకు పోస్టర్లు, టైటిల్స్, ప్రెస్ ఆడ్స్ డిజైన్ చేసారు. పని పట్ల ఆయనకున్న ఏకాగ్రత , శ్రద్ధ ఆయన్ను డిజైనింగ్ రంగంలో శిఖర స్థాయికి చేర్చాయి. అయితే, ఊహించని మలుపులు ఎదురవ్వడమే జీవితం ! 1984 లో జరిగిన ఒక సర్జరీ లోని పొరపాటు వల్ల, ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన చిన్న గీత కూడా గియ్యలేక పోయేవారు. ఆరు నెలలు కష్టపడ్డాకా, తిరిగి గీతలు, చిన్న చిన్న బొమ్మలు గియ్యడం ఆరంభించి, ఫిజియో థెరపీ తో మళ్ళీ మామూలు స్థితికి వచ్చారు. స్వాధీనంలోకి రాని చేతిని మళ్ళీ అధీనంలోకి తెచ్చుకోవడానికి పట్టుదలగా కృషి చేసి, మళ్ళీ తన ప్రస్థానం ఆరంభించారు. భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసారు. సనాతన సారధి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్ లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశారు. బాబా చెప్పిన కధల ఆధారంగా చిన్న కధలను బొమ్మలతో వేసి, పది సంపుటాలు ప్రచురించారు. ఇప్పటికీ సనాతన సారధిలో ఆయన బొమ్మల నీతి కధలు వస్తుంటాయి. cover sat2ఆయన కృషి , మొక్కవోని దీక్ష ఆయనకు అనేక బహుమతులు, అవార్డులు తెచ్చిపెట్టాయి. ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కార బహుమతి(1977), మంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం(1982), వంశీ బర్క్‌లీ వారి ఉత్తమ కార్టూనిస్ట్ బహుమతి(1986), ఢిల్లీ తెలుగు సంఘంవారి 24వ వార్షికొత్సవ బహుమతి(2002), ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారి బహుమతి(2002) అందుకున్నారు. కళాకారుడికి విశ్రాంతి, తృప్తి లేదు, పొగడ్తలతో కడుపు నింపుకుంటే ఎదగలేమని ఆయన అంటారు. కళతో పాటు మంచి మనసు ఉండడం అనేది చాలా అరుదైన విషయం. ఆంధ్రభూమిలో వీరు రాసిన ‘కార్టూన్లు వెయ్యడం ఎలా?’ అన్న శీర్షిక పుస్తక రూపంలో వచ్చింది. ఎంతో మంది కొత్త కార్టూనిస్ట్ లకు బొమ్మలు వేసి చూపించి, వర్క్ షాప్ లలో తగిన సూచనలిచ్చి, నాణ్యమైన కొత్త పాళీలు ఉచితంగా బహుకరించి, ప్రోత్సహించి, తీర్చిదిద్దేవారు సత్యమూర్తి గారు. అలా ఎందరో కార్టూనిస్ట్ లకు ఆదర్శంగా నిలిచారు. 75 వసంతాల స్నేహశీలి, నిగర్వి, నిరాడంబరులు, మృదుస్వభావి సత్యమూర్తి గారు. ఇప్పటికీ రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా కార్టూన్లు గీస్తూ ఉంటారు. అలుపెరుగని ఆయన ప్రస్థానంలో ఆయన మనకిచ్చే సందేశం... జీవితంలోని ఆటుపోట్లకు కృంగి పోయి మూల కూర్చోకుండా, సంకల్ప బలంతో, కృషితో మళ్ళీ మామూలు స్థితికి వచ్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడు విధి సైతం మనకు తల ఒగ్గుతుంది. తన విశిష్ట శైలితో, కృషితో కార్టూన్ రంగంలో ధృవతార లా వెలిగే సత్యమూర్తి గారి జీవన విధానం ఆదర్శవంతం, అనుసరణీయం!

No comments:

Post a Comment

Pages