మెషీన్ (భావి భారత అత్తలకు మాత్రమే..!) - అచ్చంగా తెలుగు

మెషీన్ (భావి భారత అత్తలకు మాత్రమే..!)

Share This
మెషీన్ (భావి భారత అత్తలకు మాత్రమే..!)
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

తొలి కోడి కూయక మునుపే.. టక....టక...టక..టక తలుపు చప్పుడు లీలగా వినిపిస్తోంది". "అమ్మాయ్ లే..! తెల్లారిపోయింది" అత్త పిలుపుతో ఉలికిపడి లేచి, దుప్పటి తొలిగించి, చీర సవరించుకుని, ఎంత పొద్దెక్కిందో కదా అని హడావుడి పడి.. గోడ గడియారం కేసి చూసేసరికి సమయం 4:30.. అంతే కదా మరొక్క అయిదు నిముషాలైనా.. అనుకుని బద్దకించింది సరోజ. "లే అమ్మాయ్.. ఇంకా ఇంత నిద్దరేంటి.. అవతల పొద్దెక్కి ఎంతసేపయ్యింది.. మా కాలంలో ఇంతసేపు నిద్రపోమమ్మా.. లేలే..!" సణుగుడు ప్రారంభమైందనుకుని.. లోలోపలె తిట్టుకుంటూ లేచి తాళిబొట్టు కళ్ళకద్దుకుని గది తలుపు తీసి బయటకొచ్చింది సరోజ. నేరుగా ముగ్గేసేందుకు అడుగెట్టేలోగానే" ఆ ముగ్గు ఇంకా ఎంత సేపమ్మాయ్.. మాకాలంలో అయితేనా అంటూ రాగాలు వినిపించాయ్. 
ముగ్గు అయ్యిందనిపించుకుని సరోజ వాష్ బేసిన్ దగ్గరకు చేరుకుని బ్రష్ పై పేస్ట్ వేసుకునే సరికి... "అమ్మాయ్ గీజర్ ఆన్ చెయ్" అత్తగారి కేకతో నోట్లో బ్రష్ ఇరికించుకుని గీజర్ వేద్దామనుకుంటే... ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు లేకపోవడం గుర్తించి మోటార్ వేసింది. "నేను వేయమంది గీజర్ కాదు.." అని వినిపిస్తుండటంతో.. "ఆ..ఆ.. ట్యాం..క్.. లో.. నీ..ళ్ళు.. లే..వు.." పళ్ళుతోముకుంటూ... సమధానం చెప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది సరోజ. ముఖం కడుక్కుని గీజర్ వేసి నీళ్ళు పడుతున్నంతలో అటు నుంచి "గీజర్ వేసి ఎంత సేపయ్యింది... నీ సుపుత్రుడిని  లేపు  స్నానం చేసి స్కూల్ కి తగలడాలి కదా..!" అత్త ముక్తాయింపు. 
 హడావుడిగా వెళ్ళి నిద్ర లోకంలో విహరిస్తున్న కుమారుడిని "లేరా నాయనా.. మీ నాయనమ్మ తిడుతోంది. అంటూ బ్రతిమాలి పొద్దుపోయాక పడుకున్నాడు కదా కాసేపు నిద్రపోతాడులే అనుకుని తాను స్నానం చేసేందుకు బాత్రూం లోకి అడుగుపెట్టింది. "అమ్మాయ్ వాడో బడుద్ధాయ్.. నువ్వయినా స్నానం చెయ్" అంటున్న అత్తగారి కేకలు పంపు నీళ్ళ శబ్దంలో కలిసి ఒక రకమైన ధ్వని పుట్టింది. “అత్తంటే ఇలా వుండాలి. నిన్న పట్టు చీర తెచ్చిందట కోడలుకి పదివేలు పెట్టి ...కోడలికి ఏమేం కావాలో అన్నీ ముందే గుర్తించే అత్తలు ఈ కాలంలో ఎందరుంటారు చెప్మా.. సరోజ అదృష్టవంతురాలు.." అన్న పక్కింటి పిన్నిగారి మాటలు గుర్తొచ్చి అసహనంగా నవ్వుకున్న సరోజ ...  తన ఆవేశంపై నీళ్లు పోసుకుంది. 
 అంతలోనే.. "స్నానం చేసేది ఎంతసేపమ్మా.. ఈ పిల్లకు ఎన్ని గంటలైనా చాలదు బాత్రూంలో" అంటూ దీర్ఘాలు పోతోంది అత్తగారు. స్నానం పూర్తి చేసుకుని.. తల తుడుచుకుంటూ దేవుని గదిలోకి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి, కుంకుమ పెట్టుకుంటూ తనకిష్టమైన ఎర్రచీర కట్టుకుని స్కూల్ కి వెళ్ళాలని నిర్ణయించుకుని చీరను చేతికి తీసుకుంది సరోజ. ఎర్రచీరెపై నల్ల చుక్కలు.. పల్లుపై నెమలి బొమ్మలు ఉన్న ఈ ఎర్ర చీరంటే తనకు వల్లమాలిన ఇష్టం. నాన్న కొనిచ్చింది.. అని నాన్న తెచ్చిచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ చక్కగా ముస్తాబైంది". ఆ చీరెందుకే రక్తం కక్కినట్లుంది.. అక్కడ నీలం చీర ఉంది కట్టుకో.. ఎంత చక్కగా ఉంటావో.." ప్రేమ ఒలకబోసింది అత్తగారు. చిన్నప్పటి నుంచి సరోజకు నీలం అంటే చచ్చేంత అసహ్యం. అలాంటిది తప్పదు తన ప్రియాతి ప్రియమైన అత్తగారు ఆదేశించారు నేను పాటించాలి అనుకుని ఆ ముచ్చట తీర్చింది". ఇప్పుడు చూడు బబిత మా కోడలు పిల్ల ఈ చీర లో  ఎంతందంగా వుందో చూడు.. గర్వంగా చూసిన అత్తగారికే ఓటేసింది పనమ్మాయి బబిత.. బ్రతక నేర్చింది.
 "ఏమ్మాయ్ వాడు లేచాడా.. ఇంతసేపు ఏం చేస్తున్నావే..! వాణ్ణి లేపకుంటే లేపవే..! త్వరగా లేచి, స్నానం చేసి స్కూల్ కి తగలడమను.." "అమ్మాయ్ పెనం పెట్టా.. దోసెలు వెయ్.. మీ ఆయన తింటాడో లేదో వాడికి ఇడ్లీ కావాలేమో అక్కడే పిండి వుంది రెండు ఇడ్లీ పెట్టు" "మీమామ లేచారేమో చూడు.. మళ్లా ఆయన కేకలు తట్టుకోవటం మన వల్ల కాదు.." ఎన్నిపన్లు చేయాలే.. ఇదిగో ఆకు కూర తరిగా పప్పులో వెయ్" వరస పెట్టారు అత్తాశ్రీ. 
 సరోజ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. 8 గంటలలోపు స్కూల్ కాంపౌండ్లో అడుగుపెట్టాలి. ఆలస్యమైతే శాలరీ కోతంటూ గేట్ మెన్ అవతారం ఎత్తే చండశాసనుడైన ప్రిన్సిపాల్ గుర్తొచ్చాడు. అన్నం వండాలి, కూరలు తరగాలి, క్యారేజ్ సర్దాలి, పుత్రుడికి నీళ్ళుపోయాలి..  అప్పటికే టైం.. 6:45 "అమ్మాయ్.. సరోజా నా బ్రష్ ఎక్కడ పెట్టారు.. మీ అత్త పలికి చావదూ.. " మామగారు లేచినట్లుంది. 
 "అక్కడే ఉంది మామయ్యా" అని అనబోయి బ్రష్ పై పేస్ట్ వేసి, మగ్గులో వేడినీళ్ళు తీసుకెళ్ళి టవల్ తో సహా అందించి మరలా వంటింటిలోకి తుర్రుమంది సరోజ. నాలుగు పొయ్యిల గ్యాస్ వెలిగించి, ఒకదానిపై కుక్కర్, మరొకదానిపై బాండీలో ఫ్రై, మరొక వైపు కుతకుతలాడే పప్పు.. నాల్గొవ దానిపై దోసెలు.. ఆహా తనలా గ్యాస్ పొయ్యి ఒకేసారి ఎన్ని పనులు చేస్తుందొ.. కదా.. గ్యాస్ పొయ్యిని కనుక్కున్నదెవడోగానీ.. వాడు ఆ పనిచేసి ఉండకుంటే.. గ్యాస్ పొయ్యి లేకుంటే గనుక తన లాంటి సరోజల పరిస్థితేంటి అనుకుంటుండగా అన్ని పొయ్యిలూ ఒక్కసారిగా ఆరిపోయాయ్.. గ్యాస్ అయిపోయింది. స్నానం చేసిందన్న మాటేగానీ ఆవిర్లతో పప్పులాగా ఉడికిపోయింది సరోజ.
 "యావండీ ప్లీజ్ లేవండీ.. మీ అమ్మ పాలు తెస్తానని బయటికెళ్ళింది. గ్యాస్ అయిపోయింది కాస్త సిలిండర్ మార్చరూ ప్లీజ్.. స్కూల్ టైం అయిపోతోంది" అని పిలుస్తూనే తన పిలుపు శ్రీవారికి చెవికెక్కదనుకుని.. పనిమనిషి బబిత సాయంతో సిలిండర్ దొర్లిస్తూ.. గ్యాస్ నియంత్రణి (రెగ్యులేటర్)ని తగిలించి మరలా స్టౌ లు వెలిగించింది. అంతలో పక్క ఇంట్లో  కొట్టుకుంటున్న శబ్ధాలు.. 
"వామ్మో.. వాయ్యో" అంటూ అరుపులు కేకలు.. ఏంటే అరుపులు  ఆసక్తిగా బబితను అడిగింది సరోజ. "అమ్మగారూ నానేంసెప్తాలేండి.. ఆల్ల సొంతిష్యాలు.. ఆ చిత్రాంగక్క.. రాత్రి 'స్త్రీ కన్నీరు' సీరియల్ సూసిందంట.. అందులో అత్తను కోడలు సితకేసిందంట.. అలా నేనెందుకు అత్తను కొట్టకూడదూ అని పొద్దున్నుంచి ఆల్ల అత్తను బాదినచోట బాదకుండా బాదేస్తున్నదమ్మా.. నాకైతే బయమైనాది.. ఆ.. పాపం కదమ్మా..! అని మొత్తం విషయం చెప్పేసి, నే సెప్పినట్లు ఎవ్వరికీ సెప్పమాకమ్మా" అంది బబిత.  
బబితను కాస్త కదిలిస్తే చాలు అందరి విషయాలూ ఇట్టే విప్పేస్తుంది. అందుకే అత్తగారికి బబితతో అంతటి లింకు . "ఏంటే అమ్మడూ.. గ్యాస్ లీకౌతుందా ఏంటి.? కాస్త కాఫీ పట్రా" అంతలో అందుకున్నారు మామగారు. అంతలో లోపలికి పరుగెట్టుకొచ్చిన అత్తగారు.. "గ్యాస్ వాసనొస్తుందే.. అర్ధం కావట్లేదా.. అసలే ఆ పాలవాడు మళ్లా రమ్మన్నాడు.. నువ్వు స్కూల్ కి వెళ్లేముందు పాలు తెచ్చిచ్చి వెళ్ళమ్మ" ఆర్డరేసింది. "లీకైనా బాగుండేద" ని తనలో తాను గొణుక్కుంటూ.. సమస్య ఎక్కడో అర్ధం కాక.. ఆడవారి బ్రతుకింతేనులే..! అని ఓ నిట్టుర్పు నిట్టూర్చిన సరోజ పనిలో నిమగ్నమైంది. "చీ, కాఫీదీ ఓ బ్రతుకేనా.. ఎవడు కనిపెట్టాడో కానీ.. గంటకు ఒకళ్ళకివ్వాలి.. అన్నిసార్లు తగలడీ.. కాస్త కూడా ఫీల్ అవ్వదు ఈ కాఫీ.. అత్తకు ఒకసారి, మామకు ఒకసారి, శ్రీవారికి ఒకసారి.. ఏవిటో" తను మాత్రం తాగని కాఫీ ఫై ఒకింత కోపం.. ఒకింత సానుభూతితో... కాఫీ కలిపి మామకి అందించి హడావుడిగా వంటింట్లోకి పరుగు లంఘించుకొనే లోపే 
"అమ్మడు ఆ న్యూస్ పేపర్ కాస్త యిటిచ్చి వెళ్ళు", ఛటాలున వెనక్కి తిరిగి మామకు పేపర్ ఇచ్చి వంటింట్లోకి పరిగెత్తింది. కూర లో అట్లకాడ పెట్టి కలిపెలోగా "కూర మాడుతుందే ఎక్కడున్నా" అని అత్తగారు పిల్లోడి తల వంద సార్లు దువ్వుతూ. "కాస్త కలపొచ్చుగా, నేనేమన్నా ఖాళీగా వున్నానా" అని పెద్దగా వేసిన సరోజ కేకకి కొండ నాలుక అడ్డం పడటంతో గొంతులోనే మూగవోయింది. "ఎంతో మంచివారమ్మ" అని నాన్న చెబితే మెట్టింట్లో అడుగుపెట్టింది సరోజ. "చుట్టూ వాళ్ళను ఎంక్వయిరీ చేశానమ్మ" నీకే సమస్య ఉండదమ్మా అన్న నాన్న మాటలు గుర్తు వచ్చి "నిజమే కదూ.. నన్నెవ్వరు కొట్టరు.. తిట్టరు.. ఈ జీవితమే కదా అమ్మాయిలు కోరుకునేది" అని నిస్తేజంగా క్యారేజి సర్దింది. వాస్తవానికి సరోజ అత్తింటి వాళ్ళు అంత దుర్మార్గులైతే కాదు.. ఆ విషయం సరోజకు కూడా బాగా తెలుసు.. కానీ..ఇదిగో చూశారుగా.. 
 "సరోజ నా ప్యాంటు, షర్ట్, ఇన్నర్స్ తీసిపెట్టు స్నానం చేసి వెళ్ళాలి.. " ఓహో శ్రీవారు లేచినట్లు వున్నారు. "అమ్మడు ఆ చేత్తో నా మందులు కూడా" మామ తను మరిచిపోతారేమోనన్న అనుమానపు ధ్వని. "అమ్మాయ్ వాడు లేచాడు రెండు దోసలు వేసి పెట్టు. మోటార్ ఆపేసాను, పంపు కట్టేసాను, చిన్నోడికి తల దువ్వాను.. ఎన్ని పనులని చేయాలి నేను. ఇప్పుడైతే వాషింగ్ మెషిన్, గ్రైండర్ లాంటివి అన్నీ ఉన్నాయి. మా కాలంలో అయితే ఇవి ఏవి లేవు. అన్నీ మేమే చేసుకోవాలి మీకెంత టైం వున్నా తెమలదు.. త్వరగా దోసెలు వేసి మీ ఆయనికివ్వు". అత్త గారు చిట్టా విప్పారు . అమ్మోరులకు ఐదో... ఆరో చేతులు, ఎందుకుంటాయో ఇప్పుడే అర్ధం అవుతుంది సరోజకు. "ఈ దోసెలు ఎవ్వడు కనిపెట్టాడో కానీ.. నాకు కానీ వాడు కనపడాలి.. వాడ్ని దోసె మాడ్చినట్టు మాడ్చిపారేస్తా" అని తిట్టుకుంటూ మరో రెండు దోసెలు హాట్ బాక్స్ లో కుక్కింది.
 ఆ ఫై ఏవ్వరి మాట  వినకుండా  శ్రీవారికి కావలిసినవి కనపడేలా పెట్టి తను హడావుడిగా అద్దంలో చూస్తూ తన కిష్టం లేని చీర ఎన్ని వేలు పెట్టి తెస్తే మాత్రం ఏం ప్రయోజనం అనుకుంటూ  ఆ నీలంచీరె సరిచేసుకొని, టూ వీలర్ పై కొడుకుని ఎక్కించుకుని స్కూల్ వైపు తుర్రుమంది. అప్పటికి ఎనిమిది గంటలకు ఇదు నిముషాలు మాత్రమే ఉంది. నానా చావు చచ్చి వెళ్లి కూడా నిమిషం లేట్ అయితే ఆ ప్రిన్సిపాల్ ఛండశాసనుడు ఆబ్సెంట్ వేసేస్తాడు అని ఒకటే టెన్షన్ పడుతుంది సరోజ. మూలిగిన నక్క మీద తాటికాయ పడ్డట్టు అంత హడావుడుగా ఇంటి నుంచి బయటపడ్డా.. ట్రాఫిక్ జాం లో ఇరుక్కు పోయింది  ''ఆడజన్మకు ఎన్ని.. శో ..కా.. లో..' ఎక్కడో సెల్ ఫోన్ లో పాట లీలగా వినిపిస్తుంది. విజయలక్ష్మి.. ఆ పేరంటే వాళ్ళ ఏరియాలో తెలియని వాళ్ళుండరు. ఎంతో మంచి కుటుంబం.. ప్రక్క వారితో కూడా తగాదాలు లేని పేరున్న కుటుంబం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇంటిల్లిపాదీ అంతే..! 
అందుకే సరోజ నాన్న ఏరికోరి , గూడచర్యం చేసి మరీ ఈ సంబంధం ఓకె చేశారు. మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం.. కడుపులో పెట్టుకునే అత్తమామలు ఈ రోజుల్లో ఎందరుంటారు అని మురిసిపోయింది సరోజ అమ్మ. వారు తలపులోకి రాగానే తనలో తాను ఏడ్వలేక నవ్వుకుంది సరోజ. అంతలో ట్రాఫిక్ ముందుకు కదలటంతో త్వరగా దాటుకుని స్కూల్ గేటు వేస్తున్నంతలోనే జర్రున దూరి లోపలికి పోనిచ్చి, స్టాండ్ వేసి, సంతకం చేసి, క్లాసురూం లోకి ఒక్క ఉదుటన చేరుకుంది. "ఈ స్కూల్ ఎవడు కనిపెట్టాడ్రా బాబూ" అనుకుని పాఠాలు మొదలెట్టింది. 
కార్పొ'రేట్’ వ్యవస్థలో అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఉదయం స్కూల్ కి వచ్చింది మొదలు భోజన విరామం మినహా సాయంత్రం పొద్దుపోయిందాకా నిలబడే వుండాలి. ఇదో కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పనిష్మెంట్. అసలు సరోజకు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులని మనం కాకుంటే ఎవరు చూస్తారు అంటాడు శ్రీవారు. దూరంగా ఏ అమెరికాలోనో ఉంటే మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళ గతి ఏమౌతుంది అనేది చిన్ననాటీ నుండి సరోజ ఫీలింగ్ అందుకే శ్రీవారి మాటకు కాదనలేకపోయింది. కానీ ఉద్యోగం మాత్రం ఇంటి వాతావరణం నుంచి కొద్దిసేపు సేదదీరేందుకు తనకు తానుగా ఏర్పరచుకున్న చిన్నపాటి అవకాశం మాత్రమే..! 
 సాయంత్రం మరలా.. సమయం దగ్గర పడే కొద్దీ సరోజకు మరలా టెన్షన్ మొదలు. ఇంటికి వెళ్లే సరికి ఏమి పనులు ఎదురు చూస్తున్నాయో..! అనుకుంటూ ఇల్లు చేరుకుంది. సరోజ ఇంటి ముందు ప్రత్యక్షమైందో లేదో.. "అమ్మాయ్ ఇప్పుడే చీపురు తీసుకున్నానే.. ఆ పనిపిల్ల సినిమాకెళ్ళాలని ఈ రోజు ఎగ్గొట్టింది, రేపు కూడా రాదట.. వాళ్లాయన, పిల్లలతో తిరుపతి కెళ్ళాలట". అత్త రేడియో జాకీ లా వాగుతుండటంతో సరోజకు చిర్రెత్తకొచ్చింది. "పని మనిషి బబిత కాపురం చూసి ఈర్ష పుట్టింది సరోజకు.. "తాను అంతగా చీప్ అయిపోయానా..! ఏందుకీ బానిస బ్రతుకు" అనుకుంటుండగానే.. అమ్మ గుర్తొచ్చింది సరోజకు. 
 "అమ్మకు పెద్దకూతురిగా నేనంటే ఎంతో ప్రాణం..నేను ఎంతో సుఖసంతోషాలతో ఉన్నాననుకుని తెగ సంబర పడిపోతుంటుంది పిచ్చిది. నా పరిస్థితి తెలిస్తే"... అమ్మ దగ్గరకు వెళ్ళి, ఆమె ఒడిలో పొదివి.. పొగిలి ఏడ్వాలనిపించింది. "ప్రశాంతంగా ఏడ్చే అవకాశం కూడా ఉండదు ఈ పాడు జీవితానికి.. ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా పుట్టింటికి వెళ్లనివ్వరు". రెండు రోజులు నాతో గడపాలని అమ్మకనిపించి పంపమంటే.." మీ అమ్మాయిని మేమేమన్నా కాల్చుకు తింటున్నామా..  మీ అమ్మాయిని బంగారంలా చూసుకుంటుంటే.." అని వయ్యారం ఒలకబోస్తుంది అత్తగారు. పురిటికి వెళ్తే.. మనవణ్ణి చూడాల్సిందే అని పట్టుబట్టి పచ్చిబాలింతని కూడా చూడకుండా తెచ్చేశారు.. పాపం అమ్మ ఎంత చిన్నబోయిందో ఆ రోజు.. అమ్మ గుర్తొచ్చే కొద్దీ ఏడుపు తన్నుకొస్తోంది సరోజకు". వీళ్ళది ప్రేమ అనాలా.. పైసాచికత్వం అనాలా..? ఏనాడో ఋణపడి వుంటా! 
అందుకేనేమో ఆడపిల్ల పుడుతుంటే ఈ కష్టాలు పడలేదని కాబోలు పురిటిలోనే తల్లులు చిదిమేస్తున్నారు. మరి ఇలా వేధిస్తుంటే భావి భారత అత్తగార్ల కొడుకులు 'గే'ల తో గడపాలని తెలీదేమో..? ఏవిటో "అని తనలో తానే భగభగ మండిపోయింది. ఆ సమయంలో సరోజ గుంభనంలా వున్న అగ్నిపర్వతాన్ని తలపించింది. కాపురానికొచ్చిన నాటి నుండి ఒక్క సినిమా లేదు, ఒక్క పుణ్యక్షేత్రం కి జంటగా వెళ్ళింది లేదు, కనీసం హోటల్ కి వెళ్ళి వీకెండ్ సెలెబ్రేట్ చేసుకుందీ లేదు. ఎక్కడికెళ్లలన్నా తట్టాబుట్టా తీసుకుని అందరూ బయలుదేరతారు. టివిలో అయినా ఇష్టమైన సినిమా చూద్దామనుకున్నా.. అత్తగారికేమో సీరియళ్ళు, మామగారికేమో న్యూస్ రీళ్ళు.. నాలాగా ఆ టీవికి కూడా రెస్ట్ వుండదని అప్పుడప్పుడూ టివీని చూసి "టీవీని వరు కనిపెట్టరో పాపం" అని జాలి పడేది సరోజ. 
 పొరబాటున ఖాళీగా వున్నప్పుడెప్పుడైనా చూద్దామనుకుంటే.. అమ్మడూ అంటూ మామగారు, అమ్మాయ్ అంటూ అత్తగారు, శ్రీవారేమో పనుందంటూ పరారు.. ఛీ.. ఇదీ ఒక జన్మేనా.. అనుకుంటూ.. చెంగు దోపుకుని వాకిలి ఊడ్చటం మొదలెట్టింది. పొద్దుటినుంచి నిలబడి.. నిలబడి.. కాళ్ళు ఒకటే నొప్పులు.. కాసేపు నడుం వాలుద్దాం అనుకుంటే.. రెడీమేడ్ పని. అప్పగింతలప్పుడు వదిన  చెప్పిన మాటలు గుర్తొచ్చాయ్.. "అత్తమామలు చెప్పినట్లు వింటే కష్టాలుండవే అమ్మాయ్". వదిన కళ్ల ముందు మెదిలింది.. పెళ్ళంటే అబద్దాలా..? అనుకుంటూ లోపలికెళ్ళింది సరోజ.  "అమ్మాయ్ బియ్యం కడిగాను పొయ్యి మీద పెట్టా. ఈ రోజు రాత్రికి భోజనానికి మీ మామయ్య తరఫు వాళ్ళు దిగుతున్నారు. కాస్త వాళ్ళకేం కావాలో చూడాలి. అదే చేత్తో కాస్త కాఫీ నాకు, మీ మామయ్యకు ఇవ్వమ్మా.." అని చావు కబురు చల్లగా చెప్పింది అత్తగారు. "ఈ చుట్టాలనెవడు పుట్టించార్రా బాబోయ్.." అనుకుంటూ సుపుత్రుణ్ణి రెడీ చేసి, తనూ మొఖం కడుక్కుని, వంటగది కేగి అట్లకాడతో యుధ్ధం మొదలెట్టింది సరోజ. అంతలో "అమ్మ్మడూ నా మందుల పెట్టీ ఇవ్వు.. అలాగే మీ ఆయన వచ్చేటపుడు.. నాకు.." మామగారి పనుల లిస్ట్ మొదలైంది. మతిమరుపు శ్రీవారు ఏది మరచినా నాకు సంగీతమే.. ఏంటో ఈ జీవితం అని నిట్టూర్చి శ్రీవారికి ఫోన్ చేసి మామగారి లిస్ట్ అంతా ఏకరువు పెట్టింది. జాగ్ర్రత్త మీ మతిమరుపు పుణ్యమా అని మరిచిపోతే నేను వేగలేక చావాలి. అని మొత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది. 
శ్రీవారు వున్నారన్న మాటే గానీ ఒక్కరోజన్నా ఇంటి పనుల్లో సహాయం చేస్తారనుకున్నా.. ఊహు.. ఆయనో పెద్ద ఎస్కేపిస్టు.. పొద్దున్నే ఇంట్లోంచి పోతే అర్ధరాత్రి దాకా తిరిగి రారు. ఊర్లో పెత్తనాలన్నీ ఈయనగారే చూస్తారు. రాత్రిళ్ళు పక్కలో తప్ప పెళ్ళాం ధ్యాసే వుండదు. ఆ పనిమనిషి బబిత జీవితమే ఒకోసారి నయమనుకుంటూ గుడ్లలో నీళ్ళు కుక్కుకుంది. కుక్కర్ శబ్ధంతో ఈ లోకంలోకి వచ్చిన సరోజ.. అందరికీ వడ్డించి తానూ తినేందుకు సిద్దమైంది. అంతలో బంధువులు అడుగుపెట్టడంతో తినబోతున్న కంచం పక్కకు నెట్టి, ‘అతిథి దేవోభవ’ అని ముక్తాయింపు నిచ్చింది. వారికి మర్యాదలు పూర్తయ్యే సరికి బాగా పొద్దెక్కింది. అన్నం తింటున్నంతసేపూ సరోజ మంచి పిల్ల, ఇలాంటి కోడలు రావడం విజయలక్ష్మి అదృష్టం" అంటూ పొగుడుతుంటే అరికాల్లో మండిపోయింది సరోజకు. 
"అమ్మడూ వాడు ఇంకా రాలేదేంటి ఫోన్ చేసి కనుక్కుని త్వరగా రమ్మని చెప్పు" అన్న మామగారి సలహా తో మరింత కోపం వచ్చింది సరోజకు. శ్రీవారు ఏరోజన్న విన్నారా? త్వరగా రమ్మంటే..? వీళ్లేమో ఇక్కడ... వాళ్ళ కొడుకు మీద వాళ్ళకే ప్రేమ వున్నట్లు.. తనకేమో లేనట్లు.." ఏం చెబుతారో కదా అనుకుంది సరోజ. అలా పక్క వేసుకుని నడుంవాల్చిందో లేదో.. శ్రీవారి రాక.. తలుపు చప్పుడుతో తన్నుకొస్తున్న కోపాన్ని పళ్ళక్రింద అదిమి పెట్టి తలుపు తీసేంతలో.. "అమ్మాయ్ వాడొచ్చాడే.. తలుపు తీసి వాడికి అన్నం వడ్డించు.. నేను అసలే అలిసిపోయాను" అన్న అత్తగారి మాటకు మండిపోయింది సరోజకు.
 "ఇదో టైప్ ఆఫ్ పాజిటివ్ కిల్లింగ్.. అవును ఇప్పుడు సూర్యకాంతం లు లేరు.. అందరూ విజయలక్ష్మిలే..! లేకుంటే 498 (ఎ) కొరఢా ఝళిపిస్తుందనె భయంతోటే..  ఇలా మారిపోయినట్లున్నారు అత్తలు.. అని తనకు తోచిన రీతిలో తాను ఆలోచించుకుంది.. శ్రీవారికి అన్నీఅందించి, వడ్డించి పడుకుంది సరొజ.  శ్రీవారికి తన బాధంతా చెప్పుకోవాలని అప్పుడే తన మనసు కుదుట పడుతుందని ఆశపడింది. తిని మంచమెక్కిన శ్రీవారు.. 'సరూ' అంటూ రాగాలు పోయాడు.  సరోజ  మానసిక సంఘర్షణ చెప్పుకునే వీలు లేకుండా.. ఆమె పెదాలను తన పెదాలతో కలిపేశాడు.. తన శ్రమకు సాంత్వన చేకూరగానే నిద్రలోకి జారుకున్నాడు. యావండోయ్ శ్రీవారూ! 
అన్న సరోజ పిలుపు అతని గురకలో కలిసి గాలైపోయింది. వద్దు సరోజ.. వద్దు.. అని ఎంత బ్రతిమాలుకున్నా అప్పటి వరకూ ఆగిన కంటి కొలనుకు గండి పడింది. జలపాతమై వర్షిస్తున్న కన్నీటి సునామీని ఆపడం ఇక ఆమె తరము కాలేదు. అత్తా ఒకింటి కోడలే కదా.. కోడలి కష్టం ఆ మాత్రం తెలీదా..? పదివేలు తెచ్చి పట్టుచీర చేతిలో పెట్టి కట్టుకో అనే బదులు తనకేం ఇష్టమో తెలుసుకోవచ్చు కదా.. అహం అడ్డమొస్తుందేమో.. అయినా వీళ్లకు తన ఇష్టాఇష్టాలతో పనిలేదు. వీళ్లకు కావలిసింది కోడలు కాదు 'ఒక మెషీన్'. అని కన్నీరుమున్నీరైంది. 
భవబంధాలకు దూరంగా పారిపోవటానికి కన్నప్రేగు అడ్డమొస్తుంది. స్వేచ్చలు, స్వాతంత్ర్యాలు.. అన్నీ మాటలకే పరిమితం అని భాధపడింది. తాను మాత్రం తన కోడలిని పువ్వులో పెట్టి చూసుకోవాలని బలంగా నిర్ణయించుకుంది ఈ సంఘర్షణలో కొటుమిట్టాడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సరోజ. అంతలో తలుపు చప్పుడు.. టక్..టక్..టక్.. తలుపు చప్పుడు "అమ్మాయ్ పొద్దెక్కింది.. లేవాలమ్మా.. ఎంతసేపు పడుకుంటారే.." అన్న అత్తగారి పిలుపు అశోకవనం లోని రాక్షస మూకల మేలుకొలుపు పాటలా తోచింది సరోజకు. 
 (మనం సమాజంలో నిత్యం ఎందరో సరోజలను.. మరెందరో విజయలక్ష్మి లను చూస్తుంటాం.. ప్రతి అత్తా తాను కోడలిగా తన అత్తగారింట అడుగెట్టినప్పుడు సరోజలా చెప్పుకోలేని ఎన్నో కష్టాలు అనుభవించే వుంటారు. అలాంటి వారు తన కోడలితో మసలేటప్పుడు ఆమె మనసెరిగితే.. ఆడజన్మకు అంతకంటే కావల్సింది ఏదీ ఉండదేమో..! ఆడదానికి ఆడది శత్రువు కాకూడదు..) సర్వేజనా సుఖినోభవంతు..  

No comments:

Post a Comment

Pages